Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
నారదుడు చెప్పినది కొద్ది ఆలోచించవలసినది చాలా చాలా ఉన్నది. దానిని గురించి ఒక గ్రంధమే వ్రాయవచ్చును.
4. ఇంతవరకు రెండు సందర్భములందు శ్రీకృష్ణుడు వెళ్ళిన తరువాత నారదుడు వచ్చినాడు. మొదట ద్రౌపది విషయమున నియమములు ఏర్పరచుటకు వచ్చినాడు . శ్రీకృష్ణుడే నారదుని పంపించినట్లు కనిపించుచున్నది. నారదుడు శ్రీకృష్ణునకు వ్యాఖ్యాత కావచ్చును.
ధర్మరాజుతో రాజసూయము చేయంచవలెను. అందుకుగాను పాండురాజును యమలోకమున చూచినానని చెప్పినాడు. ఇది కల్పన అని నా అభిప్రాయము. ధర్మరాజును ఒప్పించుటకు అల్లిన కధ!
జరాసంధ వధ
ధర్మరాజు రాజసూయము చేయుటకు అంగీకరించినాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తొలుత జరాసంధుని వధించవలెనని చెప్పినాడు. జరాసంధుని కధ వివరించినాడు.
పూర్వము బృహద్రధుడు మగధ దేశమును ఏలినాడు. అతడు కాశీరాజు కవల కూత్రుండ్రును పెండ్లాడినాడు. అతనికి చాలాకాలము సంతానము కలుగలేదు. అతడు చండకౌశికుడు అను మహర్షిని ఆశ్రయించినాడు. మహర్షి, రాజునకు ఒక మామిడి పండును ఇచ్చినాడు. "ఈ పండు వలన నీకు ఒక పుత్రుడు కలుగును" అన్నాడు.
బృహద్రధుడు పండు తీసుకొని రాజధానికి వచ్చినాడు. ఇద్దరు భార్యలకు సగము సగము ఇచ్చినాడు. వారు గర్భవతులు అయినారు. ప్రసవించినారు. వారికి చెరి సగము బిడ్డ పుట్టినది. ఒక చేయి , ఒక కాలు, ఒక కంటితో పుట్టినవి. రాణులు అట్టి ఖండములు రాజు కంట పడరాదు అనుకున్నారు. వాటిని పారవేయించినారు. "జరి" అను రాక్షసి ఆ ముక్కలను చూచినది. వాటిని కలిపినది. అప్పుడు ఆ బాలుడు సజీవుడు అయినాడు. ఏడ్చినాడు. జర ఆ బాలుని రాజునకు ఇచ్చినది. "ఇతనిది మేరు సమానమయిన బరువు. వజ్రసమానమైన దేహము. ఇతనిని చక్కగా సాకవలసినది" అని చెప్పినది. రాజు బాలుని తీసుకున్నాడు. సంతోషించినాడు. "జర" సంధించినది కాబట్టి ఆ బాలుని పేరు "జరాసంధుడు" అని పెట్టినాడు. జరకు కృతజ్ఞత చెప్పినాడు. ఆమె పేర ప్రతి సంవత్సరము ఉత్సవము చేసినాడు.
జరాసంధుడు రాణుల వద్ద పెరిగినాడు. పెద్దవాడు అయినాడు. ఒకనాడు చందకౌశికుడు బృహద్రధుని వద్దకు వచ్చినాడు. రాజు అతనిని పూజించినాడు. జరాసంధుని చూపినాడు. మహర్షి సంతోషించినాడు. ఇట్లు అన్నాడు:-
"మహారాజా! జరాసంధుడు కుమాస్వామి అంతటి శక్తి గలవాడు. రుద్రుని కూడ రప్పించుకొగలడు. ఇతని ముందు శత్రు వీరులు నిలువలేరు. అగ్నియందు పడినా శలభముల వలె నశింతురు. తేజమున సూర్యుని వలె రాజులలో యితడు ప్రకాశించును."
మహర్షి అట్లు చెప్పినాడు. వెళ్ళిపొయినాడు. రాజు మహర్షి మాటలు విన్నాడు. పొంగిపోయినాడు. జరాసందునకు పట్టము కట్టినాడు. రాణుల సహితముగా తపోవనమునకు వెళ్ళినాడు.
జరాసంధుడు బలగర్వితుడు అయినాడు. హంసుడు, డిబకుడు అను ఇద్దరినీ సహాయులుగా చేసుకున్నాడు. రాజుల మీద దండెత్తినాడు. వారిని ఓడించినాడు. పట్టి తెచ్చినాడు. మగధలో బంధించినాడు. ఆ రాజులను రోజును ఒక్కరి చొప్పున బలి ఇచ్చి భైరవ పూజ చేయుచున్నాడు.
పూర్వము పరుశురాముడు సకల రాజవంశములను నాశనము చేసినాడు. అప్పుడు హైహయలు, ఇక్ష్వాకులు కిరీటము ధరించుటకు అర్హులు అయినారు. ఆ రెండు వంశముల నుండి నూటొక్క రాజవంషములు అయినవి. యయాతి, భోజ వంశముల నుండి పదునాలుగు వంశములు అయినవ"ి. ఆ సకల వంశస్థుల రాజులను జరాసంధుడు జయించినాడు. బంధించినాడు.
"జరాసంధుడు హంస డిబకుడు సహాయము గొని నా రాజధానియగు మధురను ముట్టడించినాడు. నేను వృష్టి, భోజ అంధక వీరులను పదునెనిమిది వేల మంది మహారధికులను సాయము గొని ఎదిరించినాను. హంస, డిబకులను నా ఉపాయమున హతమార్చినాను. అది ఎట్లన హంసుడు యుద్దమున చచ్చినాడని డిబకునకు' చెప్పించినాను. హంసుడు చచ్చెనని తెలిసి డిబకుడు సముద్రమున పడి చచ్చినాడు. డిబకుడు చచ్చిన వార్త విన్నాడు హంసుడు. డిబకుని యందు స్నేహమున హంసుడు చచ్చినాడు. జరాసంధుడు రెక్కలు విరిగినవాడు అయినాడు. మగధకు మరలిపోయినాడు.
"అంతటితో జరాసంధుడు ఊరుకొనలేదు. మా విషయమున విరోధము పెంచుకున్నాడు. మేము మధురా నగరమును విదిచినాము. కుశస్థలమున, రైవతక పర్వతము పై గొప్ప దుర్గమును నిర్మించుకున్నాము. అచటనే ఉన్నాము.
"శ్రీకృష్ణా! జరాసంధుడు మీ మీద పగబూనుటకు కారణమేమి?" అని ధర్మరాజు అడిగినాడు.
"కంసుడు మహా దుర్మార్గుడు. అతనిని ఘోర యుద్దమున నేను చంపినాను. కంసుని భార్య జరాసంధుని కూతురు. ఆమె తండ్రిని ప్రేరేపించినది. అందువలన అతడు మాకు అనేక ఉపద్రవములు కలిగించినాడు.
"జరాసంధుడు అసాధ్యుడు కాడు. హంస, డిబకుల చావు వలన వాడు రెక్కలు లేని పక్షి అయి ఉన్నాడు. ఆయుధముతో చావకుండునట్లు జరాసంధుడు రుద్రుని వద్ద వరము పొందినాడు. అందువలన ఆయుధములతో అతనిని వధించుట సాధ్యపడదు. భీముడు మహాబలవంతుడు. అతడు మల్ల యుద్దమున జరాసందుని చంపగలడు. భీముని బాహుబలము, అర్జునుని రక్షణము, నా రాజనీతి బలము ఉండగా నీకు అసాధ్యములు లేవు. నీకు న విషయమున నమ్మకము ఉన్నచో భీమార్జునులను నాకు అప్పగించుము. జరాసంధుని వధించి వత్తుము. తదుపరి నీ నలుగురు తమ్ములు దిగ్విజయ యాత్ర చేయుదురు. నీవు రాజసూయము చేసి అనంతమయిన కీర్తిని అర్జించుము."
అప్పుడు ధర్మరాజు "మహాత్మా! శ్రీకృష్ణా! నీవు కరుణా సముద్రుడవు. పరమేశ్వరుడవు. నీవు మా యెడల దయ తలచినావు. మాకు అసాధ్యములు లేవు. సకల సంపదలు కలుగును. భీమార్జునులను వెంట తీసుకొని వెళ్ళుము" అన్నాడు.
శ్రీకృష్ణ భీమార్జునులు ధర్మరాజు అనుమతి పొందినారు. బయలుదేరినారు. శోణ, గండకి, సరయూ నదులను దాటినారు. గంగను దాటినారు. తూర్పు దిక్కుగా వెళ్ళినారు. పూర్వ కోసల, మిధిలా దాటినారు. జరాసంధుని దేశామగు మగధలో ప్రవేశించినారు. మగధకు రాజధాని యగు గిరివ్రజమున ప్రవేశించినారు.
గిరివ్రజము అయిదు పర్వతముల మధ్య ఉన్నది. అందువలన అభేద్యమై ఉన్నది. శ్రీకృష్ణ భీమార్జునులు ఆ పట్టణ ప్రాకారమును చూచినారు. వారు పట్టణ ద్వారము నుండి ప్రవేశింపదలచలేదు. వారు చైత్య పర్వత శిఖరమును ఎక్కినారు. అక్కడ మూడు భేరీలు ఉన్నవి. మానుపాదమనేడి ఎద్దును చంపి ఆ తోలుతో మగధరాజులు భేరీలను నిర్మించినారు. ఒక ముని వాటికి శక్తి కలిగించినాడు. అందువలన శత్రువును చూచి అవి తమంతట తామే మ్రోగును. శ్రీకృష్ణుని ఆదేశము చొప్పున భీమార్జునులు ఆ భేరీలను బద్దలు కొట్టినారు.





