Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
బిటేన్ నిశ్సబ్దంగా కాలూ కళ్ళల్లోకి చూచాడు. ఆ చూపు కాలూ హృదయాన్ని కప్పివేసిన తెరలోంచి దూరి కాల్చిన కర్రులా , పి. 14 నూ, మోసకారినీ కాలుస్తుంది. ఆ చూపు భరించలేక కాలూ ముఖం తిప్పుకున్నాడు.
"హు అనందం , నీకు కళ్ళున్నయ్యా?"
"నా కూతుర్ను గురించి నా కంటే నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడ్తావెం? లేఖ ఇంకా చిన్నది. తన్ను గురించి ఆలోచించుకునే శక్తి ఆమెకు లేదు."
'అంతేనా నీ జవాబు ?"
"గతంలో ఆమె పడ్డ యాతనే ఆమె ఆనందానికి అడ్డంకి అవుతుంది. ఒకసారి అగ్గిలో పడ్డ స్త్రీ సురక్షిత స్థానం కావాలని వాంచిస్తుంది."
"నిప్పు కల్తీ బంగారాన్ని కాలుస్తుంది. బంగారాన్ని కాల్చలేదు ."
"నిజంగా నీవు బంగారానికి విలువ ఇస్తావా?"
"నిప్పుకు వెరవనప్పుడు ."
కాలూ నీళ్ళు నమిలాడు. దుఖం కోపంగా ప్రజ్వరిల్లింది.
"తగాదా అనవసరం" చేత్తో గట్టిగా మంచాన్ని చరిచాడు. "నా కూతురు మంచిని గురించి నాకు తెలుసు. వట్టి మాటలు కట్టి పెట్టేయి. నా షరతులు చెప్పాను. కొన్ని రోజులు ఆలోచించు. తరువాత నీ అభిప్రాయం చెప్పు. ఇంక నేను చెప్పాల్సిందేమీ లేదు."
"ఒకవేళ నీ కూతురు ....." అతని ధ్వని తడబడి ఆగిపోయింది.
కాలూ అడిరిపోయాడు. కాని అదురుబాటును కప్పి పుచ్చుతూ "ఇంక నేను చెప్పాల్సిందేమీ లేదు. " అని అక్కణ్నుంచి లేచిపోయాడు.
21
వసారాలో కూర్చున్న వారి ముందు ఒక బెత్తపు బల్లా, దాని మీద పండ్లూ ఉన్నాయి. లేఖ పండును అందుకుంటూ "ఏం ఇవంటే నీకు ఇష్టం లేదా?" అని అడిగింది.
బిటేన్ శరీరం మాత్రమే అక్కడుంది. అతని మనసు ఎక్కడో దూరంగా వినిపించే ఆర్తనాదాలు విని బాధపడుతున్నట్లు అతని ముఖంలోని వ్యధ వ్యక్తం చేస్తుంది. స్త్రీలూ, పురుషులూ, అంతా ఏకంగా శోకాలూ పెట్టి ఏడుస్తున్నారు. ఆ కలగాపులగపు అరుపుల్లోంచి కొందరి కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
"కసాయివాళ్ళు చంపేస్తున్నారు కాపాడండి ...... మా ప్రాణాలను రక్షించండి."
క్షణంలో ఆర్తనాదాలు అడుగంటాయి. అంతటా నిశ్శబ్ధం ఆవరించింది. చడీ చప్పుడూ లేదు.
"పొద్దుటి నుంచీ ఆరు లారీల్లో జనాన్ని తీసికెళ్ళారు. మొదటిసారి నాకీ అరుపులూ, ఏడుపులూ వినిపించినపుడు ఇంకా తెల్లరనే లేదు. ఆ కేకలే నన్ను నిద్ర మేల్కొన్నాయి. లేచి బాల్కనీకి పరుగెత్తు కొచ్చా" అన్నద ి లేఖ.
"ఈ రోడ్డు తూర్పుకు వెళ్ళే రోడ్డుకు కలుపుతుంది. ఇలాంటి లారీలు ఇంకొన్ని రోజుల్దాకా కనిపిస్తాయి. మన తెల్ల దొరలు ఒక్క వారంలో కరువును నగరం నుంచి పారదోలి మాములు శోభ సమకూరుస్తారట!"
"ఆ తీసికెళ్ళే దేవరు? మిలిటరీ వాళ్ళా?"
"కాదు. నగర పాలకులు. మిలిటరీ వాళ్ళ లాఠీలనూ, ట్రక్కులనూ అరువుకు తెచ్చుకొని అన్నార్తులను నగరం నుంచి గెంటి వేయడానికి స్వచ్చంద సేవకుల్ను సిద్దం చేశారు. వారు మన డిమాండులకు ఇచ్చే జవాబు ఇది. 'కరువును పల్లె పట్టులకు గెంటేయండి. అక్కడ దాన్ని ఎవరూ చూడరు" ఇదీ వారి నినాదం."
"అన్నార్తుల్ను ఏట్లో పారేస్తున్నారటగా . బజార్లో గుసగుసలు మా బామ్నీ విన్నాదట. చెప్పింది. అంతేకాదు సరకులు తేవడానికి వెళ్ళినపుడు స్వయంగా చూసిందట. వారు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వెన్నంటి పట్టు కుంటున్నారట. అయితే మాత్రం వాళ్ళను వాళ్ళవాళ్ళ ఊళ్ళకు పంపేయకూడదూ?" ఆమె ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆమె కంఠంలో ఏదో విచారం వినిపించింది.
"అక్కడికే పంపుతున్నారు. అయితే మాత్రం ఏం ప్రయోజనం? ఊళ్ళకు వెళ్ళగానే వారికీ కనిపించేవి బీడు పొలాలు, మట్టితో పోట్లాడుతున్న భూములు, పట్నానికి వచ్చినవారిలో చాలామంది భూములున్న అమ్ముకునే వచ్చేశారు. ఇళ్ళకు వెడితే భూమి లేని కూలీలుగా మారిపోవాల్సి వస్తుంది." అతని కంఠం మారింది. 'అంతేకావాలి . లేకుంటే తండ్రి తాతల్నుంచి వచ్చే పోలాల్ను అమ్ముకుంటారా?"
"భూమిని బుక్కుతే డొక్క నిండుతుందా?"
పెద్దగా నవ్వాడు. "నేల మీదనే, తామ పూర్వికులు చమటోడ్చిన పొలం మీదనే పడి చావాల్సింది . ఏం? చావడం చేతకాదూ? తిరిగిపోతే ఏంతింటారు? చిన్ననాటి నుండి చెమటోడ్చిన నేల ఉండదు. అయినా అదైర్యపడ్డం ఎందుకూ? మీరు కూలి చేసుకోవచ్చు. పట్నాల్లో ఫ్యాక్టరీ కార్మికుల్లా శ్రమను అమ్ముకోవచ్చు. డొక్క నిండుతుంది. అంతేగా కావాల్సింది. తిండి లేక ఎండి చావరు. చాలదూ? ఇంకో లాభం కూడా ఉంది. ఎన్నడూ లేని సరికొత్త స్వేచ్చ లభిస్తుంది. ఊరూరికి తిరిగి దేశం చూసే భాగ్యం లభిస్తుంది. ప్రయోజనం తెలిసిందా? బంగారు బెంగాల్ను దర్శించుకుంటారు. ఊరూరికి తిరిగి మీ ఇష్టం వచ్చిన చోట స్థిరపడే స్వేచ్చ లభిస్తుంది.
మౌనంగా తలవంచుకొని నేలను చూస్తుంది.
"ఈ మహామారి నిన్ను అంటింది కదూ?"
పరధ్యానంగా "ఊ" అన్నది.
"మీ తండ్రి ఝూర్నా వదిలిం తర్వాత ఎలా ఉండింది? గడ్డుగా గడిచిందా? చాలా బాధ పడ్డావా?"
"బాధపడ్డాను. సరే గాని ఆకలి యాత్రలు ఇంతటితో ఆగిపోతాయా?"
"సాగుతాయి."
"దరిద్రులంతా నగరం నుంచి వెళ్ళిపోతారు కదూ?"
"అవును, కాని దరిద్రం ఇక్కడే ఉండిపోతుంది. వారితో పాటు వారి సమస్యను నగరం నుంచి గెంటి వేయడం సాధ్యపడదు. ఉద్యమం పుంజుకుంటుంది. ఇంకా మన ముందు గుట్టంత పని పడి ఉంది. నీవూ ఒక కమిటీలో చేరుతే మా ప్లానులన్నీ తెలుస్తాయి."
"నేనా?" ఆమె కళ్ళు పెద్దవి అయినాయి.
"మన మీద ఉన్న కార్య భారాన్ని గురించి నీకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండాలి."
"నాకేం తెలుసుస్తుంది ?ఇదంతా అర్ధం అవుతుందా?"
తదేక ధ్యానం తో ఆమె ముఖాన్ని అవలోకించాడు. ఎక్కడో దూరాన ఉన్న భవిష్యత్తు ను గురించి ఆలోచిస్తున్న ముఖపు సౌబగు మెరుగు పెట్టుకుంది. అతని గుండె ఎగిరి గంతేసింది.
"నాకేం తెలుస్తుంది? నేనేం చేయగల్ను?"
"లేఖ లేఖగా ఉంటే చాలు. ఆమె ఎక్కువ గానీ, తక్కువ గానీ కావాల్సిన అవసరం లేదు."
"నాకు తెలిసిందెంత?"
"లేఖా, నీ తండ్రి వచ్చి ......"
"పాపం , అతన్ని అపార్ధం చేసుకోకండి. నిజంగా అతని హృదయం పేదలూ, పీడితులూ అంటే కరిగి నీరు అవుతుంది. అతడు మాత్రం బాధ పడలేదూ? ఏం చెప్పాడు ? ........ ఏం చెపుతాడూ? ఒక్క రూపాయి సంపాదించుకోవడానిగ్గాను తాను ఎత్తి వేసిన పీనుగుల్ను గురించి చెప్పి ఉంటాడు ......పీనుగుల పెంటలో పడి ఉన్న ఒక కుర్రాడి వంట్లో ఇంకా వేడి ఉండడమూ , దాన్ని సహితం తాను ఎత్తి వేయాల్సి రావడమూ చెప్పి ఉంటాడు."
"లేఖా, అతడు నిన్ను గురించి చెప్పాడు. నీవూ బాధలు పడ్డావనీ, భయంకరమైన యాతనలు భరించావనీ , మళ్ళీ వాటిని గుర్తుకు తేవద్దనీ చెప్పాడు, కాని తండ్రి వద్దన్న పనే చేయదల్చుకున్నాను. నీ బాధలు, యాతనలు చెపుతావా?"
ఆమె అదిరిపోయింది. చూపు నిలిచిపోయింది. చాలాసేపు లేఖ వేపు చూపు బిటేన్ మీదనే నిల్చి ఉంది.
"నేను పడ్డ బాధలా?"
"అవును చెప్పు, తెలిసినంత వరకు చెప్పు. జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పు. గతంలోని నీ మూర్తిని నా ముందు ఉంచు , అంతే"
క్షణం గడిచింది. "బాధ యాతన" ఆమె గొంతు బీటలు వారింది. భీకర దుఖం పొర్లింది. తల వంచుకుంది. కళ్ళు భాష్ప పూర్ణము లైనాయి.





