Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



        అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్|
        యుయో ధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాతే నమ ఉక్తిం విధేమ||

                                  మూడవ ప్రపాఠకము

                                             మొదటి అనువాకము

    1. ఐశ్వర్యము కోరువాడు - వరదులును, సంపన్నులును అగు ఆదిత్యులకు చరు హవిస్సును నిర్వాపము చేయవలెను. ఆదిత్యులే యజమానికి ఐశ్వర్యములు కలిగించుచున్నారు. ఒకడు ఐశ్వర్యమునకు అర్హుడు అగును. అట్లయ్యు ఐశ్వర్యవంతుడు కాకుండును. అట్టివాడు సంపన్నులైన ఆదిత్యులను స్వభాగధేయమున సేవించవలెను. ఆ ఆదిత్యులే అతనికి ఐశ్వర్యము కలిగింతురు. అతడు నిశ్చయముగా ఐశ్వర్యవంతుడు అగుచున్నాడు.   

    2. పూర్వము శత్రువుచే తన దేశము నుండి తొలగించబడిన వాడును, ప్రస్తుతము శత్రువుచే స్వదేశము నుండి తొలగించబడిన వాడును స్వస్థానమునందు నిలుపు సమర్థులగు ఆదిత్యులకు చరు హవిస్సును నిర్వాపము చేయవలెను. అతడు స్వభాగధేయమున ఆదిత్యులను సేవించవలెను. అట్లయిన ఆదిత్యులే అతనిని స్వదేశమునకు చేర్చెదరు. అప్పుడు శత్రువులు అతనిని తొలగించజాలరు.

    3. స్వదేశచ్యుతుడు 'అమ్మా భూమీ! నన్ను ప్రవేశించుటకు అనుమతించుము' అను మంత్రమును ఉచ్చరించవలెను. శత్రువు కాలుపడిన మట్టిని పట్టవలెను. అందువలన అదితి శబ్దవాచ్యమగు ఈ ధరిత్రియే అతనిని స్వదేశమునకు అనుమతించును.

    4. సత్యాశీరిత్యాహ సత్యమేవాశిషం కురుత. నా కోరిక ఫలించును గాత అనుట వలన వాస్తవముగనే కోరికలు తీరుచున్నవి.

    5. రాజ్యచ్యుతుడైన వాడు ప్రజలమనస్సు నాకు అనుకూలమగును గాత, అను 'ఇహమనః' మంత్రమును ఉచ్చరించవలెను. ఆ మంత్రము ప్రజలను అతనికి అనుకూలమనస్కులను చేయును.

    6. మరుత్తులారా! మీరు రాజ్యమున ప్రవేశము కలిగించ గలవారలు. దేశచ్యుతడగు ఇతడు రాజుతో యుద్ధము చేసి జయించ తలచినాడు. మీరు రాజ్యచ్యుతుడగు రాజునకు అభిముఖముగా అతని దగ్గరకు వెళ్లుడు అని "ఉపప్రేత మరుతః సుదానవః ఏనా విశ్వతినాభముగం రాజానమ్" మంత్రము చెప్పుచున్నది.

    ఈ మంత్రము మరుత్సంబంధము. అందువలన మంత్రము చదివిన వానికి అది రాజ్యమును ప్రజలను సమకూర్చి సమృద్ధము చేయును.

    7. అతడు గ్రామ్యవాది. సభలోనకాక రహస్యముగా హితము చెప్పువాడు. అతని వలన కలుగు హానిని నివారించుటకు అతని ఇంటినుండి ధాన్యమును తీసికొనవలెను. వానిలో నల్లని, తెల్లని ధాన్యమును వేరుచేయవలెను. ఆ తెల్లని ధాన్యముచే ఆదిత్యులకు చరు హవిస్సును నిర్వాపము చేయవలెను. ప్రజ ఆదిత్య సంబంధి అగును. అందువలన ప్రజలు యజమానిని చేరుకొందురు.

    8. రాజ్యచ్యుతనకు ప్రజ అనుకూలమైనంత మాత్రమున రాజ్యము కలుగదని వచింతురు. కావున రాజ్య ప్రాప్తి కొరకు వరుణ సంబంధమగు చరు హవిస్సును నిర్వాపము చేయవలెను. ప్రజకు ఆదిత్యులవలె రాజ్యమునకు వరుణుడు అధిదేవత అగును. ఆదిత్యవరుణుల సంతృప్తి వలన రాజ్యచ్యుతనకు ప్రజయు, రాజ్యము ఉభయము లభించును.

    9. అప్పటికి అతనికి ప్రజ, రాజ్యము లభించకున్నచో నేను నా ప్రజను రాజ్యమును పొందుటకు గాను శత్రువునుండి తెచ్చిన హవిర్భాగమును ఆదిత్యుల కొరకు నిర్వాపము చేయుదును, అని నిర్వాపము చేయవలెను. ఆ విధముగా నిర్వాపము చేయుటవలన ఆదిత్యులే హవిర్భాగమును అపేక్షించుచున్న వారై అతనికి స్వకీయ ప్రజను సమకూర్తురు.

    10. అప్పటికి అతనికి ప్రజయు, రాజ్యము లభించకున్నచో ఈ ఆదిత్యచరునే నిర్వాపము చేయవలెను. ఇధ్మమునందు శంకువులను బంధించవలెను. అప్పుడు అతడు తనను విడిచిన ప్రజను మరల పొందును.

    11. అప్పటికి ప్రజను పొందనిచో మరల ఆదిత్యదేవతాకమగు చరు హవిస్సునే నిర్వాపము చేయవలెను. ఇధ్మము నందు కూడ శంకువులను బిగించవలెను. అప్పుడు నిశ్చయముగ అతడు తన ప్రజను పొందును.

    12. శంకువు రావిచెట్టునకు సంబంధించినది కావలెను. రావి మరుత్తుల ఓజస్సు అగును. మరుత్తుల ఆ ఓజస్సుతోనే అతడు తన ప్రజను పొందును.

    13. శంకువులు ఏడు కావలెను. మరుత్తులు సప్తసంఖ్యాకులు కదా! అందువలన ప్రజలు గుంపులు, గుంపులుగా అతనిని చేరుకొందురు.

                                   రెండవ అనువాకము

    1. దేవతలు మృత్యువునకు భయపడినారు. వారు ప్రజాపతిని అర్థించినారు. అతడు వారికి ప్రజాపతి దేవతాకమగు శతకృష్ణలఇష్టిని సూచించినాడు. నిర్వాపము చేసినాడు. అందువలన దేవతలకు అమృతత్వము కలిగించినాడు.

    (కృష్ణల గురివిందగింజ. వంద గురువిందలంత బంగారముతో చేయు ఇష్టి శతకృష్ణల అగును.)

    2. అపమృత్యు భయము కలవాడు ప్రజాపతి దేవతాకమగు శతకృష్ణలఇష్టిని ఆచరించవలెను. అతడు స్వభాగధేయమున ప్రజాపతిని సేవించవలెను. ఆ ప్రజాపతియే యజమానికి సంపూర్ణ ఆయువును కలిగించును.

    3. ఇష్టి శతసంఖ్యాక కృష్ణల కావలెను. ఏలనన మానవుడు శతాయుష్కుడు. నూరు ఇంద్రియములు కలవాడు. నూరు ఇంద్రియములందు ఆయువు నిలిచి ఉండవలసివాడు.

    4. ఈ ఇష్టియందు బంగారమును ఘృతమునందు ఉంచవలెను. ఆయువు ఘృతము, హిరణ్యము అమృతమగును. కావున ప్రజాపతి అతనికి ఆయువును, అమృతత్వమును సమానములుగా కలిగించును.

    5. నాలుగు నాలుగు కృష్ణల చొప్పున అవదానము చేయవలెను. అందువలన చతురవత్త ప్రాప్తి కలుగుచున్నది.

    6. ఏకధా బ్రహ్మణ ఉపహరత్యైకదైవ యాజమాన ఆయుర్దదాత. ఋత్విగ్భాగము లన్నింటిని ఒకటిచేసి బ్రహ్మకు అర్పించవలెను. అందువలన యజమానికి సర్వావయములందు ఒకే తీరుగ ఆయువు కలుగుచున్నది.

    7. ఒకానొకప్పుడు సూర్యుడు ప్రకాశించకుండెను. దేవతలు సూర్యునకు ప్రకాశము కలిగించదలచినారు. సూర్యదేవతాక చరు హవిస్సును నిర్వాపము చేసినారు. అందుకే సూర్యునకు ప్రకాశము కలిగించినారు.

    కావున బ్రహ్మవర్చస్సును అభిలషించువాడు సూర్యదేవతాక చరు హవిస్సును నిర్వాపము చేయవలెను. స్వీయభాగధేయమున సూర్యుని అర్చించవలెను. సూర్యుడే యజమానికి బ్రహ్మవర్చస్సు కలిగించుచున్నాడు. యజమాని బ్రహ్మవర్చసి అగుచున్నాడు.

    8. హవిస్సునకు పైభాగమునను, క్రింది భాగమునను హిరణ్యములను ఉంచవలెను. అట్లుచేసిన సూర్యుడు యజమానికి కాంతిని కలిగించుచున్నాడు.

    9. ప్రతి ప్రయాజము నందును గురవిందఎత్తు బంగారమును హోమము చేయవలెను. అందువలన యజమానికి సర్వదిశలనుండి బ్రహ్మవర్చస్సు చేరుచున్నది.

    10. హిరణ్యం విన్దేయ హిరణ్య మోపనమేదితి - బంగారము నాకు అందవలెను, నన్ను బంగారము చేరవలెనను కోరికగలవాడు, అగ్ని దేవతాకమగు అష్టాకపాల పురోడాశమును, సవితృ దేవతాకమగు ద్వాదశ కపాల పురోడాశమును, భూదేవతాకమగు చరు హవిస్సును నిర్వాపము చేయవలెను.

    అష్టాకపాల పురోడాశము అగ్నిదేవతాకము. బంగారము అగ్ని సంబంధి. అందువలన యజమాని హిరణ్యస్వామి అగ్ని చేతనే హిరణ్యమును పొందును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.