Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                   జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                  ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                పందొమ్మిదవ అధ్యాయము


1.    స్వాద్వీం త్వా స్వాదునా తీవ్రాం తీవ్రాం తీవ్రేణామృతామమృతేన|
    మధుమతీం మధుమతా సృజామి సంసోమేన||
    సోమ్కో స్యాశ్విభ్యాం పచ్యస్వ సరస్వత్యై పచ్యస్వేంద్రాయ
    సూత్రమ్ణే పచ్యస్వ
   
    (ఇవి సౌత్రామణి యాగమంత్రములు. మూడు అధ్యాయముల వరకు సాగును.)

    సురా! రుచిగల నిన్ను రుచిగల సోమమున కలుపుదును. త్రీవమగు నిన్ను తీవ్ర సోమమున కలుపుదును. అమృతమయమగు నిన్ను అమృత సోమమున కలుపుదును మధుమతి వాగు నిన్ను మధుమయ సోమమున కలుపుదును.
   
    సోమ సంయోజిసురా! నీవు అశ్వినుల కొరకు పచనమగుము. సరస్వతి కొరకు పచనమగుము. సురక్షకుడగు ఇంద్రుని కొరకు పచనమగుము.

    2. ఋత్విజులారా! ఏది యజమానిని ధరించినదగునో, ఏది మానవులకు హితకరమగునో దేనిని అధ్వర్యులు జలమునందు రాళ్ళతో దంచి తీసినారో, అట్టి అభిషుత సోమమున ఆవుపాలను కలపండి. అది సర్వోత్తమ సోమహవి అగును.

    3. ఉదరాంతర్వర్తియగు వాయువుచే దశాపవిత్రమున పావనము చేయబడిన సోమము ప్రవహించుచు దిగువకు చేరును. అది ఇంద్రునకు అనుకూల మిత్రము అగును.

    4. (అధ్వర్యు యజమానితో అనవలసినది)

    యజమానీ! అభిషుతమైన నీ సోమమును గో అశ్వవాలమున -సూర్యపుత్రి శ్రద్ధ పవిత్రము చేయును.

    5. సోమమా! అభిషుతమగుము. బ్రాహ్మణ, క్షత్రియులందును, ఇంద్రియములందును తేజస్సు పుట్టించుము. సురతో కలసిన నీవు మదకారివి అగుదువు. నీ శుద్ధమగు బలమున అగ్ని మున్నగు దేవతలను ప్రసన్నులను చేయుము. ఘృతాది సహిత యజమానికి అన్నము ప్రసాదించుము.

    6. మిత్రమా అగ్నీ! విత్తుటకు ముందు రైతు ధ్యానమును గడ్డి నుంచి వేరు చేయును. అట్లే ఈ లోకమందు కుశలు అందుకొని నీకు నమస్కరించు యజమానుల వేరు చేసి వారి కొరకు అన్నపానాదులు ఏర్పరుచుము.

    (పయోగ్రహన్ గృహ్ణాతి, పాలపాత్రను అందుకొనును)

    పయోగ్రహమా! నీవు ఉపయామ పాత్ర  ద్వారా  గ్రహించబడినావు. నేను నిన్ను అశ్వినులు, సరస్వతి, సురక్షక ఇంద్రుని కొరకు గ్రహించుచున్నాను. ఇది నీ స్థానము. తేజము, బలము కొరకు నిన్ను ఇచట స్థాపించుచున్నాను.

    7. (సురాగ్రహాన్ గృహ్ణాతి - సురాపాత్రలను అందుకొనవలెను)

     సురా సోమములారా! మీ ఇరువురి కొరకు వేరు వేరు స్థానములు ఏర్పరచబడినవి. ఆ స్థానములు దేవతలకు హితక రములు. ఉత్తమ వేడి స్థానములందు మీరిరువురు కలసిపోకండి.

    సురా! నీవు బలశాలివి సురవు. ఇది శుద్ధ సోమరసము. నీవు నీ స్థానమున నిలుపుము ఏనాడును సోమమును బాధించకుము.

    8. ఉపయామగ్రహమున సేకరించబడినావు. నీవు అశ్వినులకు తేజస్సువు. సరస్వతికి బలమవు. ఇంద్రునకు శక్తివి. ఇది నీ స్థానము. ప్రమోదము, ఆనందము, తేజస్సు కలుగవలెనని నిన్ను  ఇచట స్థాపించుచున్నాను.

    9. (దుగ్ధ పాత్రను అందుకొని అందు గోధుమ పిండి - గంగరేగు పొడి వేయవలెను.)

    దుగ్ధపాత్రా! నీవు తేజస్సువు. నాలో తేజస్సు నింపుము. నీవు వీర్యమవు. నాలో వీర్యము నింపుము. నీవు బలమవు. నాలో బలము నింపుము. నీవు ఓజస్సువు. నాలో ఓజస్సు నింపుము. నీవు కోపమవు. నాలో కోపము నింపుము. నీవు సాహసమవు. నాలో సాహసము నింపుము.

    10. విషూచిక వ్యాఘ్రమును, వృకమును రక్షించును. ఎగురునట్టి శ్యేన పక్షి సింహమున రక్షింపును. ఆ విషూచిక యజమానిని పాపములనుండి రక్షించును గాత.

    11. తల్లిపాలు తాగునప్పుడు బిడ్డ తల్లిని తన్నును. అగ్నీ! నేను ఆ ఋణము తీర్చుకున్నాను. నేను తలిదండ్రులను బాధించలేదు.

    (యజమాని సోమపాత్రలను తాకవలెను)

    సోమ పాత్రలారా! మీరు కూర్చు స్వభావము కలవారు. నాకు శుభములు కూర్చండి.

    (యజమాని సురాపాత్రలను తాకవలెను)

    సురాపాత్రలారా! మీరు వేరు చేయువారు. నన్ను పాపముల నుండి వేరు చేయండి.

    12. ఇంద్రుని కొరకు ఇంద్రియ బలము సముపార్జించునపుడు దేవతలు యజ్ఞమును విస్తారపరచినారు. అశ్వినులు యజ్ఞమున వైద్యము చేసినారు. వాణి ద్వారా సరస్వతియు వైద్య అయినది.

    13. నవయవాంకురము దక్షిణీయ ఇష్టి స్వరూపము. లేచిగురు యవాంకురము ప్రాయణీయ ఇష్టి స్వరూపము. లాజలు సోమక్రియ స్వరూపలు, సోమఖండము మధుర సోమరస స్వరూపము.

    14. 'మాసరము' ఆతిథ్యేష్టి స్వరూపము, 'నగ్నహు' మహావీర ఘట స్వరూపము. మూడు రాత్రులు అభిషుతము చేసి మూడు రాత్రులు గుంతలో ఉంచిన సుర 'ఉపనద్' ఇష్టక స్వరూపమగును.

    15. ఒకటి, రెండు, మూడు గోవుల పాలచే చిలికి పరిసించితము చేయబడిన సుర సోమక్రియా స్వరూపమగును. అశ్వినుల కొరకు ఒక ఆవు పాలచే మొదటి రోజు - సరస్వతి కొరకు రెండు ఆవుల పాలచే రెండవ రోజు - ఇంద్రుని కొరకు మూడు ఆవుల పాలచే మూడవ రోజు ఆసించితము చేయబడును.

    16. సోమమును ఉంచు పీఠము రాజు యొక్క సింహాసన స్వరూపము. సురను ఉంచు కుంభము 'సౌమికి వేది' స్వరూపము. రెండు వేదిల మధ్య భాగము ఉత్తర వేది స్వరూపము. సురను శుభ్రముగా చేయుజల్లెడను ఇంద్రుడు మరియు యజమాని వైద్యముగా తెలియవలెను.

    17. వర్తమాన వేది వలన 'సౌమికీ' వేది లభించును. బర్హి నుండి కుశరూప బలము ప్రాప్తించును. యూపమున యూపము అగ్నివలన అగ్ని లభించును.

    18. ఈ సౌమిత్రాణి యాగమందు అశ్వినులు సద్భావమున హవిర్ధానము, సరస్వతి ఉపస్థితి వలన అగ్నీధ్రము ఇంద్రునకు అర్పించు హవి గర్హపత్యము, పత్నీశాలమని భావించవలెను.

    19. ప్రేషణమున ప్రేషణము- అప్రియజ్ఞము వలన అప్రియజ్ఞము - ప్రయజనుముల వలన ప్రయజము అను యాజముల వలన అనుయాజము వషట్కారము వలన వషట్కారము- ఆహుతుల వలన ఆహుతులు  సంప్రాప్తించును.

    20. పశువులవలన పశువులు, పురోడాశము వలన పురోడాశము, హవిస్సులవలన అన్య హవిస్సులు, ఛందముల వలన ఛందములు, సామిధాని ఋక్కుల వలన సామిధాని ఋక్కులు, యాజ్యల వలన యాజ్యలు, వషట్కారముల వలన వషట్కారములు లభించును.

    21. వేపినధాన్యము, కరంభము, సత్తు, హవిష్పంక్తి, పాలు, పెరుగు, వీనిని సోమమునకు ప్రతినిధులుగా తెలియవలెను. దుగ్ధ సంబంధములు, మధు సంబంధములు హవి రూపములగును.

    22. పెద్దరేగు ధాన్య ప్రతీక. గోధుమలు హవిష్పంతి ప్రతీకలు. రేగు సత్తు ప్రతీక. యవలు జలమంథ ప్రతీకలని తెలియవలెను.

    23. యవలు దుగ్ధ రూపలు. రేగు దధి రూపము. కర్కంధము సోమరూపము - మధువు సౌభ్య చరు రూపములగును.

    24. 'ఆశ్రవాయ' స్తోత్రియము' 'అస్తువౌషఢ' ప్రత్యాశ్రావము, 'యజ', ధాయ్యా - 'యేయజామహే' ప్రగాథ ప్రతినిధులని ఎరుంగవలెను.

    25. అర్థర్చల నుండి ఉక్థలు- పదములనుండి నివిదలు - ఓం నుండి శాస్త్రములు - పాల నుండి సోమము - కలుగునని గ్రహించవలెను.

    26. అశ్వినుల సద్భావమున ప్రాతః సవనము - ఇంద్రుని సద్భావమున మధ్యాహ్న సవనము- సరస్వతి సద్భావమున సాయం సవనము సిద్ధించును.

    27. సోమ పాత్రల వలన సకల సోమ పాత్రలను, వైతస పాత్రల వలన ద్రోణ కలశమును, సురను చేర్చుకోను కుంభము వలన అభిష్టుత సోమము కొరకు పూతభూత - ఆహవణీయ ఘటములు - పళ్ళెముల వలన పళ్ళెములు ప్రాప్తించును.

    28. యజువుల నుండి యజుస్సులు, గ్రహముల నుండి గ్రహములు, స్తోమముల నుండి స్తోమములు, స్తుతులనుండి స్తుతులు, ఛందముల నుండి ఛందములు, సోమము నుండి సోమము అవభృధము నుండి అవభృధమును పొందవచ్చును.

    29. ఇడ నుంచి ఇడను సూక్తవాక్కు నుండి సూక్తవాక్కును, ఆశీర్వచనము నుండి ఆశీర్వచనమును, శంయు నుండి శంయును పత్నీ సంయోజముల నుండి పత్నీ సంయోజములను సమిష్ట యుజుస్సు నుంచి సమిష్ట యజస్సును, సంస్థ నుండి సంస్థను పొందవచ్చును.

    30. వ్రతము వలన దీక్షను, దీక్ష వలన దక్షిణను, దక్షిణ వలన శ్రద్ధను, శ్రద్ధ వలన సత్యమును ప్రాప్తించ వచ్చును.

    31. ఏతావద్రూపం యజ్ఞస్య యద్దేవైర్బ్రహ్మణాకృతమ్|
    తదేతత్సర్వమాప్నోతి యజ్జేసౌత్రామణీ సుతే||

    ఇది సోమ యజ్ఞ స్వరూపము. దీనిని దేవతలు, బ్రహ్మ దర్శించినారు. సౌత్రామణి యజ్ఞమున సురాసోమము అభిష్టుతమైనంత యజమానికి ఇవన్నియు ప్రాప్తించును.

    32. సౌత్రామణియాగము సురాయుక్తము. దేవతల ఆసనమగు దర్భాసన యుక్తము. దీనిని మహా ఋత్విజులు నమస్కారయుక్తులై కొనసాగింతురు. మేము అర్చించువారలము. ఋత్విజు యజమానులము. మంత్రములచే సోమమును దేవతల కంపుచున్నాము. ఇంద్రుని మదోన్మత్తుని చేయుచున్నాము.

    33. సురా! ఓషధులందున్న ణీ యొక్క రసము కూర్చుబడినది. నీతో కూడి సోమమునకు  బలము చేకూరినది. మదాకమగు రసమున యజమానిని, సరస్వతిని, అశ్వినులను, ఇంద్రుని అగ్నిని తృప్తిపరచుము.

    34. ఏ సోమమును అశ్వినులు అసురుడగు నముచి నుండి తెచ్చినారో దేనిని ఇంద్రియముల కొరకు సరస్వతి పరిశుద్ధము చేసినదో అట్టి శుద్ధమును, మధురమును, ఆనందకరమును, రాజగునట్టియు సోమమును నేను ఈ యజ్ఞమును సేవింతును.

    35. ఆ సోమపు కొంత భాగము సురలో చేరినది. ఈ సురను ఇంద్రుడు ఉపాయముగ శుద్ధి చేసి సేవించినాడు. రాజగు ఆ సోమపు అంశముగల సురను సుమనస్కుడనై యజ్ఞమునందు సేవింతును.

    36. స్వధాప్రియులగు పితరులకు స్వధాన్నము సమర్పించుచున్నాము. వారికి నమస్కారము. స్వధా ప్రియ పితామహులకు స్వధాన్నము సమర్పించుచున్నాము. వారికి నమస్కారము. స్వధాప్రియులగు ప్రపితామహులకు స్వధాన్నము సమర్పించుచున్నాము. వారికి నమస్కారము.

    (సురాభాండములను సురలకు అర్పించి అగ్నికి ఆహుతులు అర్పించవలెను.)

    పితరులు సురాపానము చేసినారు. మత్తులయినారు. తృప్తులయినారు. పితరులారా! మీరు చేతులు కడుక్కొని పరిశుద్ధలు కండి.

    37. (ఈ మంత్రములను జపించవలెను.)

    సోమప్రియులగు పితరులు నన్ను పవిత్రుని చేయవలెను. ప్రపితామహులు మమ్ము పవిత్రులను చేయవలెను. శతాయుష పవిత్రమున ప్రపితామహులు నన్ను పావనము చేయవలెను. పితామహులు శతాయుషమగు పవిత్రమున నన్ను పావనము చేయవలెను. ప్రపితామహులు శతాయుషమగు పవిత్రమున నన్ను పావనము చేయవలెను. వారిచే పావనము చేయబడిన నేను సంపూర్ణ ఆయుష్మంతుడ నగుదును గాత.

    38. అగ్నీ! ఆయుష్యము కలుగు పనులను మాచే చేయింతువు. మాకు ఆయుష్యము కలుగునట్టి బలము గల అన్నమును తెచ్చి ఇమ్ము. దుష్ప్రవృత్తి గలవారిని మానుండి దూరము చేయుము.

    (ఆయుష్యము కలుగుటకు బలమును ఇచ్చు ఆహారము. దుష్టులకు దూరముగా ఉండుట అవసరమని)

    39. దేవజనుల నన్ను పావనుని చేయుదురు గాత. వారు నా మనసు ద్వారా నా బుద్ధిని పావనము చేయుదురు గాత. సర్వ భూతములు నన్ను పావనుని చేయును గాత. జాతవేద అగ్ని నన్ను పావనము చేయును గాత.

    40. అగ్నిదేవా! దీప్యమానుడవగు నీవు నన్ను శుద్ధ పవిత్రమున పావనము చేయుము. యజ్ఞము లక్ష్యముగా ణీ స్వకర్మమున నన్ను పావనము చేయుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.