Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                 నూట నాలుగవ సూక్తము

         ఋషి - వసిష్ఠుడు, దేవత - వేరు వేరు, ఛందస్సు - వేరు వేరు.

    1. ఇంద్రసోములారా ! మీరు రాక్షసులకు దుఃఖము కలిగించండి. చావగొట్టండి. అంధకారమున వృద్ధిచెందు రాక్షసులను నేలకరిపించండి. అజ్ఞాని రాక్షసులను విముఖులను చేసి హింసించండి. కాల్చండి. కొట్టిపారేయంది. దూరమునకు విసరండి - భక్షక రాక్షసులను జర్జరముచేసి విసరివేయండి.

    2. ఇంద్రసోములారా ! అనర్థ ప్రశంసకులు. ఆక్రమకులగు రాక్షసులను వెంటనే అణచివేయండి. మీ తేజస్సున మాడిన రాక్షసులను అగ్నిలోనికి విసరిన చరువలె విలుప్తము చేయండి. బ్రాహ్మణద్వేషులు, మాంసభక్షకులు, ఘోరనేత్రులు, కఠినవాక్కుగల రాక్షసులను సర్వదా ద్వేషించునట్లు చేయండి.

    3. ఇంద్రసోములారా ! దుష్కర్మలగు రాక్షసులను అంతర్మధ్యమున ఆలంబనములేని అంధకారమున పడేసి చంపండి. మరల వారిలో ఒక్కండును బయటికి రానట్లు పరిమార్చండి. మీకుగల క్రోధవంతమగు ప్రసిద్ధబలము రాక్షసులను అణచుటకు సమర్థవంతము కావలెను.

    4. ఇంద్రసోములారా ! అంతరిక్షమునుండి ఘాతక ఆయుధములు నిర్మించండి. ఈ నేలనుండి ఘాతక ఆయుధములు నిర్మించండి. మీరు రాక్షసులను ధ్వంసము చేసిన వజ్రమును మేఘమునుండి సృష్టించండి.

    5. ఇంద్రసోములారా ! అంతరిక్షమున నలువైపులకు ఆయుధములు పంపండి. అగ్నివలె కాల్చునవి, తపింప చేయునవి, దృఢములు, రాళ్లతో చేసిన అస్త్రములతో రక్కసుల పక్కలు పగులకొట్టండి. ఆ రాక్షసుల నోరుమూసుకొని పారిపోవలెను.

    6. ఇంద్రసోములారా ! చంకకు తగిలించుకొను త్రాడువంటిదానితో గుఱ్ఱములను కట్టుదురు. మా ఈ మనోహర స్తుతి మాకు ఆవిధముగా చెందవలెను. మీరు బలవంతులు. బుద్ధిబలమున ఈ స్తోత్రమును పంపుచున్నాము. రాజులు ధనముతో నింపినట్లు మీరు ఈ స్తోత్రములను ఫలవంతము చేయండి.

    7. ఇంద్రసోములారా ! వేగవంతమగు గుఱ్ఱముపై రారండి. ద్రోహులు, భంజకులగు రాక్షసులను మట్టు పెట్టండి. పాపి రాక్షసుడు ద్రోహము తలచి ఎప్పుడో ఒకప్పుడు మనను కొట్టవచ్చును. కావున వాడికి సుఖము కలిగించకండి.

    8. నేను పరిశుద్ధ మనస్కుడను. నన్ను అసత్యభాషిని చేసిన రాక్షసులు ఉన్నారు. ఇంద్రసోములారా ! అట్టి అసత్యవాది రాక్షసుని మట్టిలోపడిననీటివలె అస్తిత్వ రహితుని చేయండి.

    9. సత్యవాదినగు నన్ను తన స్వార్థము కొఱకు లజ్జితుని చేయువానిని, కళ్యాణవృత్తిగలనన్ను బలవంతుడై దోషిని చేయువానిని పాములమీద పడేయండి లేదా పాపదేవత వడిలోకి విసరండి.

    (ఇచట రాక్షసులు, అని చెప్పలేదు, మనిషిని తప్పుదారి పట్టించువారు రాక్షసులు మాత్రమేకారు)

    10. అగ్నీ ! మా అన్నపుసారమును నష్టపరచ తలచువాడును, మా అశ్వముల గోవుల వాటి సంతానముల సారమును నష్టపరచ దలచినవాడును అగు శత్రువు, దొంగ, ధనాపహర్త రాక్షసులు హింసలుపాలు కావలెను. వాడు తన దేహము, సంతాన సహితముగా నాశనము కావలెను.

    11. మమ్ము రాత్రింబవళ్లు బాధల పాలుచేయగోరు రాక్షసుడు దేహరహితుడు, సంతానరహితుడు కావలెను. వాడు మూడు లోకముల అడుగునకు పోవలెను. దేవతలారా ! అతని కీర్తిని ఎండగొట్టండి.

    12. సత్యాసత్యవచనముల పరస్పర ప్రతిస్పర్థ విద్వాంసునకు తెలియును. వానిలో సత్యము సరళతమము అయిన దానిని సోముడు పాలించును అసత్యమును హింసించును.

    13. సోమదేవత పాపిని, బలయుక్తిని, మిథ్యా వాదిని విడువడు. చంపును. అతడు రాక్షసులను చంపును. అసత్యవాదిని కూడ చంపును. అట్లు చచ్చిన వారు ఇంద్రుని ఉచ్చునపడి ఉందురు.

    14. నేను అసత్య దేవతలవాడనే అయినను. వృథాగా దేవతలవద్దకు వెళ్లువాడనే అయినను ధనీ అగ్నీ ! నా విషయమున క్రోథమెందుకు వహింతువు? మిథ్యావాదులు నీ హింసకు గురికావలెను.

    15. నేను వసిష్ఠుడను రాక్షసుడనైనచో, ఏ వ్యక్తి ఆయువునైన నష్టపరచినచో ఇప్పుడే చచ్చిపోవలెను. అట్లుకాక నన్ను వృధాగా రాక్షసుడన్నవాడు భార్యా, బిడ్డలు బంధువులు సహితముగా నాశనముకావలెను.

    16. అరాక్షసుడనగు నన్ను రాక్షసుడన్న రాక్షసుని తనను తాను పరిశుద్ధుడనుకున్న రాక్షసుని ఇంద్రుడు తన మహాయుధముతో బాధవలెను. వాడు సకల ప్రాణులలో అధముడై పతితుడు కావలెను.

    17. రాత్రిళ్లు ద్రోహబుద్ధితో గుడ్లగూబ రూపము దాల్చి చరించు రాక్షసి తలపండు పగిలి బొందలో పడవలెను. అభిషవ శబ్దములు శిలలు సహితము రాక్షసుడు నష్టపరచవలెను.

    18. మరుత్తులారా ! మీరు ప్రజల వివిధ రీతులందు వసించండి. రాత్రులు పక్షి రూపమున వచ్చు రాక్షసులను ప్రదీప యజ్ఞమును బాధించువారిని పట్టి, కొట్టి పిండి చేయండి.

    19. ఇంద్రా ! అంతరిక్షమునుండి వజ్రమును పంపుము. సోమపు వడిగల యజమానిని సంస్కరింపుము. గ్రంథులుగల వజ్రమున తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశలందున్న రాక్షసులను నాశము చేయుము.

    20. ఈ రాక్షసులు కుక్కల సహితులై పట్టుచు వస్తారు. బాధించరాని ఇంద్రుని హింసించ దలచిన రాక్షసులను వధించుటకు ఇంద్రుడు వజ్రమును పడును పెట్టుచున్నాడు, ఇంద్రుడు త్వరగా రాక్షసుల మీద వజ్రాయుధము ప్రయోగించవలెను.

    21. ఇంద్రుడు హింసకులకు హింసకుడు. రంపము చెట్లను కోసినట్లు స్తుతి గిన్నెలను బద్దలకొట్టినట్లు ఇంద్రుడు హవ్యమంథన కర్త, అభిముఖ ఆగమనకర్త కొరకు రాక్షసులను తెగనరకుచు వచ్చుచున్నాడు.

    22. ఇంద్రా ! ఉలూకములతో హింసించు రాక్షసులను వధించుము. క్షుద్ర ఉలూక రూపమున హింసించువారిని వధించుము. కుక్క, చక్రవాకము డేగ, గ్రద్ద రూపమున హింసించు వారిని రాతివంటి వజ్రముతో చంపుము.

    23. మమ్ము రాక్షసులు చుట్టుముట్టరాదు. దుఃఖము కలిగించు రాక్షస జంటలు దూరము కావలెను. రాక్షసులు ఇదేమిటి? ఇదేమిటి? అని అరచుచు తిరుగుదురు. పృథ్వి మమ్ము అంతరిక్ష పాపము నుండి రక్షించవలెను. అంతరిక్షము స్వర్గీయ పాపమునుండి రక్షించవలెను.

    24. ఇంద్రా ! మగ రాక్షసులను నాశము చేయుము. మాయలతో హింసించిన ఆడ రక్కసిని నాశము చేయుము. చంపుటయే పనిగల రాక్షసుల తలలు తెంపి చంపుము. వారు ఉదయ సూర్యుని చూడరాదు.

    25. సోముడా ! నీవు ఇంద్రుడు ఒకరిని ఒకరుక చూచుకొనండి. వివిధ రీతుల వీక్షించండి. జాగృతులుకండి మేల్కనండి ఉత్తిష్ఠ ! రాక్షసుల మీద వజ్రము ప్రయోగించండి.

    ఆలోచనామృతము

    ఈ నేలమీద మానవుడు పుట్టి లక్షల సంవత్సరములు దాటినవి. అయినను మనిషి అంతరంగము మనిషి స్వభావము మనిషి గుణము ఏ మాత్రము మారినట్లు కనిపించదు. సాహిత్యాదులు నేటికిని వర్తించుటకు ఇదే కారణము కావచ్చును.

    మానవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు సుఖదుఃఖములు, రాగద్వేషములు మున్నగు లక్షణములు మనిషిని అన్నికాలములందును పట్టుకొని ఉన్నవి. అవి ప్రాణముతో వచ్చును. కాని ప్రాణముతో పోవు.

    మనకు పూర్వ, పరజన్మల మీద విశ్వాసమున్నది. విశ్వాసము మాత్రమేకాదు. అది సత్యము. వాస్తవము. తథ్యము ఏలనన ప్రకృతిలో పదార్థములన్నిటికి పరిణామము మార్పు మాత్రమున్నది. నాశనము లేదు. కర్ర కాలి బొగ్గగును బొగ్గు బూడిద బూడిదమట్టి మట్టిమండి చెట్టు పునరావృతమగును.

    ప్రకృతి వలయము వంటిది. పదార్థములన్నియు ఒక బిందువు వద్ద ఆరోహణ క్రమమున పెరుగును. మరొక బిందువు వద్ద ఆపరోహణ క్రమమునదిగును. దీనికి అంతము మనకు తెలియదు. నిరంతరపరిణామమేప్రకృతి ధర్మము.

    మృత్యువు అనంతజీవితమున ఒక దశ మాత్రమే. అంతము దేహమునకే. ఆత్మకుకాదు. ఆత్మను తెలియుట అందరికి సాధ్యపడదు.

    ఆత్మకు నాశము లేదు "నైనం చ్చిందంతి శస్త్రాణి నైనం దహతి పాపకః" అన్నాడు కృష్ణపరమాత్మ గీతలో

    ఇది జన్మాంతర చర్చకు స్థానముకాదు. అయినను కామ క్రోధాదులు చావుతో చావవు. అంతస్తును బట్టి కుటుంబము, సమూహము, సమాజమును పట్టి పీడించుచుండును.

    రాగద్వేషాదులు మృత్యువుకన్న బలవత్తమములు అవి మహాత్ములను తప్ప మానవులను విడువవు.

    వసిష్ఠుడు ఋషి, ఋషిని అతీంద్రియ దర్శకుడు అని వ్యాఖ్యానించినాడు శాయనాచార్యులు. వసిష్ఠుని గురించి వాఖ్యానించు శక్తి మాకు లేదు. కాని వసిష్ఠుడు అతి సామాన్యుని వలె ప్రవర్తించినాడు అని చెప్పుట తప్పుట లేదు. అతడు ద్వేషము కక్కినాడు. సూక్తమునంతను తిట్లతో నింపినాడు. మండూక సూక్తమున సూక్తమునే పరిహసించినాడు.

    ఇది మానవ స్వభావము. నాటి నుంచి నేటికి మారలేదు. ముందు మారబోదు. "స్వభావో దురతిక్రమః" అన్నాడు వాల్మీకి.

    మానవుడు తన అభివృద్ధికి గోత్రములు, సమూహములు, తెగలు ఏర్పరచుకున్నాడు. అవియే అనంతర కాలమున మానవ వికాసమునకు అవరోధములయినవి. తనకు హానిచేసిన వ్యక్తినికాక ఆ వ్యక్తికి చెందిన సమూహమునే ద్వేషించసాగినాడు. అవి యుద్ధమందు వినాశములకు కారణములైనవి. ఇది మానవునకు చెరుపు మానవతకు చేటు.

    జాతిద్వేషము మానవతకు మసిపూత. ఇది మాన్పించుటకు మానవునకు జ్ఞానము కలిగించుటకు వర్తించుటకు నిదే కారణము కావచ్చును మహాభారతమున సర్పయాగ, వృత్తాంతము చెప్పబడినది.

    తన తండ్రిని సర్పము చంపినదని సర్పజాతిమీద ద్వేషము పూనివాడు జనమేజయుడు. ఒకజాతిని ద్వేషించి నాశము చేయరాదను అస్తీకుని బోధన విని జనమే జయుడు నిజము తెలిసికొన్నాడు.

    రాక్షసులందరు చెడ్డవారుకారు. తెలిసి తన పతనము ఎరిగి, వామనునకు మూడడుగులు దానము చేసిన వదాన్యుడు బలి. ప్రహ్లాదుడు భాగవతోత్తముడు. విభీషణుడు లేకున్న రామునకు విజయము కలుగునదికాదు.

    వశిష్ఠునకు ఇవి తెలియవా? అతడు రాక్షస జాతిని ద్వేషించినాడు. తిట్టినాడు. శపించినాడు. అయినను వసిష్ఠుడు విచక్షణ చూపినాడు. అన్నిచోట్ల కాకున్నను, కొన్ని విశేషణములు చూపి అట్టి రాక్షసులను మట్టు పెట్టుమన్నాడు. దుష్టులను, అసత్యవాదులను తిట్టినాడు.

    స్త్రీల విషయమున వివక్షత కనపరచినాడు. "ఇంద్రజహి పుమాంసంయాతు ధానము తస్త్రియం మాయయాశాశదానమ్"

    మగరాక్షసులను నాశము చేయుము. అన్నవాడు ఆడరాక్షసులు మాయలు చేసిననే వధించమన్నాడు.

    వసిష్ఠుడు మహాత్ముడు. ఎంతటివాడును అన్ని సందర్భముల మహాత్ముడుకాడు.


    విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటక కర్త, బాలసాహిత్యకారుడు, చలన చిత్రరచయిత, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వినయవంతుడు ప్రపన్నుడగు దాశరథి రంగాచార్య రచించిన ఆంధ్ర వచన ఋగ్వేద సంహితమున ఏడవ మండలము సమాప్తము.

                              తంచక్షుర్దేవాహితం శుక్రముచ్చరత్
                              పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతమ్




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.