Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

13. యుద్దమునందు చనిపోయిన వీరుల కుటుంబములను పోషించవలెను.
14. చారుల సమర్దులయి శత్రురాజుల రహస్యములు భేదించగలవారయి ఉండవలెను.
    నారదుడు పదమూడు రాజ దోషములను వివరించినాడు. 1. నాస్తిక్యము. 2. అసత్యము. 3. క్రోధము. 4. పొరపాటు. 5. బుద్దిమాంద్యము. 6. విచారణ వలన ఆలస్యము. 7. మూడులతో ఆలోచనము 8. శాస్త్రజ్ఞులను విద్వాంసులను గ్రహించకుండుట. 9. ప్రయోజనము ఉన్న కార్యమును అప్రయోజనమని వదలి వేయుట. 10. నిశ్చిత కార్యము చేయకుండుట. 11. రహస్యాములను రక్షించకుండుట. 12. శుభములను ఉపయోగించక ఉండుట. 13. విషయ సుఖాసక్తి కలిగి ఉండుట.
    నారదుడు ధర్మరాజునకు రాజధర్మములు బోధించినాడు. ధర్మరాజు నారదునకు మయసభా భవనమును చూపినాడు. ఇట్టి సభా భవనమును ఏలోకమందయినను చూచితిరా అని అడిగినాడు. నారదుడు లోకపాలుర సభలను వర్ణించినాడు. మయసభ వంటి సభ లోకములందు లేదని చెప్పినాడు. మరియు ఇట్లన్నాడు :-
    "ధర్మజా! నీ తండ్రి యమధర్మరాజు సభయందు కనిపించినాడు. రాజసూయము చేసినందున హరిశ్చంద్రుడు ఇంద్రుని సభలో ఉన్నాడు. నేను యమసభలో ఉన్నాను. ధర్మరాజుతో చెప్పి రాజసూయము చేయించుము. నేనును ఇంద్రసభకు చేరుడును" అని చెప్పినాడు. కాబట్టి పితృవాక్యమును అనుసరించుము. రాజసూయము చేయుము. నీ తండ్రి చెప్పినమాట చెప్పినాను. వెళ్ళుచున్నాను. అని నారదుడు నిర్గమించినాడు.
    ధర్మరాజు నారదుని మాటలు విన్నాడు. విచార మనస్కుడు అయినాడు. రాజసూయము చేయగలనో లేనో అని విచారించినాడు. దౌమ్య, వేదవ్యాసాదులను అడిగినాడు. వారు చేయవలసినది అన్నారు. తమ్ములను అడిగినాడు. వారును ప్రోత్సహించినారు. అయినను నమ్మకము కలుగలేదు. రాజసూయమును నిర్విఘ్నముగ పూర్తి చేయించుటకు శ్రీకృష్ణుడే సమర్ధుడగును. అతడు జనన మరణాది వికారములు ఎరుగని బ్రహ్మస్వరూపుడు. లోకమునకు మేలు చేయుటకు మానవ లోకమున పుట్టినాడు. కాబట్టి అతనితో అలోచించి రాజసూయము చేతును" అని శ్రీకృష్ణుని తోడ్కొని వచ్చుటకు పరిచారకులను పంపినాడు.
    శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వచ్చినాడు. ధర్మరాజు రాజసూయమును గురించి వివరించినాడు. నారదుడు చెప్పిన విధము, పురోహితులు , తమ్ములు ప్రోత్సహించిన విధము వివరించినాడు. శ్రీకృష్ణుడు రాజసూయము చేయవలసినదని ధర్మరాజును ప్రోత్సహించినాడు. ధర్మరాజు అంగీకరించినాడు.
    
                                                          ఆలోచనామృతము

1. గెలిచినా జాతి ఓడిన జాతిని బానిసలను చేస్తుంది. గెలిచినవానిదే నాగరికత, సంస్కృతీ అని ప్రచారం చేస్తుంది. ఓడిన జాతిని భౌతికంగానే కాక మానసికంగా బానిసలను చేయుటకు సర్వ ప్రయత్నములు చేస్తుంది. మీరు బానిసలు, మీకు చరిత్ర లేదు. నాగరికత లేదు. సంస్కృతీ లేదు. మేమే మీకు అన్నీ నేర్పుచున్నాము అని ప్రచారము చేస్తుంది. బానిస జాతి నమ్ముతుంది. అంతేకాదు గర్వముగా తమను బానిసలుగా చెప్పుకుంటుంది. గెలిచినవారి వేశాబాషలు అవలంభిస్తుంది. తమకు సంస్కృతీ లేదని మనసా, వాచా నమ్ముతుంది. తమకు ఉన్న చరిత్రను సంస్కృతిని విమర్శిస్తుంది. పనికిరానిది అంటుంది. ఇది సామాన్యముగా జరుగు విషయము.
    భారతజాతి సుమారు వేయేండ్లు విజాతీయుల పాలనలో ఉన్నది. వేయేండ్ల పాటు ప్రగతి నిలిచిపోయినది. జాతికి వేయేండ్లు స్తబ్ధత ఎచటికి దారితీయునో మనము ఊహించవచ్చును. ఆంగ్లేయులు రెండు వందల ఏండ్ల పరిపాలనలో మన నీడను చూచి మనమే భయపడుట నేర్చుకున్నాము. జీవితమునందలి అన్ని అంగములు ఆంగ్లేయములు అయినవి. మన చరిత్రను, సంస్కృతిని, సాహిత్యమును ఈసడించుకున్నాము. అందు నిజాము లేదు. అంతయు కల్ల అన్నాము.
    మనకు స్వాతంత్ర్యము వచ్చినది. మనను మనము తెలుసుకొనవలసిన పని ఉన్నది. మనకు అనంతమయిన చరిత్ర ఉన్నది. మహత్తరమయిన సంస్కృతీ ఉన్నది. ఉన్నతమయిన సంప్రదాయమున్నది. అవి వేయి సంవత్సరముల విజాయితీల పాలనలో మరుగున పడినవి. వానికి వెలికి తీయుటకు ఒక ఉద్యమము రావలసి ఉన్నది, ముందు మనము అందుకు మానసికముగా సిద్దము కావలసి ఉన్నది. అందుకు భారత అధ్యయనము ఎంతయో ఉపకరించును.
2. మయుడు సభ నిర్మించినాడు. రాక్షసులతో మోయించుకొని వచ్చినాడు అనగానే ఇది పుక్కిటి పురాణము అని కొట్టి వేయరాదు. అంతమాత్రమున ఉన్నదంతయు నిజమని నమ్ముటయు సరికాదు. పరిశీలించి నిగ్గు తెల్చవలె.
    పదార్ధము దొరుకు చోట ఇల్లు కట్టుట ఒక పద్దతి. ఇల్లు కట్టుచోటునకు పదార్దములు తెచ్చుట రెండవ పద్దతి. విడిభాగములను ఎక్కడికి అక్కడ సిద్దము చేసే ఇల్లు కట్టుటను పాశ్చాత్యులు నేడు అవలంభించుచున్నారు. ఆ పద్ధతినే మయుడు అవలంభించినాడు. బిందు సరోవర ప్రాంతమందు రత్నములు, వజ్రములు లభించి ఉండవచ్చును. రత్నములను గురించి ఒక శాస్త్రమునే సమకూర్చిన జాతి ఎంత ఉన్నతము అయి ఉందును! రత్న ప్రాకారములు, కుడ్యముల నిర్మాణములను ఇందు గురించి ఆలోచించిన వారి శాస్త్ర పరిజ్ఞానము ఎంతటిదో ఊహించవలసినదే. జలము స్థలమువలె, స్థలము జలము వలె కనిపించినట్లు చేయుట అద్భుతము!
    నాడు రవాణా సౌకర్యములు అంతగా ఉన్నట్లు కనిపించవు. కట్టిన ఇంటిని ఎనిమిది వేల మంది రాక్షసులచే మోయించుకొని వచ్చినాడు మయుడు.
3. రాజనీతి విషయమున నారదుడు చెప్పిన దానిని పరుశీలించిన ఆనాడు రాజకీయ శాస్త్రమున ఎంతటి పరిశోధన, పరిశీలనలు జరిగినవో విదితమగును. రాజకీయమును అంత నిశితముగా పరిశీలించిన జాతి ఎంత ఉన్నతము అయి ఉండవలెను!
    పరిపాలనా విషయమున నారదుడు చెప్పిన నీతులకన్న ఏదేశమునకు మిన్న అయినది. ఉన్నట్లు కనిపించదు. అవి ప్రాధమిక సూత్రములు మాత్రమే. అసలు శాస్త్రములు వేరున్నవి. నారదుడు రాజ దోషములను చాల చక్కగా నిశితముగా చెప్పినాడు. అవి నేటికీ అత్యంతముగా ఉపయోగపడును. నేటి శ్రేయోరాజ్యమున అవసరమయిన వానిని గురించి కూడ వివరించినాడు. వైద్యము, శారీరకము, మానసికము అని చెప్పి ఒక మహత్తర సత్యమును చెప్పినాడు. వాతావరణ శాస్త్రజ్ఞులు ఉండవలెనని ప్రభుత్వ బాధ్యతను పెంచినాడు. ప్రభుత్వమున కర్యాలోచనములో రహస్యముల దాచుటను గురించి చెప్పి నేడు మంత్రులు చేయు ప్రమాణములను చెప్పినాడు. అలస్యములను గురించి చెప్పి నాటి, నేటి , రేపటి ప్రభుత్వములను హెచ్చరించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.