Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఇల్లు కనిపిస్తుంది. తలుపు తెరచి ఉంది. ఆమె కటిక నేల మీద వాకిట్లో చతికిల బడి ఉంది. ఆమె కండ్లు ఎర్రవారి పొంగాయి. ముఖం నిండా కన్నీటి చారలున్నాయి. ఆమెలో దుఖం మూర్తిభావించింది. అంతా చూచాడు. అతని గుండె రంపంతో కోసినట్లయింది.
ఆమె అతన్ని చూచింది. ప్రతిమకు ప్రాణం వచ్చింది. కళ్ళు పెద్దవి చేసి తన్ను తాను చూసుకుంది. నేల మీద పాక్కుంటూ వచ్చి కాళ్ళ మీద పడి కన్నీటితో కడిగింది.
ఏడ్పు తగ్గిం తరవాత రాత్రంతా ఏదో ఒక విపత్తును తలచుకుంటూ కనురెప్పవాలకుండా ఎలా గడిపిందీ చెప్పింది.
"నన్ను వదిలి వెళ్ళిపోయావు .......... కారు క్రింద పడ్డావు ......చనిపోయావు ......"
కన్నీరు కడిగిన ఆమె కళ్ళల్లో భయం మూర్తీభవించి కనుపాప నలుపు సైతం కనిపించలేదు.
తాను పెద్దగా నవ్వాడు.
"ఏం, నేను చనిపోతే ?"
ఆమె ముఖంలో కత్తివేటుకు రక్తం కనిపించలేదు. ప్రాణాలు అపుర్న లేచిపోయాయి. నోట మాట రాక నేలవైపు చూస్తూ కూర్చుంది. కొంతసేపు అయిం తర్వాత గాని మాట పెకల్లేదు.
"ప్రతి రోజూ సాయంకాలం, వందలమంది దేవతలు విహారానికి వచ్చే సమయాన నేను వారిని "పసుపుకుంకుమతో నా తనువు కడ తేల్చండి ఓ దేవతలారా! నాకింకేమీ కోరికా లేదు" అని ప్రార్ధించేదాన్ని."
ఆమె పదహారేండ్ల పడుచు. బాల్యం ఇంకా బాగా వెనుక పట్టని స్త్రీ. ఆమె ప్రార్ధన ఇది.
తానొక మనో మూర్తిని సిద్దం చేసుకున్నాడు. అది రాధ మూర్తి. ఆ రాధ బాధ ఈమెలో మూర్తిభావించిందా? ప్రతిధ్వనించిందా? ఎంత పాతపాట! ఎంత పాత]గాధ!
తనముందున్నది రాధ కాదు. అతనికి వినిపించేది ఆమె పాట కాదు. రెంటిలోనూ ఒకటి అదృశ్యం. అది శ్రావ్యం మాత్రమే. వేరొకటి ద్రక్ష్యం. శ్రావ్యం కూడా.
ఏమిటీ ఆలోచన? పిచ్చేక్కలేదు కదా? తనలో తనే నవ్వుకున్నాడు. నాటకంలోని రాధిక తన మధుర సంగీతంతో ఇంకా తన్ను వెన్నంటుతూనే ఉంది.
నాటి నుంచి వారిద్దరి సంబంధంలోనూ కొత్త మార్పు వచ్చింది. కమ్మరి పిల్ల తాళం చెవులతో పాటు తన్ను కొంగుకు కట్టుకున్నా అతడు సిగ్గు పడలేదు.
ఆనతి కాలంలోనే సంధ్యాసమయంలో విహారానికి వచ్చే దేవతలు ఆమెను ప్రేమించారు.
మనసు గతం నుంచి వర్తమానానికి వ్రాలినది.
"ఇప్పుడే చంద్రలేఖను పిలిచిచెపుతే ?"
"చెప్పాల్సిందేనా?"
కాస్త అగడమే మంచిది. బిటేన్ దగ్గరి నుంచి వాగ్దానం వస్తే సరిపోతుంది.
బిటేన్ పనికి వెళ్ళకముందే పట్టుకోవాలి. కాలూ త్వరగా లేచి పెరడైజ్ లాజ్ కు వెళ్ళాడు.
మంచం మీద కూర్చుంటూ "బిటేన్ నేను చెప్పిందంతా జాగ్రత్తగా విను" అన్నాడు.]
"సరే"
"చంద్రలేఖను గురించి ఆలోచిస్తుంటే నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. అది తల్లి లేని....."
'అయితే నేనేం చేసేది" అన్నాడు కాస్త ఉద్రేకంగా.
"కమ్మరి వాళ్ళకు అందుబాటులో సహితం లేని ఆనందాన్ని మంగల్ అధికారి ఆమెకు సమకూర్చాడు. ఇప్పుడు ఆమెకు కావాల్సింది జీవితంలో సుఖం. వాటిని ఆమె భర్త సమకూర్చాల్సిన రోజు వచ్చింది."
బిటేన్ తెల్లబోయి "సౌఖ్యం?" అన్నాడు.
"అవును, మంచి ఇల్లు. మంచి ఆదాయం. మంచి భద్రత."
బిటేన్ తల నేలకు వేశాడు.
"లేఖ ఇప్పటికే చాలా బాధపడింది. క్షామం ఆమెను తినేసింది. హృదయకుహరంలో దాగి వున్న దుఖాన్ని మళ్ళీ రేకేత్తించకు" కాలూ ధ్వనిలో మార్దవం కనిపించింది. అతడు బిటెన్ను బ్రతిమాలాడాడు. "ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో. ఉంచుకుంటావు కదూ? ఆమెకు భవిష్యత్తు మాత్రమే కనిపించింది. ఉజ్వలమైన భవిష్యత్తు. నీవు ఆమెను సుఖ పెట్టగలవు. సంతోష పెట్టగలవు."
"నేనా ?" బిటేన్ అదిరిపడ్డాడు.
కాలూ గట్టిగా నవ్వాడు.
"మీ హృదయాల్లో మొలిచిన ప్రేమ విషయం నాకు తెలుసు. ఇవిగో నా ఆశీస్సులు."
"నీ .........వ..........నే.........ది" బిటేన్ ముఖం వెలిగింది.
"అవును నేననేది అదే"
"మీరన్న మంచి ......"
"ఇల్లు, ఆదాయం , భద్రత అన్నీ సమకూర్చాలి. భయమెందుకు? గుడి ఉంది. అది నీ ఉపాయపు ఫలితమే. నన్నీ వ్యాపారంలోకి దించింది నీవే. అన్యులు పిచ్చిగా కోరే వాటి మీద నీకు ఇష్టం మీద నీకు ఇష్టం లేని మాట నేను కాదనను. కాని నీవు చంద్రలేఖను గురించి ఆలోచించాలి. కలుగబోయే సంతానాన్ని గురించి యోచించాలి. ఒక్కొక్కసారి జీవితంలో ప్రధాన నియమాలతోనే రాజీ పడాల్సి వస్తుంది."
"బిటేన్ ముఖంలోని వెలుగు ఆరిపోయింది.
"గుడితో నాకు ఎలాంటి సంభందమూ లేదు" అని తల నేలకు వేసి " ఆ విషయం ఇది వరకే చెప్పేశాను" అన్నాడు.
"ఏమిటీ ? ఇదంతా విన్న తర్వాత కూడానా?" కాలూ అరిచాడు.
బిటేన్ తలెత్తి చూచాడు. "ఏమిటీ విన్నది. ఇది నా ఉపాయం అనేనా?"
కాలూ బిటేన్ ధ్వనిలో నిశితత్వాన్ని గ్రహించాడు. "నే .....న....నే....ది...."
"కాని ఆ ఉపాయాన్ని పగ తీర్చుకోవడానికి వినియోగించుకున్నది నువ్వు. నీలాంటి వేలమంది జనాన్ని మోసగించే ముష్కరుల మీద దెబ్బ తీయడానికి వాడుకున్నావు. ఈ మోసం అంతా అచ్చంగా నీ పొట్ట నింపుకొని మూట కట్టుకోవడానికేనా?" బిటేన్ పదును పెట్టిన కత్తి లాంటి పదాలను ప్రయోగించాడు.
అతడు కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. కాలూ చాలాకాలంగా ఆత్మవంచన చేసుకుంటున్నాడు. అతని అసలు ఉద్దేశం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అతని ఉద్దేశం ఒక తెరచాటున దాగి వుంది. దాన్ని చీల్చి చూడాలి.
బిటేన్ విసిరిన చురిక కాలూ గుండెలో లోతుగా గుచ్చుకుంది. ఈ మోసానికి దిగేముందే తాను పడిన యాతనలన్నింటినీ బిటేన్ కు చెప్పాలి. అప్పటికైనా అతడు గ్రహించి మెత్తపడ్తాడా?ఎన్నడో కాదు ఇవ్వాళే బిటేన్ తన ముందు లొంగిపోవాలి. ఇది చంద్రలేఖ జీవితానికి సంబంధించిన సమస్య.
కాలూ తమాయించుకున్నాడు. అతడు కాళ్ళు నేలకు కొట్టాడు. కాని జాగ్రత్తగా నెమ్మదిగా .
'అయితే నేననుకొన్నది నిజం కాదన్నమాట. నీకు చంద్రలేఖ మీద ప్రేమ లేదన్నమాట. అంతేకాదూ?"
"ప్రాణాలైనా ఇస్తా గానీ ఆమె మీద ఈగ వాలనివ్వను."
ఈ మాటల్లోని ఉద్రేకం కాలూకు మళ్ళీ నమ్మకం కలిగించింది. ఈ ఉద్రేకాన్ని ఆయుధంగా వాడుకోవాలి. కనికరం లేకుండా మాట్లాడాలి.
"ఒక విషయం నీవు గ్రహించాలి. బ్రాహ్మడికి తప్ప నా కూతురు నిచ్చి పెళ్లి చేయను. మంచి బ్రహ్మడైనా బూటకపు బాపడైన సరే."
"నువ్వు నీవాళ్ళనే మోసగిస్తావన్న మాట. నన్నూ ఆ మోసంలో పాలు పంచుకొమ్మంటావు. అయితే చంద్రలేఖకు నా మీద అభిమానం ఏం చస్తుంది ?"
కాలూ జంకాడు.
"చంద్రలేఖ సర్వవిధాలా బ్రాహ్మణ కన్య అయిపొయింది ."
"నీవనే బ్రాహ్మణత్వం ఆమె హృదయాన్ని తాకనైనా లేదు."
"మనం ఇంకో దృక్కోణంతో కూడా చూడాలి. నీవు ఎంత డబ్బు దాచావు?"
"దాచిన డబ్బా?"
"పోనీ, నీకు మంచి ఆదాయం వస్తుందని నమ్మకం ఉందా?"
"జీవితానికి సరిపోయేంత సంపాదించుకుంటాను. ఎక్కువ పని చేస్తే ....."
'చంద్రలేఖ ఒక రకపు జీవితానికి అలవాటు పడింది. దాన్నుంచి దూరం అవుతే అనందం సహితం ఆమె నుంచి దూరం అవుతుంది. ఆ విషయం నీకు తెలీదా ?"





