Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    9. జనసంచారము కల భూమీ! ప్రాణులు, నానావిధసస్యములు నిన్ను ఆశ్రయించి ఉన్నవి. సకిలించు గుర్రమువలె జనులకు భోగ వస్తువులు ప్రసాదించుచున్నావు.

    10. సేవించిన హింసించనదియు - మిత్రుని వలె హితము కూర్చునదియు, వాంతి కలిగించనదియు, ఉదరమునకు ఆరోగ్యకరమైనట్టిదియు అగు సోమమును సేవించుచున్నాను. ఆ సోమము నా ఉదరమున చేరినది. అది జీర్ణమగుటకును, వాంతి కలిగించకుండుటకును ఇంద్రుని పూజించుచున్నాను.

    11. సోమము కోపమును పూర్తిగా విడిచినది. మూడు సవనములందు రాళ్లచే దంచబడునది. దంచుట వలన అటునిటు కదలునది. అభిషవించబడినది. రాళ్ల రాపిడికి చితికిన అవయవములు కలది. రసము పిండుట వలన నీరసము అయినది. అటువంటి సోమము విశ్వము నందలి సకల వనములందు వర్థిల్లును గాత.

    ఇన్ద్రం ప్రతిమానాని దేభుః - నీకు ఉపమానములు ఇంద్రుని కించ పరచజాలవు.

    12. యజమాని జమదగ్ని వంటివాడు. యజ్ఞము చేయగోరుచున్నవాడు. స్తుతులచే పూజించుచు ఇంద్రుని కొరకని సోమమును దంచుచున్నాడు.

    ఇంద్రా! నీవు ఫలములను వర్షించువాడవు. ఉదరమున చేరి వమనమునకు తొందరపెట్టు సోమమును నియంత్రించు వాడవు. ఉదరమున చేరిన సోమమును జీర్ణమగునట్లు శాసించుము. నిన్ను భజించు యజమానికి సోమము జీర్ణమగు శక్తి ప్రసాదించుము.

    13. సోమమా! ఋత్విజులు ఇష్టిరూపమగు బృహత్కర్మనాచరించుచున్నారు. అందుకని నిన్ను రాళ్లతో దంచి బాధించుచున్నారు. వారే నీకు శ్యామాక చరు రూప హవిస్సును అర్పించుచున్నారు. నీవు సోమ శబ్ద వాచ్య సూర్యుడవు. నా ఉదరమునందలి నిన్ను ఇంద్రుడు యుద్ధమునందువలె బయటపడకుండ నిలుపును.

    14. విష్ణువా! నేను యజమానిని. నన్ను దేవతలు, విధి ప్రేరేపించుచున్నారు. ఆ ప్రేరణచే నేను నీకు హవిస్సులు అర్పించుచున్నాను.

    పశుసాధ్యమగు యజ్ఞమా! నేను సమర్పించిన హవిస్సును అనుభవించుము. నా వాక్కులు శోభనములు. స్తుతి రూపములు. అవి నిన్ను వర్థిల్ల చేయును గాత. నీవు పూజ్యుడవు. నాకు నిత్యము శుభములు కలిగించుము. నన్ను రక్షింపుము.

    15. యజ్ఞరూప విష్ణువా! ఈ యజ్ఞమందు నీ నామ నిర్వచనమును తెలిసికొన్నాను. స్వామివగు నిన్ను ఆ నామములచే స్తుతించుచున్నాను. నీవు దృశ్యమానమగు ఈ లోకమునకు దూరమున ఉన్నవాడవు. తపస్వివి. అట్టి నిన్ను తపస్విని కాబట్టి నేను స్తుతించుచున్నాను.

    16. విష్ణూ! నేను 'శిపివిష్ఠుడను' అని నీవు చెప్పినావు. అది ఏమాత్రము గర్హణీయము కాదు. అట్లనుకొని ఆ నామమును మాకు దూరము చేయకుము. యుద్ధములందు నీవు నానా రూపములు ధరింతువు కదా! అట్లే ఈ నామము మా మనములందు నిలుచును గాక!

    17. అగ్నీ! యజమాని హవిస్సు నిచ్చుచున్నాడు. అతనికి ధనము నిమ్ము. వీరులగు భృత్యులు కలిగి, కను ముక్కు తీరు చక్కగా ఉన్న పుత్రులను ఇమ్ము. నీవు ప్రసాదించిన పుత్రుల వలన మేము అగ్రగణ్యులము అగుదుముగాక.

    18. అగ్నీ! నాకు వాకిళ్లవంటి వందల పశువులను ఇమ్ము - వేల పశువులను ఇమ్ము. యజ్ఞము కొరకు ఆటంకములు తొలగించి అన్నమును వృద్ధిచెందించుము. మాస్తుతులచే సంతృప్తుడవు అగుము. ద్యావాపృథ్వులను మాకు అనుకూలములను చేయుము. ఉషస్సులు, స్వర్గమును వలె నా గృహమును ప్రకాశవంతము చేయును గాత.

    19. అగ్ని ధనమును ఇచ్చును గాత. అగ్ని వీరులగు పుత్రుల పాలకుడు. అతడు మాకు వేయి విధములుగ ఋషితుల్యులగు పుత్రులను ఇచ్చును గాత. ఈ అగ్ని స్వర్గమందంతటను మా హవ్యమును వ్యాపింపచేసినాడు. అట్టి అగ్నికి అనేక స్థానములు ఉన్నవి.

    20. అగ్నీ! మమ్ము భాధించకుము. రక్షింపుము. మమ్ము భరించుము. వదిలివేయకుము.

    21. అన్నవంతుడైన ప్రజాపతీ! దర్భపూరిత ఆజ్యము వలె నీవు పవిత్రుడవు. చొక్కపు బంగారము వలెను, ఆభరణముల వలెను, నీవు ప్రకాశింతువు గాత.

    22. ఆనందము కలిగించు అగ్నీ! నీనోరు రెండు ధర్వుల నేతితో నిండి ఉన్నది. యజ్ఞములందు మాకు ఉత్సాహము కలిగించుము. నిన్ను స్తుతించు యజమానులకు అన్నము కల్పించుము.

    23. వాయువా! నీవు పుష్టిమంతములగు వంద గుర్రములను నీ రథమునకు కట్టుము. మా ఇంటికి విచ్చేయుము.

    కాకున్న వేల అశ్వములను కూర్చుము. ఆ రథము వేగముగా మా ఇంటికి వచ్చును గాత.

    24. వాయువా! యజ్ఞగృహమున యజ్ఞము జరుగుచున్నది. దానికి నీవు సిద్ధి కలిగించ వలసి ఉన్నది. కావున నియుత్తులతో నీవు హవిస్సునందించు యజమాని వద్దకు వెళ్లుదువు. ఈ యజ్ఞమునందు మాకు పుత్రులు, గోవులు, అశ్వములతో కూడిన ధనము ప్రసాదించుము.

    25. జలములు సంపన్నములు. మాకు సంతోషము కలిగించునవి. అధిక అన్నవంతములు. వానితో మేము ఇంద్రుని స్తుతించి ఆనందింతుము. అట్టి జలములు మా స్వామియైన ఇంద్రునకు సుఖవంతములు అగును గాక.

    26. ఇంద్రా! యజమాని ధనవంతుడు. అతడు ధనవంతుడవు, అన్నవంతుడవు, దేవతలందు ప్రసిద్ధుడవైన నిన్ను ఎంతో శ్రద్ధగా స్తుతించుచున్నాడు.


            శ్రీమాదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 
            రెండవ కాండమునందలి రెండవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.