Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
దేవతలారా! మేము యజ్ఞము చేసి స్వర్గము చేరినాము. మేము అమరులము అయినాము. మేము ప్రజాపతికి ప్రజలమైనాము -స్వాహా.
వసోర్ధారాహొమ మంత్రములు సమాప్తము.
30. మేము అన్నపు అధీనమున ఉన్నవారము. జగన్నిర్మాత్రియు, మహనీయము, అఖండనీయము, సమస్త భూతములను నిలిపినదియు అగు భూమాతను మేము వేద వచనములచే అనుకూలను చేసికుందుము. ఆ భూమి యందు ఉండునట్లు సవితా దేవత మమ్ము ప్రోత్సహించవలెను.
31. నేడు విశ్వ మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయుదురు గాత. హవిరన్నమునకు ఆకర్షితులై విశ్వేదేవతలు విచ్చేయుదురు గాత. వారందరు మమ్ము రక్షింతురు గాత. ఆ దేవతల కృప వలన సమస్త అగ్నులు ప్రజ్వరిల్లును గాత. యజ్ఞపు ఫల స్వరూపముగ మాకు సకల ద్రవ్యములు లభించును గాత. 'విశ్వమస్తు ద్రవిణం వాజో అస్మీ.'
32. మాకు అన్నము, ఏడు లోకములు, నాలుగు దిశలు, దూరమున ఉన్న స్వర్గము లభించవలెను. ఈ యజ్ఞమందు ధన ప్రాప్తి కలుగుటకు గాను విశ్వేదేవతలు సహితముగా అన్నము సహితము మమ్ము కరుణించవలెను.
33. నేడు అన్నదానమునకు మాకు అనుమతి లభించును గాత. అన్నమే ఋతువులను కల్పించుచున్నది. అన్నమే దేవతలను కల్పించుచున్నది. అన్నమే నన్ను పుత్ర, పౌత్రాదులు కలుగువానిని చేయుచున్నది. నాకు సమృద్ధాన్నము కలిగినంత అన్నదానము చేసి సకల దిశలను జయించగలను.
34. అన్నము మాముందు ఉండును గాత. అన్నము మా వెనుక ఉండును గాత. అన్నము మాకు మధ్యన ఉండును గాత. అన్నమే హవిద్వారా దేవతలను వర్ధిల్ల చేయుచున్నది. అన్నమే నన్ను వీరపుత్ర, పౌత్ర వంతుని చేసినది. నేను అన్నపతినై సకల దిశలందు వ్యాపింతును.
(అన్నమున దిశలను జయించుట - దిశలకు వ్యాపించుట ఎంత ఉన్నత, ఉదాత్త ఆశయము! ఆయుధమున కాదు అన్నమున జయించుట!! పుచ్చుకొని కాదు ఇచ్చి జయించుట!!!)
35. అగ్నీ! నేను స్వయముగా పృథ్వి సంబంధ రసమున సంయోజితుడనగుదును. నేను స్వయముగా ఓషధులు, జలములచే సంయోజితుడనగుదును. అటువంటి నాకు నీ దయవలన అన్న ప్రాప్తి కలుగవలెను.
36. అగ్నీ! నీవు ఈ భూమి యందు రసమును ప్రవేశపెట్టుము. అంతరిక్ష, ద్యులోకములందు జలమును స్థాపించుము. నీ దయవలన నాకు సమస్త దిశలకు రసపూర్ణములు కావలెను "పయస్వినః ప్రదిశః సన్తు మహ్యమ్"
37. అధ్వర్యునగు నేను సవితా దేవుని ఆజ్ఞానువర్తిని. అశ్వినుల బాహువులలతోను - పూష హస్తములతోను- సరస్వతి వాక్కునను - ప్రజాపతి నియమమునను - అగ్ని యొక్క సామ్రాజ్య సహితముగా యజమానివగు నిన్ను అభిషించించుచున్నాను.
38. అగ్ని సత్య స్థానపువాడు - సత్యమును సహించగలవాడు. అగ్నియే గంధర్వుడు. ఓషధులు అతని అప్సరలు. ఆ అప్సరల పేరు 'ముద్' అగును. ఆ గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. గంధర్వులకు స్వాహా, ఓషధులకు స్వాహా.
39. రాత్రింబవళ్ళ సంధ్యలను కల్పించువాడు సూర్యుడు. సూర్యుడే సంహిత అగును. సూర్యుడే సర్వ సామమగును. సూర్యుని కిరణములే అతని అప్సరలు అగుదురు. వారి పేరు 'ఆయువ' అగును. సూర్య రూప గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. సూర్య గంధర్వునకు స్వాహా. సూర్య కిరణములకు స్వాహా.
40. చంద్రుడు ఆనందకరుడు. చంద్రుడు సూర్య కాంతి వలన ప్రకాశించువాడు. చంద్రుడే గంధర్వుడు, నక్షత్రములు అతని అప్సరలు. వారి పేరు 'భాకురి' ఆ చంద్ర గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. చంద్రునకు స్వాహా. నక్షత్రములకు స్వాహా.
41. వేగవంతుడు - సర్వగామి వాయువే గంధర్వుడు. జలములు అతని అప్సరలు. వారి పేరు "ఊర్జ" అగును. వాయు రూప గంధర్వుడు. బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. వాయువునకు స్వాహా, జలములకు స్వాహా.
42. సమస్త దేవతలకు మానవులకు అన్నము పెట్టువాడును - అర్వత్ర సంచరించువాడగు యజ్ఞమే గంధర్వుడు అగును. దక్షిణలు అతని అప్సరలు అగును. వారి పేరు 'స్తావ' అగును. యజ్ఞరూప గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. వాయువునకు స్వాహా, దక్షిణలకు స్వాహా.
43. ఇంద్రియ ప్రజకు ప్రభువు - సమస్త నిర్మాణ కారకమగు మనస్సే గంధర్వుడు. ఋక్కులు, సామ గానములు మనసునకు అప్సరలు. వారి పేరు. 'ఏష్టయః' మనో రూప గంధర్వుడు బ్రాహ్మణ, క్షత్రియులను పాలించును గాత. మనసునకు స్వాహా. ఏష్టియులకు స్వాహా.
44. భవనముల స్వామీ! ప్రజాపాలకా! నీకు పైలోకమున గృహములున్నవి. ఈ లోకమున గృహములు ఉన్నవి. నీవు బ్రాహ్మణ, క్షత్రియులకును, నాకును మహా సుఖములు కలిగించుము. స్వాహా.
45. వాయుదేవా! నీవు తడిచేయు సముద్రమవు. నక్షత్రములను కూడిన నభస్వభావుడవు.
వర్ష నీహరాదులచే సర్వమున ఆర్ద్రము చేయు ఆర్ద్రదనువు. ఐహిక సుఖములనిచ్చు శంభుడవు. పరలోక సుఖములనిచ్చు మయోభుడవు. అట్టి నీవు నన్ను అభివహించుము.
వాయువా! నీవు మరుత్సమూహముడవు. ఇహలోక, పరలోక సుఖములను ఇచ్చువాడవు. నీవు నన్ను అభీష్టము కొరకు అభివహింపుము. మా సేవలు అందుకొను నీవు మాకు రక్షకుడవు. నీవు ఇహ పర సుఖములనిచ్చు వాడవు. నీవు నన్ను పాలింపుము స్వాహా.
46. అగ్నీ! నీ కిరణములు సూర్యుని చేరినవి ఆ కిరణములు ద్యులోకమంతటికి పాకినవి. ఆ కిరణములతోనే మమ్ము ప్రతి వ్యక్తికి అనుకూలమగునట్లు చేయుము.
47. దేవతలారా! మీ ప్రకాశము సూర్యుని యందున్నది. మీ శోభ గోవులందును, అశ్వములందును ఉన్నది. ఇంద్రాగ్ని బృహస్పతులారా! ఆ శోభను, ఆ ప్రకాశమును మాలో ప్రవేశపెట్టండి.
48. అగ్నీ! బ్రహ్మణులందు ప్రకాశము ప్రవేశపెట్టుము . క్షత్రియులందు - వైశ్యులందు - శూద్రులందు ప్రకాశమును ప్రవేశపెట్టుము. నాయందు ప్రకాశమును ప్రవేశపెట్టుము.
49. వరుణదేవా! యజమాని నీకు హవిస్సులు అర్పించినాడు. కొన్నింటిని కోరినాడు. నేను మంత్రములచే నిన్ను స్తుతించి యజమాని కోరిన వానినే యాచించుచున్నాను. యశోవంతవరుణా! నీవు వాటిని - కోపించక - యజమానికి ప్రసాదించుము. మా ఆయువును సమాప్తము చేయకుము.
50. (అర్క అశ్వమేధ సంతతియను అయిదు ఆహుతులు అర్పించవలెను.)
స్వర్ణధర్మునకు స్వాహా. స్వర్ణార్కునకు స్వాహా. స్వర్ణ శుక్రనకు స్వాహా. స్వర్ణ జ్యోతికి స్వాహా. స్వర్ణ సూర్యునకు స్వాహా.
51. అగ్ని దివ్యుడు, సుగమనుడు, స్వధూముడు. నేను అగ్నిని ఘృత, బలయుక్తిని చేయుచున్నాను. ఆ అగ్ని ద్వారామున మేము ఆదిత్యుని ఉత్తమ లోకము చేరుకుందుము. అచటి నుంచి స్వర్గమునకు ఆరోహింతుము. అచటి నుండి ' అధి నాకముత్తమం చేరుదుము.
52. అగ్నీ! నీకు ఉత్తర దక్షిణములను రెండు - జరారహిత - పక్షములున్నవి. వానితో నీవు రాక్షసులను హతమార్తువు. ఆ పక్షములతోనే మమ్ము ఋషులు చేరి అమరులైనట్టి పుణ్యలోకములకు చేర్చుము.
53. అగ్ని ఆహ్లాదకుడు, ఉత్సాహవంతుడు. శ్యేనము వంటి వాడు. సత్యవంతుడు. బంగరు రెక్కల పక్షి. అందరకు అన్నము కలిగించువాడు. మహామహుడు. స్థిరుడు. యజ్ఞశాలస్థితుడు. అట్టి అగ్నికి నమస్కరించుచున్నాను. అతడు మమ్ము బాధించకుండవలెను.
54. అగ్నీ! నీవు ద్యులోకమునకు తలవు - భూలోకమునకు నాభివి. జలములకు, ఓషధులకు బలమవు. ప్రాణులందరకు జీవనమవు. అందరకు ఏకమాత్ర శరణమవు. సర్వత్ర అవిచ్ఛిన్న ప్రభావుడవు. నీకు నమస్కారము.
55. అగ్నీ! నీవు విశ్వమునకు గల తలమీద ఉన్నావు. అంతరిక్షమున నీ హృదయము ఉన్నది. జలములందు నీ జీవనము ఉన్నది. అగ్నీ! మాకు జలములను ఇమ్ము. సాగరములను తెంపుము. ద్యులోక, అంతరిక్ష, భూలోకముల నుండి వర్షము తెమ్ము, మమ్ము పాలించుము.
56. ఏ యజమాని యజ్ఞము భృగువులు, వసువులచే సముపార్జించబడినదో - ఆ యజమాని ఇంటికి సకల పదార్థములు చేరును గాత. ఈ యజ్ఞము అభీష్టప్రదము.
57. చేసిన యాగమును - నిత్యము తర్పంచిన అగ్నియు మాకు కోరిన స్వర్గాదులను ఇచ్చును గాత. ఈ స్వయంగమన శీల హవి దేవతలను చేరును గాత.
58. ఋత్విజులారా! ఈ యజ్ఞకర్మ ప్రజాపతి విధించినది. దీనిని మీరు స్థిర సంకల్పమునను సహృదయముతోను - మనసు, చక్షురాది జ్ఞానేంద్రియములచే నిర్వహించండి. అందువలన పూర్వర్షులు చేరి అమరులైన పుణ్యలోకమునుకు చేరుకొనండి.
59. సహస్థాన స్వర్గమా! నేను ఈ యజమానిని నీకు అందించుచున్నాను, అతనితో పాటు అగ్ని పూర్తి చేసిన సుఖనిధి యగు యజ్ఞమును కూడా అర్పించుచున్నాను. ఇక ఈ యజ్ఞపతి నీవద్దకు స్వర్గమునకు రానున్నాడు. అతడు అచటికి చేరినంత - ఆకాశమందు - మీ దేవతలందరు సమ్మానించండి.
60. స్వర్గస్థ దేవతలారా! పరమాకాశమందలి స్వర్గమునకు చేరిన ఈ యజమానిని గుర్తించండి. ఈ యజమాని దేవ మార్గమున స్వర్గమునకు వచ్చినపుడు పరిచయము చేసికొనండి. అతనికి సుఖము కలుగునట్లు అతని కర్మముల శుభ ఫలితములు ప్రకటించండి.
61. అగ్నీ! ప్రజ్వలితుడవగుము. జాగృతుడవగుము. నీవే కర్మలను సృష్టించినావు. యజ్ఞమును సృష్టించినావు - ఈ ఉత్తమమగు యజ్ఞ స్థానమున విశ్వే దేవతలు, యజమాని కూర్చుండవలెను.
62. అగ్నీ! నీ సామర్థ్యమున నీవు సహస్ర దక్షిణ యజ్ఞమును నిర్వహింతువు నీ సామర్థ్యముననే సర్వస్వ దక్షిణ యజ్ఞమును నిర్వహింతువు. ఆ సామర్ధ్యముననే మేము దేవతల స్వర్గమునకు చేరుటకు వీలు కలిగించు - ఈ యజ్ఞమును నిర్వహించుము.
63. అగ్నీ! శిల, పరిథి, స్వచ, వేదిని, మంత్రములతో మా యజ్ఞమును ఫలింపజేయుము. మమ్ము దేవతల వద్దకు స్వర్గమునకు చేర్చుము.
64. భార్యా పుత్రులకు ధనము ఇవ్వబడినది. పరోపకారార్థము కుంటి, గ్రుడ్డి, మున్నగు వారికి ధనము దానము చేయబడినది బ్రాహ్మణ భోజనాదులకు దక్షిణలకు - యజ్ఞ యాగాదులందు ధనము ఇవ్వబడినది. అగ్నీ! మేము స్వర్గము చేరుట కొరకు - వాటినన్నింటిని స్వర్గమున దేవతలకు అందించుము.
65. విశ్వకర్మ అగ్నీ! ఘృత మధుధారలు నిరంతరము ప్రవహించు స్వర్గమందలి దేవతలకు మా యజ్ఞ యాగాది పుణ్యమును తెలియపరచుము.
66. నేను అగ్నిని. జన్మతోనే జ్ఞానిని. ఘృతము నా నేత్రము - ముఖము అమృతము - నేనే ఋగ్యజుస్సామత్రిధాతు యజ్ఞమునకు నేనే జలనిర్మాతను. అక్షయ ఆదిత్యుడను నేనే! నేనే హవిస్సును.
67. ఋగ్వేదమును నేనే. యజుర్వేదమును నేనే. నేనే సామవేదమును.
అగ్నీ! పృథ్వి మీద ఉపకార అగ్నులందు నీవు ఉత్తముడవు. నీవు మమ్ము జీవించు ప్రేరణ కలిగించుము.
68. ఇంద్రా! వృత్రవధ శత్రుసేన పరభవమునకు గాను నిన్ను మేము యుద్ధములకు లాగుచున్నాము.
69. పురుహూత ఇంద్రా! దానవులతోటి వానిని -చేతులు లేని వానిని - కుశబ్దకారియగు దైత్యుని నీవు నలిపివేసినావు. వర్ధమానుడు, దేవఘాతకుడు అగు పాదరహిత వృత్రుని నీవు నీ స్వంత బలమున పరిమార్చినావు.
70. ఇంద్రా! మా శత్రువులను హింసించుము. మాపై దండెత్త దలచిన సేనను త్రుంచుము. మమ్ము దాసులనుగా చేయదలచిన వారిని అడుగున అంధకారమున త్రోయుము.
71. ఇంద్రా! నీవు సింహము వంటి భయంకరుడవు. సంచారివి. పర్వతములందు తావరము కలవాడవు. ఎంతో దూరము నుండి ద్యులోకము నుండి వచ్చినవాడవు. సృకమును, వజ్రమును పదును పెట్టుము. శత్రువులను కొట్టుము. హింసకులను తరిమికొట్టుము.
72. అగ్ని మా స్తుతులను ఆలకించవలెను. యజ్ఞమునకు విచ్చేయవలెను. వైశ్వానరాగ్నీ! సుదూర అంతరిక్షమునుండి మమ్ము రక్షించుటకు విచ్చేముము.
73. ద్యులోకమున ఆదిత్య భావమున ఉన్నవాడెవడు? అగ్నియే. అంతరిక్షమున విద్యుద్రూపమున ఉన్నవాడెవాడు? అగ్నియే. ఓషధులందు రసభావమున ప్రవేశించువాడెవాడు? అగ్నియే. బలమున మథింపగా ప్రకటించబడువాడెవడు? అగ్నియే. అట్టి వైశ్వానరాగ్ని మమ్ము రాత్రింబవళ్ళు రక్షించవలెను.
74. అగ్నీ! నీ రక్షణ యందు మేము మా అభీష్టములు అనుభవింతుము గాత. ధనవంతులమగు మేము పుత్ర సహితులమై ధనమును అనుభవింతుము గాత. దేవతలను పూజించుచు మేము అన్నమును అనుభవింతుము గాత. నీ జరారహిత తేజమును సహితము అనుభవింతుము గాత.
75. అగ్నిదేవా! మేము నీకు చేతులెత్తి నమస్కరించుచు నీ వద్దకు వచ్చి నీకు హవి సమర్పించుచున్నాము. నీ యజనీయ, మహనీయ, అహింసనీయ మనమున దేవతలను యజింపుము.
76. ధామచ్ఛదగ్నియు - ఇంద్రుడును - బ్రహ్మయు - బృహస్పతియు - జ్ఞానవంతులగు విశ్వేదేవతలును మా యొక్క ఈ శుభ యజ్ఞమును రక్షించవలెను.
ధామచ్చదగ్నిరిన్ద్రో బ్రహ్మా దేవో బృహస్పతిః|
సచేతసో విశ్వేదేవా యజ్ఞం పావన్తు నః శుభే ||
77. త్వం యవిష్ఠ దాశుషో నౄః పాహి శృణుధీ గిరః|
రక్షాతోకముత త్మనా||
యువతను అగ్నీ! మా స్తుతులను వినుము. హవిర్ధాత యజమాని మనుష్యులను రక్షింపుము. మా పుత్రులను మమ్ము రక్షింపుము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
వసుర్దారాదికమగు పద్ధెనిమిదవ అధ్యాయం సమాప్తము.
సర్వేభస్తు సుఖినః





