Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. నేను ఇంద్రుని పూర్వకర్మలను వక్కాణింతును. అతని నవీన కర్మములున్నవి. వానిని కూడ వివరింతును. ఇంద్రుడు ఆసురీమాయను ఓడించినాడు. కావున సోమము ఇంద్రునిది మాత్రమే అగును. "భవత్కేవలః సోమో అస్య".

    6. ఇంద్రా ! ప్రాణుల ఉనికికి నలుదిశల సమస్త విశ్వము నిలిచి ఉన్నది. దానిని నీవు సూర్యతేజమున వీక్షింతువు. అవన్నియు నీవే. నీవు ఒక్కడవే సమస్త గోవులకు స్వామివి. నీవు ఇచ్చిన ధనమునే మేము అనుభవింతుము.

    "ప్రయతస్యవస్వః"

    7. బృహస్పతీ ! నీవు, ఇంద్రుడు దివ్య, పార్థివ ఉభయ ధనములకు అధిపతులు. మీరిద్దరు స్తోత్రకర్త స్తోతలకు ధనము ఇచ్చువారు "యూయం పాత స్వస్తిభిః సదానః"


                              తొంబది తొమ్మిదవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు - విష్ణువు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. విష్ణూ ! నీవు శబ్దస్పర్శాది పంచతన్మాత్రలకు అతీతుడవై నీ దేహమును పెంచినావు. ఆ నీ మహిమను ఎరుగువారులేరు. మేము నీ ఉభయ పృథివ్యంతరిక్షలోకములను ఎరుగుదుము. కాని నీవు మాత్రమే పరమలోకమును ఎరుగుదువు. "త్వం పరమస్య విత్సి"

    (విష్ణువు వామనుడై ముల్లోకములను వ్యాపించినాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు పంచతన్మాత్రలు. సృష్టి సాంతము ఈ అయిదింటిమీదనే ఆధారపడి ఉన్నది. విష్ణువు వీనికి అతీతుడు)

    2. విష్ణూ ! భూమిమీద పుట్టినవాడు కాని పుట్టబోవువాడు కాని నీ మహిమల పారమును అందజాలడు. దర్శనీయము. విశాలమగు ద్యులోకమును ఎత్తిపట్టినావు. భూలోకపు తూర్పుదిశను ధరించి ఉన్నావు.

    (తూర్పు దిశను ధరించుట అనగా సూర్యుడగుట)

    3. ద్యావాపృథ్వులారా ! మీరు స్తోతలగు మానవులకు దానము చేయగోరి అన్నవంతులు, ధేనువంతులు యువతులు అయినారు.

    విష్ణువా ! నీవు వివిధ రీతుల ద్యావాపృథ్వులను క్రిందుమీదుగా నిలిపి ఉంచినావు. అంతట ఉన్న పర్వతములతో పృథ్విని నిలిపి ఉంచినావు.

    4. ఇంద్ర, విష్ణువులారా ! మీరు సూర్యుని, అగ్నిని, ఉషను సృష్టించినారు. యజమాని కొఱకు విశాల స్వర్గమును నిర్మించినారు. మీరు "వృహిశిప్ర" నామక దస్యుని యుద్ధమున నష్టపరచినారు.

    5. ఇంద్ర విష్ణువులారా ! మీరు శంబరుని తొంబది తొమ్మిది దృఢపురములను ధ్వంసము చేసినారు. వర్చినామక అసురుని నూరుగురు, వేయిమంది వీరులను హతమార్చినారు.

    6. ఈ స్తుతి బృహత్, విస్తీర్ణ, విక్రమయుక్తము. ఇది బలశాలురగు ఇంద్ర విష్ణువులను వర్థిల్లచేయును. యజ్ఞ స్థలమున వారికి ఈ స్తోత్రము సమర్పించబడినది. యుద్ధమున మీరు మా అన్నమును పెంచవలెను.

    7. విష్ణూ ! యజ్ఞమున నీ కొఱకు నీటితో వహట్కారము చేసినాను. తేజోవంత విష్ణూ ! నీవు ఈ హవ్యమును స్వీకరింపుము. శోభనములగు మా స్తుతియు, వాక్కును నిన్ను వర్థిల్ల చేయునుగాత, "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                నూరవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - విష్ణువు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. విష్ణువు బహుజన కీర్తనీయుడు. విష్ణువునకు హవ్యప్రదానము చేయవాడును ముక్తకంఠమున మంత్రములతో అతనిని పూజించువాడును మానవ హితైషి విష్ణువును సేవించువాడును ధనముకోరి దానిని పొందును.

    2. కోరికలు తీర్చు విష్ణువా ! అందరికి హితకరమును, ద్వేషరహితమగు నీ అనుగ్రహమునకు మమ్ము పాత్రులను చేయుము. అందువలన మాకు పొందదగిన అనేక అశ్వములుగల బహుజ్ఞాన ఆనందకర ధనము లభించును. అదిలభించునట్లు చేయుము.

    3. ఈ విష్ణు దేవుడు నూర్ల కిరణములు కలిగి ఈ భూమిని తన మహిమతో మూడుసార్లు చరణములు అంటించినాడు. ముల్లోకములను ఆక్రమించినాడు. పెద్దలకన్న పెద్ద విష్ణువు మాకు స్వామి. ప్రవృద్ధ విష్ణు రూపము ప్రదీప్తము.

    4. ఈ భూమిని మానవనివాస యోగ్యము చేయగోరి ఈ విష్ణువు భూమిమీద అడుగు పెట్టినాడు. ఈ విష్ణువు స్తోతలు నిశ్చలులగుదురు. సుజన్మ విష్ణువు విశాల నివాస ప్రదేశమును ఏర్పరచినాడు.

    5. తేజోవంత విష్ణూ ! నీవు స్తుతులకు స్వామివి. జ్ఞాతవ్యుడవు. నిన్ను తెలిసికొని నీ ప్రసిద్ధ నామమును కీర్తించుచున్నాము. నీవు మహత్తువు. నేను అణువును అయినను నిన్ను స్తుతింతును. ఏలననగా నీవు రజోలోకపు ఆవలివాడవు.

    (అల్పానల్పములు రజోలోకమునకే పరిమితములు)

    6. ఒకానొకప్పుడు విష్ణువు తనరూపము విడిచినాడు. కృత్రిమ రూపము దాల్చినాడు. యుద్ధమున వసిష్ఠునకు సాయము చేసినాడు. ఇది ఆ సందర్భము

    విష్ణూ ! నేను నిన్ను శిపివిష్ణ, నామమున పిలిచినాను. దానిని స్వీకరించకుండుట బదులు పలుకకుండుట నీకు న్యాయమా? యుద్ధమున నీవు వేరు రూపము దాల్చినావు. మాముందు నీరూపమును దాచకుము.

    7. విష్ణూ ! నీ కొఱకు నీటితో నేను వషట్కాము చేయుదును. కావున శిపివిష్ణూ ! మా హవ్యము స్వీకరింపుము. నా యొక్క అందమగు స్తుతి మఱియు వాక్యము నిన్ను వర్థిల్ల చేయునుగాత "యూయంపాత స్వస్తిభిః సదానః"

    (ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున ఆరవ అధ్యాయము సమాప్తము.)


            ఓం నతామినన్తిమాయివో వధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి.
            వరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతావి నమే తస్థివాంసః


               ఏడవ అధ్యాయము             నూట ఒకటవ సూక్తము

                 ఋషి - వసిష్ఠుడు, దేవత - పర్జన్యుడు, ఛందస్సు - త్రిష్టుప్.


            ఓం త్రిపోవాచః ప్రవదజ్యోతిరగ్రాయా పితద్దు హేమధు దోఘమూధః
            వత్సం కృబ్వవ్యర్భ మోష ధీనాం పద్యోజాతో వృషభోరోరవతి


    1. అగ్రభాగమున విద్యుత్తు ఓంకారము గల ఋక్, యజుస్సామ త్రివిధవాక్యములు జలములను పితుకును. ఆ వాక్యములనే పలుకుము. పర్జన్యుడే సహవాసి అయి విద్యుదగ్నిని ఉత్పన్నము చేయును. ఓషధులకు గర్భము కలిగించును. వెంటనేపుట్టి వృషభమువలె గర్జించును.

    (తిస్రోవాచః అనగా ద్రుత, విలంబిత, మధ్యమములు కూడ కావచ్చును)

    2. పర్జన్యుడు ఓషధుల వర్ధకుడు. జలవర్ధకుడు. సకల లోకములకు ఈశ్వరుడు. అతడు మాకు త్రిధాతుయుక్త గృహము, సుఖములు ప్రదానము చేయవలెను. మూడు ఋతువులందు ఉండు సుందరగమనముగల జ్యోతిని మాకు ఇవ్వవలెను.

    (త్రీణివా ఆదిత్యస్య తేజాంసి వసంతప్రాతర్గ్రీష్మే మధ్యన్ధినే శరదపరాహ్ణఇతి. సూర్యునకు మూడు తేజస్సులు ఉన్నవి. ఉదయము వసంతము-పగలు గ్రీష్మము అపరాహ్ణమున శరత్తు)

    3. పర్జన్యుని ఒక రూపము. ఈత ఉడిగిన గోవు వంటిది. మరొకటి జల వర్షకము. అతడు తానుకోరుకున్నట్లు రూపములు ధరించును. అతడు మాత పృథ్వి, పిత ద్యులోకము నుండి పాట స్వీకరించును. అందువలన తండ్రి ద్యులోకము, పుత్రులగు ప్రాణి వర్గము వర్థిల్లును.

    4. పర్జన్యుడు సకల భువనములందు ప్రాణులందు ఉన్నాడు. అతడు ద్యులోకాది మూడు లోకములందు ఉన్నాడు. అతని నుంచి మూడు ప్రకారముల తూర్పు, పడమర - దిగువ జలములు కలుగును. అతడు నాలుగు దిక్కులను తడుపునట్టి మూడు తూర్పు, పడమర పైభాగపు మేఘములు వర్షించును.

    5. పర్జన్యుడు స్వయం ప్రకాశమానుడు. ఈ స్తోత్రము అతని కొఱకే రచించబడినది. అతడు దీనిని స్వీకరించవలెను. మాకు సుఖము కలిగించు వర్షము కలుగవలెను. పర్జన్యుడు అనుగ్రహించినవాని ఓషధులు పంటలు ఫలించును.

    6. వృషభమువలె పర్జన్యుడు సకల ఓషధులకు రేతస్సు జలము ఇచ్చును. సమస్త స్థావర జంగమములు పర్జన్యునిలోనే ఉండును. పర్జన్యుడు ప్రదానము చేసిన జలము నాకు నూరేళ్ళ ఆయువునిచ్చి రక్షించవలెను. "యూయంపాతస్వస్తిభిః సదానః"


                                నూట రెండవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - పర్జన్యుడు, ఛందస్సు - గాయత్రి.

    1. స్తోతలారా ! అంతరిక్షపుత్రుడు, సేచకుడు పర్జన్యుని కొఱకు స్తుతులు గానము చేయండి.

    2. పర్జన్యుడు ఓషధులకు, గోవులకు, అశ్వములకు స్త్రీలకు గర్భాదానము చేయును.

    3. పర్జన్యుని కొఱకు దేవతల ముఖమగు అగ్నిలో రసవంత హవ్యమును హవనము చేయండి. అతడు మనకు అమిత అన్నము ఇవ్వవలెను.


                                 నూట మూడవ సూక్తము

    ఋషి వసిష్ఠుడు, దేవత - మండూకము, ఛందస్సు - మొదటిది అనుష్టుప్, మిగిలినవి త్రిష్టుప్.

    1. బ్రాహ్మణుడు ఒక సంవత్సర పర్యంతము వ్రతము చేయును. అట్లే మండూకము సంవత్సర పర్యంతము శయనించును. అప్పుడు పర్జన్యుని ప్రసన్నుని చేయుటకు పలుకును.

    (కప్పలు బెకబెలాడిన వర్షము వచ్చునని ప్రతీతి)   

    2. మండూకము ఎండిన చర్మమువలె సరోవరములందు పడుకొని ఉండును. వాటి వద్దకు వర్షజలము వచ్చినపుడు లేగదూడవలె కలకలారావము చేయును.

    3. వర్షకాలము వచ్చును. పర్జన్యుడు ఎదిరిచూచిన, దప్పిగొన్న కప్పలను నీటముంచును. బూడిబడి పలుకులతో తండ్రివద్దకు పోవు కొడుకువలె ఒక కప్పు మరొక కప్పు వద్దకు చేరును.

    4. వర్షము పడినపుడు రెండు జాతుల కప్పలు సంతోషపడును. పర్జన్యుడు కురిపించిన వర్షమును పొడవగు గంతులు వేయును. బూడిదరంగువి ఆకుపచ్చవానితో కలిసి ధ్వనులు చేయును. ఆ సమయమున ఒక కప్ప మరొకదానిని అనుగ్రహించును.

    5. శిష్యుడు గురువును అనుకరించినట్లు మండూకములు ఒకదాని ధ్వనిని మరొకటి అనుకరించును. మండూకములారా ! మీరు సుస్వర శబ్దములు చేయుచు నీటిమీద దూకునపుడు మీ శరీరపు కీళ్లు సరి అగును.

    6. కప్పలలో ఒకటి ఆవువలె, మరొకట మేకవలె అరచును. ఒకదానిది పొగరంగు. మరొకదానిది పచ్చరంగు. పేరు అన్నింటిది ఒకటే కాని రూపములు అనేకములు. అవి నానాదేశములందు ధ్వనులు చేయుచు కనిపించును.

    7. మండూకములారా ! అతిరాత్రి సోమయజ్ఞమున బ్రాహ్మణమువలె నిండిన కొలనులో బెకబెకలాడుచు నలువైపుల విహరించండి.

    8. సోమయుక్తము మరియు వార్షిక స్తుతులు చేయు విప్రులవలె మండూకములు శబ్దము చేయును. స్వేదము నిండిన ఋత్విక్కులవలె తడిసినట్లున్న కప్పలు వేడికాలమున కన్నములందుదాగి వర్షకాలమున బయటపడును.

    9. మండూకనేతలు ప్రకృతినియమములను కాపాడును. అవి పన్నెండు నెలలు ఋతువులను వృధాకానివ్వవు. ఏడాది పూర్తికాగా వానకాలమురాగా ఎండవేడికి మ్రగ్గిన కప్పలు గుంతల బంధనములు విడిపించుకొనును.

    10. ఆవువలె అరుచు మండూకము మాకు ధనము ఇవ్వవలెను. మేకలవలె అరుచు మండూకములు మాకు ధనము ఇవ్వవలెను. బూడిద రంగువి మాకు ధనము ఇవ్వవలెను. పసుపురంగువి ధనము ఇవ్వవలెను. వేల పంటలు పండించు వర్షకాలమున మండూకములు మాకు అసంఖ్యాక గోవులను ఇచ్చి మా ఆయువును పెంచవలెను.

    (ఇది పరిహాసమా? కప్పనుకూడ కీర్తించ వచ్చునని చెప్పుటయా? వినోదమా?)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.