Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
శ్రీమహాభారతము
సభాపర్వము
సభానిర్మాణము
పాండవులు ఇంద్రప్రస్థమున స్థిరపడినాడు. బలవంతులయి ప్రకాశించినారు. శ్రీకృష్ణుడు అచటనే ఉన్నాడు.
ఒకనాడు పాండవులు, శ్రీకృష్ణుడు ఉన్నచోటికి మయుడు వచ్చినాడు. వారికి నమస్కరించినాడు. "అర్జునా! నీవు నాకు ప్రానదానము చేసినావు. ఉపకారము పొందినపుడు ప్రత్యుపకారము చేయుట బుద్దిమంతుల లక్షణము. నేను మీకు ప్రియకార్యము చేయదలచినాను. నేను రాక్షసులకు విశ్వకర్మను. శిల్పవిద్యయందు నిపుణుడను. మీకు ఇష్టమగు దానిని నిర్మింతును. అజ్ఞాపించుడు." అని విన్నవించినాడు.
మయుని మాటలు విన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుని చూచినాడు. శ్రీకృష్ణుడు ఆలోచించినాడు. "మయుడా! ధర్మరాజు సకల రాజులచేత సేవించబడుచున్నాడు. ఇతనికి తగిన విధముగా ఒక సభను నిర్మించి తెమ్ము. అది సర్వలోక మనోహరమయి ఉండవలెను. నీ శిల్ప చతుర్యమంతయు అందు విదితము కావలెను" అని ఆదేశించినాడు.
మయుడు అందుకు అంగీకరించినాడు. వారి వద్ద శలవు తీసుకుని వెళ్ళినాడు. శ్రీకృష్ణుడు తల్లిదండ్రులను చూడవలెను అనుకున్నాడు ద్వారకకు వెళ్ళినాడు.
మయుడు హిమవంతమున గల హిరణ్య శృంగమునకు వెళ్ళినాడు. అచట బిందు సరోవరము ఉన్నది. మయుడు పూర్వము వృషపర్యునకు ఒక సభ నిర్మించ తలపెట్టినాడు. అందు కొఱకు కొంత సామాగ్రి కూర్చి అక్కడ ఉంచినాడు. అంతేకాక అక్కడ నానా విధములయిన రత్నసాధనములున్నవి. వానితో మయుడు సభా నిర్మాణము చేసినాడు.
మయసభా భవనపు గోడలు, దూలములు మణిమయములు ప్రాకారములు నవరత్నమయములు, అందు ఇంద్రనీలములు ఆకుపచ్చగా ప్రకాశించినవి. పద్మరాగములు పద్మములవలె విరాజిల్లినవి. వైడూర్య రత్న కాంతులు తెల్ల కలువలవలె తెజరిల్లినవి. ముత్యములు పాలనురుగు వలె కనిపించినవి.
మయసభ విచిత్రముగా నిర్మించబడినది. స్థలము జలముగను, జలము స్థలముగను కనిపించునట్లు నిర్మించబడినది. అందు నానావిధ యంత్రములు ఉన్నవి. సర్వదా పుష్పించి ఫలించు వృక్షములున్నవి. సరస్సులున్నవి. అందు తామరులు ఉన్నవి. వనములు ఉన్నవి. ఉపవనములు ఉన్నవి. పక్షులున్నవి. పక్షులకు గూళ్ళున్నవి. ఈ సభ నిర్మించుటకు మయునకు పదునాలుగు నెలలు పట్టినది. దాని పొడవు పదివేల మూరలు. వెడల్పు వేయి మూరలు. అట్టి సభా భవనమును మహాబల వేగవంతులయిన రాక్షసులు అకాశమర్గమున మోసి తెచ్చినారు. మయుడు ఇంద్రప్రస్థమునకు తెచ్చినాడు. దానిని ధర్మరాజునకు సమర్పించినాడు. అర్జునునకు దేవదత్తము శంఖమును, శత్రుసంహరకమగు గదను భీమునకు అర్పించినాడు.
ధర్మరాజు అందుకు సంతసించినాడు. మయుని గౌరవించినాడు. మయుడు వెళ్ళిపొయినాడు. ధర్మరాజు ఆ సభా భవనమున బంధు, మిత్ర బ్రాహ్మణ సహితుడయి ప్రవేశించినాడు. అప్పుడు గొప్ప ఉత్సవము జరిగినది. ఆ ఉత్సవమునకు ఋషులు, మునులు, రాజులు అనేక మంది వచ్చినారు. వారందరిని తగు రీతిన గౌరవించినాడు. బ్రాహ్మణులకు అనేక దానధర్మములు చేసినాడు. ఉత్సవము ముగిసినది. వచ్చినవారు వెళ్ళిపోయినారు.
ఒకనాడు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చినాడు. ధర్మరాజాది పాండవులు ఎదురేగి ఆ మహర్షికి స్వాగతము పలికినారు. అర్ధ్యపాద్యాదులు ఇచ్చినారు. నారదుని అసీనుని చేసినారు. అప్పుడు నారదుడు ధర్మరాజుకు కొన్ని రాజనీతి విషయములు బోధించినాడు. (అవి అత్యాధునిక పాలకులకు కూడ పనికి వచ్చునట్లున్నవి) వానిలో కొన్ని ఇట్లున్నవి.:-
1. మంత్రులు నీతిమంతులు, శాస్త్రజ్ఞులు కావలెను. కార్యసమర్దులయి ఉండవలెను. పర రాజుల వద్ద ధనము పొంది వారి పక్షము అవలంభించువారు కారాదు. కార్యాలోచనమును ఇతరులకు తెలియనీయరాదు. రహస్యములను రక్షింపవలెను.
2. సేనాపతులు బలపరాక్రమములు కలవారు కావలెను. రాజునకు విశ్వాస పాత్రులు కావలెను.
3. జ్యోతిష్కులు రానున్న కీడును తెలుసుకొని నివారణోపాయములు చెప్పు సమర్ధులు కావలెను (ప్రకృతి వైపరీత్యములను తెలుసుకోనువారు అయి ఉండవచ్చును. వీరు మన వాతావరణ శాస్త్రజ్ఞులు వంటివారు)
4. వైద్యులు వ్యాధి నివారణమున సమర్ధులు కావలెను. ఔషధసేవ వలన దేహ వ్యాధులు నివారణమగును. పెద్దల సేవ వలన మనోవ్యాదులు నశింతును. (వైద్యశాస్త్రము ద్వివిధముగా అప్పటికే విభజింపబడినది. ఒకటి శారీరక వైద్యము. రెండవది మానసిక వైద్యము. అత్యంత ఆధునికులు కూడ దీనిని అంగీకరించుచున్నారు).
5. ఉద్యోగుల విషయమున దయకలిగి ఉండవలెను. వారికి కాలనియమము తప్పక వేతనములు చెల్లించవలెను. అట్లు కాకున్న ఇంద్రుడయినను చెడిపోవును .(నేటి కార్మిక శాసనములు ఇందు కొఱకే చేయబడినవి.)
6. ఉద్యోగులు అవినీతి]పరులు కారాదు. దొంగ ధనము తీసుకొని వారిని రక్షించరాదు. (ఉద్యొగులు ప్రవర్తనా నియమావళి ఇందు కొఱకే ఏర్పడినది నేడు.)
7. నీరు విలువ ఉంచుటకు చెరువులు, నిర్మించవలెను. అందువలన నీరు లేని సమయమున ఉపద్రవము కలుగదు (అవి నేటి ప్రాజెక్టుల వంటివి)
8. పెదవారలకు, వ్యవసాయదారులకు విత్తనములు మున్నగునవి అప్పుగా ఈయవలెను.
9. వర్తకులకు, పెట్ట్టుబడి నిమిత్తము ధనము అప్పుగా ఈయవలెను - ధర్మవడ్డీ గ్రహించవలెను.
10. రాజ్య ద్రవ్యమున సగమును మించి వ్యయము చేయరాదు.
11. గురుజనులు, వృద్దులు, సాధువులు, కళాకారులు పేదలు కాకుండా చూడవలెను.
12. దుర్గములు అభేద్యములు కావలెను. ధన ధాన్యములు సంగ్రహించి ఉంచవలెను.





