Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
పద్ధెనిమిదవ అధ్యాయము
1. వాజశ్చమే ప్రసవశ్చ మే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమేధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చ మే శ్రవశ్చమే శ్రతిశ్చమే స్వశ్చమే యజ్ఞేన కల్పంతాం||
యజ్ఞము వలన మాకు అన్నము కలుగును గాత. అన్నదానపు అనుజ్ఞ కలుగును గాత. శుద్ధి కలుగును గాత. ఉత్సాహము కలుగును గాత. ధ్యానము కలుగును గాత. సంకల్పము కలుగును గాత. సాధు శబ్దము కలుగును గాత. శ్లోకము కలుగును గాత. యశస్సు కలుగును గాత. శృతి కలుగును గాత. జ్యోతి కలుగును గాత. స్వర్గము కలుగును గాత.
2. యజ్ఞము వలన మాకు ప్రాణము కలుగును గాత. అపానము కలుగును గాత. వ్యానము కలుగును గాత. వాయువు కలుగును గాత. చిత్తము కలుగును గాత. బాహ్య విషయ జ్ఞానము కలుగును గాత. వాక్కు కలుగును గాత. మనసు కలుగును గాత. నేత్రములు కలుగును గాత. శ్రోత్రములు కలుగును గాత. జ్ఞానేంద్రియ కౌశలము కలుగును గాత. కర్మేంద్రియ కౌశలము కలుగును గాత.
3. యజ్ఞము వలన మాకు ఓజస్సు కలుగును గాత. బలము కలుగును గాత. ఆత్మ శక్తి కలుగును గాత. పుష్టి కల శరీరము కలుగును గాత. సుఖము కలుగును గాత. కవచము కలుగును గాత. అంగ ప్రత్యంగములు కలుగును గాత. అస్థులు కలుగును గాత. సర్వము కలుగును గాత. శరీరములు కలుగును గాత. ఆయువు కలుగును గాత. వార్థక్యము కలుగును గాత.
4. యజ్ఞము వలన మాకు జ్యేష్ఠత్వము కలుగును గాత. ఆధిపత్యము కలుగును గాత. క్రోధము కలుగును గాత. తేజస్సు కలుగును గాత. బలము కలుగును గాత. జలము కలుగును గాత. జయము కలుగును గాత. మహిమ కలుగును గాత. విశాలత్వము కలుగును గాత. గృహక్షేత్రాది విస్తారము కలుగును గాత. దీర్ఘ జీవనము కలుగును గాత. అవిచ్ఛిన్న వంశము కలుగును గతా. ప్రభూత అన్న ధనాదులు కలుగును గాత. విద్యాది గుణోత్కర్ష కలుగును గాత.
5. యజ్ఞము వలన మాకు సత్యము కలుగును గాత. శ్రద్ధ కలుగును గాత. జగత్తు కలుగును గాత. ధనము కలుగును గాత. విశ్వము కలుగును గాత. తేజస్సు కలుగును గాత. క్రీడ కలుగును గాత. మోదము కలుగును గాత. సంతానము కలుగును గాత. వంశ పరంపర కలుగును గాత. సూక్తము కలుగును గాత. పుణ్యము కలుగును గాత.
6. యజ్ఞము వలన మాకు ఋతుము కలుగును గాత. అమృతము కలుగును గాత. అరోగత్వము కలుగును గాత. అనామయత్వము కలుగును గాత. జీవనము కలుగును గాత. దీర్ఘాయుష్యము కలుగును గాత. అశత్రుత్వము కలుగును గాత. అభయము కలుగును గాత సుఖము కలుగును గాత. నిద్ర కలుగును గాత. శుభమార్గములు కలుగును గాత. సుదినము కలుగును గాత.
7. యజ్ఞము వలన మాకు అశ్వదుల నియంత్రణ కర్త కలుగును గాత. పోషకుడు కలుగును గాత. క్షేమము కలుగును గాత. ధృతి కలుగును గాత. విశ్వము కలుగును గాత. తేజము కలుగును గాత. సంవిదము కలుగును గాత. విజ్ఞాన సామర్థ్యము కలుగును గాత. ప్రేరణ సామర్థ్యము కలుగును గాత. జనన శక్తి కలుగును గాత. ధాన్యాదులయు, కృషి ప్రతిబందకుల నివృత్తి కలుగును గాత.
8. యజ్ఞము వలన మాకు ఐహిక సుఖములు కలుగును గాత. పారలౌకిక సుఖములు కలుగును గాత. ప్రియము కలుగును గాత. ప్రియ పదార్థము కలుగును గాత. విషయ సుఖము కలుగును గాత. ప్రేమ భావము కలుగును గాత. సౌభాగ్యము కలుగును గాత. ధనము కలుగును గాత. ఇహ శుభములు కలుగును గాత. పరశుభములు కలుగును గాత. గృహాదులు కలుగును గాత. యశస్సు కలుగును గాత.
9. యజ్ఞము వలన మాకు అన్నము కలుగును గాత. సత్యవాణి కలుగును గాత. దుగ్ధము కలుగును గాత. దధి కలుగును గాత. మధువు కలుగును గాత. సహ భోజనము కలుగును గాత. సహపానము కలుగును గాత. కృషి కలుగును గాత వృష్టి కలుగును గాత. జయము కలుగును గాత. శత్రుభేదనీతి కలుగును గాత. ఉద్భిదము కలుగును గాత.
10. యజ్ఞము వలన మాకు గోఅశ్వ ధనము కలుగును గాత. ముక్తామణి కలుగును గాత. ధన సమృద్ధి కలుగును గాత. పుష్టి కలుగును గాత. విభుత్వము కలుగును గాత. ప్రభుత్వము కలుగును గాత. పూర్ణత కలుగును గాత. పరిపూర్ణణ కలుగును గాత. క్షుద్ర ధాన్య సంపన్నత కలుగును గాత అక్షయత కలుగును గాత. అన్నము కలుగును గాత. అన్నము లేని బాధ కలుగకుండును గాత.
11. యజ్ఞము వలన మాకు ప్రాప్త ధనము కలుగును గాత. ప్రాప్తవ్య ధనము కలుగును గాత. పూర్వ సిద్ధ క్షేత్రాదులు కలుగును గాత. ప్రాప్తవ్య క్షేత్రాదులు కలుగును గాత. సుఖ గమ్య ప్రదేశము కలుగును గాత. సమృద్ధి యజ్ఞ ఫలము కలుగును గాత. యజ్ఞాది సమృద్ధి కలుగును గాత. ద్రవ్యాదులు కలుగును గాత. స్వకర్మ సామర్థ్యము కలుగును గాత మతి కలుగును గాత. సుమతి కలుగును గాత.
12. యజ్ఞము వలన మాకు ధాన్యము కలుగును గాత. యవలు కలుగును గాత. మినుములు కలుగును గాత. తిలలు కలుగును గాత. పెసలు కలుగును గాత. శనగలు కలుగును గాత. కాకునులు కలుగును గాత. సాఁవలు కలుగును గాత. కోదలు కలుగును గాత. నీవారములు కలుగును గాత. గోధుమలు కలుగును గాత. మసూరరములు కలుగును గాత.
13. యజ్ఞము వలన మాకు శిలలు కలుగును గాత. మృత్తిక కలుగును గాత. పర్వతములు కలుగును గాత. మహా పర్వతములు కలుగును గాత సైకతము కలుగును గాత వనస్పతులు కలుగును గాత. బంగారము కలుగును గాత. వెండి కలుగును గాత. రాగి కలుగును గాత. ఇనుము కలుగును గాత. సీసము కలుగును గాత రంగము కలుగును గాత.
14. యజ్ఞము వలన మాకు అగ్ని కలుగును గాత. జలము కలుగును గాత. లతలు కలుగును గాత. ఓషధులు కలుగును గాత. వ్యవసాయ ఉత్పత్తులు కలుగును గాత. వ్యవసాయేతర ఉత్పత్తులు కలుగును గాత గ్రామీణ పశువులు కలుగును గాత. అరణ్య పశువులు కలుగును గాత. విత్తము కలుగును గాత. భావిలాభము కలుగును గాత. పూర్వ లాభము కలుగును గాత. స్వార్జిత ఐశ్వర్యము కలుగును గాత.
15. యజ్ఞము వలన మాకు గోవులు మున్నగు ధనము కలుగును గాత. మంచి వసతి కలుగును గాత. అగ్నిహొత్రాది కర్మలు కలుగును గాత. శక్తి కలుగుము గాత. అర్థము కలుగును గాత. ప్రాప్తవ్య అర్థము కలుగును గాత. ఇష్ట ప్రాప్తికి ఉపాయము కలుగును గాత.
16. యజ్ఞము వలన మాకు అగ్ని కలుగును గాత. ఇంద్రుడు కలుగును గాత. సోమమే కలుగును గాత. సరస్వతి కలుగును గాత. పూష కలుగును గాత. బృహస్పతి ఇంద్ర యుగ్మము కలుగును గాత.
17. యజ్ఞము వలన మాకు మిత్రుడు కలుగును గాత. వరుణుడు కలుగును గాత. ధాత కలుగును గాత. త్వష్ట కలుగును గాత. మరుత్తు కలుగును గాత విశ్వేదేవతలు కలుగుదురు గాత. వారితో కూడిన ఇంద్ర యుగ్మము కలుగును గాత.
18. యజ్ఞము వలన మాకు పృథ్వి కలుగును గాత. అంతరిక్షము కలుగును గాత. ద్యులోకము కలుగును గాత. వర్షము కలుగును గాత. నక్షత్రములు కలుగును గాత. దిశలు కలుగును గాత.
19. యజ్ఞము వలన మాకు అంశుగ్రహము జలుగును గాత. రశ్మి కలుగును గాత. అదాభ్యము కలుగును గాత. అధిపతి కలుగును గాత. ఉపాంశువు కలుగును గాత. అంతర్యామము కలుగును గాత. ఐన్ద్ర వాయువు కలుగును గాత. మైత్రా వరుణము కలుగును గాత. అశ్వినము కలుగును గాత. ప్రతి ప్రస్థానము కలుగును గాత. శుక్రము కలుగును గాత.
20. యజ్ఞము వలన మాకు అగ్రాయణము కలుగును గాత వైశ్వ దేవము కలుగును గాత. ధ్రువము కలుగును గాత. వైశ్వానరము కలుగును గాత. ఐన్ద్రాగ్ని కలుగును గాత. మహావైశ్వదేవయు కలుగును గాత. మరుత్వతీయము కలుగును గాత. నిష్కైవల్యము కలుగును గాత. సావిత్రము కలుగును గాత. సారస్వత్యము కలుగును గాత. పత్నీవ్రతము కలుగును గాత. హారియోజనము కలుగును గాత.
(19, 20 మంత్రములందలివి గ్రహములు - అనగా యజ్ఞమునందు ఉపయోగపడు పాత్రలు)
21. యజ్ఞము వలన మాకు స్రువము కలుగును గాత. చమసము కలుగును గాత. వాయవ్యము కలుగును గాత. ద్రోణ కలశము కలుగును గాత. గ్రావణము కలుగును గాత. అధిషవణ ద్వయము కలుగును గాత. పూతభృతము కలుగును గాత. ఆహవనీయ సోమ కలశము కలుగును గాత. వేది కలుగును గాత. కుశములు కలుగును గాత. అవభృథము కలుగును గాత. శమ్యువాకము కలుగును గాత.
(ఇవి యజ్ఞపరికరములు)
22. యజ్ఞము వలన మాకు అగ్ని కలుగును గాత. ప్రవర్గ్యము కలుగును గాత. యజ్ఞ విశేషము కలుగును గాత. సూర్యము కలుగును గాత. ప్రాణము కలుగును గాత. అశ్వమేధము కలుగును గాత. పృథ్వి కలుగును గాత. దితి కలుగును గాత. ద్యౌ కలుగును గాత. అంగుళి కలుగును గాత శక్తులు కలుగును గాత. దిశలు కలుగును గాత.
23. యజ్ఞము వలన మాకు వ్రతము కలుగును గాత. ఋతువులు కలుగును గాత. తపము కలుగును గాత. సంవత్సరములు కలుగును గాత. అహొరాత్రులు కలుగును గాత. జంసము కలుగును గాత. జానుని కలుగును గాత. బృహద్రథన్తర సామము కలుగును గాత.
(కండికాద్వయేన యజ్ఞక్రతు హొమాః 22,23 మంత్రములందలివి యజ్ఞ క్రతు హొమములు)
24. యజ్ఞము వలన మాకు ఒకటి కలుగును గాత. మూడు మూడు కలుగుగాత. అయిదు అయిదు కలుగునుగాత ఏడు ఏడు కలుగునుగాత. తొమ్మిది తొమ్మిది కలుగునుగాత. పదకొండు పదకొండు కలుగునుగాత. పదమూడు పదమూడు కలుగునుగాత. పదిహేను పదిహేను కలుగునుగాత. పదహేడు పదిహేడు కలుగునుగాత. పందొమ్మిది పందొమ్మిది కలుగునుగాత. ఇరువది ఒక్కటి ఇరువది ఒక్కటి కలుగునుగాత. ఇరువదిమూడు ఇరువదిమూడు కలుగునుగాత. ఇరువది అయిదు ఇరువది అయిదు కలుగునుగాత. ఇరువది ఏడు ఇరువది ఏడు కలుగునుగాత. ఇరువది తొమ్మదిఇరువది తొమ్మిది కలుగునుగాత. ముప్పది ఒక్కటి ముప్పది ఒక్కటి కలుగునుగాత. ముప్పదిమూడు ముప్పది మూడు కలుగునుగాత.
(అయుగ్మస్తోమ హొమార్థమన్త్రాః బేసి సంఖ్యగల స్తోమ హొమ మంత్రములు ఆదరాతిశయ ద్యోతనార్థా సర్వత్ర పునరుక్తిః ఒక్కొక్క సంఖ్య రెండు మారులు చెప్పుట ఆదరాతి శయము వ్యక్త పరచుటకు)
25. చతుస్రశ్చ 4 మేష్టేచ మ్కేష్టౌ చ 8 మేద్వాదశచమే ద్వాదశచ 12 మేషోడశచమే షోడశచ 16. మే వింశతిశ్చమే వింశతిశ్చ 20 మే చతుర్వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ 24 మ్కే ష్టావిశతిశ్చమ్కేష్టావింశతిశ్చ 28. మేద్వాత్రింశచ్చ 32 మేషట్ త్రింశచ్చ మేషట్ త్రింశచ్చ 36 మే చత్వారింశచ్చ మే చత్వారింశచ్చ 40 మే చతుశ్చత్వరింశచ్చమే చతుశ్చత్వారింశచ్చ 44 మే అష్టాచత్వారింశచ్చ మే అష్టాచత్వారింశచ్చ 48. మే యజ్జేన కల్పన్తామ్
(మంత్రములు సంఖ్యాసూచకములు. సంఖ్యలు సూచించినాను. ఇవన్నియు యజ్ఞము వలన కలుగవలసినవి.)
26. యజ్ఞము వలన మాకు సంవత్సరన్నర వత్సము కలుగును గాత. సంవత్సరన్నర దూడ కలుగును గాత. రెండు సంవత్సరముల దూడ కలుగును గాత. రెండున్నర సంవత్సరముల దూడ కలుగును గాత. మూడేళ్ళ ఆవు, ఎద్దు, ఆబోతు కలుగును గాత. మూడున్నర సంవత్సరముల ఆవు, ఎద్దు. ఆబోతు కలుగును గాత.
27. యజ్ఞము వలన మాకు నాలుగేళ్ళ ఆవు, ఎద్దు కలుగును గాత. పరిపూర్ణ వృషభము కలుగును గాత. వంధ్య గోవు కలుగును గాత. యువ వృషభము కలుగును గాత. గర్భపాతమైన గోవు కలుగును గాత. బండిలాగు ఎద్దు కలుగును గాత. నవ ప్రసూత గోవు కలుగును గాత.
28. అన్నప్రధాన చైత్ర మాసమునకు స్వాహా. ప్రేరక వైశాఖమునకు స్వాహా, జ్యేష్ఠమునకు స్వాహా, యాగప్రధాన ఆషాఢమునకు స్వాహా, యాత్రానిషేధక వాసకారి శ్రావణమునకు స్వాహా, సూర్యతాపక భాద్రపదమునకు స్వాహా, మూఢదివస ఆశ్వయుజమునకు స్వాహా, పొట్టి పగళ్ళ కార్తీకమునకు స్వాహా, విష్ణు స్వరూప మార్గశీర్షమునకు స్వాహా, పుష్టి కలిగించు పుష్యమునకు స్వాహా, చివరిదగు ఫాల్గుణమునకు స్వాహా. భువనపతికి స్వాహా. అధిపతికి స్వాహా, ప్రజాపతికి స్వాహా.
అగ్నీ! ఇది నీ రాజ్యమగును. నీవు నియంతవు. యజమానిని నియమించువాడవు. విశిష్ట అన్నరసము నిమిత్తము నిన్ను అభిసించితము చేయుచున్నాను. మాకు వర్షము, ప్రజాధిపతుఅము కలిగించుమణి నిన్ను ఘృతధారలచే తడుపుచున్నాను.
29. యజ్ఞము వలన ఆయువు కలుగును గాత. యజ్ఞము వలన ప్రాణము కలుగును గాత యజ్ఞము వలన నేత్రములు కలుగును గాత. యజ్ఞము వలన చెవులు కలుగును గాత. యజ్ఞము వలన మాట కలుగును గాత. యజ్ఞము వలన మనసు కలుగును గాత. యజ్ఞము వలన ఆత్మ కలుగును గాత. యజ్ఞము వలన బ్రహ్మ కలుగును గాత. యజ్ఞము వలన జ్యోతి కలుగును గాత. యజ్ఞము వలన స్వర్గము కలుగును గాత. యజ్ఞము వలన స్తోత్రము కలుగును గాత. యజ్ఞేన కల్పతాం యజ్ఞో- యజ్ఞము వలన యజ్ఞము కలుగును గాత. యజ్ఞము వలన స్తోమము కలుగును గాత. యజ్ఞము వలన ఋగ్యస్సామములు, బ్రహద్రథన్తర సామము కలుగును గాత.





