Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                 తొంబది మూడవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వృత్రఘ్న ఇంద్రా ! అగ్నీ ! ఈనాటి నాస్తోత్రము పరిశుద్ధము నవోత్పన్నము. దీనిని మీరు స్వీకరించండి. మీరు సుఖముగ పిలువ తగినవారు. నేను మిమ్ము మరల మరల పిలుస్తాను. యజమాని మిమ్ము అభిలషించును. అతనికి వెంటనే అన్నము ప్రదానము చేయండి.

    2. ఇంద్రాగ్నులారా ! మీరు విధిపూర్వకముగ పూజనీయులు. మీరు బలిభూతము వంటి శత్రుభంజకులుకండి. మీరు ఒకేసారి పెంపొందువారు. విశేష ధనవంతులు. అన్నములకు ఈశ్వరులు. మీరు దృఢమును శత్రువినాశకమగు అన్నము మాకు ప్రసాదించండి.

    3. హవివంతులు, క్రుపాభిలాషులగు విప్రులు అనుష్ఠానముతో యజ్ఞలబ్ది పొందుదురు, అట్టి నేతలగు జనులు అశ్వము యుద్ధభూమిని వ్యాప్తము చేసినట్లు ఇంద్రావరుణుల కర్మములకు వ్యాప్తికలిగింతురు. వారిని మాటిమాటికి పిలుతురు.

    4. ఇంద్రాగ్నులారా ! విప్రులు మీ కృపార్థులు. యశోవంతులు. తొలుత అనుభవించదగిన ధనము కొఱకు స్తోత్రములతో మిమ్ము స్తుతిస్తారు. నూతనము, దానయోగ్యమగు ధనముతో మమ్ము వర్థిల్లచేయండి.

    5. విశాలములు, పరస్పర యుద్ధము చేయునవి, యుద్ధమందు ప్రయత్నశీలములగు ఉభయ సేనలను మీ తేజస్సుతో ఎల్లప్పుడు నష్ట పరుస్తుండండి. సోమాభిషవకర్త, దేవాభిలాషి యజమాని సాయమున దేవాభిలాష లేనివారిని నాశనముచేయండి.

    6. ఇంద్రావరుణులారా ! మంచి మనసునకుగాను మీరు మా సోమాభిషవ కర్మకు విచ్చేయండి. మీరు మమ్ము గాక ఇతరులను ఎరుగరు. అందువలన చాల అన్నముతో మిమ్ము ఆహ్వానించుచున్నాము.

    7. అగ్నీ ! నీకు ఈ అన్నమున సమిద్దుడవగుము. ఇంద్రుడు, మిత్రుడు, వరుణునకు ఇది రక్షణీయమని చెప్పుము. మేము చేసిన అపరాధములనుండి మమ్ము రక్షింపుము. ఆర్యమ, అదితి సహితము అట్టి మా అపరాధమును తొలగించవలెను.

    8. అగ్నీ ! శీఘ్రముగ ఈ యజ్ఞమును ఆశ్రయింపుము. మా అందరకు ఒకేసారి నీ అన్నము లభించవలెను. ఇంద్ర, విష్ణు, మరుద్గణములు మమ్ముకాక ఇతరులను చూడరాదు. "యూయంపాత స్వస్తిభిః సదానః"


                                తొంబది నాలుగవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రాగ్నులు, ఛందస్సు - జగతి, చివరిది అనుష్టుప్.

    1. ఇంద్రాగ్నులారా ! మేఘము నుండి వర్షమగునకదా, అట్లే ఈ స్తోతనుండి ప్రధానమగు స్తుతి కలిగినది.

    2. ఇంద్రాగ్నులారా ! మీరు ఈశ్వరులు. స్తోత పిలుపు వినండి. అతని స్తుతిని భోగించండి. అనుష్ఠిత కర్మను పూర్తిచేయండి.

    3. నేతలగు ఇంద్రాగ్నులారా ! మమ్ము హీనభావము, పరాభవము అను నిందలలోనికి త్రోయకండి.

    4. రక్షణలు కోఱిన మేము విశిష్ఠహవ్యము, సుందర స్తుతి, కర్మయుక్త వచనములను ఇంద్రాగ్నులవద్దకు పంపుదుము.

    5. రక్షణల కొఱకు విప్రులు ఇంద్రాగ్నులను స్తుతింతురు. బాధలందు ఉన్నవారుకూడ అన్నప్రాప్తి కొఱకు స్తుతింతురు.

    6. మేము స్తోత్రాభిమానులము. అన్నవంతులము. ధనాభిలాషులము. యజ్ఞప్రాప్తికొఱకు మిమ్ము స్తుతింతుము. ఆహ్వానింతుము.

    7. ఇంద్రాగ్నులారా ! మీరు మానవులను సృష్టించువారు. మావద్దకు మీరు అన్నసహితులైరండి. కఠినవాక్కులాడువాడు మాకు ప్రభువుకారాదు.

    8. ఇంద్రాగ్నులారా ! మాకు ఎటువంటి శత్రువుయొక్క హింస కలుగరాదు. మాకు సుఖములను ఇవ్వండి.

    9. ఇంద్రాగ్నులారా ! మీవద్ద గోవులు, అశ్వములు, హిరణ్యయుక్త్ ధనమున్నది. మేము దానిని యాచించుచున్నాము. అది మా అనుభవమునకు రావలెను.

    10. కర్మ నేతలు సోమము అభిషవింతురు. సేవాభిలాషులు అగుదురు. అశ్వములుగల ఇంద్రుని అగ్నిని తేప తేప పిలిచెదరు.

    11. అందరిని మించిన వృత్రహంత, ఆనందమగ్నుడు ఇంద్రుని, అగ్నిని మేము ఉక్థము స్తోత్రము, అన్యస్తవములతో సేవింతుము.

    12. ఇంద్రాగ్నులారా ! దురాలోచనపరులను దుష్టజ్ఞానవంతులను, దుష్టబలవంతులను చోరులను కుండలను బ్రద్దలు కొట్టినట్లు కొట్టండి.


                                తొంబది ఐదవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు, దేవత - సరస్వతి, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సరస్వతి లోహనిర్మిత పురివలె ధారయిత్రి అగును. ఆమె జీవనదారక జలముతో ప్రవహించును. ఆమె తన మహిమతో సారథివలె ఇతర నదులను బాధించుచు సాగును.

    2. ఒకే సరస్వతి నదులలో పవిత్ర. పర్వమునుండి సాగరమువరకు సాగునది. ఆమె నహుషుని ప్రార్థన విన్నది. నహుషునకు ఎంతో ధనము ఇచ్చినది. అతని కొఱకు ఘృత, దుగ్ధధారలు పారించినది.

    3. సరస్వతి మానవ శ్రేయస్సు కొఱకు వర్షము కలిగించు సమర్థురాలు. ఆమె పుట్టుకతో శిశువు. యజ్ఞములందు యోషిత. జలముల మధ్య పెరిగినది. ఆమె హవిష్మంత యజమానికి బలశాలి అగు పుత్రుని ఇచ్చును. లాభము కలిగించి అనేకుల సంస్కరించును.

    4. సరస్వతి శోభన ధనములు కలది. ఆమె ప్రసన్నురాలు కావలెను. యజ్ఞమునకు రావలెను. స్తుతులు వినవలెను. పూజనీయులగు దేవతలు తలలువంచి ఆమె దగ్గరకు వెళ్లుదురు. సరస్వతి నిత్యధనవంతురాలు. తన సఖుల విషయమున దయామయి.

    5. దేవీ సరస్వతీ ! మేము ఈ హవ్యమును హవనము చేసి నమస్కరించి నీవద్దనుండి ధనము అందుకుందుము. మా స్తుతిని స్వీకరించుము. మేము నీకు అత్యంత ప్రియమగు గృహమున ఉందుము. ఆశ్రయించిన వృక్షమువలె నీవద్దనే నిలుతుము.

    6. సుధన సరస్వతీ ! ఈ వసిష్ఠుడు యజ్ఞద్వారములు తెరుస్తాడు. శుభ్రవర్ణదేవీ ! సాగుము. స్తోతకు అన్నము అందించుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                తొంబది ఆరవ సూక్తము

    ఋషి వసిష్ఠుడు, దేవత - సరస్వతి, ఛందస్సు - 1,2 బృహతి, 3 ప్రస్తారపంక్తి, మిగిలినవి గాయత్రి.

    1. వసిష్ఠా ! సరస్వతి నదులలో బలవతి. ఆమె కొఱకు బృహత్ స్తోత్రములు పాడుము. ద్యావాపృథ్వులందు వర్తించు సరస్వతినే నిర్దోష స్తోత్రములతో పూజింపుము.

    2. శుభ్రవర్ణ సరస్వతీ ! నీ మహిమ వలననే మానవుడు దివ్య పార్థివ అన్నములను పొందుచున్నాడు. నీవు మమ్ము గ్రహింపుము. రక్షింపుము. మరుత్తుల సఖివై హవిర్దాతలకు ధనమంపుము.

    3. శుభంకరీ సరస్వతీ ! నీవు శుభములు మాత్రమే సమకూర్చుము. సుందర గమనవగుము. అన్నవతిని అగుము. మాకు ప్రజ్ఞ కలిగించుము. నేను జమదగ్నివలె నిన్ను స్తుతించుచున్నాను. నీవు వసిష్ఠ స్తూయమానవగుము. 

    4. మేము స్త్రీలను పుత్రులను కోరుకొను దాతలము స్తోతలము. మేము సరస్వతిని స్తుతించుచున్నాము.

    5. సరస్వాన్ ! నీవద్ద రసవంతములగు జలసమూహములు వర్షజలములు ఉన్నవి. వానితో మమ్ము రక్షింపుము.

    6. ప్రవృద్ధ సరస్వతి స్తవమువంటి మధుధారలు మాకు అందవలెను. ఆమె సర్వదర్శనీయ మేము ప్రజ్ఞయు అన్నమును పొందవలెను.   


                                   తొంబది ఏడవ సూక్తము

   ఋషి - వసిష్ఠుడు, దేవత - బ్రహ్మణస్పతి, బృహస్పతి, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సేవాభిలాషి నేతలు ఉన్మత్తులయిన యజ్ఞమున భూలోకనేతలు సమస్త సోమము ఇంద్రుని కొఱకు అభిషవించు యజ్ఞమున ఆ యజ్ఞమునకే హృష్టుడగుటకుగాను ఇంద్రుడు తొలుతరావలెను. నడకలుగల అశ్వములుకూడ రావలెను.

    2. మిత్రులారా ! మేము దేవతల రక్షకుగాను ప్రార్థించుచున్నాము. బృహస్పతి మా హవ్యములు స్వీకరించవలెను. దూరదేశమునుండి ధనముతెచ్చి తండ్రికొడుకుకు ఇచ్చును. అట్లే బృహస్పతి మాకు దానము చేయును. కోరికలు తీర్చు బృహస్పతివద్ద మేము అపరాధులము కారాదు. ఆరీతి చేయకుము.

    3. బ్రహ్మణస్పతి జ్యేష్ఠుడు. సుందరుడు. సుఖవంతుడు. మేము అతనికి నమస్కరింతుము. హవ్యములిత్తుము. స్తుతింతుము. దేవకృత మంత్రములకు ప్రభువగు ఇంద్రుని బ్రహ్మణస్పతిని శ్లోకములతో స్తుతించండి.

    4. ఈ ప్రియతమ బ్రహ్మణస్పతి మా ఈ వేదిమీద ఆసీనుడు కావలెను. అతడు అందఱకు వరణీయుడు. మేము ధనము శోభన వీర్యము కోరియున్నాము. బ్రహ్మణస్పతి వానిని తీర్చవలెను. మేము చిక్కులలో చిక్కుకున్నాము. అతడు మమ్ము అహింసితుడయి దాటించవలెను.

    5. అమర దేవగణములు తొలుత ఆవిర్భవించినారు. వారికి ఇష్టమైనదియు పూజాసాధనమగు అన్నము మాకు అందవలెను. శుద్ధ స్తోత్రవంతుడు, గృహస్థుల యజ్ఞయోగ్యుడు, అప్రతిగత బృహస్పతిని మేము పిలుచుచున్నాము.

    6. సుఖకర, రుచికర, వహనశీల, జ్యోతిష్మంత అశ్వగణములు బృహస్పతిని వహించవలెను. బృహస్పతికి బలము నివాసమునకు గృహము ఉన్నవి.

    7. బృహస్పతి పవిత్రుడు. అతని వాహనములు అనేకములు. అతడు అందరిని శోధించువాడు. హితకరము. రమణీయమగు విద్యావంతుడు. అతడు గమనశీలుడు. స్వర్గభోక్త, దర్శనీయుడు. ఉత్తమ నివాసవంతుడు అతడు స్తోతలకు అందరికన్న మిన్నగా అన్నము ఇచ్చును.

    8. బృహస్పతి జనని దేవి ద్యావాపృథ్వి తన మహిమల బలముతో బృహస్పతిని వర్థిల్లచేయవలెను. మిత్రులారా ! వర్ధనీయ బృహస్పతిని వర్థిల్లచేయండి. అతడు మరింత అన్నమునకుగాను జలరాశిని సులభముగా దాటునట్లును సుఖముగ స్నానము చేయునట్లు చేయగలడు.

    9. బ్రహ్మణస్పతీ ! నీ కొఱకును వజ్రధారి ఇంద్రుని కొఱకును నేను మంత్రరూప సుందర స్తుతులు రచించినాను. మీరిద్దరు మా అనుష్ఠానములను రక్షించండి. అనేక స్తుతులు వినండి. మేము మీ భక్తులము. మమ్ము ఆక్రమించదలచిన శత్రు సేనను నష్టపరచండి.

    10. బృహస్పతీ ! నీవు, ఇంద్రుడు దివ్య, పార్థివ ఉభయ ధనములకు ప్రభువులు, అందుకే స్తోతలకు ధనము ఇచ్చెదరు. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                  తొంబది ఎనిమిదవ సూక్తము

                   ఋషి - వసిష్ఠుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అద్వర్యులారా ! ఇంద్రుడు మానవశ్రేష్ఠుడు. అతని కొఱకు రుచికరమగు అభిషుత సోమపు హవనము చేయండి. ఇంద్రుడు సోమము దూరముగా ఉన్నదని, అది పానయోగ్యమని తెలియును. గౌరమృగము కన్న వేగముగా అభిషవము చేయు యజమానిని వెదకుచు మరల మరల వచ్చును.

    2. ఇంద్రా ! పూర్వకాలము నీవు శోభన సోమమును సేవించినావు. ఇప్పుడు కూడ ప్రతినిత్యము అట్టి సోమమునే సేవించవలెననుకొనుము. హృదయమునందును, మనమునను మమ్మే నిలిపి నీముందట సమర్పించిన సోమమును సేవించుము.

    3. ఇంద్రా ! నీవు పుట్టుకతోనే బలము కలుగుటకుగాను సోమపానము చేసినావు. నీ తల్లి అదితి నీ మహిమలు తెలియపరచినది. నీవు విస్తృత అంతరిక్షమును నీ తేజస్సుతో నింపినావు. యుద్ధము చేసి దేవతల కొఱకు ధనము పుట్టించినావు.

    4. ఇంద్రా ! నీవు మాననీయులు, అభిమానధనులగు శత్రువుతో యుద్ధము చేయించినపుడు మేము బాహుబలమున వారిని పరాజితులను చేసెదము. అట్లుకాక మరుత్తులతో కూడి నీవు స్వయముగా యుద్ధమున దిగినచో అన్నముకొఱకగు ఆ యుద్ధమున మేము గెలువగలము.

    ("సాక్షామ జయేమ" అను రెండు పదములు ప్రయోగించినాడు. సాక్షామ అనగా సహించగలము. ఓడించగలమని అర్థము, ఎదుటివారి ఓటమి మాత్రము తనజయముకాదు. కావున జయేమ జయింతుము అన్నాడు.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.