Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    అప్పుడు కృష్ణార్జునులు విజయగర్వమున సింహనాదములు చేసినారు. అప్పుడు దిక్కులు పిక్కటిల్లినవి.
    సముచికి తమ్ముడు మయుడు. అతడు రాక్షసుడు. వనమందు ఉన్నాడు. మంటలకు తాళలేకపోయినాడు. తక్షకుని ఇంట తలదాచుకున్నాడు. వానిని సంహరించుటకు అగ్నియు కృష్ణుడు ఉరికినారు. మయుడు బెదరినాడు. అర్జునుని చాటున నక్కినాడు. అప్పుడు అర్జునుడు శరణాగతుని రక్షించినాడు.
    ఖండవము కాలి కూలినది. అగ్గి ఆరినది. బూడిద మిగిలినది. సకల ప్రాణిజాలములు వృక్షములు నశించినవి. వనము నుండి బతికి బయటపడినవారు అశ్వసేనుడు, మయుడు , మందపాలుని నలుగురు కొడుకులు.
    మందపాలుడెవరు? అతని కొడుకులు యెట్లు రక్షించబడిరి? అందుకు ఒక కధ ఉన్నది. అది ఇల్తున్నది :-
    పూర్వము మందపాలుడు అను ముని ఉన్నాడు. అతడు బ్రహ్మచర్యము అవలంబించినాడు. తపస్సు చేసినాడు. యోగము వలన దేహము విడిచినాడు. కాని సంతానము లేనందున పుణ్యగతులు కలుగలేదు. మందపాలుడు అది గ్రహించినాడు. మనిషిగా పుట్టిన సంతానము పొందుటకు కలకాలము పట్టును. పక్షులకు త్వరగా సంతానము కలుగును. అట్లనుకొని పక్షి రూపము ధరించినాడు. చరిత్ర అను ఆడు పక్షిని కూడినాడు. అతనికి జితారి మున్నగు నలుగురు పిల్లలు కలిగినారు. వారు బ్రహ్మవేత్తలు.
    మందపాల పక్షికి మరొక భార్య ఉన్నది. ఆమె లపిత మందపాలుడు చరితను, జితారి మున్నగు బిడ్డలను విడిచి లపిత దగ్గరకు వెళ్ళినాడు. అక్కడ ఉన్నప్పుడు అగ్ని సూక్తములు చదివినాడు. అగ్నిని ప్రార్ధించినాడు. తన బిడ్డలను రక్షించమన్నాడు.
    మందపాలుడు అక్కడ ఉండగా ఇక్కడ ఖాండవము తగులబడినది. చరిత బిడ్డలను పెట్టుకొని ఏడ్చినది. బిడ్డలు రెక్కలురానివారు. ఎగురలేరు. మాంసపు ముద్దలు. తాను ఎత్తుకొని పోలేదు. అక్కడ ఒక ఎలుక కన్నము కనిపించినది. పిల్లలను అందులో దూరమన్నది. అందుకు జితారీ "తల్లీ! మేము మాంసపు ముద్దలము. ఎలుక కన్నములో దూరిన ఎలుక మమ్ము తప్పక చంపును. అగ్ని వలన చావు సంశయాస్పదము . గాలి మరొక వైపుకు వీచిన మేము బ్రతుకవచ్చును. ప్రాణాపాయ సమయమందు తప్పక మరణము కలుగు చోటును విడువవలెను. సందేహము లేని చోట ఉండవలెను." అని నలుగురు అగ్నిని ప్రార్ధించసాగిరి. అగ్నిదేవుడు ఆ చెట్టు వరకు వచ్చినాడు. కాని ఆ చెట్టును కాల్చలేదు. చరిత అది చూచి ఆనంద బాష్పములు రాల్చినది. మంటలు అరగనే మందపాలుడు వచ్చినాడు. భార్య, బిడ్డలు సురక్షితులు అయి ఉన్నారు. మురిసిపోయినాడు.
    ఇదీ కధ.
    ఓడిన ఇంద్రుడు శ్రీకృష్ణార్జునుల బలపరాక్రమములను మేచ్చినాడు. వారి వద్దకు వచ్చినాడు.  కృష్ణార్జునులను కౌగలించుకున్నాడు. అర్జునుడు ఆగ్నేయ , వారుణ, వాయవ్యాది అస్త్రములను ఇచ్చినాడు. అర్జునునకు సర్వదా ప్రాణ స్నేహితుడై ఉండవలసినదని శ్రీకృష్ణుని ప్రార్ధించినాడు. స్వర్గమునకు వెళ్ళినాడు.
    కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకున్నారు. ఇంద్రప్రస్థమునకు చేరినారు. ధర్మరాజునకు మ్రోక్కినారు. జరిగిన కధ చెప్పినారు. తెచ్చిన మయుని చూపినారు. ఇంద్రప్రస్థమున సుఖముగా ఉన్నారు.
    
                                                     ఆలోచనామృతము
    
1. లక్క ఇంటి కధ భరతమున ప్రధాన మలుపు. లక్క ఇంటివరకు పాండవులను విదురుడు కాపాడినాడు. ద్రౌపది పెళ్ళి వరకు వ్యాసుడు కాపాడినాడు. వ్యాసుడు , విదురుడు కురు కుటుంబము వారు. ద్రౌపది వివాహముతో వారిద్దరు తెరమారుగయినారు. అది దుర్యోధనుని ప్రభావము కావచ్చును.
    ద్రౌపది వివాహము ఒక ప్రధాన ఘట్టము. ఆనాటి నుంచి శ్రీకృష్ణుడు రంగప్రవేశము చేసినాడు. అతడు ప్రజ్ఞావంతుడు . రాజనీతిజ్ఞుడు, చతురుడు, ఉపాయములు ఎరిగినవాడు. అప్పటి నుండి జరిగిన సంఘటనలన్నింటిలో శ్రీకృష్ణుని ప్రమేయమున్నది. అతడు కాంపిల్యమున యుద్దము నివారించినాడు. పాండవులకు అర్ధరాజ్యము ఇప్పించినాడు. ద్రౌపది విషయమున నియమము ఏర్పరచినాడు. అర్జునుని యాత్రలకు పంపినాడు. సుభద్ర పెళ్లి చేసినాడు.
    ఖాండవ దహనము ముఖ సంఘటన. ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యము ఇచ్చినాడు. కాని వారిని అడవిలోకి తోసినాడు. అది భయంకరము అయిన అడవి అయి ఉండవచ్చు. అక్కడి నుంచి పాండవులు బ్రతికి బయటపడరాదని వారి పధకము అయి ఉందును. అట్టి చోట శ్రీకృష్ణుడు పట్టణము కట్టించినాడు. అయినను ఆటవిక జంతువుల బాధ అధికమయినది. మృగముల వలన మరింత బాధలు కల్పించినాడు దుర్యోధనుడు. వాటిని చంపకుండ వనరక్షకులను ఏర్పాటు చేసి ఉందును. వారిని ఓడించి, ఖాండవము కాల్చి, ఇంద్రప్రస్థమును అపాయము నుండి కాపాడినారు శ్రీకృష్ణార్జునులు.
    శ్రీకృష్ణార్జునుల ప్రతిభాపాటవములు చాటుటకు ఇంద్రాదులు ప్రవేశించినారు.
2. లక్క ఇంటివరకు కధ సాంతము హస్తినలోనే జరిగినది. దేవ, యక్ష, కిన్నెర, జాతులు అంతగా కనిపించవు. లక్క ఇంటి తరువాత పాండవుల సంబంధములు విస్తృతములయినవి. అందువల్ల దేవతలు మున్నగు వారు ఎక్కువగా కనిపింతురు.
3. అగ్నికే అగ్నిమాంద్యము కలిగించునది అజ్యము. నేయి ఎక్కువ తినరాదు. అగ్ని మాంద్యము మనిషిని క్రుంగదీయును. అగ్నిదేవుని వలె సకల ప్రయత్నమూ చేసి వ్యాధి నుండి విముక్తులు కావలెను. వ్యాధులకు ఓషధులున్నవి. వానిని కనుగొనుటకు ప్రయత్నించక లభించవు. మానవ ప్రయత్నమున సాధించలేనిది లేదు అనుచున్నాడు.
4. సమాజ పరిణామ క్రమమున వ్యాస మహర్షి ఎంతో చక్కగా చిత్రించినాడు. భద్రత పెరిగిన కొద్ది వ్యక్తుల వైయక్తీకత పెరుగుచుండును. తండ్రికి యవ్వనము అర్పించిన పూరుని కాలము గతించినది. తండ్రి కొఱకు స్వర్వస్వము త్యాగము చేసిన భీష్ముని కాలము గతించినది. అన్న చెప్పినట్లు తమ్ములు వినవలసిన కాలము వచ్చినది. నూరుగురు తమ్ములకు దుర్యోధనుడే ప్రతినిధి. పాండవులకు ధర్మరాజే ప్రతినిధి. శ్రీకృష్ణుడు ఆ వ్యవస్థను బద్దలు కొట్టినాడు. బలరాముడు పెద్దవాడు. అతడు చెప్పినట్లు శ్రీకృష్ణుడు వినవలసి ఉన్నది. కాని శ్రీకృష్ణుడు తన వ్యక్తిత్వమును మహాత్తరముగా పెంచుకున్నాడు. బలరాముడు శ్రీకృష్ణుని అన్నగానే మనకు తెలియును.
5. మందపాలుడు కధ అద్భుతమయినది. తన విధి నిర్వహించని వానికి మోక్షము లేదు. జీవితము నుండి పారిపోవుట పాపము. సుఖ దుఃఖములు అనుభవించి తీరవలెను. ముక్కుమూసుకుని చచ్చిన మరల జన్మము ఎత్తక తప్పదు. జీవితము అనుభవించుటకు ఉన్నది. అనుభవించవలెను.
    సంతానము పొందుట ప్రక్రుతి ధర్మము. సంతానము వలన సుఖములున్నవి. దుఖములున్నవి. పిల్లలను రక్షించుటకు చరిత పడిన బాధ ఏ తల్లి అయినను పడును. తండ్రి బాధ పడలేదని కాదు. అతడు మరొక ప్రియురాలివద్ద ఉన్నాడు. కాని పిల్లల స్థితి తలచుకున్నపుడు ప్రియురాలితో ఆనందము అనుభవించలేక పోయినాడు. తల్లిదండ్రులు తపించినారు.
    పిల్లలు రక్షించబడినవి.
    వాటిని చూచినపుడు తలిదండ్రులకు కలిగిన ఆనందమును కొలుచుటకు యంత్రములు లేవు. అట్టి ఆనందమునకు అవధులు లేవు.
    ఇది జీవితము.
    చీకటి వెలుగుల రాట్నము.
    భారతము జీవిత కధనము.
    లక్ష్మణాచార్య బుచ్చమాంబా పౌత్రుండును, వేంకటాచార్య వేంకటాంబా పుత్రుండును, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవీశ్వరులు కృష్ణమాచార్యుల అనుజుండును శ్రీమద్రామాయణ, భాగవతాధ్యనేక గ్రంధకర్తయు అయిన దాశరధి రంగాచార్య విరచితంబున శ్రీమహాభారతమున ఆదిపర్వము సమాప్తము.    




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.