Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    మిత్రులారా! ఇంద్రుని స్తుతించండి. అతనిని ఉత్తేజితుని చేయండి. యుద్ధము కొరకు ఆరాటపడునట్లు చేయండి.

    39. ఇంద్రుడు అసురులను అల్లకల్లోలము చేయువాడు. అదయుడు. వీరుడు. శతశః క్రోధి. అప్రచ్యావ్యుడు. సేనలను పరభవించువాడు. ఎదురులేనివాడు.

    ఇంద్రా! యుద్ధములందు మా సేనలను రక్షింపుము.

    40. ఇంద్ర! బృహస్పతులు మాసేనలకు నేతలు. యజ్ఞఅధిష్ఠాత విష్ణువు దక్షిణ పార్శ్వమున నిలుచును. సోముడు అగ్రేసరుడగును. మాసేనను ఖండఖండములు చేయగలది. విజయము సాధించగలది. ఈ దేవసేనకు అగ్రమున మరుత్తులు సాగుదురు.

    41. కోరికలు తీర్చు ఇంద్రుడు - రాజావరుణుడు -ఆదిత్య మరుత్తుల మహాబలము మహామనులు, లోకపాలకులు, జయప్రదులగు దేవతలు వీరందరు ఒకేమారు తుముల నాదము చేసినారు.

    42. ధనవంత ఇంద్రా! ఉత్సాహము ఉడిగిన మా వీరుల మనోబలము పెంచుము. వారు మరల ఆయుధములు ఎత్తునట్లు చేయుము. వేగవంత అశ్వముల, జయశీల రథముల నాదములు పెల్లుబుకవలెను.

    43. ఎగురుచున్న మాధ్వజములు శత్రువుల ధ్వజములతో తలపడినపుడు ఇంద్రుడు మాకు రక్షకుడు అగును గాత. ఇంద్రుని కృపవలన మా శరములు శత్రువును గెలుచును గాత. మావీరులు శత్రువులకు భారమగుదురు గాత.

    దేవతలారా! మాఆహ్వానములందే మమ్ము రక్షించండి. - "దేవా అవతా హవేషు"

    44. అప్వదేవతా! నీవు శత్రువుల మనస్సులను కలచి వేయువాడవు. శత్రువుల మనసులను కల్లోలపరచి, వారి అవయవములు అందుకొని పారిపోమ్ము. మరల శత్రువుల అవయవములు కొనిపోవుటకే ఇచటికి రమ్ము. శత్రువుల హృదయములను పుత్రాది శోకములచే నింపుము. మాశత్రువులు గాఢంధకారమున కలసి పోవుదురు గాత.

    (వ్యాధిభయము, మనో దౌర్భల్యము కలిగించునది అప్వ)

    45. మంత్రములచే తీక్ష్ణము చేయబడిన శరవృష్టీ! ఒనిన్ను విడిచినంత శత్రువు మీదకు పొమ్ము. శత్రువును తాకుము. మాశత్రువులందు ఒక్కడు సహితము బ్రతికి పోకుండునట్లు చేయుము.

    46. మా సేనలారా! శత్రువు మీద విరుచుకు పడండి. వారిని ఓడించండి. ఇంద్రుడు మీకు సుఖములను ఇచ్చునుగావుత. మీ భుజములందు మిమ్ము ఎంతటివాడును ఓడించరానంతటి బలముకూడును గావుత.

    47. మరుత్తులారా! శత్రుబలములు పగబట్టి మామీదకు దండెత్తినవి. ఏదేని ఉపయమున వారికి గాఢాంధకారము కలిగించండి. వారికి ఎటు తోచకుండ చేయండి. వారిలోనే ఒకరినొకరు గుర్తించకుండ చేయండి.

    48. ఏయుద్ధమున బాలుర శిరోజముల వంటి చక్కని బాణములు వర్షించునో అచట ఇంద్రుడు, బృహస్పతి, అదితి మాకు శాంతిని, సుఖమును ప్రసాదింతురు గాత.

    49. (యుద్ధమునకు ఉద్యమించిన రాజునకు అధ్వర్యు కవచము ప్రదానము చేయును)

    వీరుడా! నీ మర్మస్థానములను కవచముచే కప్పుచున్నాను. రాజగు సోముడు నిన్ను అమృతమున నిలుపును గాత. వరుణరాజు నీ ఉరమును రాతికన్న గట్టిది చేయును గాథ. దేవతలు నిన్ను ప్రోత్సహించుచు జయము కలిగింతురు గాత.

    50. (ఔదుంబరపు మూడు సమిధలను నేతిలో ముంచి యజ్ఞశాల ద్వారామందలి అగ్నికి ఆహుతులు సమర్పించవలెను)

    ఘృతాహుత అగ్నీ! మాయజమానికి ఉత్కృష్టస్థితి కలిగింపుము. ధనసమృద్ధి కలిగింపుము. సంతానము ద్వారా ఇతనిని బహుసంఖ్యాకుని చేయుము. "సృజ ప్రజయాచబహుంకృధి"


    51. ఇంద్రా! ఈయజమానిని అత్యంత ప్రకృష్టుని చేయుము. ఇతని సజాతీయులు ఇతని వశమున మసలునట్లు చేయుము. ఇతనిని బ్రహ్మవర్చస్సు కలవానిని చేయుము. ఇతడు యజ్ఞములందు దేవతలకు వారి భాగములు ఇచ్చువాడు కావలెను.

    52. అగ్నీ! ఏ యజమాని గృహమందు మేము దేవతలకు హవి అర్పించుచున్నామో అతనిని వర్ధిల్లచేయుము. దేవతలందరు ఇతడు మాకు ఇష్టుడు అందురు గాత. ఇతడు మంత్రములకు స్వామి అగును గాత.

    53. అగ్నీ! విశ్వేదేవతలు నిన్ను సంజ్ఞానములచే పోషింతురుగాక. జ్వాలాముఖ, ప్రభాధన అగ్నీ! మాకు శుభంకరుడవగుము.

    54. అయిదు దివ్యదిశలు అయిదుగురు దేవతల అధిష్ఠానమున ఉన్నవి. అవి మాకు బుద్ధులను, దుష్టవిచారములను పోగొట్టి మమ్ము రక్షించవలెను. దిగ్దేవతలు యజమానికి ధన సమృద్ధిని కలిగించి మాయజ్ఞమున ధనపుష్టి కలిగించవలెను.
   
    55. అగ్ని సమిద్ధమైనంత మాహత్తు కలిగించునదియు, శాస్త్రములచే వాహనీయమును, స్తుత్యము అగు యజ్ఞము అధ్వర్యు చే పరిసమాప్తి నొందును. తప్తమహావీర ఘటమును పట్టుకొని ఋత్విజుడు యజ్ఞమును పూర్తిచేయును.

    56. అగ్ని దేవతల హితకారి. యజ్ఞముద్వారా జగత్తును పాలించువాడు. హవ్యవాహనుడు. దేవతలను తృప్తిపరచువాడు. దేవతలు యజమానిని అనుగ్రహించుట వలన శతసంఖ్యక హవిస్సుల యజ్ఞము కలుగును. ఇట్టియజ్ఞమును దేవతలు పరిగ్రహింతురు. స్వయముగా ఋత్విజుడే దేవతల నిమిత్తము యజ్ఞకార్యమును నిర్వహించును.

    57. దేవతలను ప్రియమగు హవిని యజనము చేయుటకు ఋత్విజుడు సమంత్రకముగా చతుర్థ యజ్ఞ హవిని అర్పించును. అట్లుయజ్ఞము సమాప్తమైనంత మాకు ఆశీర్వచనములు లభించును.

    (ఆధ్వర్యుః పురస్తాద్యజూంషిజపతి హొతా పశ్చాదృచ్కోన్వహ బ్రహ్మ దక్షిణ త్కోప్రతిరథంజపత్యేష ఏవ తురీయోయజ్ఞః ఇతిశృతిః. తొలుత అధ్వర్యుయజుస్సులు జపించును. తదుపరి హొత ఋక్కులు వచించును. బ్రహ్మ దక్షిణముగా అప్రతిరథమును జపించును. అట్లు ఇది తురీయ నాలుగవ యజ్ఞమగును)

    58.  అగ్ని సూర్యుని వంటి కిరణములవాడు. బంగారు వంటి జ్వాలల వాడు. ప్రాణులను వారి వారి పనులకు పురి కొల్పువాడు. జ్యోతిస్స్వరూపుడగు అగ్ని ప్రజ్వరిల్లుచున్నాడు. అగ్ని క్షయము ఎరుంగడు.

    పూష దేవత విద్వాంసుడు. ధర్మ రక్షకుడు, అతడు జగములను వీక్షించును. అగ్ని అను శాసనము నందుండును.

    59.(అగ్నీధ్రగృహమునకు దక్షిణమున అధ్వర్యు ఒక శిలను ఉంచవలెను.)

    భ్రమించునట్టి సూర్య రూపమున ఉన్న ఈ శిల ద్యులోక అంతరిక్ష మధ్యభాగమున సంచరించును. ఇది తన తేజమున ద్యావాపృథ్వులను నింపుచున్నది. ఈ శిల సర్వవ్యాపక వేదిని ఘృతసించిత స్రువమును వీక్షించుచున్నది. అది ద్యులోక భూలోకములను-అందలి జనులను వారి చిత్తములను దర్శించును.
   
    (అగ్నులందు అహవనీయము ద్యులోకము గార్హపత్యము భూలోకము. అగ్నీధ్రము అంతరిక్షము అగును. శిల అగ్నీధ్రము వద్ద ఉన్నందున మధ్యస్థానము అయినది.)

    60. సూర్యుడు వర్షము నిచ్చి పంటలు పండించును. ఉదయమున తుహిన బిందువులచే లోకములను తడిచేయును. ఎరుపు రంగు కలిగి - శుభములనిచ్చు సూర్యుడు తూర్పున ఉదయించును. నానా కిరణ సంకులుడగు సూర్యుడు ద్యులోకపు మధ్యన విరాజిల్లుచున్నాడు. ద్యులోకస్థుడగు సూర్యుడు లోకత్రయమును రక్షించును.

    61. సాగర సమవ్యాపకుడు - రథికులందు శ్రేష్ఠరథికుడు - అన్నవంతులందు శ్రేష్ఠ అన్న పాలకుడగు ఇంద్రునే సమస్త స్తుతులు వర్ధిల్లచేయుచున్నవి.

    62. దేవతలను ఆహ్వానించు యజ్ఞము దేవతలను యజ్ఞమున వహించునుగాక. సుఖములను ఇచ్చు యజ్ఞము దేవతలను యజ్ఞమున వహించును గాత. అగ్ని దేవతల యజనము చేయును గాత. యజ్ఞమునకు దేవతలను అగ్ని వహించి తెచ్చును గాత.

    63. అన్నము దానము చేయునపుడు నా చేయి పైది అగును. ఆ ఊర్ధ్వహస్తము నన్ను ఉన్నతుని చేయవలెను. మా శత్రువులకు ఇంద్రుడిచ్చు ధనము క్రిందిచేయి భిక్షగా తీసికొనును. అది వారిని నీచపరుచవలెను.

    64. నాది పై చేయి అగును. శత్రువుది క్రింది చేయి అగును. దేవగణములు నన్ను, వేదత్రయిని వర్ధిల్లచేయవలెను. మా శత్రువులను ఇంద్రాగ్నులు చిందర వందర చేసి పారగొట్టవలెను.

    65. ఋత్విజులారా! ఉఖాగ్నిని చేత బూని స్వర్గమునకు సాగండి. ద్యులోకపు వెనుక భాగమున ఉన్న స్వర్గమునకు చేరండి. అక్కడ దేవతలతో కలసిమెలిసి స్థిరపడండి.

    66. విద్వాంసుడగు ఉఖాగ్నీ! తొలుత నీవు నీ ప్రభావమును గుర్తించుము. తూర్పునాకు సాగుము. అచట చిత్యగ్ని ఉన్నది. నీవు దానికి ముఖ్యాగ్నివి అగుము. సమస్త దిశలను భాసింపచేయుచు విశేషముగా దీపించుము. తదుపరి మా ద్విపాద మానవులకు అన్నము, చతుష్పాద గవాదులకు గడ్డి మున్నగునవి కలిగించుము.

    67. నేను భూమినుండి పైకి లేచినాను. అంతరిక్షమునకు చేరినాను. అంతరిక్షము నుండి ద్యులోకమునకు ఆరోహించినాను. ద్యులోకపు ఉత్తుంగ శిఖరమునుండి ఎగిరినాను. ఆదిత్య జ్యోతిని చేరుకున్నాను.

    68. విశ్వమును భరించు యజ్ఞమును విస్తార పరచు విద్యాంసులు స్వర్గమునకు సాగునపుడు ఎటువంటి లౌకిక పదార్థములను అపేక్షించరు. వారు ద్యావాపృథ్వులను ఆదిత్య మండలమును ఆరోహింతురు.

    69. అగ్నీ! నీవు దేవతలకు నేత్ర స్థానమవు. మానవులకు నీవే సాక్షాత్తు నేత్రమవు. భృగు బ్రాహ్మణుల విషయమున ప్రీతి గలవారును - యజనశీలురగు యజమానులకు శుభములు కలిగి స్వర్గము ప్రాప్తించవలెను.

    70. (ప్రతి ప్రస్థాత చేత స్వయమాతృణ్ణ ఇటుక వద్ద అగ్నిని స్థాపింప చేయవలెను. దాని మీద తెల్లని దూడగల నల్లని ఆవు పాలచే ఆహుతులు అర్పించవలెను.)

    సమ మనస్కులై విపరీత రూపములు కలిగి వెంట వెంట నడచునట్టి రాత్రి, ఉషలు ఒక అగ్ని రూప శిశువును ప్రజ్వలింపచేయుదురు. ద్యావాపృథ్వుల నడుమ నిలిచినా ఈ అగ్ని విశేష రూపమున శోభిల్లును. ధనదాతలగు దేవతలు అగ్నిని ధరించినారు.

    71. అగ్నీ! నీవు సహస్రాక్షుడవు. శత మూర్ధనుడవు. నీవి నూరు ప్రాణములు. వేయి వ్యానములు. నీవు వేల సంఖ్యలో గో  అశ్వధనములు దానము చేయగలవాడవు. అట్టి నిన్ను అన్నార్థినై యజనము చేయుచున్నాను - స్వాహా.

    72. అగ్నీ! నీవు చక్కని రెక్కల గరుడుడవు. నీవు పృథ్వి యొక్క పృష్ట భాగమున ఉన్న వేది మీద స్థిరపడుము. నీ ప్రకాశమును అంతరిక్షమున నింపుము. నీ జ్యోతిచే ద్యులోకమును వెలిగించుము. నీ తేజస్సున దిశలను దృఢపరచుము.

    73. అగ్నీ! నిన్ను ఆహ్వానించుచున్నాము. నీవు జ్వాలావంతుడవగుము. తూర్పున స్వస్థానమున స్థిరపడుము. ఇది ఉత్కృష్టమగు దేవతలతో కూర్చుండు స్థానము. ఇచట విశ్వేదేవతలు యజమాని కూర్చుందురు గాత.

    74. రవి వరనీయుడు.సర్వప్రేరకుడు. సుమతి. అతని తేజస్సు బహురూపకము. సర్వోత్పాదకము నేను ఆ సూర్యతేజమును భజింతును. సూర్యుడు -దుగ్ధ పూర్ణము, సహస్ర ధారాయుక్తము బహుదుగ్ధయగు - మహా గోరూపుడు. పూర్వము కణ్వుడు ఆ సూర్యుని తేజస్సును భజించినాడు.

    75. అగ్నీ! ఉత్కృష్ట ద్యులోకమున ఆదిత్య రూపమున ఉన్న నిన్ను భజింతుము. అంతరిక్షపు దిగువన విద్యుద్రూపమున ఉన్న నిన్ను భజింతుము. ఇటుకల కుండ రూప స్థానమున నీవు వాస్తవముగా స్థిరపడినావు. అట్టి నీ యొక్క యోని రూపమగు వేదిని సహితము భజింతును. సమిధలతో కూడిన నీ యందు ఋత్విక్కులు హవిస్సులచే హొమము చేయుదురు.

    76. యువతమ అగ్నీ! నిరంతర సమిధాదానము వలన ఎంతో ప్రజ్వరిల్లువాడవు. నీవు మా  యందు పరిపూర్ణముగ దేదీప్యమానుడవు అగుము. మా సమస్త హవిరన్నములు సదా  నిన్నే చేరుచుండును.

    77. అశ్వమేధ అశ్వమును మంత్రములచే మరింత మేధ్యము చేయుదురు. అగ్నీ! అట్లే మేము నిన్ను హవిస్సులతోను, స్తోత్రములతోను వర్ధిల్ల చేయుదుము.

    78. యజ్ఞమును కోరువారును యజ్ఞమును వర్ధిల్లచేయువారును అగు దేవతలు యజ్ఞమునకు విచ్చేయుటకు గాను మనసా ఘృతమున ఋత్విగ్యజమానుల కుండమునందు అగ్నిని స్థాపించుచున్నాను. ఈ విశాల విశ్వపాలకుడగు విశ్వకర్మ కొరకు సదా హొమము చేయుదును.

    79. అగ్నీ! నీవు ఏడు సమిధలు- ప్రాణములు- కలవాడవు. నీకు ఏడు జ్వాలా జిహ్వలు కలవు. ఏడుగురు ఋషులున్నారు. గాయత్రి మున్నగు ఏడు చంధస్సులున్నవి. ఏడుగురు ఋత్విజులు నిన్ను ఏడు అగ్నిష్టోమాది యజ్ఞ విధులచే యజింతురు. ఏడు కుండములు కల వేదిని ఘృతముచే నింపుము. స్వాహా.

    80. (వైశ్వానర పురోడాశమున యజ్ఞము చేసి మారుత పురోడాశమున హొమము చేయవలెను.)

    శుక్రజ్యోతి, చిత్రజ్యోతి, సత్యజ్యోతి, జ్యోతిష్మంతులగు శుక్ర, ఋతపా మరియు పాపములను అతీతులై ఉండు మరుత్తులు తమ తమ సప్త గణములతో మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    81. ఈదృజ్ - అనాదృజ్ - సదృజ్ - ప్రతి సదృజ్ - మిత - సమిత - సభరములను మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    82. ఋత - సత్య, ధ్రువ - ధరుణ - ధర్త విధర్త - విధారయములను మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    83. ఋతజిత్ - సత్యజిత్ -సేనజిత్ - సుషేణ - అన్తిమిత్ర - దూరే అమిత్ర - గణములను మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయ వలెను.

    84. ఈదృక్షస - ఏతాదృక్షాస - ఊషుణ - సదృక్షాస - ప్రతిసదృక్షాస - మితాస- సమ్మితాసులను మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    85. స్వతవాన్ - ప్రఘాసి- సాన్తపన - గృహమేధి - క్రీడి - శాకి - ఉజ్జేషి యను మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    86. ఉగ్రశ్చ భీమశ్చ ధ్వాన్తశ్చ ధునిశ్చ|
    సాసహ్వాశ్చాభియుగ్వాచ విక్షిపః స్వాహా

    దేవరూపప్రజ మరుత్తులు, ఇంద్రునకు అనుకూలముగా నడుచుకొనును. అట్లే ఈ యజమానికి దైవీ ప్రజ, మానవ ప్రజా అనుకూలురు కావలెను.

    87. (రానున్న 13 మంత్రములను అధ్వర్యు యజమానిచే అనిపించవలెను.)

    అగ్నీ! ఇది స్రుక్ రూపస్తనము. ఇది విశిష్టము. - రసవంతము - ఘృత యుక్తము. ఈ స్రుగ్రూపస్తనమును కుడుపుము. లోకముల మధ్య ఈ మధుమయ స్తోత్రమున్నది. దానిని ఆస్వాదించుము. తృప్తుడవగుము. సముద్ర సంబంధమగు నీ గృహమున ప్రవేశింపుము.

    88. అగ్ని జ్వాలాముఖుడు. నేను అతని ముఖమును ఘృతమున ఆసించితము చేయదలచినాను. ఘృతమేలయనిన ఘృతమే అగ్నికి  ఉత్పత్తి స్థానము. అగ్ని ఘృతమునే ఆశ్రయించి ఉండును. అగ్ని యొక్క తేజస్సు ఘృతమే యగును.
   
    అధ్వర్యులారా! హవిరన్నము సముపార్జించండి. అగ్నిని ఘృత భక్షణకు ఆహ్వానించండి. అగ్ని విచ్చేసినంత అతనిని పూర్తిగా తృప్తుని చేయండి.

    కోరికలు తీర్చు అగ్నీ! స్వాహా అని నీకు అర్పించిన హవ్యములను దేవతల కొరకు వహించుము. నీవు అందుకొనుము.

    89. గోవు యొక్క స్తన రూప సముద్రము నుండి దుగ్ధ రూపము అగు మధుర తరంగములు లేచును. ఆ దుగ్ధములకు అగ్ని సంయోగము కలిగినంత వానికి అమృతత్వము కలుగును. (కాగిన పాలు, పాల ఉత్పత్తులు అమృతమని) దేవతల నోళ్లు ఊరుటకు ఘృతనామము మాత్రము చాలును. ఘృతము అమృతత్వ కారకము.

    (ఆయుర్వైఘృతమ్. ఘృతము వలన ఆయుర్వృద్ధి కలుగును. ఘృతముచే యజ్ఞము చేయుట వలన అమృతత్వము కలుగును.)

    90. మేము ఘృతనామమును ఉచ్చరించుచున్నాము. ఈ యజ్ఞమున అన్న సహితముగా ఘృతము అర్పించుచున్నాము. మేము ఘృతమును ప్రశంసించుటను బ్రహ్మ వినును గాత. ఈ యజ్ఞ రూప గౌర మృగమునకు ఋత్విజులను నాలుగు శృంగములున్నవి. ఆ యజ్ఞ రూప గౌరము ధ్యానము చేయుచున్నది.

    91. ఇది యజ్ఞ వృషభము. నలుగురు ఋత్విజులే దీని నాలుగు శృంగములు. (బ్రహ్మ, ఉద్గాత, హొత - అధ్వర్యులను నలుగురు ఋత్విజులు) మూడు వేదములు దీని మూడు పాదములు హవిర్ధాన, ప్రావర్గ్యములను రెండు శిరస్సులు. ఏడు ఛందస్సులు ఏడు హస్తములగును. మూడు సవనములందు ప్రతి బద్ధమగు ఈ వృషభము తుముల వేదనాదము చేయును. ఈ విధముగా ఈ మహాయజ్ఞ దేవత మానవులందు ప్రవేశించినాడు. "మహొ దేవో మర్త్యాం ఆవివేశ"

    92. ఘృతము యజ్ఞ పరిణామ భూతము. అది మూడు విధములుగా ముల్లోకములందు ఉన్నది. దానిని పణులు దాచినారు. అప్పుడు దేవతలు గోవు నుండియే ఘృతమును సముపార్జించినారు. ఈ ఘృతము ఒక  భాగమును ఇంద్రుడు రెండవ భాగమును సూర్యుడు ఉత్పత్తి చేసినారు. మూడవ భాగమును ద్విజన్ములు స్వధద్వారా యజ్ఞ సాధన అగ్ని సాయమున  సముపార్జించినారు.

    93. ఈ దుగ్ధధారలు గోవు హృదయ సముద్రము నుండి ఉప్పొంగును. శతవ్రజములగు ఈ దుగ్ధ ధారలను శత్రువు తిరస్కరించిన జాడకానరాదు.

    నేను ఘృత ధారలను దర్శించుచున్నాను. ఈ ఘృత ధారల మధ్యనే కదా బంగారు రంగు అగ్ని వసించునది!
   
    94. హృదయమునందలి మనసు వంటి పవిత్రములు గోవులు. ఆ గోవులు నదుల జలధారలనువలె ఘృత ధారలను స్రవింపచేయుచున్నవి. వేటగానికి భయభీతలై మృగములు ఉరుకులు పెట్టినట్లు ఈ ఘృత తరంగములు గంతులు వేయుచున్నవి.

    95. పల్లపు ప్రదేశములందు మహానదుల జలతరంగములు విరిగి దూకినట్లు - గుర్రపు పందెమునందు గుర్రములు హద్దు దాటి ఎగిరినట్లు ఈ ఘృతపు మహాధారలు తరంగములై ఉప్పొంగిపడుచున్నవి.

    96. శుభకామలు, మందస్మిత వదనలు, ప్రసన్నచిత్తలై యువతులు తమ ప్రియులను చేరినట్లు ఘృతధారలు అగ్నిని చేరుకొనుచున్నవి. ఘృత ధారలు సమిధలందు ఇముడును. జాత ప్రజ్ఞుడగు అగ్ని వానిని కలుసుకొని అత్యంత ప్రసన్న చిత్తుడగును.

    97. భర్త ఇంటికి వెళ్ళు కన్యలు కాటుక మున్నగు వానిచే అలంకరించు కొన్నట్లు - నాకు ఘృతధారలు కనిపించుచున్నవి. "యత్ర సోమఃసూయతే యత్ర యజ్ఞో ఘృతస్య ధారా అభితత్పవన్తే" ఎచట సోమము స్రవించునో - ఎచట యజ్ఞము ప్రవర్తిల్లునో - అచట ఘృత ధారలు ప్రవహించును.

    98. దేవతలారా! మా యొక్క సుమనస్క స్తుతులు ఆలకించండి. ఘృతమయ యజ్ఞమునకు విచ్చేయండి. విచ్చేసి మాకు ధనములను అందించండి. మా 'సౌత్రామణి' యాగమును దేవతలకు అందించండి. "ఘృతస్య ధారా మధుమత్పవంతే" ఘృతపు మధుర ధారలు ప్రవహించుచున్నవి. వానిని సహితము దేవతలకు అందించండి.

    99.  అగ్నీ! నీవు సమస్త బ్రహ్మాండమున వ్యాపించి ఉన్నావు. సముద్రమున వ్యాపించి ఉన్నావు. హృదయమందు వ్యాపించి ఉన్నావు. ఆయుష్యమందు వ్యాపించి ఉన్నావు. జలముల ముఖము నందును - యుద్ధమునందున తేజో రూపమున నిండియున్న - నీ మధుర తరంగ ఘృతమును మేము ఆస్వాదింతుము గాక.

    ధామంతే విశ్వం భువనమధిశ్రితమన్తః సముద్రే హృదయాన్తరాయుషు|
    అపామనీకే సమిథేయ ఆభృతస్తమశ్యామ మధుమంతం త ఊర్మిం

   

       
                               దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
             పేకాది జపపర్యన్తమను పదిహేడవ అధ్యాయము సమాప్తము.
                               సర్వే భవన్తు సుఖనః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.