Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ఆధునిక నాగరకత పేర సాగుతున్న అణ్వాధ్యాయుధములు మానవ వినాశకారకమగు కాలుష్యాదులు ఎవరుకోరి తెచ్చుకొనుచున్నారు? ఎవరు మానవజాతి ఆత్మహత్యకు కారణమగుచున్నారు?
ఇది దైవ కృతముకాదా? మానవుడు నివారించగలడా?
అట్లని వ్యక్తిని బాధ్యతా రహితుని చేయలేము. అతని పనులకు అతడే ఇహపరములందు బాధ్యత వహించవలసి ఉన్నది. స్వప్రయత్నమునకు మీరి, అలవికానప్పుడు మాత్రమే దైవకృతమగును.
స్వప్నమున చేసినది పాపమగునా? ఇది వాదనకు బాగున్నది. తెలిసి చేసినది మాత్రమే పాపము, దోషము నేరము అగుచున్నది.
ఎనుబది ఏడవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - వరుణుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వరుణుడు అంతరిక్షమున సూర్యునికొఱకు మార్గము ఏర్పరచినాడు. నదులకు అంతరిక్షమును పుట్టిన జలము అందించినాడు. మగ గుర్రములు ఆడగుర్రము కొరకు ఉరికినట్లు వరుణుడు వేగముగా పోదలచి రాత్రులనుండి పగళ్లను వేరుచేసినాడు.
2. వరుణా ! నీగాలి లోకమునకు ప్రాణము. నలువైపుల ఉన్న నీరు కూడ నీవు ఇచ్చినదే. గ్రాసము పశువును అన్నవంతము చేయును. అట్లే జగములను, భరించు వాయువు అన్నవంతుడగును. గొప్పవి, పెద్దవి అగు ద్యావాపృథ్వులమధ్య ఉన్న నీ సమస్త స్థానములు జనప్రియములు.
3. వరుణుని అనుచర వర్గమంతయు ప్రశంసనీయము. వారు చక్కని రూపము గలవారు. ద్యావాపృథ్వులను వీక్షింతురు. వారు కర్మవంతులు, యజ్ఞధీరులయిన కవుల స్తోత్రములను నలువైపులనుండి వీక్షింతురు.
4. నేను మేధావి ఋత్విక్కును. పృథ్విలేక వాక్కునకు ఇరువది ఒక్క పేర్లున్నవని వరుణుడు నాతో చెప్పినాడు. వరుణుడు మేధావి. విద్వాంసుడు అతడు యోగ్యుడగు శిష్యునకు ఉత్తమ స్థానమునందు ఈ రహస్యములను అన్నింటిని ఉపదేశించినాడు.
5. ఈ వరుణునితో ఉత్తమ, మధ్యమ, అధమ మూడు విధముల ద్యులోకములు ఉన్నవి. ఇతనిలో ఉత్తమ, మధ్యమ, అధమ భూములు ఋతువులనుబట్టి ఆరు దశలు ఉన్నవి. రాజావరుణుడు బంగారు ఊయలవంటి సూర్యుని వెలుగు కొఱకు ఏర్పరచినారు.
6. వరుణుడు సూర్యునివంటి వెలుగు కలవాడు. అతడు సముద్రములను స్థాపించినాడు. వరుణుడు జలబిందువు వంటి నిర్మలుడు. గౌరమృగము వంటి బలవంతుడు. గంభీరస్తోత్రమువంటి జలముల నిర్మాత. దుఃఖములను దాటగల బలవంతుడు. లోకములందలి సమస్త పదార్థములకును రాజు.
7. వరుణుడు అపరాధిని సహితము అనుగ్రహించును. దీనత్వము ఎరుగని వరుణుని కార్యములను మేము యదావిధిగా సమృద్ధము చేయుదుము. అతనిముందు నిరపరాధులమై నిలుతుము. "యూయంపాత స్వస్తిభః సదానః"
ఎనుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - వరుణుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వసిష్ఠా ! కోఱికలు తీర్చు వరుణుని గూర్చి స్వయంశుద్ధము, ప్రియతమమగు స్తుతి రచింపుము. వరుణుడు యజనీయుడు. బహుధనవంతుడు. అభీష్టవర్షి. విశాలుడు. వరుణుడు సూర్యుని మనకు అభిముఖుని చేయును.
2. ఇప్పుడు వెంటనే నేను వరుణుని దర్శనముచేసి కొందును. అగ్ని జ్వాలలను స్తుతింతును. వరుణుడు పాషాణమునందలి సుఖకర సోమమును తనివి తీర సేవించినప్పుడు అప్పుడు అతడు ప్రశస్తరూపమున దర్శనమిచ్చును.
3. నేను వరుణుడు నావపై ఎక్కినపుడు నావను సముద్ర మధ్యమున నడిపినపుడు నీటిమీద తేలియాడు నావపై మేమున్నపుడు. అప్పుడు నావరూపపు ఊయలలో ఊగుచు ఆనందముగ ఆటలాడినాము.
4. మేధావి వరుణుడు సూరాత్మరూపమున రాత్రింబవళ్లను పెంపొందించినాడు. దినములలో సుదినమున వసిష్ఠుని నావమీద ఎక్కించినాడు. వరుణుడు తన రక్షణలతో వసిష్ఠుని సుకర్మను చేసినాడు.
5. వరుణా ! మనకు పురాతన స్నేహము ఎచట ఏర్పడినది? పూర్వము మనకు హింసారహిత మైత్రి ఏర్పడినది. దానినే నిలుపుకొనుచున్నాము. అన్నవంత వరుణా ! గొప్పది, ప్రాణులకు విడదీయునది, వేయిద్వారములుగల నీ గృహమున నేను ప్రవేశింతును.
6. వరుణా ! వసిష్ఠుడు నీకు నిత్యబంధువు. ఔరసపుత్రుడు. అతడు పూర్వము ప్రియుడయి నీ విషయమును అపరాధము చేసినాడు. అతడు ఇప్పుడు నీకు మిత్రుడు కావలెను.
యజనీయ వరుణా ! మేము నీకు ఆత్మీయులము. కావున పాపయుక్తులమై భోగములు అనుభవించకుండరాదు. నీవు మేధావివి. స్తోతలకు కోఱిన గృహము ప్రదానము చేయుము.
7. వరుణా ! మేమందరము నిత్యములగు భూములందు నివసింతుము. నిన్ను స్తుతింతుము. నీవు మాకట్లు విప్పవలెను. మేము అఖండభూతలము నుండి వరుణుని రక్షణలు అనుభవించవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"
ఎనుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - వరుణుడు, ఛందస్సు - గాయత్రి, చివరిది జగతి.
1. రాజా ! వరుణా ! నీమట్టి ఇల్లు నాకు వద్దు బంగారపుది కావలెనని అర్థము. శోభన ధనవంత వరుణా ! అనుగ్రహించుము. మమ్ము సుఖింప చేయుము, "మృళాసుక్షత్ర మృళయ"
2. ఆయుధములుగల వరుణా ! నేను వడకుచు గాలితోలిన మబ్బువలె సాగుదును. "మృళాసుక్షత్రమృళయ"
3. ధనవంతుడు, నిర్మలుడవగు వరుణా ! దీనత, అసమర్థత వలన శ్రౌత, స్మార్తాదికర్మానుష్ఠానములకు ప్రతికూలుడనైనాను. "మృళా సుక్షత్ర మృళయ"
4. నేను స్తోతను సముద్రమున ఉన్నాను. అయినను దాహమగుచున్నది. "మృళా సుక్షత్ర మృళయ"
5. వరుణా ! మేము మానవులము. దేవతల విషయమున అపకారము చేసి ఉండవచ్చును. అజ్ఞానము వలన చేయవలసిన కర్మలందు ప్రమత్తులము కావచ్చును. అట్టి అపరాధములను ఎంచి మమ్ము కొట్టకుము.
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున అయిదవ అనువాకము సమాప్తము.)
ఆరవ అనువాకము తొంబదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - వాయువు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వాయువా ! నీవు వీరుడవు. శుద్ధము, మధురము అభిషుత సోమమును అధ్వర్యులు నీకు అందింతురు. నీవు నియుత్ గణములను అశ్వములను రథమునకు జోడించుము. విచ్చేయుము. ఆనందమునకు అభిషుత సోమభాగమును ఆరగింపుము.
2. వాయువా ! నీవే ఈశ్వరుడవు. నీకు ఉత్తమ ఆహుతి ఇచ్చిన యజమానివి. పవిత్ర సోమము సమర్పించిన వానిని మానవులందు ప్రధానుని చేయుము. అతడు సర్వత్ర ప్రఖ్యాతుడగును. అందవలసిన ధనమును అందుకొనును.
3. ద్యావాపృథ్వులు ధనముకొఱకు ఈ వాయువును సృష్టించినవి. ప్రకాశమానమగు స్తుతి ధనము కొఱకు ఈ వాయువును ధరించినది. అట్టి వాయువును ఇప్పుడు అశ్వములు సేవించుచున్నవి.
4. పాపశూన్యులగు ఉషస్సులు సుదినములకు కారణభూతులగుటకు అంధకారమును నశింప చేసినారు. దీప్యమానులై విస్తీర్ణజ్యోతిని అందుకున్నవి. అంగిరులు గోరూపధనమును పొందినారు. ప్రాచీన జలములు అంగిరులను అనుసరించినవి.
5. ఇంద్రవాయువులారా ! యజమానులు సుమనస్కులై మననీయ స్తోత్రములతో వెలుగొందుదురు. వారివారి కర్మలు వీరకృత్యములతో రథములు సాధింతురు. ఆ రథములపై మిమ్ము ఆసీనులను చేయుదురు. మీరు ఈశ్వరులు. సమస్త అన్నములు మిమ్ము సేవించును.
6. ఇంద్రవాయువులారా ! మాకు గోవులు, అశ్వములు, గృహములు, బంగారములతో సుఖింప జేయునట్టి క్షమతాశీలదాతలు యుద్ధమున అశ్వములు, వీరుల సాయమున సుదీర్ఘ జీవనమును గెలుచుకొందురు.
(జీవనము యుద్ధరంగమని దానిని గెలుచుటకు దానము కారణమని చెప్పినాడు)
7. అశ్వమువంటి హవివాహకులు, అన్నమును ప్రార్థించువారు, బలమును కోరువారగు వసిష్ఠగణములు ఉత్తమ స్తుతులతో ఇంద్రవాయువులను ఆహ్వానింతురు. "యూయంపాత స్వస్తిభిః సదానః"
తొంబది ఒకటవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - వాయువు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ప్రాచీన కాలమున ప్రవృద్ధులైన స్తోతలు వాయువునకు అనేక స్తోత్రములు వచించినారు. ప్రశస్తులయినారు. వారు ఆపదలందున్న మానవులను తరింపచేయుటకు వాయువునకు హవి అర్పించుటకుగాను సూర్యునితో ఉషను ఒకేచోట నిలిపినారు.
2. ఇంద్రవాయువులారా ! మీరు కామాయమానదూతలు రక్షకులు మీరు బాధించవలదు. నెలలు, ఏండ్ల పర్యంతము కాపాడవలెను. మా సుందర స్తుతి మిమ్ము చేరి సుఖప్రదము, ప్రశంసనీయము, సులభ్యమగు ధనమును యాచించును.
3. వాయువు - మంచి బుద్ధిగలవాడు. తన గుఱ్ఱముల కొఱకు తెలుపును. ఎన్నుకున్నవాడు. అతడు ప్రాచుర అన్నవంతులు, ధనవృద్ధిగలవారిని ఆశ్రయించును. వారు సహితము మంచి మనసుగలవారై, వాయువుకొఱకు యజ్ఞము చేయుటకు వివిధ రీతుల చేరినారు. వారు సుందర సంతతికి కారణభూతములగు కార్యములను చేసినారు. యజ్ఞమువద్దకు విచ్చేయుము. ఈ యజ్ఞమున సోమపానము చేయుము. ఉన్మత్తుడవగుము. "యూయం పాత స్తస్తిభిః సదానః"
4. మీ దేహమున వేగము ఉన్నంతవరకు బలము ఉన్నంతవరకు నేతలు జ్ఞానబలమున ప్రకాశమానులయినంతవరకు - అప్పటివరకు విశుద్ధ సోమపానము చేయు ఇంద్రావరుణులారా ! ఈ కుశలపై ఆసీనులుకండి. విశుద్ధ సోమపానము చేయండి.
5. ఇంద్రవాయువులారా ! మీరు కోఱదగిన స్తోత్రములుగలవారు. మీ అశ్వములను ఒకే రథమున పూన్చండి. మా వద్దకు విచ్చేయండి. ఈ సోమమునందలి అగ్రభాగము మీ కొఱకు తెచ్చినాము. సోమము సేవించుడు. ప్రసన్నులగుడు. మమ్ము పాపములనుంచి విడిపించుడు.
6. ఇంద్రవాయువులారా ! మీ అశ్వములు శత సంఖ్యాకములు. అవి మిమ్ము సేవించును. అందరిని ఆకర్షించు అశ్వములు శత సంఖ్యాకములు. అవియు మిమ్ము సేవించును. శోభన ధనములు ఇచ్చునట్టి ఆ అశ్వములతో మావద్దకు విచ్చేయండి.
7. అశ్వమువంటి హవివాహకులు, అన్నమును ప్రార్థించువారు, బలమును కోరువారును వసిష్ఠగణములు ఉత్తమ స్తుతులతో ఇంద్రవాయువులను ఆహ్వానింతురు. "యూయం పాత స్వస్తిభిః సదానః"
తొంబది రెండవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - వాయువు, ఛందస్సు - త్రిష్టుప్.
1. వాయువా ! నీవు పవిత్ర సోమము అందుకొనువాడవు. మావద్దకు విచ్చేయుము. నిన్ను అందఱు అభిలషింతురు. నీకు వేయి గుఱ్ఱములున్నవి. నీవు ప్రథమ సోమమునకు అధికారివి. అట్టి మాదకమగు సోమమే నీ కొఱకు పాత్రలో ఉన్నది.
2. క్షిప్రకారులు, సోమమును అభిషవించు అధ్వర్యులు ఇంద్రవాయువుల కొఱకు యజ్ఞమున సోమము ఏర్పరచినారు. ఇంద్రవాయువులారా ! దేవాభిలషుగులవారు అధ్వర్యులు కర్మద్వారా మీకొఱకు ఈ యజ్ఞమున సోమపు అగ్రభాగము అర్పించినారు.
3. వాయువా ! గృహమునందున్న హవ్యదాత వద్దకు యజ్ఞమునకు ఏ అశ్వములతో ఏగుదువో వానితోనే విచ్చేయుము. మాకు అన్నవంత, ధనము, వీరపుత్రులు, గోవులు అశ్వములతో కూడిన వైభవము ఇమ్ము.
4. ఇంద్రవాయువులను తృప్తులను చేయు స్తోతలు దేవయుక్తులు. అందువలన వారు శత్రునాశకులు. వారిసాయమున మేము శత్రునాశము చేయు సమర్థులము అగుదుము. ఆ స్తోతల సహితులమై మేము శత్రువును పరాభవించగలము.
5. వాయువా ! శతసంఖ్యాక, సహస్రసంఖ్యాకములగు నీ అశ్వములతో హింసాశూన్యమగు మా యజ్ఞమువద్దకు విచ్చేయుము. ఈ యజ్ఞమున సోమపానము చేయుము. ఉన్మత్తుడవగుము. "యూయం పాత స్తస్తిభిః సదానః"





