Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఖాండవ దహనము
సుభద్ర పెళ్లి జరిగినది. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమున ఉన్నాడు. పాండవులు సుఖులయి ఉన్నారు.
ఒక ఎండాకాలము, ఎండమండుచున్నది. వడగాల్పులు వీచుచున్నవి. సకల జీవులు ఎండలకు తపించుచున్నవి. అట్టి ఎండకాలమున ఒకనాడు కృష్ణార్జునులు అడవులకు బయలుదేరినారు. వేటాడుటకు వెళ్ళినారు. చల్లని అడవులందు వేటాడుచు , నదులందు విహరించుచు కాలము గడిపినారు.
ఒకనాడు కృష్ణార్జునులు ఒకచోట కూర్చుని ఉన్నారు. ఇష్ట కధలను చెప్పుకొనుచున్నారు. వారివద్దకు ఒక ముదుసలి బ్రాహ్మణుడు వచ్చినాడు. తనకు ఆకలిగా ఉన్నది అన్నాడు. ఇష్ట భోజనము పెట్టవలెనని కోరినాడు. కృష్ణార్జునులు అందుకు సమ్మతించినారు. అతనికి ఇష్టభోజనమేదో చెప్పమన్నాడు. ఆ ముసలి బాపడు చెప్పినది ఇట్లున్నది :-
"నేను అగ్నిదేవుడను. నాకు అజీర్ణము కలిగినది. అందుకు కారణము శ్వేతకి.
శ్వేతకి ఒక మహారాజు. అతడు నూరు సంవత్సరములు సత్రయాగము చేయ తలపెట్టినాడు. రుద్రుడు యాజకుడు కావలేనని తపస్సు చేసినాడు. రుద్రుడు ప్రత్యక్షము అయినాడు. శ్వేతకి పన్నెండు సంవత్సరములు ఆజ్యచర్యము అవలంభించవలెనన్నాడు. పన్నెండు సంవత్సరములు ఆజ్యధారాలతో అగ్నిదేవుని పూజించవలెను అన్నాడు. శ్వేతకి అందుకు అంగీకరించినాడు. అట్లు చేసినాడు. అందుకు రుద్రుడు సంతోషించినాడు. దుర్వాసుని యజకుడుగా పంపించినాడు. శ్వేతకి నూరేండ్లు సత్రయాగము చేసినాడు. అంత నెయ్యి తాగుట వలన నాకు అజీర్ణమయింది. నేను బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళినాను. విషయము విన్నవించినాను. అతడు దయ తలచినాడు. "ఖాండవ వనమున అనేక ఓషధులు ఉన్నవి. దానిని దహింపుము. అందువలన నీ అజీర్ణము నివారణమగును" అన్నాడు. అప్పుడు నేను ఖండవము దహించుటకు యత్నించినాను. ఇంద్రుడు నా ప్రయత్నము సాగనీయలేదు. వర్షధారలు కురిపించి నన్ను అర్పినాడు. అది ఏలనన ఖండవమున తక్షకుడు ఉన్నాడు. అతడు సర్పరాజు. ఇంద్రునకు మిత్రుడు. తక్షకుని రక్షించుటకు ఇంద్రుడు నాకు విఘాతము కల్పించుచున్నాడు. తదుపరి మరికొన్ని సార్లు ప్రయత్నించినాను. ఇంద్రుని వలన విఫలుడను అయినాను. మరల బ్రహ్మ వద్దకు వెళ్ళినాను. మొర పెట్టుకున్నాను. "నరనారాయణులు కృష్ణార్జునులుగా భూలోకమున అవతరించగలరు. వారు దివ్యాస్త్రసంపన్నులు. వారు నీకు సాయము చేయగలరు. నీ విఘ్నములు తొలగించగలరు. అప్పుడు నీవు ఖాండవమును దహింపుము" అని చెప్పినాడు బ్రహ్మ. నా అదృష్టమున మీరు వచ్చినారు. బ్రహ్మ వాక్యము తప్పదు. మీరు నన్ను రక్షించవలెను. నా అగ్ని మాంద్యము పోగొట్టవలెను.
అగ్నిదేవుడు చెప్పినది కృష్ణార్జునులు విన్నారు. అగ్ని దేవునితో ఇట్లన్నారు:-
"అగ్నిదేవా! వర్దాధారం నుండి నీరు రక్షణ కల్పింతుము. ఖాండవనము దహించుటకు సాయపడుదుము. కాని మేము నిరాయుధులము. ఆయుధము లేక నీకు సాయపడుట అసాధ్యము."
అగ్నిదేవుడు అది విన్నాడు. వరుణదేవుని తలచినాడు. వరుణదేవుడు వచ్చి నిలిచినాడు. కృష్ణార్జునులకు ఆయుధములు ఇవ్వవలసినదని అగ్నిదేవుడు వరుణుని అర్ధించినాడు. వరుణుడు అనుగ్రహించినాడు. అంగీకరించినాడు ఇచ్చినాడు.
వరుణుడు అర్జునునకు గాండీవము ఇచ్చినాడు. అది బ్రహ్మ నిర్మితము, వజ్రాయుధము వంటిది. దాని ముందు నిలుచుట గాని, గెలుచుట గాని గరుడ గాంధర్వలకలయినకు సాధ్యపడదు. వరుణుడు అర్జునునకు రెండు అమ్ముల పోదులను ఇచ్చినాడు. అవి అక్షయములు అందులోని బాణములు తరగవు. పెరుగుచుండును. వరుణుడు అర్జునునకు దివ్యరధమును ఇచ్చినాడు. అది దేదీప్యమానముగ ప్రకాశించును. దానిది కపిధ్వజము. సింహపు తోకవలె విరాజిల్లుచుండును. దానికి తెల్లని గుఱ్ఱములున్నవి. అవి వాయువేగము గలవి. అది దివ్యరధము. దిగ్విజయ రధము.
వరుణదేవుడు శ్రీకృష్ణునకు సుదర్శన చక్రమును ఇచ్చినాడు. అది వేయి అంచులు గలది. కాంతి పుంజములచే ప్రకాశించునది. రాక్షస , యక్ష, పిశాచ, గరుడ, గాంధర్వదులను సంహరించు శక్తి గలది. వరుణుడు శ్రీకృష్ణునకు కౌమోదకి అను దివ్య గదాయుధమును ఇచ్చినాడు.
వరుణుడు ఆయుధములు ఇచ్చినాడు. అంతర్దానుడు అయినాడు.
శ్రీకృష్ణార్జునులు సాయుధులు అయినారు. యుద్ద సన్నద్ధులు అయినారు. భాండవమును దహించమని అగ్నిదేవునితో అన్నారు. అగ్ని తేజోరూపము ధరించినాడు. ఖండవమును ప్రవేశించినాడు.
నిప్పు అంటుకున్నది. సురసురమన్నది. బరబరమండినది. భగ్గుమన్నది. అగ్నిజ్వాలలు లేచినవి. అడవి తగలబడుచున్నది. జంతువులు మంటలకు అరచినవి. అటు ఇటు ఉరికినది. తప్పుకోనలేక పోయినవి. కాలిచచ్చినవి. పక్షుల గుంపులు అగ్గి మంటలకు తాళలేకపోయినవి. ఆకాశమునకు గుంపులు గుంపులుగా ఎగిరినవి. అగ్ని జ్వాలలు నాల్కలు చాచినవి. ఆ మంటలకు రెక్కలు అంటుకున్నవి. కుప్పలు తెప్పలుగా కాలి కూలినవి. పాములు ఇతర జంతువులూ ఉరికి ఉరికి అగ్నికి ఆహుతి అయినవి. చిటచిట ధ్వనులతో అగ్ని ఆకాశము నంటి జాజ్వాల్యముగ ప్రకాశించుచున్నది.
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రము ధరించి ఒక పక్కన, గాండీవము ధరించి అర్జునుడు మరొక పక్కన అగ్నిని రక్షించుచున్నారు. వారు ఆ మంటల వెలుగుకు ధగధగ మెరయుచున్నారు.
ఆ మంటలు చూచినారు వనరక్షకులు. అర్పుటకు ప్రయత్నించినారు. అర్జునుని బానములకు కూలినారు. మిగిలినవారు ఇంద్రుని వద్దకు ఉరికినారు. జరిగిన విషయము చెప్పినారు. ఇంద్రుడు అదిరిపడినాడు. మేఘపుంజములను ఉరికించినాడు.
అగ్ని దావానలమయినది. మంటలు అడవిని నిండినవి. కర్పూర, తక్కొల, చందన అగరు వృక్షములు అంటుకొని సువాసనలు వెదజల్లినవి. వనమునందలి జీవుల ఆర్తనాదములు ఆకాశమంటినవి. మంటలు పొగలు ఆకసమునంటి విద్యాధరుల విమానములను బాధించినవి.
మేఘపుంజములు ఉరికి వచ్చినవి. ఉరిమినవి. అగ్గి బెదరలేదు. మెరిసినవి. అవి అగ్గిలో కలిసినవి. కురిసినవి. అగ్గి మింగినది. మంటలు ఆగలేదు. మంటల కొండలు ఆకాశమును దహించునట్లున్నది. ఆకాశము త=ఎర్రబడ్డది.
వనమందు సకల జీవులు తపించినవి. తప్పుకోను మార్గము లేక చచ్చినవి. తక్షకుని కొడుకు అశ్వసేనుడు అగ్నిజ్వలలకు తాళలేక తల్లిని తోకకు తగిలించికొని ఆకాశమునకు ఎగిరినాడు. అర్జునుడు అది చూచినాడు. బాణము వేసినాడు. అశ్వసేనుడు తోక, తల్లి శిరసు తెగి మంటలలో పడినవి. అశ్వసేనుడు తప్పుకున్నాడు. అర్జునుని మీద పగ బట్టినాడు. కర్ణుని వద్దకు చేరినాడు.
మేఘములు రిత్తబోయినవి అది విన్నాడు ఇంద్రుడు. మరిన్ని మేఘములను పంపినాడు. వాటివలన చుట్లు, చీకట్లు కమ్మినవి. ఉరుములు ఉరిమినవి. పిడుగులు కురిసినవి. అర్జునుడు వాయువ్యము వేసినాడు. పెనుగాలులు వచ్చినవి. మేఘములను నష్టపరచినవి.
ఇంద్రుడు దేవ, గరుడ. గాంధర్వ, యక్ష సర్పములను పూరికొల్పినాడు. అర్జునుడు వాటిని కొట్టివేసినాడు. శ్రీకృష్ణుడు వారిని హతమార్చినాడు'.
ఇంద్రుడు మరింత కోపించినాడు. రాళ్ళవాన కురిపించినాడు. అర్జునుని బాణములకు అరాళ్ళు వెనుదిరిగినవి. ఇంద్రుని వద్దకే మరలినవి. ఇంద్రుడు మందపర్వత శిఖరము తెచ్చినాడు. అర్జునుడు దానిని చూర్ణము చేసినాడు. ఇంద్రుడు నిర్వీర్యుడు అయినాడు. ఆడినాడు. ఆకాశవాణి వలన తక్షకుడు కురుక్షేత్రమునకు పారిపోయినాడని తెలుసుకున్నాడు సకల దేవతలను వెంట పెట్టుకొని తిరిగిపోయినాడు.





