Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"పుకార్లేమిటి ?"
"అందులో ఆశ్చర్యం ఏముంది?"
మళ్ళీ కాస్సేపు ఆమె మాట్లాడలేదు.
"నాకేం లక్ష్యం ?"
"చంద్రలేఖా!"
ఆమె నోటి సూటిదనాన్ని గ్రహించాడు. ఆమెకు ఇలాంటి భావనలు అరుదు. అలాంటప్పుడు విశాక్షణ జ్ఞానం అంతరించి, ఆలోచనకు అతీతురాలై , ఉడుములా మంకుపట్టు పడ్తుంది. తల్లి కూడా అలాగే ఉండేది. కాలూ స్మృతి పధంలో ఆమె కనిపించింది.
"ఈ గిల్టు పంజరం ఎన్నాళ్ళూ? దీనితో నీకు సంతృప్తి ఉండొచ్చు. కాని నన్నెంతకాలం ఇది బంధించి ఉంచుతుంది ?"
"గిల్టు పంజరమా! అప్పుడే దీని అర్ధం మరిచావా ? ఇది నీకెలా సాధ్యం అయింది?"
ఆమె తల ఊపింది. "దేశభక్తుడు తన ప్రజల్ను నిరంకుశంగా పాలించే కరకు పాలకులను ఎదిరించి పోరాడతాడు. పెత్తనం తనకు రాగానే తానూ పాలకుల్తో పొత్తు కలుస్తాడు. ఇది జగమెరిగిన కద."
కాలూ నిశితంగా "బిటేన్ చెప్పాడు కదూ? అతడు రక్తం మండే యువకుడు అతనికి నా అంతస్టు గాని నీ పరిస్థితి గాని అర్ధం కావు."
"నాకు అతని మీద విశ్వాసం ఉంది."
అంటే. సంభాషణ ముగిసింది. కాలూకు ఆమెలో తిరుగుబాటు కనిపించింది. ఆమె అభిప్రాయాలు తన అభిప్రాయాలకు చుక్కెదురు. ఇది జీవిత సమస్య. గట్టిగా నిలవాలి.
"మానవుడు ఆటవిక జంతువుల కంటే క్రూరుడు కాగలడనే విషయం అప్పుడే మరచావుకదూ ? నాటి రాత్రి ..... ఆ భీకర ....."
విషర్ణమైన ఆమె ముఖంలో అనిర్వచనీయమైన బాధ కనిపించింది. పెదవులు వణకాయి. దిగ్గున లేచి విసవిసా నడిచిపోయింది.
కాలూ సిగ్గు బరువుతో కుంగి కూర్చున్నాడు. నాటి రాత్రిని గురించి నేటి వరకూ ఆమె ముందు నోరెత్తలేదు.
"భగవంతుడా!" అని నిట్టూర్చాడు. ఈ జీవితంలో అతనికి మనశ్శాంతి లేదు. కష్టాల మీద కష్టాలు దొంతర్లుగా పడుతున్నాయి.
లేఖ బిటెన్ను విశ్వసించింది. అసలు బిటేన్ను విశ్వసించంది ఎవరు? కాని ప్రస్తుత సమస్య శుష్క విశ్వాసానికి సంబంధించి మాత్రం కాదు.
అతని మనసులో ఏదో ఆలోచన తళుక్కున మెరిసింది. లేఖ పలుకులకు అంతరార్ధం ఏమైనా ఉందా?
సాయంకాలం కాగానే, బిటేన్ పని నుండి తిరిగి వచ్చే సమయానికి బాల్కనీ మీద నుంచొని వీధుల వైపు ఆదుర్దాగా చూసే లేఖ అతనికి జ్ఞాపకం వచ్చింది. ఒక్కోనాడు అలా చూడకున్నా రేడియో వింటూ కూర్చుంటుంది. కాని ఆమె మనసు మాత్రం మనసులో ఉండదు. తలుపు చప్పుడు వింటే చాలు, దిగ్గున లేచి పరిగెత్తుతుంది. అతని ముందు ఆమె ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. ఆనందంతో నవ్వే ఆ నవ్వు , వంటిట్లో అతని విషయంలో ఆమె తీసుకునే ప్రత్యెక శ్రద్దా, అమాంతంగా ఆమెకు దుస్తుల మీద కలిగిన ఆపేక్షా, అన్నీ స్పురణకు వచ్చాయి. మెడకు నక్లేసు, చెవులకు లోలాకులు, సహితం పెట్టుకుంటుంది. ఎర్రని కుంకుమ బొట్టు ఆమె ముఖానికి అందాన్నిస్తుంది.
అవన్నీ జరిగిపోతుంటే చూశాడు. కాని వానిలోని అంతరార్ధం అతనికి అర్ధం కాలేదు.
"ఇదీ అర్ధం " అని తల ఊపాడు.
బిటేన్ జందెం వేసుకోవడానికి ఒప్పుకోడు. వేసికోడు. లేఖ బిటెన్ను పెళ్ళాడ్తె? ఆమె కులం పోతుంది. అప్పుడు తన గతి ఏమి అవుతుంది ? అభిషేకపాల తగాదా చల్లారి ఇంకా రెండు నెలలు సహితం కాలేదు. హృదయాల్లో ఉద్రేకం అలాగే ఉంది. వారి అదృష్టన ఈ అవకాశం కూడా వస్తే పగ తీర్చుకోవడానికి బాగా వినియోగించుకుంటారు. మర్యాద మంట కలిసిపోతుంది. పదవి నుంచి లాగిపారేస్తారు. మొఖాన తన్ని ముక్కలు ముక్కల క్రింద చీల్చి పారేస్తారు.
గంగతల్లి పాలు లాక్కున్నవాడు ఇంకెలా ఉంటాడు?
తాను కట్టుకున్న మేడలన్నీ కలలా కరిగిపోతాయి.
అప్పుడు లేఖ ఏమౌతుంది ? బిటేన్ ఆమెకు ఏమి ఇవ్వగలడు ? దారిద్ర్యం, దుఖం బాధ. అంతే.
తండ్రి చేతులు జోడించి ఆమె ముందు నుంచొని , తాను కట్టుకున్న మెడల్ను చేతులారా కూలదోయ్యోద్దని ప్రార్ధిస్తే?
వ్యాపారం ఇంకా సన్నగిల్ల లేదు. ఒకనాడు తన వేలు కొలిమిలో కాళింది. స్కూలు నుంచి తిరిగి వస్తున్నా లేఖ తండ్రి చేతి బొబ్బలు చూసింది. భోరున ఏడ్చింది. అంతులేకుండా ఏడ్చింది. పదహారు సంవత్సరాల గుంట గంట దాకా వెక్కివెక్కి ఏడ్చింది.
గాయం తేలిగ్గా మానుతుందనీ ప్రమాదం లేదనీ తాను ఓదార్చాడు. కళ్ళు తుడుచుకొని చిరునవ్వు నవ్వి "ఏడవకుండా ఎలా ఉండేది?" నేనేం రాతి బొమ్మనా? నాకే కాలిందనుకో , నీకెలా ఉండేది?" మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. " బాబా, మళ్ళీ ఎప్పుడూ కాల్చుకోకేం?"
ఇవ్వాళ వెళ్ళి తన ప్రాణానిగ్గాను ఆమె ముందు బడి చేతులు చాచుతే? కాదంటుందా?
అతనికి అవమానం అనిపించింది. లేచి నుంచొని ఆవరణను కలయ చూశాడు. అంధకారం. మర్రి వందల చేతులు చాచి చీకటిని కారు చీకటీ, కటిక చీకటి చేస్తున్నది. ఇది విధికృతం అని తల ఊపుకున్నాడు. బాల్కనీ పట్టా పట్టుకుని వంగాడు. దుఃఖతరంగాలు అతణ్ణి ముంచేశాయి.
ఆమె హృదయంలో ఎంత బాధ దాగి ఉందో? లేఖ నిజంగా బిటెన్ను ప్రేమిస్తుంటే ?
ఆమెలో అగ్ని పర్వతాలు ప్రేలుతాయి. ఆమె ముందుటిలా అంతకంటే ఎక్కువగా బాధపడ్తుంది.
ఒక్కోసారి రోగం కుదిరించదానికి కత్తికోత అవసరం అవుతుంది. ఇది ఆమె జీవితానికి సంబంధించిన సమస్య. ఆమె భవిష్యత్తుకు సంబంధించిన సమస్య.
వేడుకుంటే తప్పక వింటుంది.
పట్టాకు రొమ్ము ఆనించి వంగాడు.
ఆమె గుండెలో ప్రేమాంకురం అంకురించి ఉంటే ? ఒక యువతికి యువకుని మీద ఉండే అనురాగం, ఆమె దాన్ని అణచి పెట్టుకుంటుందే అనుకున్నా మళ్ళీ ఈ జీవితంలో ఆమెకు ఆనందానికి తావు ఉంటుందా?
అతనికి ఎటూ తోచలేదు. ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆలోచనల మీద ఆలోచనలు వచ్చాయి. మార్గాంతరం గోచరించలేదు. దుఃఖంతో గొంతు పూడుకొని పోయింది. ఇంక గత్యంతరం లేనేలేదు.
అతని కాళ్ళు పచ్చని రాళ్ళూ పరచిన నేల మీద నుంచి వసారాలోకి, అక్కడి నుంచి లేఖ గది దక్కరికీ లాక్కుపోయాయి.
అతడు కదల్లేదు. తన ముందున్న కర్తవ్యాన్ని తలచుకుంటూ వణికిపోయాడు. అతని మనోఫలకం మీద గత స్మృతులు పరువులేత్తాయి.
చీకటి గది. అందులో ఒక నల్లుల మంచం. లేఖ దాని మీద పడి ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆమె బాష్పదారాలకు తన వ్రేళ్ళు తడిశాయి. చేత్తో ఆమె ముఖం రుద్దుతున్నాడు. వీపు మీద చేత్తో రుద్దుతున్నాడు. కొ.....ర.....డా.... గాయం.....
తలుపు మీద ఉన్న అతని చేయి నొచ్చింది. ఆనాటి లేఖ బాధ అతనిలో పొంగింది. దయారసం పొంగులు వారింది. ఎండకు మాడిన కొండలోంచి శీతస్రోతస్సు పెల్లుబికింది. నిన్ను కొట్టారు కదూ? కొట్టారూ?
చేయి తలుపు మీద నుంచి పడిపోయింది. పెల్లుబికిన దయరసాన్ని ఓర్చుకోలేక పోయాడు. లేఖ బాధను తుడిచి వేయడానికి వెనక్కు తిరిగాడు.
బాల్కనీ లైటు అర్పేశాడు. కాలు మీద కాలు వేసు కూర్చొని జోడించిన చేతుల వేపు చూసుకున్నాడు. బుజాలు జారేసి గోడకు ఒరగపడ్డాడు. క్షణం తాళి మళ్ళీ నిటారుగా కూర్చున్నాడు. కవోష్ణస్వేదం పక్షం మీదనే ఆరిపోతూ ఉండగా ధ్యానమగ్నమైన మహా విగ్రహంలా నిబిడ నిశాంధకారంలోకి చూస్తూ చీకటిలో లోతులు కొలిచాడు.





