Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"సమయం వచ్చినప్పుడు " అన్నాడు కాలూ.
ఒక్క విషయం మాత్రం అతనికి నిశ్చితంగా ఉంది. లేఖకు అనువైన జాతకం కొనేశాడు. అందుకు అతడు ఒక వందరూపాయిలు ఖర్చు చేసినా అది దుర్వయం ఏమీ కాదు.
ధారాపాతంగా చెప్పికొని పోతున్న బ్రాహ్మడు చటుక్కున అడిగాడు. ఏదో వెనకా ముందాడుతున్నట్లు కనిపించింది.
"పుకార్లు లేవతీసేవాళ్ళ నోళ్ళు మూయించాలి. లేకుంటే ......"
"పుకార్లేమిటి?" కాలూ ఆశ్చర్యంగా అడిగాడు.
"శివా శివా, పరాయి ఇంటి కుండలో ముక్కు పెట్టాల్సిందేనా?"
అతడు గొంతు సవరించుకున్నాడు. వేళ్ళు గడ్డంలోకి దూరి గబగబా దువ్వాయి. "లోకం . ఇది లోకం. లోకులు కాకుల్లాంటివారు. అన్నీ వారికే పట్టి వుంటాయి. మీ అమ్మాయి తరచూ బిటేన్ అనే కుర్రాని వెంట వీధుల్లో కనిపిస్తుంది అనుకుంటున్నారు జనం. పాపం అమాయకురాలు."
కోపంలో కాలూ బొమలు ముడి పడ్డాయి.
"బిటేన్ మర్యాద గల మనిషి. అతడు మనకు నష్టం చేయదు"
"అతని కధ యావత్తూ మనకెలా తెలుస్తుంది? పోనీ తెలుసునే అనుకున్నా లోకపు నోరు ఎలా మూస్తామయ్యా? లోకపు నోరు."
"సరే ఆ సంగతులన్నీ తెలియజేస్తుండు" కాలూ గిరుక్కున తిరిగి విసవిసా నడిచిపోయాడు.
బాపడు లోకుల కేకలు కూడేసి కాలూకు అర్పించాడు.
కాలూ చాలా బాధపడ్డాడు. లేఖకు మంచి వరుడు దొరికే అవకాశాలు కొల్లలుగా ఉన్నాయి. వరనిర్ణయం జరిగిం తర్వాత అత్తింటి వారిని గురించిన అపోహలన్నీ దూరం చేసుకోవాలి. అప్పటిదాకా పెళ్ళి పందిరి వేయకూడదు. ఈలోగా ఈ పుకార్లు పెరిగిపోతే? ఈనాకాచి నక్కల పాలు చేసినట్లు అవుతుంది. అలా కానివ్వకూడదు.
తానే పొరపాటు చేశాడు. తన కులంలో సహితం శ్రామిక వర్గాల్లాగే ఆడా, మగా కలిసి మెలిసి తిరుగుతారు. పట్నాల్లో విద్యావంతులు కూడా అంతే. కాని ఈ బ్రాహ్మణకులానికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచులోవాల్సి ఉండే. ఇందు విషయంలో బిటెన్ను హెచ్చరించల్సింది.
అదెలా సాధ్యం? బిటేన్ తో అలా అనడం ఏం బావుంటుంది?
బిటేన్ ఏమైనా తన హద్దులు అతిక్రమించాడా? అంత చిరుత వయసులో ఎంత పెద్ద పెద్ద విషయాలు అర్ధం చేసుకున్నాడు! దేవాలయానికి వచ్చే జనాన్ని చూసి "నీవు కుల మాదాంద్రుల్నే కాక నీవారినే, నీ చీము , రక్తాన్నే మోసగిస్తున్నావు. గుడి కట్టడం అంటే చౌరంగీ రోడ్డులో దుకాణం తెరిచినట్లుకాదు" అన్నాడు. కాలూ హృదయంలో అట్టడుగున పడి ఉన్న దరిద్రుని అర్తనాదాన్ని పైకి తీశాయి ఆ పదాలు. తాను కోల్పోయిన భార్య బిడ్డలగ్గాను తన సర్వస్వమూ అయిన అయిదుకాన్లు గల పిడికిలి తెరచిన నిర్భాగ్యుడు అతని మనోఫలకం మీద మెరిశాడు.
అతనిలో అమాయకులైన భక్త కోటి మూడత్వాన్ని ఖండించెంత మానవతా, దయార్ధ్రత ఉన్నాయి. మనదేశంలోని జనుల విశ్వాసాన్ని మన మహానదులతో పోల్చవచ్చు. నదులు పొంగి గట్లు దాటి పోర్లితాయి. పల్లె పట్టులను ముంచి ప్రాణాలను మింగేస్తాయి. పంటపోలాలను జలార్ణవం చేసి నాశనం చేస్తాయి. ఈవిధంగా సంపన్నమైన జాలం నేలపాలు అవుతుంటే వందలకొద్దీ ఎకరాల్లోని పంట నీటికోసం పరితపించి పాడైపోతుంది. ఈ నదులకు కట్టలు కట్టి సదుపయాగానికి తెస్తే ఇందులోంచి శక్తి ఉర్పన్నం అయి దేశ సంపద పెంచుతుంది. అదే విధంగా జనులకున్న విశ్వాసం మనకున్న మహత్తరమైన శక్తి. దాన్ని సరియైన మర్గాన పెట్టగలుగుతే బ్రహ్మాండమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ మహత్తరమైన శక్తికి ఆనకట్ట కట్టిన్నాడు ఈ శక్తి దేశ కళ్యాణానికి తోడ్పడుతుంది!
ఇలాంటి ఉన్నత భావాలు కలవాడు దేవాలయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు!
కాలూ నిట్టూర్చాడు. బిటేన్ ఆత్మశక్తిలో ఆవగింజతైనా అతనికి లేదు. అతడు అంత శక్తి ఎలా సాధించాడో? తానూ స్వయంగా శక్తి హీనుడు. పైగా చంద్రలేఖను గురించి ఆలోచించాల్సిన భారం కూడా తన మీదనే పడింది. ఆమెకు పెళ్ళి చేయకుండానే తెల్లారే వరకే తాను చనిపోతే ఆమె గతి ఏం కాను?
కాలూ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఉన్న విషయాలన్నీ లేఖకు వివరించి నచ్చచెప్పడం కంటే గత్యంతరం లేదు.
సాయంకాలపు భోజనం అయింది. లేఖ పుస్తకం చేత్తో పట్టుకొని బాల్కనీ మీదికి వచ్చింది. కాలూ సూటిగా అన్నీ చెప్పేశాడు.
"లేఖా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. పెళ్ళి కాని పిల్ల కొత్త మగవానితో తిరగడం బావుండదు చూడు."
లేఖ నివ్వెర పోయి "కొత్తవారూ?" అన్నది.
కాలూ కాస్త వెనకా ముందాడాడు.
"నీ మంచికే చెపుతున్నా, చంద్రలేఖా, అర్ధం చేసుకో."
'అసలు నువ్వనేదేమిటి?"
"వీధుల్లో బిటేన్ తో తిరక్కు."
"బాబా, ఏమిటది?" ఆమె తెల్లబోయింది.
"వెధవ పుకార్లు వ్యాపిస్తున్నాయి."
ఆమె ముఖంలోని నెత్తురు చచ్చింది.





