Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                     జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

                                         పదిహేడవ అధ్యాయము

1.    అశ్మన్నూర్జం పర్వతే శిశ్రియాణామద్భ్య ఓషధీభ్యో వనస్పతిభ్య్కోఅధి సంభృతం పయః|
    తాంనఇషమూర్జం ధత్తమరుతః సం రరాణా ఆశ్మంస్తే క్షుణ్మయి త్కఊర్గ్యం
    ద్విష్మస్తం తేశుగృచ్ఛతు||

    (నిండు కుండలోని నీటిని వేదికి నలువైపుల చల్లవలెను.)

    మరుత్తులారా! సారవంతమగు వృష్టి పర్వతములను ఆశ్రయించి ఉండును. వృష్టి వలన వనస్పతులు, ఓషధులు వర్ధిల్లును. వానిని గోవులు మేయుట వలన కలుగు దుగ్ధాదులను మాకు ప్రసాదించండి. మీరు ఉదారులగు దాతలు. మాకు వర్షమును, బల స్వరూపములగు ఘృతాదులను ప్రసాదించండి.

    అగ్నీ! మా హవి ఆరగించుటకు నీకు ఎంతో ఆకలి కావలెను. నీ తేజము నాలో ప్రవేశించవలెను. మమ్ము  ద్వేషించువారికి నీ మంటలు తాకవలెను.

    (కడవను బయట ఉంచవలెను)

    2. అగ్నీ! ఈ ఇటుకలు మాకు కామధేనువులు అగును గాత. అవి ఒకటికి పది - పదికి వంద - వందకు వేయి వేయికి ఆయుతము, ఆయుతమునకు నియుతము, నియుతమునకు ప్రయుతము, ప్రయుతమునకు అర్బుదము, అర్బుదము సముద్రము, మధ్యము, అంతము, పరార్థములై నీ కృప వలన నాకు ఇహ పరలోకములండు కామధేనువులు అగును గాత.

    3. ఇష్టకలారా! మీరు వసంతాది ఋతుస్వరూపలు. యజ్ఞమును వర్ధిల్లచేయువారు. విశేష ఋతు యజ్ఞమున స్థిరపడువారు. ఘృతమును కరిగించువారు. మధువును సేవించువారు. విరాజ నామకములు - అక్షయ లోకమాతృణ్ణ ఇష్టకలగు మీరు సాక్షాత్తు కామధేనువులు.

    4. (మండూకము - శేవల, వేంత శాఖలను  వెదురు బొంగుకు కట్టి వేడి మీద దక్షిణ దిశన ప్రారంభించి లాగవలెను.)

    అగ్నీ! మేము నిన్ను నీటి శేవలమున చుట్టుదుము. నీవు మా విషయమున ఉదారుడవు. శాంతుడవు అగుము.

    5. అగ్నీ! మేము మంచువంటి శేవలమున నిన్ను చుట్టుదుము. నీవు మావిషయమున ఉదారుడవు, శాంతుడవు అగుము.

    6. అగ్నీ! నీవు నేలమీద - వేంతశాఖ యందు - నదులందలి శీతల శేవలములకు దిగిరమ్ము. నీవు జలములకు వెలుగువుకదా!

    మండూకమా! నీవు ఈ శేవల, వేంత సహితుడవై మాకు లభింపుము. నీవు మాయజ్ఞమును అగ్నివంటి తేజస్విగను - శాంతమును చేయుము.

    7. ఇది జలములు నిండిన స్థానము. సముద్రపు మహాస్థలము. అగ్నీ! ఇక నీ జ్వాలలు మమ్ము కాక ఇతరులను  కాల్చవలెను. నీవు మా విషయమున మాత్రము నిత్యము శాంతుడవగుము.

    8. శోధక అగ్నీ! నీయొక్క మందజ్వాలా జిహ్వలతో మమ్ము చేరుకొనుము. ఈ యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించుము. వారిని పూజింపుము.
   
    9. దేదీప్యమానశోధక అగ్నీ! నీవు దేవతలను ఇచటికి కొనిరమ్ము. వారికి మా హవిని అందించుము.

    10. అగ్ని తన ప్రకాశవంత, చైతన్యకారక దీప్తిచే - ఉషః కాలము తనదీప్తిచే వలె శోభిల్లును. అగ్ని  అశ్వయుద్ధమున శత్రువులను హింసించుచు మహాజ్వాలలచే మహాజ్వాలలచే అజరుడగును నిత్యయౌవనుడగును. మేము  అట్టి అగ్నిని మండూక, శేవల, వేంతసములచే ప్రశమింపచేయుదుము.

    11. హరించు అగ్నికి నమస్కారము. శోషింపచేయు అగ్నికి నమస్కారము. అర్చిష అగ్నికి నమస్కారము. నీ జ్వాలాతోరణములు మమ్ము కాక ఇతరులను తపింపచేయును గాత. మాకు  మాత్రము కళ్యాణకారివి అగుము.

    (బంగారు ముక్క సహితముగా ఘృతము నిండిన స్రువము దధి, మధు, కుశముష్టి యుక్త పాత్రను పట్టుకొని అధ్వర్యుచితాగ్నిని చేరవలెను)

    12. (స్వయమాతృణ్ణ ఇటుకల మీద  అయిదు ఆహుతులు అర్పించవలెను)

    జఠరాగ్ని రూపమున మానవులందు ఉండునట్లు అగ్నికి ఇది పరోక్ష ఆహుతి. జలములందు ఔర్వాగ్ని రూపమున ఉన్న అగ్నికి ఇది పరోక్ష ఆహుతి. ఆహవనీయాది భావమున కుశల యందున్న అగ్నికి ఇది పరోక్ష ఆహుతి. వృక్షములందు దావాగ్ని రూపమున ఉన్న అగ్నికి ఇది పరోక్ష ఆహుతి. స్వర్గమందు ఆదిత్యరూపమున విరాజిల్లు అగ్నికి ఇది పరోక్ష ఆహుతి.

    13. (పాత్రయందలి ఘృతబిందువులను కుశలచే తుడువవలెను)

    దేవతలందు యజనయోగ్యులు ఉన్నారు. యజనయోగ్యులందు పరిపక్వ అన్నాది భాగములు అందుకొనువారున్నారు. అట్టిప్రాణాది దేవతలు పత్యక్షరూపులై ఈ యజ్ఞమున ఘృతములు ఆరగించవలెను.

    14. ఏ ప్రాణాది దేవతలు ఇంద్రాదుల శరీరములందు ప్రవేశించు దేవత్వమునొందినారో, ఎవరు జీవితమునకు అగ్రగాములు అగుదురో, ఎవరు లేకున్న శరీరచలనము సాగాదో, అట్టి ప్రాణాది దేవతలు ద్యులోకమున ఉండరు. భూలోకమున ఉండరు. వారు ముక్కు, కన్నులు మున్నగు అవయవములందు వసింతురు.

    15. అగ్నీ! ప్రాణ, అపాన, వ్యాన బ్రహ్మవర్చస్సులనిచ్చు నీజ్వాలలు మాకు శాంతములగును గాత. అవి ఇతరులను కాల్చును గాత. శోధక అగ్నీ! మాకు నీవు శాంతమూర్తివి అగుము.

    16. (యజ్ఞశాల ద్వార మందున్న అగ్నికి ఆహుతులీయవలెను)

    భక్షక రాక్షసులనందరను అగ్ని తన తీవ్రతేజమున పారద్రోలవలెను. అగ్ని మాకు ధనము నీయవలెను. "అగ్నిర్నో వనతేరయిమ్"

    17. (పంచమందలి ఘృతముచే హొమము అయిన తరువాత షోడశమందున్న ఘృతమునందలి అర్ధభాగముచే యజ్ఞశాల ద్వారామందలి అగ్నికి ఆహుతులు అర్పించవలెను)

    విశ్వకర్మ - ఆదిఋషి - సృష్టియజ్ఞపు హొత - మా పితరులు వీరినందరిని విలయము చేసిన వాడె విశ్వసృష్టిరూప సంపదను కోరి సృష్టిరూపమున ఈ బ్రహ్మాండమును ఏర్పరచును. అతడు సృష్టిచేసి సృష్టియందలి భూతజాతములందు ప్రవేశించును.

    18. బ్రహ్మండమును సృష్టించనపుడు విశ్వకర్మ నిలిచినా స్థానమెయ్యది? అతని క్రియ ఏమి? అతని ఉపకరణములేవి? సర్వద్రష్టవిశ్వకర్మ తన మహిమచే భూలోకమును సృష్టించి దానికి ద్యులోకపు ఆచ్ఛదన ఏర్పరచినప్పటి స్థితిఏమి?

    19. విశ్వకర్మ విశ్వచక్షువు. విశ్వతోముఖుడు. విశ్వతో బాహువు. విశ్వపాత్తు. అతడు ఒక్కడే తనబాహువులచే భూలోక ద్యులోకములను సృష్టించినాడు. అతనికి బాహ్య ఉపకరణములతో పనిపడలేదు.

    20. విశ్వకర్మ ద్యావాపృథ్వులను నిర్మించుటకు ఉపయోగపడిన అరణ్యము ఏది? వృక్షము ఏది? విద్వాంసులారా! భువనములను సృష్టించినవాడు ఎచట నిలిచి సృష్టించినాడని మనసున ఆలోచించండి.

    (జగదాధారునకు ఆధారము అవసరమా అని)

    21. విశ్వకర్మా! నీకు ఉత్తమ, మధ్యమ, అపర తేజస్సులున్నవి. వానిని నీ మిత్రుడగు యజమానికి ప్రసాదించుము. ఏలననగా ఆయజమానులు సమర్పించిన హవిస్సుల వలననే నీవు అన్నవంతుడవగుచున్నావు. నీవు విశ్వాకర్మవు. విశ్వరూపవు. ఈ యజ్ఞమున నిన్ను వర్థిల్లచేసికొనుము. నీ యజనము నీవే చేసికొనుము.

    (నీ యజ్ఞము చేయగల సమర్థుడు లేడుకదాఅని)

    22. విశ్వకర్మా! హవిస్సులచే వర్థిల్లుము. నీవు స్వయముగా ద్యులోక, భూలోక భూతముల యజనము చేయుము. నీవు ఆ  విధముగా చేయుటను చూచి మాశత్రువులు నివ్వెరపోవుదురు. ఈ యజ్ఞమున ఇంద్రుదే మాకు ఉపదేశకుడు అగును గాత.

    23. విశ్వకర్మ వేదవాణి పాలకుడు. విశ్వవిధాత. మనో వేగవంతుడు. నేడు మేము మా రక్షణకు గాను విశ్వకర్మను ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. రక్షించుటలో అత్యంత నైపుణ్యము కలవాడును అందరకు శుభములు కలిగించువాడును అగు విశ్వకర్మ మేము సమర్పించు సకల సామగ్రిని ఆస్వాదించవలెను.

    24. విశ్వకర్మ! హవిద్వారా వర్ధిల్లిన నీవు ఇంద్రుని అవధ్యుని చేసినావు. అందువలన సకల యుద్ధములకు ఇంద్రుడు ఆహ్వానించబడువాడు అయినాడు. ఆ ఇంద్రుని యందు పూర్వ ప్రజలందరు తలలు వంచినారు.

    25. విశ్వకర్మ చక్షుషః పితా మనసాహిధీరో - చక్షుపాలకుడు. మనోధీరుడు. చంచలములగు ద్యావాపృథ్వులను దృఢపరచుటకు అతడు జలమును సృష్టించినాడు.

    పూర్వ ఋషులగు వసిష్ఠాదులు ద్యావాపృథ్వులను దృఢపరచగా విశ్వకర్మ వానిని విస్తరింప చేసినాడు.

    26. విశ్వకర్మ విశిష్టమనస్కుడు. వ్యాపకుడు. ధారణకర్త. పరమద్రష్ట. భక్తులను అనుగ్రహించువాడు. అతని భక్తుల కొరకు అభిమతపదార్థములు - సప్తర్షులు విశ్వకర్మతో ఏకత్వము పొందినచోట- అమృతరసమున రుచికరములగును.

    27. అతడు మనపాలకుడు. ఉత్పాదకుడు. విధాత. సమస్తలోకజ్ఞాత. అతడు ఒక్కడే సమస్తదేవతల పేర్లు గలవాడు. ప్రశ్నవ్యుడు. అంత్యకాలమున అన్నిభూతములు అతని యందే చేరుచున్నవి.

    28. వసిష్ఠాదులు పదిహేడు అవయవముల లింగశరీరమున ప్రేరితులై, విస్తీర్ణ అంతరిక్షమున నిలిచి, ఈ సమస్త భూతములను ఉత్పన్నము  చేసినారు. పూర్వకాలమందు వసిష్ఠాది సప్తర్షులు ప్రథమస్తోతలు అయినారు. వారు విశ్వకర్మ సృష్టించిన బ్రహ్మాండరూపజలమును యజించినారు.

    29. దివికి పరము, పృథ్వికి పరము,  దేవాసురులకు పరమైనది ఏది? పూర్వము దేవగణములు దర్శించిన మహాజలమును గర్భమున దాల్చినది ఎవరు?

    30. ఆ జలమే విశ్వకర్మను తొలిసారిగా గర్భమున దాల్చినది. అందునుండియేసమస్త దేవతలు అవతరించినారు. పుట్టుక లేని - అజస్య - అతని యందు అంత్యకాలమున సమస్త భూతములు చేరినవి. అతని నాభినుండియే సకల దేవతలు, భూతములు వెడలినవి.

    31. జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలిసికొనరు. తమలోనే ఉన్న అతనిని కానలేరు. వారిని మాయ మంచు వలె ఆవరించి ఉన్నది. అది అజ్ఞానము. అందువలన వారు తమను మాత్రము ఎరుగుచున్నారు. యజ్ఞయాగాదులు చేయుచు ఇహ, పర భోగములందు తృప్తి చెందుచున్నారు.

    32. విశ్వమునందు సర్వప్రథమముగా విశ్వకర్మయే ఆవిర్భవించినాడు. రెండవవారుగా గంధర్వులు, మూడవ వారుగా ఓషధులు వానిని పోషించు పర్జన్యుడు అవతరించినారు. పర్జన్యుడు వివిధ జలములను తన గర్భమున దాల్చినాడు.

    వైశ్వకర్మణహొమః సమాస్తః
    విశ్వకర్మహొమము సమాప్తము.

    33. (ఈ 12మంత్రములు జపించుచు బ్రహ్మ యజ్ఞశాల యొక్క దక్షిణదిశకు సాగవలెను)

    ఇంద్రుడు శీఘ్రగామి. తన వజ్రమునకు పదును పెట్టుకొనువాడు. ఆబోతు వంటి భయంకరుడు. శత్రుఘాతకుడు. శత్రువులను అల్లకల్లోలము చేయువాడు. నినదించువాడు. రెప్పవాల్చనివాడు. ఎంతో వీరుడు. తాను ఒక్కడే నూరింతల శత్రుసేనలను గెలుచువాడు.

    34. ఇంద్రుడు కేకవేయువాడు. అనిమేషుడు. జయశీలుడు. యుద్ధకారి. అజేయుడు. ప్రగల్భుడు. నిర్భయుడు. బాణహస్తుడు. వరదుడు. జనులారా! ఇంద్రుని ద్వారా మీ శత్రువుల తలలు వంచండి.

    35. ఇంద్రుడు యుద్ధకారి. బాణహస్తుడు. కరవాలధారులగు మరుద్గణములతో కలసి శత్రుమాత్రులను వశపరచుకొనును. ఇంద్రుడు తుముల యుద్ధవిజేత. సోమపాయి. తన బాహువులచే శత్రువును హింసించువాడు. ఉగ్రధన్వి. బాణవర్షము కురిపించువాడు.

    36. బృహస్పతీ! నీవు రథమును అధిరోహించుము. సర్వత్ర సంచరించుము.

    ఇంద్రా! నీవు రాక్షసనాశకుడవు. శత్రువధశాలివి. శత్రుసేనా భంగకుడవు. సంహారకుడవు. యుద్ధములందు శత్రుపరాజయకర్తవు. నీవు మా రథములను రక్షింపుము.

    37. ఇంద్రా! నీవు శత్రుబల జ్ఞాతవు. చిరంతనుడవు. ప్రకృష్టవీరుడవు. బలశాలివి. అన్నవంతుడవు. శత్రుసంహారకుడవు. ఉగ్రుడవు. వీరపరివేష్ఠుడవు. సేవకులు చుట్టున్నవాడవు. బలోత్పన్నుడవు. స్తుతివాణిజ్ఞాతవు.

    ఇంద్రా! నీవు జయశీల రథమునధిరోహించుము.

    38. ఇంద్రుడు పణుల కొట్టములను కొట్టినవాడు. స్తుతులను గ్రహించువాడు. వజ్రబహువు. యుద్ధవిద్యను ఎరిగిన వాడు. స్వబలమున పగతురను విరుచువాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.