Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    10. ఇంద్ర, వరుణ, ఆర్యమలు, మాకు ప్రకాశమాన ధనమును, మహా విస్తీర్ణ గృహమును ప్రసాదించవలెను. యజ్ఞవర్థిక అదితి తేజము మమ్ము బాధించరాదు. మేము సవితృ దేవుని స్తుతింతుము.


                                       ఎనుబది మూడవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు దేవత - ఇంద్రావరుణులు, ఛందస్సు - జగతి.

    1. నేతలగు మిత్రావరుణులారా ! యజమానులు మీ సఖ్యత చూచినారు. తమకు గోప్రాప్తి కలుగుటకు కొడవలిచేతబట్టి తూర్పుదిక్కునుసాగినారు. మీరు దాసులను, సుదాస శత్రువులైన ఆర్యులను వధించండి. సుదాసునకు రక్షణ కల్పించుటకు విచ్చేయండి.

    2. మానవులు ధ్వజములెత్తి యుద్ధమునకు కలిసినచోట యుద్ధమున ఏ మాత్రము అనుకూలించనప్పుడు ప్రాణులు స్వర్గము చేరునప్పుడు అదిగో అట్టి యుద్ధమున ఇంద్రావరుణులారా ! మా పక్షము వహించండి.

    3. ఇంద్రావరుణులారా ! విపత్తు విరుచుకుపడినది. భూమిమీది అన్నములన్నింటిని సైనికులు నష్టపరచినట్లున్నారు. సైనికుల కోలాహలము స్వర్గమునంటుచున్నది. నా సేనల శత్రువులందరు నన్ను సమీపించినారు. హనన శ్రవణకారి ఇంద్రావరుణులారా! రక్షణలు వెంటబెట్టుకొని మావద్దకు విచ్చేయండి.

    4. ఇంద్రావరుణులారా ! ఆయుధమునకు అందని భేదనామక శత్రువును వధించినారు. సుదారాజును రక్షించినారు. తృత్సుల స్తోత్రములను విన్నారు. యుద్ధకాలమున తృత్సుల పౌరో హిత్యమును ఫలింప చేసినారు.

    5. ఇంద్రావరుణులారా ! శత్రువులు ఆయుధ సహితులై నన్ను చుట్టుముట్టినారు. హింసకుల నడుమ శత్రువులు నన్ను హింసించుచున్నారు. మీరు ఉభయ ధనములకు అధిపతులు. కావున యుద్ధమున వీరిద్దరు మమ్ము రక్షించండి.

    6. ఇంద్రావరుణులారా ! యుద్ధ సమయమున ఉభయులు సుదాస తృత్సులు - ధనప్రాప్తికిగాను మిమ్ము పిలుస్తారు. ఈ యుద్ధమున పదిమంది రాజులతో పీడింపబడిన సుదాసుని తృత్సుల సహితముగా మీరు రక్షించినారు.

    7. ఇంద్రావరుణులారా ! యజ్ఞ హీనులగు పదిమంది రాజులు ఏకమైనారు. అయినను సుదాసుని దెబ్బకొట్టలేక పోయినారు. హవ్యయుక్త యజ్ఞమున నేతల స్తోత్రములు ఫలించినవి. ఈ యజ్ఞమున సమస్త దేవతలు అవతరించినారు.

    8. తృత్సులు వసిష్ఠశిష్యులు. వారు నిర్మలులు. జటీవంతులు. కర్మదులు. వారు ఏ దేశమున స్తుతులతో సేవించినారో, ఆ దేశముననే పదిమంది రాజులు చుట్టుముట్టిన సుదాసునకు మిత్రావరుణు లారా ! మీరు బలము ప్రసాదించినారు.

    9. ఇంద్రావరుణులారా ! మీలో ఒకరు ఇంద్రుడు వృత్రులను నాశము చేయును. మరొకరు వ్రతములు కర్మలను రక్షించును. అందమైన స్తుతులో పిలచెదము. మాకు సుఖములు ప్రసాదించండి. "శర్మం యచ్ఛతమ్"

    10. ఇంద్ర, వరుణ, ఆర్యమలు మాకు ప్రకాశవంతమగు ధనమును మహా విస్తీర్ణ గృహమును ప్రసాదించవలెను. యజ్ఞవర్థక అదితి తేజము మమ్ము బాధించరాదు. మేము సవితృ దేవుని స్తుతింతుము.   


                                    ఎనుబది నాలుగవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు దేవత - ఇంద్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రావరుణులారా ! మీరు సామ్రాట్టులు. నేను ఈ యజ్ఞమునుకు మిమ్ము హవ్యము, స్తోత్రములతో ఆహ్వానించుచున్నాను. చేతులందు గల నానారూపముల జుహువులు స్వయముగా మీవైపే చూచుచున్నది.

    2. ఇంద్రావరుణులారా ! మీది స్వర్గరూపము. విశాల దేశము. మీరు వర్షము కలిగింతురు. హర్షము కలిగింతురు. పాశము లేకుండనే బాధించు ఉపాయములతో పాపిని బిగించండి. వరుణుని క్రోధము మమ్ము రక్షించి దాటవలెను. ఇంద్రుడు స్థానమును విస్తరించవలెను.

    3. ఇంద్రావరుణులారా ! మా గృహమందలి యజ్ఞమును రమణీయము చేయండి. స్తోతల స్తోత్రములు ఉత్తమములు చేయండి. దేవతలంపిన ధనము మమ్ము చేరవలెను. అభిలషణీయ రక్షణలతో మమ్ము వర్థిల్లచేయండి.

    4. ఇంద్రావరుణులారా ! అందరు కోరుకొను నివాస స్థానమును అన్నవంత ధనమును అందించండి. ఆదిత్యుడు వరుణుడు అసత్యమును నాశనము చేయువాడు. అతడే వీరులకు అపరిమిత ధనము ఇచ్చును.

    5. ఇది నా స్తుతి. ఇది ఇంద్రుని, వరుణుని వ్యాప్తము చేయవలెను. నేను ఉచ్చరించు ఈ స్తుతి పుత్రపౌత్రాదులను ఇవ్వవలెను. రక్షించవలెను. మేము సుందర రత్నవంతులమై యజ్ఞమును అందుకొందుము.


                                   ఎనుబది ఐదవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు దేవత - ఇంద్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రావరుణులారా ! మీ కొఱకు సోమమును అగ్నికి ఆహుతి ఇచ్చుచున్నాను. దీప్తవతి ఉషవలె దీప్తాంకము, రాక్షస శూన్యమగు స్తుతి రచించుచున్నాను. యుద్ధము సంభవించినప్పుడు మీరు ప్రయాణము చేయుచు మమ్ము రక్షించండి.

    2. పరస్పర స్పర్థగల యుద్ధమున శత్రువు మాతో స్పర్థించును. యుద్ధములందు ధ్వజముమీద ఆయుధములు పడును. అట్టి తరి మిత్రావరుణులారా ! మీ ఆయుధములతో వివిధ గతులుగల శత్రువును నాశము చేయండి.

    3. సోమములన్నియు స్వాయత్త యశోవంతములు ద్యుతిమంతములు. అవి గ్రహములందు ఇంద్రావరుణులకొరకు నిలుచును. వారిలో వరుణుడు ప్రజాగణములను వేరువేరుగా పాలించును. ఇంద్రుడు ఇతరులు గెలువరాని శత్రువును నాశము చేయును.

    4. అదితి పుత్రులారా ! మీరు బలశాలురు. మీకు నమస్కరించి మిమ్ము సేవించువాడే శోభన కర్మవంతుడు, యజ్ఞజ్ఞాత అగును. ఏ హవ్యవంతుడు మిమ్ము తృప్తులను చేయుటకు ఆహ్వానించునో వాడు అన్నవంతుడగును. అందవలసిన ఫలమును అందుకొనును.

    5. ఇది నా స్తుతి. ఇది ఇంద్రుని వరుణుని వ్యాప్తము చేయవలెను. నేను ఉచ్చరించు ఈ స్తుతి పుత్ర, పౌత్రాదులను ఇవ్వవలెను. రక్షించవలెను. మేము సుందర రత్నవంతులమై యజ్ఞమును అందుకుందుము.


                                   ఎనుబది ఆరవ సూక్తము

                  ఋషి - వసిష్ఠుడు దేవత - వరుణుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వరుణుని జన్మ ధీరము స్థిరము మహిమాన్వితము. అతడు విశాల ద్యావాపృథ్వులను స్థాపించి నిలిపినాడు. అతడు ఆకాశమున సూర్యుని, దర్శనీయ నక్షత్రములను ద్విధా కల్పించినాడు. అతడు భూమిని విస్తరింపచేసినాడు.

    (పగలు సూర్యుని, రాత్రి నక్షత్రములను కల్పించినందున "ద్వితా ద్విధా" అయినది)

    2. వరుణుని దర్శించుటకు ఆతురుడైన ఋషి అనుచున్నాడు. నేను ఈ దేహముండగా వరుణునితో ఉండగలవా? వరుణుని వద్ద ఎప్పుడు నిలువగలను? వరుణుడు క్రోధరహితుడై నా హవ్యము స్వీకరించగలడా? నేను సుమనస్కుడనై ఎన్నడు వరుణుని దర్శించగలను?

    (ఉండుట నిలుచుట హవ్యస్వీకారము కనీస దర్శనము అవరోహణక్రమము ఆదర్శము నుండి వాస్తవమునకు)

    3. వరుణా ! నిన్ను చూడదలచినాను. ఒక పాపపుమాట అడగదలచినాను. నేను అనేక ప్రశ్నలతో విద్వాంసులను దర్శించినాను. వారందరు ముక్తకంఠమున వరుణుడు "నీ విషయమున కోపము వహించినాడు" అన్నారు.

    (వరుణుని వినా జ్ఞానము కలుగదని భావము కోపము విడిచి ఉపదేశించుమని ప్రార్థన)

    4. వరుణా ! నేను చేసిన అపరాధమేమి? ఎందుకు స్తోత అగు మా మిత్రుని కొట్ట దలిచినావు? వరుణా ! నీ తేజస్సు దుర్ధర్షము. నీవు ఏల పలుకవు? నీవు పలికిన నేను త్వరపడి, నమస్కరించి, ప్రాయశ్చిత్తము చేసికొని నీవద్దకు వత్తునుకదా !

    5. వరుణా ! మమ్ము పితృ క్రమాగత ద్రోహమునుండి విడిపించుము. మా జీవిత కాలమున మేము చేసినదానినుండి విడిపించుము. దొంగ పశువును దొంగిలించును. అందుకు ప్రాయశ్చిత్తముగా దానికి గడ్డి మేపును. ఆ దొంగనువలెను పలుపుకట్టిన దూడవలెను నన్ను వసిష్ఠుని విడిపించుము.

    (వసిష్ఠుని పూర్వులు ద్రోహము చేసినారనికాదు. ఆతురతలలో అతడు అన్నింటినుంచి విముక్తుని చేయమని ప్రార్థించినాడు)

                            పాపమును వివరించుచున్నాడు :-

    6. వరుణా ! పాపము మానవ దోషమున కలుగదు. అది సుర, భ్రమ, క్రోధము, జూదము, అజ్ఞానము మున్నగు దైవగతి కారణముగ జరుగును. చిన్నవానిని పెద్దవాడు తప్పుదారి పట్టించును. స్వప్నమందును దైవగతిలో పాపము కలుగును.

    7. వరుణుడు కామవర్షి. పాలకుడు. నేను పాపశూన్యుడనగుదును. దాసునివలె వరుణుని అతడుకోరినరీతి పూజింతును. మేము అజ్ఞానులము. వరుణస్వామి మాకు జ్ఞానము ప్రసాదించవలెను, జ్ఞానివరుణుడు స్తోతకు ధన విషయక ప్రేరణ కలిగించవలెను.

    8. అన్నవంతవరుణా ! ఈ సూక్తరూప స్తోత్రము నీ కొఱకు రచించినాను. దీనిని నీవు హృదయమున పదిలపరుచుకొనుము. మాకు లాభము మంగళమయము కావలెను. క్షేమము మంగళమయము కావలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"

    ఆలోచనామృతము

    ఈ సూక్తము పాపము జ్ఞానమును గురించి చెప్పబడినది. అతడు వసిష్ఠుడే కావచ్చును. వేరెవ్వరయిన కావచ్చును. పాపములనుండి విముక్తికి తపించినాడు. మొర పెట్టుకున్నాడు. ప్రార్థించినాడు. అర్థించినాడు. తుదకు పాపము తన దోషము కాదని తేల్చిచెప్పినాడు. ఇందలి ఆరవ మంత్రమును పరిశీలించవలసి ఉన్నది.   

    నసస్వోదక్షో వరుణధృతిః సాసురా మన్యుర్వీభీదకో అచిత్తః
    అస్తిజ్యాయాన్కనీయః ఉపారేస్వప్నే దనృతస్య ప్రయోతా!

    పాపము మానవ దోషముకాదు అనుచున్నాడు. అది అతని అధీనములేదు అనుచు స్వప్నపు ఉదాహరణ ఇచ్చినాడు. స్వప్నము మానవుని అధీనమునలేదుకదా ! అది పాపమేల కావలెను అని ప్రశ్న?

    "నసో దక్షో" పురుష బలము పాపవృత్తికి కారణముకాదు. కాకున్న ఎవరు కారణము?

    "ధృతిః" కాలము దైవగతి కారణములు. అదెట్లనగా

    సుర, భ్రమ, క్రోధము, జూదము, అజ్ఞానము పాపమునకు కారణములు. ఇది నిత్య సత్యము. నిశ్చితము. ఈ దుర్గుణము దైవకృతములగునా?

    మనిషి స్వాధీనమున లేనిదానిని దైవ కృతము అందుము. కామక్రోధాది అరిషడ్వర్గములను మానవుడు తన ఆధీనము ఉంచుకొనవలెనని అనంతరకాలమున గీతాకారుడగు కృష్ణపరమాత్మ ప్రబోధించినాడు. అది ఆదర్శము. అసాధ్యముకాదు. కాని దుస్సాధ్యము. అందరకు సాధ్యమనగునదికాదు.

    కావున తాను చేసిన పనికి దైవమును బాధ్యుని చేయుట సమంజసమగునా? కాకపోవచ్చును. కాని ఒక్కొక్కసారి తన పరిధిని దాటిపోయినపుడు దైవ కృతములు కావచ్చును.

    రామాయణమున రాముని "విగ్రహవాన్ ధర్మం" అన్నాడు. అతడు ధర్మస్వరూపుడని అర్థము. అరణ్యమున సీత మాయలేడిని కోరినది. అది ఆమె భ్రమ. ఆభ్రమ రామునకు ఉండరాదు. పైగా లక్ష్మణుడు హెచ్చరించినాడు. అతడు మారీచుడు మాయలేడికాదని. అయినను రాముడు మాయలేడిని వెన్నాడినాడు ఫలితము అనుభవించినాడు.

    ఇది దైవ కృతముకాదా? మానవుడు నివారించగలడా?

    మహాభారతమున ధర్మరాజు ధర్మస్వరూపుడు. అతనికి జూదము పాపమని తెలియదా? విదురాదులు వివరింపలేదా? మిన్నకున్నాడా? ఆడినాడు. ఓడినాడు. తొలి జూదమున ద్రౌపది అతనికి రాజ్యము ఇప్పించినది. మరల జూదమునకు పిలిచిన ఊరకున్నాడా? ఓడినాడు. అడవుల పాలయినాడు.

    ఇది దైవకృతముకాదా? మానవుడు నివారించగలడా?

    ఈ మధ్య జరిగిన రెండు ప్రపంచ సంగ్రామములు ఎవరుకోరి తెచ్చుకున్నార




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.