Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


 

    శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న వసుదేవాది యాదవులతో ఇంద్రప్రస్తమునకు వచ్చినాడు. వారు సుభద్రార్జునులకు అనేక బహుమానములు ఇచ్చినారు. యాదవులు వచ్చిన సందర్భమున ఏడు రోజులు ఉత్సవములు జరిగినవి. యాదవులందరు ద్వారకకు వెళ్ళినారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థముననే ఉన్నాడు.
    కొంతకాలమునకు సుభాద్రార్జునులకు అభిమన్యుడు కలిగినాడు. అభిమన్యుడు బలపరాక్రమములు కలవాడు. అరిభయంకరుడు. అతడు దౌమ్యుని వద్ద వేదశాస్త్రములు చదివినాడు.
    అంతట ద్రౌపదికి అయిదుగురు భర్తల వలన అయిదుగురు పుత్రులు కలిగినారు. వారు ధర్మరాజు వలన ప్రతివింద్యుడు, భీముని వలన కలిగినవాడు శ్రుతసోముడు, అర్జునుని వలన కలిగినవాడు శ్రుతకీర్తి, నకులుని వలన కలిగినవాడు శతానీకుడు, సహదేవుని వలన కలిగినవాడు శ్రుతసేనుడు.
    అందరు ఇంద్రప్రస్థమున సుఖముగా ఉన్నారు.

                                                       ఆలోచనామృతము

1. ద్రౌపది విషయమున పాండవులలో విభేదములు కల్పించతలపెట్టినాడు దుర్యోధనుడు. దానికి విరుగుడు కనిపెట్టినాడు శ్రీకృష్ణుడు. ఎంతో అలోచించి నిర్ణయించిన దానిని నారదునితో చెప్పించినాడు.
    పాండవులలో ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క సంవత్సరము ద్రౌపది ఉండును. సంవత్సరమెందులకు? ఈలోన ఆమె గర్బవతి అయిన ప్రసవించును. కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకొనవచ్చును. ఆ సంవత్సర పర్యంతము ఆమెను ఎవరును చూడరాదు. చూచిన మనసు చలించవచ్చును. సంభోగము కావచ్చును. మగడు అడిగిన ఆమె కాదనలేదు. అట్లు తొందరపడినవాడు అక్కడ ఉండరాదు. యాత్రలు చేయవలెను. ఇన్ని విషయములను దృష్టిలో ఉంచుకొని సంవత్సర నియమము ఏర్పరచినాడు.
2. ఉలూచి అర్జునుని ఎత్తుకొని పోయినది. మగవాడు ఆడదానిని ఎత్తుకొని పోవుట సామాన్యము. ఆమె ఎత్తుకొని పోయినది. కామము తీర్చుకున్నది. పంపించినది. అక్కడ తలిదండ్రుల ప్రసక్తి గాని, పోషకుల ప్రసక్తి గాని లేదు. ఆమె నాగ కన్యక. నాగులలో అట్టి అచారమున్నదేమో పరిశీలించవలసి ఉన్నది.
3. అర్జునుడు సేవించిన ప్రదేశములన్నియు నదులు, పర్వతములు, మాత్రమే. ఆలయముల ప్రసక్తి లేదు. రామాయాణమందును ఆలయముల ప్రసక్తి లేదు. అప్పటికి విగ్రహారాదన ఏర్పడినట్లు లేదు. అది ఎప్పుడు ప్రారంభము అయినదో పరిశోధించవలసి ఉన్నది. ఏకలవ్యుడు విగ్రహారాధనకు అంకురము వేసినవాడు కావచ్చును.
    అర్జునుడు యాత్ర చేసిన మార్గము చిత్రముగ  ఉన్నది. అతడు సుమారు భారతదేశమంతయు పర్యటించినాడు. అతని మార్గమును గురించి పరిశీలించవలసి ఉన్నది.
    యాత్ర మనోవికాసమునకు ఉపకరించును అను సత్యమును ఆనాడు గ్రహించినారు. నేడు పర్యటన ప్రపంచమున ఒక గొప్ప వ్యాపారముగా నడుచుచున్నది.
4. పెద్దవానిని చిన్నపిల్లలు హేళన చేయుట, అపహాస్యము చేయుట తప్పు. అపచారము. యోగులను మహాత్ములను వేషమువలన కనుగొనలేము. యువతీయువకులు వేషము చూచి హేళన చేయుదురు. అట్టివారికి నంద కధ ఒక గుణ'
పాఠము. అట్లు చేసినవారు మొసళ్ళు అయినారు.
5. సుభద్ర పెళ్ళి ఒక రాజకీయ తంత్రము. తంత్రరచయిత శ్రీకృష్ణుడు. బలరామునకు ఈ పెళ్లి ఇష్టము ఉన్నట్లు కనిపించదు. అందుకు రెండు కారణములు కావచ్చును.
1. బలరాముడు కౌరవ పాండవులను సమభావమున చూడదలచినాడు. పక్షపాతము వహించదలచలేదు. ఈ పెండ్లి వలన పక్షపాతము కలుగును.
2. ద్రౌపదిని పంచ పాండవులు పెండ్లాడినారు అనునది సమాజమున వారికి తలవంపులు చేసినదేమో! సుభద్రను అట్టివారికే కట్టబెట్టుటకు బలరాముడు ఇష్టపడి ఉండడు.
సుభద్ర పెళ్ళి వలన శ్రీకృష్ణుని రాజకీయజ్ఞత వెల్లడి అయినది. అతడు ఈ పెండ్లి చేసి రెంటిని సాధించదలచినాడు.
1. బలరాముని పాండవులవైపు మళ్ళించుట. సోదరి శ్రేయస్సుకై బలరాముడు పాండవుల పక్షము అవలంబించక తప్పదు. సుభద్ర విషయమున శ్రీకృష్ణబలరాములకు యెనలేని ప్రేమ . అందుకు నిదర్శనము జగన్నాధాలయము. అక్కడి దేవుళ్ళు సుభద్రా బలరామకృష్ణులు.
2. పాండవులకు సమాజమున గౌరవము కలిగించుట. రాజులలో వారు రాణించుట.
3. సుభద్ర పెళ్ళికి గాను శ్రీకృష్ణుడు రచించిన వ్యూహము గొప్పది. మాయోపాయముతో అతడు ఒక మహాత్కార్యమును సాధించినాడు. రాజకీయమనిన మయోపాయమే కదా నేటికిని!
4. అర్జునుడు కించిత్తు కామాతురుడుగా కనిపించుచున్నాడు. ఆయుధము నెపము మాత్రమే. ద్రౌపది మీది మక్కువతో ఉరికినట్లున్నాడు.
    అర్జునుడు స్పురద్రూపి. ఉలూచికి అతని కనులలో కామము కనిపించియుండును. అది చూచి ఆమె వలచినది. ఎత్తుకొని పోయి కామము తీర్చుకున్నది.
    అర్జునుడు చిత్రాంగదను పురుషరూపమున చూచినాడు. అయినను ఆమెను స్త్రీగా, సొగసుకత్తేగా గ్రహించినాడు. అతనిది అంతశృంగార దృష్టి! చిత్రాంగదలో స్త్రీ సహజమయిన సౌకుమార్యము లేకుండునట్లు పెంచినాడు చిత్రవాహనుడు. ఆమెలో అనురాగమును పెంచినాడు. అర్జునుడు! ఆమెను ఆడదానిని చేసినాడు.
    మణిపురమున కన్యాశుల్కపు అచారమున్నట్లు కనిపించుచున్నది.
5. అర్జునుడు చేసిన యత్రలందును, వివాహములందును రాజకీయములున్నవి. యాత్రల వలన విజ్ఞానము పెరిగినది. వివాహముల వలన వివిధ జాతులతో సంబంధములు ఏర్పడినవి. నంద కధ వలన అతని సాహస గాధలు ప్రచారము అయినవి.
    ఈ యాత్ర సహితము శ్రీకృష్ణుని రచనగా తోచుచున్నది!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.