Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"ఆకలి బాధ అందరికీ సమానం గాదు. బాధకు తలొగ్గినవారు అన్నార్తులు. బాధను జయించినవారు సత్యాగ్రహులు. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు. దీనికి ఆత్మతో సంబంధం."
"స్త్రీలు కూడా నిరసన వ్రతం చేశారా?"
"వారూ అందరిలాంటి వారే. ఆ మాటకొస్తే మన స్వాతంత్య సంగ్రామంలో స్త్రీలు లేని పోరాటం అంటూ ఒకటి ఉందా? అని. "క్వింట్టిడియా " అనే ప్రతి పురుష కంఠం ప్రక్కా స్త్రీ నినాదం ఉంటూ ఉన్నది. మనకు విజయం తధ్యం అనేందుకు అదొక శుభ సూచకం. అందువల్లనే మనకు భవిష్యత్తు దేదీప్యమానంగా కనిపిస్తుంది."
ఆ తర్వాత కొంతసేపు ఆమె మాట్లాడలేదు. అతడు మౌనం వహించాడు. ఆమె తాను నేర్చుకున్న దాన్నంతా ముక్కలు ముక్కలుగా విభజిస్తుంది. "పోరాటం వాస్తవ మార్గం. పోరాటం మొట్టమొదట భయంతో పోరాటం" అని ఆమె గునిసింది.
అది విన్న బిటేన్ "ఆ అంతే" అన్నాడు.
ఒక్టార్ లోని మాన్యుమెంటు దగ్గరున్న పార్కు లో జరిగే బహిరంగ సభకు ఆమెను తీసికు వెళతా నన్నాడు ఒక ఆదివారపు ఉదయం.
ఆమె సిద్దం అయి అతని కోసం నిరీక్షించింది. అతడు వచ్చాడు. ఇద్దరూ రెండు ఫర్లాంగులు నడిచారు. గుంపుగుంపులుగా జనం కూడిన బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారు.
పార్కులో తండోపతండాలుగా జానం కూడారు. నేల ఈనినట్లుంది. వారు ఇంకాస్త దగ్గరికి వెళ్ళారు. సగర్వంగా ఎగురుతున్న పతాకాలు కనుపించాయి. అవే పదాలు, అవే నినాదాలు, ఇత్తడి పొన్నులు గల లాఠీల పోలీసులు మూగారు. ఎడం వైపు ఒక నూరు గజాల దూరంలో శ్వేత వస్త్రధారులైన ఆశ్వికులు ఉన్నారు. మెరిసే ఇత్తడి బొత్తాములు గల సార్జెంట్లు బెల్టులలో పిస్తోళ్ళు దోపుకొని నిల్చి ఉన్నారు.
"ఇక్కడే నంచుందాం" అన్నాడు బిటేన్.
ఆ జన సమూహంలోని మహిళలను చూసి చకితురాలైన లేఖ 'దగ్గరికి వెళ్దాం " అన్నది ఉత్సాహంగా.
ఒద్దన్నట్లుగా తల ఊపాడు బిటేన్. "ఈ సభను ప్రభుత్వం నిషేధించింది. కల్లోలం జరగవచ్చు."
"అయితే నాకేం భయం."
అతడు నవ్వాడు.
"నీకు ఉద్రేకం ఉందనుకో, కాని ఇప్పుడు తీసుకొచ్చింది నేను. నీ తండ్రికి జవాబు చెప్పాల్సి ఉంటుంది."
ఇంకో పదినిముషాల తరవాత సభా కార్యక్రమం ప్రారంభమయింది. గుంపు పెరిగిపోతుంది. గుసగుసలూ, కేకలూ వినవచ్చాయి. చప్పున ధ్వని ఆగిపోయింది.
వేదిక మీదికి ఒక వ్యక్తీ వచ్చాడు. అతడు ఉపన్యాసం ప్రారంభించబోయేసరికల్లా ఆయుధపాణులు విరుచుకొనిపడ్డారు. చేతులకు బేడీలు వేసి తీసికెళ్ళారు. ఇదంతా లిప్త మాత్రంలో జరిగిపోయింది.
పదివేల గొంతులు ఒకేసారి "అన్నం, అన్నం, అన్నార్తులకాహారం" అని నినాదం చేశాయి. ఉరుములా ఆ ధ్వని ఉరికింది.
స్త్రీ వేదిక మీదికి వచ్చింది.
"సోదరులారా! మనం ఇక్కడ ....."
రెప్పపాటులో పోలీసులు ఆమెను పట్టుకొనిపోయారు.
"అన్నం, అన్నం అన్నార్తులకాహారం " అనే నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయి.
అలాగే అనేకసార్లు జరిగింది. స్త్రీలూ, పురుషులూ , ఉపన్యసించడానికి వేదిక ఎక్కారు. అరెస్టుచేయబడినారు.
"ఇలా ఎంతమందిని అరెస్టు చేస్తారు?" లేఖ ఆదుర్దాగా అడిగింది.
'అఖిలభారతంలోని ముప్పై కోట్ల జనానీకమూ అరెస్టయ్యేదాకా " అతని ముఖంలో ఉద్రేకం తాండవించింది. కాని కంఠంలో మార్దవం తగ్గలేదు.
"ఇంతమందినీ ఎలా అరెస్టు చేస్తారు?" ఎన్ని జెళ్ళని నిర్మిస్తారు?" ఆ ప్రశ్నకు జవాబు లేముంటాయి? అదలా ఉండగా మరొక ప్రశ్న వేసింది. "వారంతా ఇనుపకమ్ముల్ను విరిచేయరూ?"
"దేశానికి చైతన్యం వచ్చింది. శతాభ్దాలుగా నిదురించిన ప్రజానీకం మేల్కొంది. లేచి కూర్చుంది. అలా చూసుకుంటే కాళ్ళకు ఇనుప గొలుసులు కట్టి ఉన్నాయి. వారి నిద్రమత్తు వదిలి, జవసత్వాలు తెచ్చుకుంటే ఈ మహాశక్తి విదిలింపుకు ఇనుప గొలుసులు తునాతునకలైపోతాయి."
అతని కళ్ళలో అగ్గి మండింది. ఆమె మోకాళ్ళ నుంచి పైకి ఒక చలితరంగం ఉరుకులు పెట్టింది. ఆ ఉద్రేకంలో అతడూ వేదిక ఎక్కి మళ్ళీ కారాగారానికి వెళ్తే ?
ఆమె అతన్ని అలా చూసింది. ఆ చూపులలోని భయం గ్రహించినట్లు ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అతని హామీ దాగి వుంది.
'ఆడవారు మాకు ఎలా అండదండలుగా నుంచుంటున్నారో చూశావా? మనమంతా స్త్రీలూ, పురుషులూ - నీవు నేనూ, అందరిదీ ఒకే ధ్యేయం. అటువైపే సాగిపోతున్నాం."
బిటేన్ విషయంలో ఆమెకు ప్రగడమైన వాంఛ కలగడం అదే మొదటిసారి. తన ప్రక్కనున్న విగ్రహాన్ని తనలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళు తెరిచేసరికల్లా దశదిశల నుంచీ గుర్రాల్ను గంతులు వేయించుకుంటూ గుంపులో దూరుతున్న ఆశ్వికులు కనిపించారు. వారు "భాగో" అని అరుస్తూ గుంపును చెల్లాచెదురు చేస్తున్నారు. కోపపు ఘూర్ణింపులూ, తిట్లూ, పారిపోయే వారి అరుపులూ, అడుగుల చప్పుడూ, గుర్రాల గిట్టల ధ్వని వీటన్నింటినీ అధిగమించి "అన్నం, అన్నం, అన్నార్తులకాహారం " అనే నినాదం సుళ్ళు తిరుగుతూ మేఘ గర్జనలా ప్రతిధ్వనించింది. జనసాగర ఘోష ఆకసాన్నంటింది.
"చంద్రలేఖా! నడువ్."
బస్ స్టాప్ లో నుంచున్న జనాన్ని దాటిపోతున్న వారి నోటి వెంట చాలాసేపటి వరకు మాట రాలేదు. వారిద్దరి మధ్యా నిశ్శబ్దపు యవనిక వ్రేలాడింది.
బిటేన్ 'చూశావా?" అనడంతో తెర ఎగిరిపోయింది.
లేఖ ఉలిక్కిపడి పరధ్యానం నుంచి బైటపడింది. ఆమెలో మళ్ళీ ఒక చలి అల పరుగెత్తింది. బిటేన్ కూడా ఆ ఉపన్యాసకుల్లో కలిసిపోతే? అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేస్తే ?" ఆమెలో కలిగిన భయం, తన శిరస్సును వంచి అతని పాదాల కడ ఉంచాలనే కోర్కెను ప్రేరేపించింది. ఆమెలో రగుల్కొన్న కోర్కె వల్ల ఆమెకు నొప్పి కలిగినా ఆమె హృదయంలో ఆనందపు జల్లులు కురిశాయి.
ఎప్పుడో గతంలో తండ్రి ఇంకా కమ్మరిగానే ఉన్నప్పుడు అతన్ని చూస్తె ఆమెకు అలాంటి భావన కలుగుతూ ఉండేది. కాని ఇప్పుడు? జేలు నుంచి బైటపడ్డ అగంతకుని ముందు తల వంచి పాదాలపై ఉంచాలనుకుంది, పూజించాలనుకుంది.
19
అర్ధరాత్రి అంధకారంలోకి చూసి తల నేలకేసి బాల్కనీ నేల మీద కూర్చున్నాడు. రెండు చేతుల్లోనూ అదిమి పట్టిన తల బద్దలు అవుతుంది. అతని వంటి మీద చెమట ఫేన్ గాలికి ఎండిపోయి పొర ఏర్పడింది. తల మీద ఒక గుట్టను మోస్తున్నట్లు డస్సిపోయాడు. కాలూ ప్రతిమలా కూర్చున్నాడు.
తన కూతురే తన్ను అవహేళనం చేసింది.
సరే, ఆ మాటల్లో ఈర్ష్య ఉందే అనుకో. అయినా నిజం లేకపోతెగా! దీనంతటికీ ఆ పెళ్ళి సంబంధాల బాపడే కారణం.
'అప్సరస లాంటి నీ కూతుర్ను ఇంతమంది అడుగుతున్నారంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిందే ముంది?"
"అబ్బ, ఇందరా?" ముఖం వెలిగింది.
"పిల్లను అడిగేవాళ్ళంతా నన్ను చంపుకు తింటున్నారు. "కన్య స్వభావం ఎలాంటిది? మంచి ఇంటి కోడలు కాదగిన లక్షణాలు ఉన్నాయా?" అని అడుగుతున్నారు. ఎవరైనా దిగక ముందే లోతు చూడాలనుకుంటారు. ఒక్కసారి నమ్మకం కలిగించామంటే అప్పుడు కుప్పలు తిప్పలుగా వచ్చి పడ్తాయి. తర్వాత మీ ఇష్టం వచ్చినవాణ్ణి ఎంచుకోవచ్చు. అది మీ చేతిలో పని.
"నిన్న సంధ్యార్చనకు ముందు ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. ఆమె లేఖను చూచి "సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి మీదికి దిగి వచ్చింది. ఈమె నా ఇంటి కోడలైతే నా అదృష్టం పండేది " అనుకున్నాది. అమెది మంచి సంసారం. ఆ విషయం నాకు తెలుసు. కావాలంటే కుర్రాణ్ణి........"





