Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                   జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                  ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

                             పదహారవ అధ్యాయము

1.    నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవే నమః |
    బాహుభ్యాముత తే నమః
   
    (శతరుద్రీయ హొమమంత్రములు చెప్పుచున్నాడు)

     రుద్రదేవా! నీదేహమునకు వందనము. ఎక్కుపెట్టిన నీబాణమునకు వందనము. నీ బాహువులకు వందనము.

    2. రుద్రదేవా! నీదేహము శుభప్రదము. ఘోరపాపనాశని. అత్యంత శాంతిప్రదము. పర్వతనివాసివగు నీవు నీ శాంతదృక్కులచే  మమ్ము కావుము.

    3. గిరీశా! నీవు బాణము పట్టినావు. దానిని శాంతింపచేయుము. గిరిత్రాతా! ఆ బాణమున మానవునిగాని జంగమమును గాని హింసించకుము.

    4. గిరీశా! మేము నీకు అభిముఖులమై శాంతి కారక స్తవములచే నిన్ను నుతించుచున్నాము. ఈలోకములను రోగరహితములను చేయుము. ప్రసన్నలను చేయుము.

    5. రుద్రుడు అందరకు ప్రధానుడు. దేవలోకమునకు ఏకమాత్ర భిషక్కు. అధివక్త. రుద్రదేవా! సకల సర్పములను స్తంభింపచేయుము. సకల రాక్షసులను జాడీభూతులను చేయుము. వారిని అథోముఖముగ పారచేయుము.

    6. ఈ  శివుడు సూర్యరూప తామ్రవర్ణుడు. రక్తవర్ణడు. బభ్రువర్ణుడు. ఈ  రుద్రాంశమున వేల రుద్రచరుల సమస్త దిశలందున్నారు. వారి క్రోధము శమించవలెనని ప్రార్థించుచున్నాము.

    7. రుద్రుడు నీలకంఠుడు. విశిష్టరూపుడు. రక్తాభుడు. అతడు మెల్లమెల్లగా ముందుకు జరుగుచున్నాడు. అతనిని సాధారణ గోపాలురు చూచుచున్నారు. నీరు తెచ్చు దాసీజనులు చూచుచున్నారు. మాచే సహితము భయపూర్వకముగ చూడబడునట్టివాడు మమ్ము సుఖవంతులను చేయవలెను.

    8. నీలకంఠునకు నమః సహస్రాక్షునకు నమః సేచన సమర్థునకు నమః అతడు కాక రుద్రగణములున్నవి. వానికి సహితము  నమస్కరించుచున్నాను.

     9. రుద్రాదేవా! నీ ధనుస్సు ఉన్నదికదా! దానిరెండు కొనలకు కట్టిన నారిని విప్పివేయుము. నీచేతికి తీసుకున్న బాణమున్నదే! దానిని దూరముగ పారవేయుము.

    10. కపర్దియొక్క ధనుస్సు జ్యారహితమైనది. అతడు శల్యరహిత ధనుర్ధారి అయినాడు. అతని శరములన్నియు నిష్ఫలములైనవి. అతని తూణీరము సహితము రక్తమైనది.

    11. అత్యంత సేచన సమర్థరుద్ర దేవా! నీచేతులందు ధనుస్సున్నది. బాణములున్నవి. అవి మమ్ము రోగరహితులను చేయవలెను. నీవు మమ్ము పాలించవలెను.

    12. రుద్రదేవా! నీవు ధరించిన ధనుర్బాణములు మమ్ము సర్వదిశలందు రక్షించును గాత. ఇప్పుడు నీవద్ద నున్న శరములు నిండిన తూణీరమును, మాకు దూరముగా ఉండుచోట ఉంచుము.

    13. సహస్రాక్ష, శతతూణీర రుద్రా! మాకు కృపాళుడవగుము. బిగించిన ణీ ధనుస్సును సడలించుము. శరముల మొనలను వదిలించుము.

    14. ఎక్కుపెట్టని ణీ ఆయుధమునకు నమస్కారము. ణీ ఉభయ బాహువులకు నమస్కారము ణీ ధనురాయుధమునకు నమస్కారము.

    15. రుద్రదేవా! మాకు సంబంధించిన మహామహులను హింసించకుము. ఏ శిశువునైనను హింసించకుము. గర్భాదానము చేయు యువకులను హింసించకుము. గర్భామునందలి శిశువును హింసించకుము. మా తండ్రిని హింసించకుము. తల్లిని హింసించకుము. ప్రియములగు మా దేహములనుహింసించకుము.

    16. రుద్రదేవా! నీవు - మాపౌత్రుల, పుత్రుల, ఆయువు, గోవులు, అశ్వముల విషయమున మాటిమాటికి క్రోధము వహించకుము. క్రోధలగు మావీరులను బాధించకుము. మేము హవిర్యుక్తులమై సదా నిన్ను ఆహ్వనించుచుందుము.

    17. బంగారు బాహువుల సేనానిగల రుద్రునకు నమస్కారము. దిశలస్వామి రుద్రునకు నమస్కారము. పచ్చ పచ్చని ఆకులకేశములు గల వృక్షములకు నమస్కారము. పశుపాలకునకు నమస్కారము. లేతగరిక వంటి పీతవర్ణ తేజస్వి రుద్రునకు నమస్కారము. మార్గరక్షకుడగు రుద్రునకు నమస్కారము. నీలకేశి, జరారహిత, యజ్ఞోపవీతధారి, గుణవంతులగు మానవుల ప్రభువగు రుద్రునకు నమస్కారము.

    18. బభ్రువర్ణ రుద్రునకు నమస్కారము. శత్రువును వధించు రుద్రునకు నమస్కారము. అన్నములస్వామికి నమస్కారము. భవుని ఆయుధమునకు నమస్కారము. సకల చరాచర ప్రాణుల అధిపతికి నమస్కారము. ఆతతాయి రుద్రునకు నమస్కారము. కేదార రాక్షకునకు నమస్కారము అహంతయు, జీవనచాలకుడగు రుద్రునకు నమస్కారము. అరణ్యస్వామికీ నమస్కారము.

    19. లోహిత వర్ణునకు నమః స్థపతికి నమః వృక్షస్వామికి నమః భూమండల విస్తారకునకు నమః ధనకర్తకునమః ఓషధస్వామికి నమః మంత్రి, వణిక్కు, లతాగుల్మాది రాక్షకునకు నమః తుముల ధ్వనికారికి నమః ఆక్రందనకారికి నమః పదాతి సేనానాయక రుద్రునకు మా నమస్సులు.

    20. ఆకర్ణాంతము లాగిన ధనుస్సుతో యుద్ధములకు పరుగులిడు రుద్రునకు వందనము. సాత్వికులను, శరణాగతులను పాలించు రుద్రునకు వందనము. శత్రువులను పరాభవించు రుద్రునకు వందనము. చోరపాలకునకు వందనము. దోపిడిదారి బందిపోట్లకు వందనము. అడవుల స్వామి రుద్రునకు మా వందనము.

    21.  వంచక, పరివంచక, చోరుల స్వామి రుద్రునకు వందనము. ఖడ్గధారి, బాణవంత రుద్రునకు వందనము. ఆయుధదారి, బాణధారి, హింసేచ్ఛుక దొంగల, దోపిడి దారుల పాలక రుద్రునకు వందనము. ఆయుధధారుల, రాత్రించరుల, దేహకాముల స్వామి రుద్రునకు వందనము.
   
    22. తలపాగలవారు, కొండలందు తిరుగువారు, క్షేత్ర గృహాదులు అపహరించు వారి ప్రభువు రుద్రునకు నమస్కారము. ధనుర్ధార, బాణధార రుద్రులకు నమస్కారము. ధనుస్సునకు జ్యాను ఎక్కుపెట్టునట్టియు, బాణము సంధించునట్టియు రుద్రులకు నమస్కారము. ధనుస్సులాగువారును, శరములను విడుచువారును అగు రుద్రులకు నమస్కారము.

    23. శరముల సంధించునట్టి, బాణములు విడుచునట్టి రుద్రులకు నమః నిద్రించువారును, మేల్కొనువారును అగు రుద్రులకు నమః పడుకున్నట్టియు, కూర్చున్నట్టియు రుద్రునకు నమః నిలిచి నట్టియు, పరిగెత్తునట్టియు రుద్రునకు నమః.

    24. సభలకు దండము. సభాపతులకు దండము. అశ్వములకు దండము. అశ్వస్వాములకు దండము. వీరులైపోరు సేనలకు దండము. వివిధ రూపముల వేధించు సేనలకు దండము. ఉత్కృష్ట సేవికల యుక్త బ్రహ్మి మున్నగు మాతృకలకు దండము. బాధించుసామర్థ్యము గల దుర్గమున్నగు మాతృకలకు దండము.

    25. గణములకు నమోనమః గణపతులకు నమోనమః వివిధజాతుల సంఘములకు నమోనమః ఈ సంఘముల అధిపతులకు నమోనమః లంపటులకు నమోనమః లపంటుల అధిపతులకు నమోనమః జడల, కొప్పుల విరూపులకు నమః హయవదన, హయగ్రీవ ప్రభృతి విశ్వరూపగణములకు నమోనమః.

    26. సేనలకు నమస్సులు. సేనాపతులకు నమస్సులు. రథారూఢులకు నమస్సులు. రథహీనులకు నమస్సులు. రథ అధిష్ఠాతలకు నమస్సులు. రథపు అశ్వచాలకులకు నమస్సులు. మహావీరులకు నమస్సులు. వీరపుత్రులకు నమస్సులు.

    27. వడ్రంగులకు నమోవాకములు. రథములు చేయువారికి నమోవాకములు. కుమ్మరులకు నమోవాకములు. కమ్మరులకు నమోవాకములు. నిషాదులకు నమోవాకము. వ్యాధులకు నమోవాకములు. వేటకుక్కలకు నమోవాకములు. వేటకుక్కల యజమానులకు నమోవాకములు.

    28. కుక్కలను నమస్కారము. కుక్కలా స్వాములగు కిరాతాదులకు నమస్కారము. రుద్రునకు నమస్కారము. శర్వునకు నమస్కారము. పశుపతికి నమస్కారము. నీలకంఠునకు నమస్కారము. శిత కంఠునకు నమస్కారము.

    29. జటాజూటధారి శివునకు వందనము. బోడిగుండు రుద్రునకు నమస్కారము. సహస్రాక్షరుద్రునకు వందనము. బహుధనుర్ధారి శివునకు వందనము. గిరిశయన శివునకు వందనము. శిపివిష్ఠ శివునకు వందనము. అత్యంత సేక్త, బాణయుక్త శివునకు వందనము.

    30. అల్పశరీర రుద్రునకు దండము. వామనరుద్రనకు దండము. మహారుద్రునకు దండము. వృద్ధరుద్రునకు దండము. అనుభవ రుద్రునకు దండము. అగ్రునకు దండము. ప్రధాన పురుషునాకు దండము.

    31. జగద్వ్యప్తునకు నమః గతిశీలునకు నమః క్షిప్రకారికి నమః జలప్రవాహికి నమః తరంగయుక్తునకు నమః స్థిరజల వంతునకు నమః నందులందు పుట్టిన వారికి నమః ద్వీపసంభవులకు నమః.

    32. పెద్దలకు నమస్సు. చిన్నలకు నమస్సు. పూర్వజులకు నమస్సు.  పుట్టనున్న వారికి నమస్సు మధ్యములకు నమస్సు. అప్రగల్భులకు నమస్సు. జఘన్యులకు నమస్సు. నిమ్నస్ధులకు నమస్సు.

    33. గంధర్వులోకమున పుట్టిన వారికి నమోనమః శ్లోకయోగ్యులకు నమోనమః  వైరాగ్య సంబంధులకు నమోనమః క్షేత్రములందు ఫలించు ధాన్యాదులకు నమః కుప్పలందు పుట్టువానికి నమోనమః.

    34. అరణ్య ఉత్పత్తులకు నమోవాకము. వృక్షగుల్మాదులందు పుట్టువానికి నమోవాకము. శబ్ద, ప్రతిశబ్దరూపమునకు నమోవాకము. శీఘ్రగతి సేనలవారికి నమోవాకము. శీఘ్రరథికి నమోవాకము. శూరునకు నమోనమః శత్రువిభేదకునకు నమోనమః.

    35. శిరస్త్రాణము గలవారికి నమస్కారము. కవచధారికి నమస్కారము. ఇనుప కచ్చడముల వారికి నమస్కారము. గజముపై వేయు ఇనుపకవచము వారికి నమస్కారము. ప్రసిద్ధవీరునకు నమస్కారము. ప్రసిద్ధసేనల సేనాపతికి నమస్కారము. దుందుభి శబ్దమునకు నమస్కారము. వాదన దండమునకు నమస్కారము.

    36. ధృష్ణునకు నమస్తే. విమర్శక విద్వాంసునకు నమస్తే. ఖడ్గధారికి నమస్తే. బాణధారికి నమస్తే. తీక్ష శరవంతునకు నమస్తే. ఆయుధము పట్టిన వీరునకు నమస్తే. శోభన ఆయుధవంతునకు నమస్తే. శోభన ధనుష్పాణికి నమస్తే.

    37. క్షుద్రమార్గముల వారికి నమః విశాల మార్గములవారికి నమః కాలువలందు పుట్టువానికి నమః పర్వతముల క్రింద మొలుచువానికి నమః నందులందు మొలుచు వానికి నమః సరస్సులందు మొలుచువానికి నమః తటాక ఉత్పన్నములకు నమః.

    38. కూప ఉత్పన్నములకు వందనము. ఛాయ ఉత్పన్నములకు వందనము. ఎండలో పుట్టువానికి వందనము. మేఘ ఉత్పన్నములకు వందనము. విద్యుదుత్పన్నములకు వందనము. వర్షోత్పన్నములకు వందనము. వర్షరహిత ఉత్పన్నములకు వందనము.

    39. వాయుచక్ర ఉత్పన్నములకు దండము. ప్రళయ నిలయరుద్రనకు దండము. గృహభూమిలో పుట్టిన వానికి దండము. గృహభూమి పాలకునకు దండము. సోమమునకు దండము. రుద్రునకు దండము. తామ్రునకు దండము. అరుణునకు దండము. "నమః సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయ చారుణాయచ"

    40. సుఖములు కలిగించు వారికి నమోవాకము. పశుపతికినమోవాకము. ఉగ్రునకు నమోవాకము. భీమస్వభావునకు  నమోవాకము. ఎదుట వధించువానికి నమోవాకము. దూరము నుండి వధించువానికి నమోవాకము. హంతకు నమోవాకము. అత్యంత హంతకు నమోవాకము. హరిత వృక్షములకు నమోవాకము. తరింపచేయు రుద్రునకు నమోవాకము.

    41. సుఖస్వరూపునకు నమస్కారము. కళ్యాణమయునకు నమస్కారము. సుఖకరునకు నమస్కారము. శుభంకరునకు నమస్కారము. శివస్వరూపునకు నమస్కారము. అత్యంత శివస్వరూపనకు నమస్కారము. "నమః శివాయ చ శివతరాయ చ"

    42. లోకములకు ఆవల జీవన్ముక్త రూపమున అవతరించిన వారికి నమస్కారములు. లోకములందు సాధారణ మానవ రూపమున జన్మించిన వారికి నమస్కారము. మంత్ర జపాదులచే తరించువారికి నమస్కారము. ఉత్కృష్ట తత్వ జ్ఞానమున ముక్తి పొందువారికి నమస్కారము. తీర్థములకు నమస్కారము నదులకు నమస్కారము. కుశలకు నమస్కారము. నురుగునకు నమస్కారము. నమస్తీ ర్థాయచ కుల్యాయచ నమః శష్పాయచ ఫేన్న్యాయ.

    43. సైకత ఉత్పన్నములకు నమస్కారము. స్రోతోత్పన్నములకు నమస్కారము. చిన్న చిన్న రాళ్ళలో మొలిచిన వానికి నమస్కారము. స్థిర జల ప్రదేశమునకు నమస్కారము. సర్వన్తర్యామికి నమస్కారము. ఊసర ఉత్పన్నములకు నమస్కారము. ఉత్కృష్ట మార్గ సంభూతులకు నమస్కారము.

    44. వ్రజ సంభవులకు నమస్కారము. గోష్ఠ సంభవులకు నమస్కారము. శయ్యా సంభవులకు నమస్కారము. గృహ ఉత్పన్నములకు నమస్కారము. హృదయోత్పన్నములకు నమస్కారము. నీహార ఉత్పన్నములకు నమస్కారము. దుర్గమ ప్రదేశ ఉత్పన్నములకు నమస్కారము. గహ్వరోత్పన్నములకు నమస్కారము. 'నమః కాట్యాయచ గహ్వరేష్ఠాయ'

    45. శుష్కోత్పన్నములకు నమస్కారము. హరిత ఉత్పన్నములకు నమస్కారము. దుమ్ములో పుట్టువానికి నమస్సులు రజోకణ ఉత్పన్నములకు నమస్కారము. అగమ్య ప్రదేశములందు పుట్టువానికి నమస్కారము. తృణోత్పన్నములకు నమస్కారము. బడబానలమున పుట్టిన వానికి నమస్కారము. కల్పానలమున పుట్టిన వారికి నమస్కారము. 'నమ ఊర్వ్యాయ సూర్వ్యాయచ"

    46.పత్రములకు నమస్కారము. పత్రములు రాల్చువారికి నమస్కారము. ఉద్యమవంతునాకు నమస్కారము. కట్టెదుట వధించువారికి నమస్కారము. సర్వదుఃఖములు కలిగించువారికి నమస్కారము. మిక్కిలి దుఃఖములు కలిగించువానికి నమస్కారము. బాణములు చేయువారికి నమస్కారము. ధనుస్సులు చేయువారికి నమస్కారము. వర్షము మున్నగు వానిచే జగదుత్పత్తి కారకులకు నమస్కారము. దేవతల హృదయములకు నమస్కారము. పాపపుణ్యవిచక్షణ గలవారికి నమస్కారము. పాపములను వివిధ రూపముల నష్టపరచువారికి నమస్కారము. స్వర్గాదిలోక నిర్గతులకు నమస్కారము.

    47. పాపులకు దుర్గతి కలిగించువాడా! సోమపాలకా! మహా అకించినా! నీలకంఠా! ఈ ప్రజయందు - ఈ పశువులందు ఏ ఒక్కరిని భయభీతులు చేయకుము. ఏ ఒక్కరికిని వ్యాధి కలిగించకుము. మా పశువులలో ఏ ఒక్కదానికి విశూచికాది వ్యాధులు కలుగనీయకుము.

    48. రుద్రుడు బలవానుడు. జటాజూటధారి. శత్రువీర వినాశకుడు. అతని కొరకే మేము  ఈ స్తుతులను సమర్జించినాము. ఇందువలన ద్విపద మానవులకు, చతుష్పద గవాది జంతువులకు  శుభములు కలుగును గాత. ఈ గ్రామము పరిపుష్ఠమై కల్లోలము లేనిది అగును గాత.

    49. శివస్వామీ! నీ దేహము అతిశాంతము. సదా శాంతము. ఔషద స్వరూపము. అదే  సర్వ రోగములకు ఏకమాత్ర ఔషధము. నీ దేహమున మా జీవనమును ప్రసన్నము చేయుము. 'శివా రుతస్య భేషజీ తయానో మృడ జీవసే'

    50. మేము రుద్రుని ఆయుధమునకు దూరముగా ఉందుము గావుత. రుద్రుని రౌద్ర హింసక బుద్ధి మాకు దూరమగును గావుత.

    రుద్రా! సేచనసమర్థా! సంపన్న యజమానుల విషయమున నీ ధనువును సడలింపుము మా పుత్ర, పౌత్రాదులను కరుణించుము.

    51. సేచనసమర్థ! కళ్యాణకర, శుభస్వరూప శివస్వామీ! మాకు ప్రసన్నుడవగుము. "నః సుమనాభవ. నీవు నీ ధనురాయుధమును, ఒక ఉన్నత వృక్షమున ఉంచి విచ్చేయుము. చర్మము ధరించి విచ్చేయుము. పినాకమున దాల్చి మా వద్దకు విచ్చేయుము.

    52. భగవన్! నీవు శరవర్షము కురిపించువాడవు. విలోహితుడవు. నీకు నమస్కారము. నీ వద్ద వేన వేల వ్యాధులు ఉన్నవి. వానిని మా శత్రువుల మీద ప్రయోగించుము.

    53. రుద్రమూర్తీ! నీచేత వేనవేల రోగములు ఉన్నవి. వానిపై నీ  పెత్తనము ఉన్నది. కావున వాటిని ఇటుకాక వేరువైపు మళ్ళింపుము.

    54. ఈ భూమి మీద వేల కొలది అసంఖ్యాక రుద్రులున్నారు. మా వద్ద ఉన్న మంత్రబలమున వారి ఆయుధములను అన్నింటి తల వంచుదుము.

    55. విశాలమును, మేఘాధామగు అంతరిక్షమున అసంఖ్యాక రుద్రులు ఉన్నారు. మేము వారి ధనువులను వేల యోజనుముల దూరమున వాల్చివేయుదుము.

    56. నీలగ్రీవ, శితికంఠ రుద్రులు భూమి అడుగున సంచరింతురు. మేము వారి ధనువులను వేల యోజనముల దూరమున వంచి వేయుదుము.

    57. నీలగ్రీవ, శితికంఠ రుద్రులు భూమి అడుగున సంచరింతురు. మేము వారి ధనువులను యోజనముల దూరమున వంచి వేయుదుము.

    58. రుద్రులు వృక్షములందు ఉన్నారు. వారు లేత గరిక వంటి రంగువారు. నీలగ్రీవులు. రక్తలోచనులు. మేము వారి ధనువులను వేల యోజనముల దూరమున వంచివేయుదుము.

    59. రుద్రుడు రుద్రమార్గ రక్షకుడు. అన్న ధారకుడు. యావజ్జీవ యుద్ధకర్త. మేము అతని ధనుస్సులను వేల యోజనములు దూరమున వంచివేయుదుము.

    60. రుద్రుడు రుద్రమార్గ రక్షకుడు. అన్న ధారకుడు. యావజ్జీవ యుద్ధకర్త. మేము అతని ధనుస్సులను వేల యోజనముల దూరమున వంచివేయుదుము.

    61. ఉరిత్రాడు చేతపట్టి. కరవాలము ధరించి రుద్ర తీర్థములందు భ్రమించు వారి ఆయుధములను వేల యోజనములు దూరమున తలలు వంచునట్లు చేయుదుము.

    62. అన్నము తినుచున్నవారిని హతమార్చు రుద్రుల యొక్కయు, పాత్రలందుంచిన పాలు మున్నగునవి త్రాగి పోవు రుద్రుల యొక్కయు ఆయుధములను వేల యోజనముల దూరముననే వాల్చివేయుదుము.

    63. ఇంతటి వారును - ఇంతకు రుద్రులు ఈ భూమండలముల దిశ, విదిశలందు వ్యాపించి ఉన్నారు. వారందరి ఆయుధములను వేలయోజనముల దూరముననే రాల్చి వేయుదుము.
   
    64. ఎవరు ద్యులోకమున ఉన్నవారో, ఎవరి బాణవర్షము బిందు రూపమగునో ఆ రుద్రులకు నమస్కారము. తూర్పున నిలిచి వారికి నా దశాంగుళులను జోడించుచున్నాను. దక్షిణమున నిలిచి నా దశాంగుళులను జోడించు చున్నాను. పశ్చిమమున నిలిచి నా దశాంగుళులను జోడించుచున్నాను. ఉత్తరమున నిలిచి నా దశాంగుళులను జోడించుచున్నాను  ఊర్ధ్వ దిశకు నా దశాంగుళులు జోడించుచున్నాను. ఆ రుద్రులకు నమస్కారము. వారు మమ్ము రక్షించవలెను - మాకు సుఖములు కలిగించవలెను. మేము ద్వేషించువారిని మమ్ము ద్వేషించువారిని, మేము ఆ రుద్రుల నోట. పడవేయుదుము.

    65. ఎవరు అంతరిక్షమునందున్నారో - ఎవరి బాణము వాయువులగునో వారికి తూర్పు దక్షిణ. పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ దిశలకు మా దశాంగుళులు జోడించి నమస్కరించుచున్నాము. వారు మమ్ము రక్షింతురు గాత. మాకు సుఖములు కలిగింతురు గాత. మేము ద్వేషించువారిని, మమ్ము ద్వేషించు వారిని, మేము రుద్రుల నోట పడవేయుదుము.

    66. ఎవరు భూమండలమున ఉన్నారో, ఎవరి బాణములు అన్నమగునో అట్టి రుద్రులకు నమస్కారము. వారికి తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్థ్వ దిశలకు మా దశాంగుళులు జోడించుచున్నాము. వారు మమ్ము రక్షింతురు గాత. మమ్ము సుఖవంతులను చేయుదురు గాత. మేము ద్వేషించువారిని - మమ్ము ద్వేషించు వారిని రుద్రుల నోట పడవేయుదుము.


       
                            దాశరథి రంగాచార్య విరచిత
               శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
              శతరుద్రియమను పదహారవ అధ్యాయము ముగిసినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.