Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. ఉషా ! నీ తేజస్సు సూర్యునికన్న ముందు ఉదయించును. అట్టి నీ తేజస్సు కులటవంటిది కాదు. పతిసాన్నిధ్యమున ఉన్న పత్నివంటిది. అట్టి నిష్కళంకమగు నీ తేజము అపారము - అనంతము.
4. అంగిరోగణములు సత్యవంతులు. విద్వాంసులు. ప్రాచీన పాలకులు. వారు నిగూఢ తేజమును సాధించినారు. సత్యస్తుతులయినారు. అట్టి అంగిరులు మంత్రబలమున ఉషస్సును ఆవిర్భవింపచేసినారు. అప్పుడు వారు దేవతలకూడి ఉన్మత్తులైనారు.
5. వారు సాధారణ గోవులకొఱకు కలుసుకున్నారు. ఏకబుద్ధులు అయినారు. పరస్పర ప్రయత్నము కొనసాగించినారు. వారు దేవకర్మలను బాధించరు. హింసాశూన్యము వాసప్రదమగు తేజమున సాగుదురు.
6. సుభగా ! ఉషా ! వశిష్ఠ గణములు తెల్లవారుజామున లేచినారు. స్తోత్రములతో నిన్ను స్తుతించుచున్నారు. నీవు గోప్రాపికవు. అన్నపాలికవు. మాకు తెల్లవారింపుము. సుజన్మ ఉషా ! నీవు ప్రథమ స్తుతవు.
7. ఈ ఉష స్తోతల స్తోత్రములకు నేతృత్వము వహించును. వసిష్ఠులు ఆమెను స్తుతింతురు. ఆ తల్లి చీకట్లను చీల్చును. సర్వత్ర ప్రసిద్ధమగు ధనమును మాకు ఇచ్చును. "యూయం పాత స్వస్తిభిః సదానః"
డెబ్బది ఏడవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉష సమస్త జీవులకు కదలిక కలిగించును. ఆమె ప్రాయపు పత్నివలె సూర్యుని నుండియే వెలుగులు పొందును. అగ్ని మానవుల సమింధన యోగ్యుడయినాడు. అగ్ని అంధకారనాశక తేజమును ప్రకటించును.
2. ఉష ఉదయించినది - ఉదయించినది - ఉష జగముల ముందుకు వచ్చినది - వచ్చినది. ఉష సర్వత్రవ్యక్తమైనది - అయినది. ఆమేతేజోమయవనములు ధరించినది - ధరించినది. వాటితో వర్ధిల్లినది - వర్ధిల్లినది.
ఉష హిరణ్యవర్ణ దర్శనీయ తేజోయుక్త. వాక్యమాత. దినములనేత. ఉష అందములు సంతరించు కొనుచున్నది.
3. ఉష దేవతలకు నేత్రస్వరూప. తేజోవతి. సుభగ. స్వకిరణ ప్రకాశిత. విచిత్ర ధనవతి. జగముల కొఱకు ప్రవృద్ధ. ఆమె దర్శించదగిన అశ్వమును తెలుపుచేయుచున్నది.
(అశ్వము సూర్యుడగును)
4. ఉషా ! మా వద్దకు విచిత్ర ధనముతో రమ్ము. మా శత్రువులను దూరము చేయుచురమ్ము. మా విశాలగోచర భూమిని భయరహితము చేయుచురమ్ము. ద్వేషులను వేరుచేయుచు రమ్ము. శత్రువుల ధనము తీసికొని రమ్ము. స్తోతవద్దకు ధనము అందుకొని రమ్ము.
5. ఉషా ! మా ఆయువులను పెంచుము. మా కొఱకు శ్రేష్ఠ కిరణములతో ప్రకాశింపుము. నీవు అందరకు వరణీయవు. మా కొఱకు గో, అశ్వధనమను దాల్చివెలుగొందుము.
6. ద్యులోకదుహితా, సుజన్మా, ఉషా ! వసిష్ఠులు స్తుతులతో నిన్ను వర్థిల్ల చేయుదురు. నీవు మాకు రమణీయమగు మహాధనము నిమ్ము. "యూయం పాత స్వస్తిభిః సదా నః"
డెబ్బది ఎనిమిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఉష, ఛందస్సు త్రిష్టుప్.
1. తొలుత వెలసిన కేతనమును చూడనగును అది కిరణపుంజములతో ఊర్ధ్వముఖియై వ్యాపించినది. మా ముందు నిలిచినది. ఉషోదేవి రథము అది విశాలము. జ్యోతిష్మంతము. ఉష ఆ రథమును మా కొఱకు రమణీయ ధనము తేవలెను.
2. సమిధలు కలిగిన అగ్గి అంతట ఎదుగును. విప్రులు స్తుతులతో ఉషను కీర్తించి ఎదుగుదురు. ఉషోదేవి తన వెలుగులతో చీకట్లను పాపములను పారద్రోలి ఎదుగును.
3. ఈ సమస్త ప్రభాత కిరణములు, వెలుగులనిచ్చు ఉషలను తూర్పుదిక్కున చూడనగును. ఈ కిరణములే సూర్యుని అగ్నిని, యజ్ఞమును ఆవిర్భవింపచేసినవి. వాటివలననే నీచనము అప్రియమయిన అంధకారము దూరమైనది.
4. ద్యులోకపుత్రి, ధనవతి ఉషను ఎరిగినాము. సర్వప్రాణులు ప్రభాతకారిణి ఉషను దర్శించుచున్నారు. ఆమె అన్నముగల రథమున ఎక్కినది. అలంకృత అశ్వములు ఆ రథమును లాగును.
5. ఉషా ! మేము సుమనస్కులు, ధనవంతులగు జనులు నేడు నిన్ను మేల్కొల్పుచున్నాము. ఉషలారా ! మీరు తెల్లవార్చండి. జగముల వెలుగులు నింపండి.
డెబ్బది తొమ్మిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - ఉష ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉష మానవుల హితము కోరునది. అంధకారమును నాశనము చేయునది. పంచశ్రేణి జనులను మేల్కొల్పునది. ఉత్తమ తేజస్సుగల కిరణములతో సూర్యునకు ఆశ్రయము ఇచ్చును. సూర్యుడు ఆ తేజస్సుతో ద్యావాపృథ్వులను ఆవరించును.
2. ఉషస్సులు అంతరిక్షమున తేజస్సును వ్యక్తపరచుదురు. మానవులవలె పరస్పరము కలిసి చీకట్లను తుడిచివేయు చర్యలు చేపట్టుదురు.
ఉషా ! నీ కిరణములు అంధకారమును నాశము చేయును. సూర్యుని భుజములవె జ్యోతులు ప్రసాదించును.
3. అందరిని మించిన స్వామిని, ధనవతి ఉష ఉదయించినది. ఆమె సకల ప్రాణి కళ్యాణమునకుగాను అన్నము కల్పించినది. స్వర్గపుత్రి సర్వోత్తమ అంగిర ఉష సుకృతములకొరకు ధనముదాల్చును.
4. ఉషా ! నీవు ప్రాచీన స్తోతలకు ఇచ్చినంత ధనమును మాకును ప్రసాదించుము. ప్రాణులు నిన్ను వృషభ శబ్దమున ఎరుగుదురు. పణులు గోవులను దొంగిలించినప్పుడు నీవు దృఢపర్వత ద్వారమును తెరచినావు.
5. ధనము కొఱకు స్తోతలను మా కొఱకు సూనృత వాక్యమును ప్రేరేపించుచు, తమోవినాశినివగుచు, మాకు దానము చేయుటకు నీ వృద్ధిని స్థిరపరచుకొనుము. "యూయంపాతస్వస్తిభిః సదానః"
ఎనుబదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - ఉష ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉష సమానప్రాంత ద్యావాపృథ్వులను ఆవరించునది. ప్రాణులను ప్రకాశమునిచ్చునది. విప్రులగు వసిష్ఠులు అట్టి ఉషను అందరికన్నముందు మేల్కొలిపినారు.
2. ఆమెయే నవయవ్వన ఉష. ఈమెయే కటిక చీకట్లను కూలద్రోసిన ఉష, ఈమెయే జనులను మేల్కొల్పిన ఉష.
ఉష సిగ్గువిడిచిన పడుచువలె. సూర్యునిముందుకు పోవును. సూర్యునకు, అగ్నికి, యజ్ఞమునకు తనను సూచించును.
3. ఉషస్సులు అనేక అశ్వములుగలవి గోవులు కలవి. అవి స్తుతించ తగినది.
ఉషస్సులు సదా అంధకారమును దూరము చేయును. "యూయం పాత స్వస్తిభిః సదానః"
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున అయిదవ అధ్యాయము సమాప్తము.)
ఓం నతామినన్తిమాయివో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి.
నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమేత స్థివాంసః
ఆరవ అధ్యాయము ఎనుబది ఒకటవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - ఉష, ఛందస్సు - బృహతి.
ఓం ప్రత్యు ఆదర్శ్యాయత్య్నుచ్చన్తీ దుహితాదివః
ఆపో మహివ్యాయతి చక్షసే తమో జ్యోతిష్కృణోతిస్యూరి
1. ద్యులోకపుత్రి అంధకారినాశిని ఉష వస్తున్నది కనిపిస్తున్నది. అందరు చూచుటకు ఆమె రాత్రియొక్క ఘోర అంధకారమును దూరము చేయును. మానవులకు నేతృత్వము వహించును. వెలుగులను వికసింపచేయును.
2. సూర్యుడు కిరణములను ఒకేసారి విసరును. సూర్యుడు వెలుగొంది గ్రహనక్షత్రాదులను వెలిగించును.
ఉషా ! నీవి సూర్యుని వెలుగులు వచ్చిన తరువాతనే మాకు అన్నము కలుగును.
3. ద్యులోకపుత్రి ఉషా ! మేము శీఘ్రకర్ములమగుదుము. నిన్ను మేల్కొలుపుదుము. నీవు కోరదగిన అనంతధనము కలదానవు. యజమానికొరకు రత్నములు, సుఖములు అందుకొనుము.
4. మహతీదేవీ ! నీవు అంధకార నాశినివి. మహిమలు కలదానవు. సకల జగములను ప్రబోధితము చేయుదువు. వానిని దర్శన యోగ్యము చేయుదువు. నీవు రత్నవతివి. మేము నిన్ను యాచించుచున్నాము. తల్లికి కొడుకువలె మేము నీకు ప్రియతములము కావలెను.
5. ద్యులోకదుహితా ! ఉషా ! అత్యంత దూర ప్రదేశమున ప్రఖ్యాతమయిన ధనము తెమ్ము. నీ వద్ద మానవులకు భోజ్యమగు అన్నము ఉన్నదికదా అది మాకు ఇమ్ము. మేము సహితము అనుభవింతుము.
6. ఉషా ! స్తోతలకు అమరము, నివాసప్రదము మరియు ప్రసిద్ధమగు కీర్తిని ప్రసాదించుము. మాకు అనేక గోవులతో కూడిన అన్నము ప్రసాదించుము. యజమానికి ప్రేరణ కలిగించునదియు, సత్యవచన ఉష శత్రువులను దూరము చేయవలెను.
ఎనుబది రెండవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు దేవత - ఇంద్రావరుణులు, ఛందస్సు - జగతి.
1. ఇంద్రావరుణులారా ! మేము మీ సేవకులము. యజ్ఞ కర్మమునకుగాను మాకు మహాగృహము ప్రసాదించుము అట్లయిన యజ్ఞకర్తను అదేపనిగ పీడించు దుర్బుద్ధిని యుద్ధమున జయించగలము.
2. ఇంద్రావరుణులారా ! మీరు మహామహులు. మహా ధనవంతులు. మీలో ఒకరు. వరుణుడు సామ్రాట్టు. మరొకరు ఇంద్రుడు. స్వయం విరాజమానుడు. ఉత్తమ ఆకాశమునందలి విశ్వదేవతలు మీకు తేజస్సును ప్రదానము చేసినారు. బలమును ఇచ్చినారు.
3. ఇంద్రావరుణులారా ! మీరు బలమున జలవృష్టిని ఆవిష్కరించినారు. సర్వప్రేరకుడగు సూర్యుని ఆకసమున నడిపించినారు. మాయసోమమున ఆనందించినారు. ఇప్పుడు మీరు నదులను జలపూర్ణములుచేసి కర్మలను పూరించండి.
4. ఇంద్రావరుణులారా ! స్తోతలు యుద్ధమందు, శత్రు సేనా మధ్యమున మిమ్మే పిలుతురు. సంకుచితజానువులుగల అంగిరులు రక్షణకొఱకు మిమ్మే పిలుతురు. మీరు దివ్య పార్థివ ఉభయ ధనములకు ఈశ్వరులు. మీరు అనాయాసముగా ఆహ్వానయోగ్యులు. మిమ్ము ఆహ్వానించుటకు ఆయాసము అక్కరలేదు సులభులు. మేము స్తోతలము. మేము పిలుచుచున్నాము.
5. ఇంద్రావరుణులారా ! మీరు లోకములందలి సమస్తప్రాణులను సృష్టించినారు. మీలో ఒకరిని వరుణుని శుభములకుగాను మిత్రుడు సేవించును. మరొకరు ఇంద్రుడు మరుత్తులతో కలిసి తేజస్వియు శోభన అలంకృతుడను అగును.
6. మహాధన ప్రాప్తికని, ఇంద్రావరుణులు వెలుగొందుటకును, శీఘ్రముగా బలము ప్రాప్తించును. వీరి బలము నిత్యము అసాధారణము. వీరిలో ఒకడు వరుణుడు హింసించువారిని పరిమార్చును. మరొకరు ఇంద్రుడు స్వల్ప ప్రయత్నముననే శత్రువును వధించును.
7. ఇంద్రావరుణులారా ! వీరు ఏనరుని యజ్ఞమున విరాజిల్లుదురులో, ఏ వ్యక్తిని అనుగ్రహింతురో వానిని బాధలు చేరలేవు. పాపము చేరలేదు. దుష్కర్మలు చేరలేదు. ఏకారణమునైనను సంతాపము చేరలేరు.
8. నేతలగు ఇంద్రావరుణులారా ! మీరు మా విషయమున ప్రసన్నులైనచో దివ్యరక్షణ సహితులై మాముందు అవతరించండి. స్తోత్రములు వినండి. మీ స్నేహము, బంధుత్వము సుఖదాయకములగును. మాకు ఆ రెంటిని ప్రసాదించండి.
9. శత్రుమర్దన తేజోవంతులగు ఇంద్రావరుణులారా ! విశేష సంగ్రామములందు మాకు అగ్రశ్రేణి యోద్ధలుకండి. మిమ్ము ప్రాచీన, అధునాతన ఉభయనేతలు యుద్ధమునకును పుత్ర పౌత్రాదుల ప్రాప్తికిని ఆహ్వానింతురు.





