Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అర్జునుడు అట్లే చేసినాడు.
    మిగిలిన వారికి విముక్తి కలిగించినాడు.
    అప్సరసలు అర్జునుని దీవించినారు
    స్వర్గమునకు వెళ్ళినారు.
    అర్జునుడు మరల మణిపురమునకు వెళ్ళినాడు. చిత్రాంగదతో గడిపినాడు. ఆమెకు, అర్జునుని వలన ఒక పుత్రుడు కలిగినాడు. అతడు బభ్రువాహనుడు అనుకున్నట్లు బభ్రువాహానుని చిత్రవాహనునకు ఇచ్చినాడు. ఆరాజు అనుమతి పొందినాడు. చిత్రాంగదను అచటనే ఉంచినాడు. యాత్రలకు బయలుదేరినాడు.
    అర్జునుడు గోకర్ణమును చూచినాడు. ప్రభాస తీర్ధమునకు చేరినాడు. ఆ తీర్ధము ద్వారకకు దగ్గరలో ఉన్నది. శ్రీకృష్ణునకు ఆ సమాచారము చారుల వలన తెలిసినది. అతడు ఒంటరిగా అర్జునుని వద్దకు వెళ్ళినాడు. శ్రీకృష్ణుని చూచినాడు. ఆనంద బాష్పములు రాల్చినాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఆలింగనము చేసుకున్నాడు. కుశల ప్రశ్నలు అడిగినాడు. యాత్రా విశేషములు తెలుసుకున్నాడు.
    సుభద్ర బలరామకృష్ణుల సోదరి. అర్జునునకు ఆమె మేన మరదలు. అర్జునునకు సుభద్ర మీద మనసయినది. అ విషయము శ్రీకృష్ణుడు గ్రహించినాడు. వారి వివాహము బలరామాదులకు తెలియకుండ జరిపించదలచినాడు. పధకము వేసినాడు. అర్జునునకు యతి రూపము వేయించినాడు. ద్వారకకు దగ్గరలో ఉన్న రైవతక పర్వతమున ఉంచినాడు.
    అర్జునుడు యతి రూపమున రైవతకమున ఉన్నాడు. శ్రీకృష్ణుడు రైవతకమున ఉత్సవము జరుగునని చాటింపు వేయించినాడు. సంకర్షణ, సాంబ ప్రధ్యుమ్నాది యాదవులందరు తమ తమ భార్యలతో పర్వతమునకు వచ్చినారు. శ్రీకృష్ణుడు రుక్మీణి మున్నగు భార్యలతో వచ్చినాడు. బలదేవాది యాదవులు అర్జునుని దగ్గరికి వచ్చినారు. అతనిని యతిగా తలచి పూజించినారు. తీర్ధయాత్రలు వృత్తాంతములు విని నమ్మినారు. అర్జునుని ద్వారకాపురికి గొనిపోయినారు. అది వర్షాకాలము. ఆ వర్షాకాలము ద్వారక యందే గడుపవలసినదని ప్రార్ధించినారు. అర్జునుని పరిచర్యలకు సుభద్రను ఏర్పరచినారు.
    అర్జునుడు యతి రూపమున ఉన్నాడు. సుభద్ర పరిచారక అయి ఉన్నది. వారి ఇద్దరిలో ఇదివరకే ప్రేమ అంకురించినది. ఇప్పుడు అది బలపడినది. సుభద్ర మాత్రము అర్జునుని ఎరుగకున్నది. ఇంద్రప్రస్థము నుంచి యాత్రలకు వెళ్ళిన అర్జునుని గురించి యతిని అడిగినది. యతి తానే అర్జునుడను అన్నాడు. సుభద్ర చేయి పట్టుకున్నాడు. సుభద్ర ఓడలు జల్లుమన్నది. మేనంత పులకించినది. తలవంచినది. నేల చూపులు చూచినది. కాలి బొటనవ్రేలితో వలయములు చుట్టినది.
    "సుభద్రా! బ్రహ్మదేవుడు , శ్రీకృష్ణుడు మనకు కలయిక కలిగించినారు. వివాహములు ఎనిమిది విధములు. అందు క్షత్రియులకు గాంధర్వ రాక్షసములు శ్రేష్టములు. మనము గాంధర్వము అవలంభింతము." అన్నాడు.
    "గాంధర్వమేల? నన్ను నీకు ఇచ్చి పెండ్లి చేయగలవారు అందరు ఇచటనే ఉన్నారు" అన్నది. చేయి విడిపించుకున్నది. సుభద్ర వెళ్ళిపొయినది. అర్జునుడు ఆమె వెళ్ళిన దిక్కున చూపు నిలిపినాడు.
    ద్వారక వద్ద ఒక అంతర్ధ్వేపము ఉన్నది. శ్రీకృష్ణుడు అక్కడ ఒక మహోత్సవము కల్పించినాడు. బలరామాదుల సహితముగా శ్రీకృష్ణుడు కూడ అక్కడికి వెళ్ళినాడు. సుభద్రార్జునులు మాత్రము ద్వారకలోనే ఉన్నారు.
    శ్రీకృష్ణుడు ఒక నెపమున ద్వారకకు వచ్చినాడు. సుభాద్రార్జునుల వివాహమునకు ఏర్పాట్లు చేసినాడు. బృహస్పతి శుభలగ్నము చెప్పినాడు. యమ, వరుణ, వాయు, కుబేరులు వచ్చినారు. అత్రి, భ్రుగు, భరద్వాజ, నారద, వామదేవ, వశిష్టులు సదస్యులు అయినారు. అరుంధతి, శని, రుక్మిణి పురంధ్రీ కార్యములు నిర్వర్తించినారు.
    సుభద్రార్జునుల వివాహము వైభవముగా జరిగినది.
    పెండ్లికి ఇంద్రుడు వచ్చినాడు. నవరత్న ఖచితమయిన కిరీటమును అర్జునుని శిరస్సునందు ఉంచి అభిషేకము చేసినాడు. కొడుకును కౌగలించుకొని అనంద బాష్పములు రాల్చినాడు. స్వర్గమునకు వెళ్ళిపొయినాడు.
    శ్రీకృష్ణుడు అర్జునునకు బంగారు రధమును ఇచ్చినాడు. దానికి వాయువేగము గల గుఱ్ఱములు ఉన్నవి. దాని మీద అక్షయ ధనుర్భాణములు ఉన్నవి. సుభద్రను తీసుకుని ఆ రధము మీద ఇంద్ర ప్రస్థమునకు వెళ్ళవలసినదని అర్జునునకు చెప్పినాడు. శ్రీకృష్ణుడు అంతర్ధ్వీపమునకు వెళ్ళినాడు.
    సుభద్ర రధ సారధ్యము చేసినది. అర్జునుడు ధనుర్బాణాములు ధరించి రధము ఎక్కినాడు. రధము సాగినది. పృధుశ్రవసుడు మున్నగు యాదవ ప్రముఖులు ద్వారకాపురి ద్వారమును కావలి కాయిచున్నారు. వారు రధమును చూచినారు. అర్జునుడు సుభద్రను ఎత్తుకొని పోవుచున్నాడు అనుకున్నారు. అర్జునుని అడ్డగించినారు. అర్జునుడు శరపంపర కురిపించినాడు. అర్జునుని ధాటికి తాళలేక వారు పారిపోయినారు. వారు అంతర్ద్వీపమునకు పోయినారు. బలరామాదులతో జరిగిన విషయము విన్నవించినారు. అది విని కన్నెర్ర చేసినారు యాదవులు. ప్రళయ రుద్రులు అయినారు. బలరామాదులు కార్చిచ్చువంటి మహా సైన్యమును తీసుకొని ఉరికినారు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని వారించినాడు. అన్నాడు :-
    "అన్నా! బాలరామా! అర్జునుడు భరత కుల శ్రేష్టుడు. ధర్మజ్ఞుడు. బలపరక్రమములు గలవాడు. సుభద్ర అతనికి మేన మరదలు. అందుకు ఆమెను తీసుకొని వెళ్ళినాడు. అర్జునుడు సుభద్రకు తగినవాడు అగునో కాదో నిర్ణయించుడు. అర్జునుని మీరు వెన్నంటిన అతడు మీకు సాద్యపడడు. అర్జునుడు దివ్యాస్త్ర  సంపన్నుడు.
    ద్రోణుని ప్రియ శిష్యుడు. అనేకమంది రాజులను జయించినవాడు. అతనితో యుద్దము పనికి రాదు."
    బలరాముడు తమ్ముని మాటలు విన్నాడు. మహా సముద్రము వంటి యాదవ సేనా ప్రయత్నమునకు శ్రీకృష్ణుని మాటలు ఆనకట్టలయినవి. యుద్ద ప్రయత్నము విరమించుకున్నాడు, వెనుతిరిగినారు.
    అక్కడ అర్జునుడు సుభద్రను తీసుకొని ఇంద్రప్రస్థము చేరినాడు. ఊరి బయట విదిసినాడు. "సుభద్రా! దౌపది మహాపతివ్రత. ఆమె మాటలు తప్పక జరుగును. మనము ఇద్దరము వెళ్ళిన ఆమె అప్రియముగా మాట్లాడవచ్చును. కాబట్టి నీవు ముందుగా వెళ్ళుము. ఆమె పాదములపై పడుము" అని అర్జునుడు సుభద్రను పంపినాడు.
    సుభద్ర రాజ ప్రాసాదమునకు వెళ్ళినది. కుంతికి నమస్కరించినది. ద్రౌపదికి పాదాభివందనము చేసినది. ద్రౌపది ఆమెను లేవనెత్తి "సుభద్రా! నీ భర్త వీరులను జయించును. నీకు వీరుడగు పుత్రుడు కలుగును" అని దీవించినది.
    అర్జునుడు అది తెలుసుకున్నాడు. నగర ప్రవేశము చేసినాడు. కుంతీదేవికీ, ధర్మజ, భీములకు నమస్కరించినాడు. దౌమ్యునకు ప్రణమిల్లినాడు.  ఆశీర్వచనములు పొందినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.