Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"బాబా !"
ఆ వ్యధ ఆమె పొట్టలో మెలికలు తిరిగింది. పారిపోతే బావుండుననుకుంది.
"బాబా!"
"ఏం లేఖా?"
లైట్లు ఆరిపోయి ఆట మొదలైంది. బైనాక్యూలర్స్ చేతిలో ఉన్న ఆడది వెనక్కు సీటులో కూలబడ్డది.
సంతోషం, అనందం అన్నీ మృగ్యం అయినాయి. లేఖ నాటకాన్ని చూడ్డం లేదు. భయంకరమైన స్వకీయనాటకం నుంచి వుముక్తురాలు కావడానికి ప్రయత్నిస్తుంది.
ఒక రంగం అయిపొయింది. తెర పడ్డం, లైట్లు వెలగడం ఒకేసారి జరిగాయి. భయంతో ఆమె బొమ్మలా అయిపొయింది. యంత్రంలా ఆమె కళ్ళు హాలు యావత్తూ కలయజూసాయి. మళ్ళీ ఆ స్త్రీ లేఖ వైపు చూడలేదు. ఆమె ఇంకేటో చూస్తుంది. ఆమె తన ప్రక్కనే ఉన్న కుర్రాడి తలమీద చేయి వేసి అనురాగంతో వ్రేళ్ళతో దువ్వుతుంది.
ఆమె కాదు !
ఏదో పొరపాటు జరిగింది. ఏదో కొద్ది పోలికలు ఉన్నంత మాత్రంతో ఆమె ఈమె ఎలా అవుతుంది? పాపం, ఆమె ఆ చిన్న కుర్రాణ్ణి అనురాగంతో దువ్వుతుంది. ఆ కుర్రాడు ఆమెకు మనుమడెమో?
కర్ర ట్రే పట్టుకున్న నీలిరంగు యూనీఫారం కుర్రాడు " చాకొలెట్లు , చాకొలెట్లు" అని అమ్ముతున్నాడు.
"లేఖా, చాకొలెట్లు తింటావా?"
లేఖ రంగురంగుల పెట్టె తెరచి కొన్ని చాకొలెట్లు చేతిలో తీసుకొని మెరుపు కాగితాలు విప్పింది. విముక్తి కలిగిన ఆనందంలో నోట్లో చాకోలేటు వేసుకున్నప్పుడల్లా "ఇది బాదాం..... ఇది అక్రోటు ' అంటుంది.
మళ్ళీ భయం క్రమ్ముకుంది. ఆమె ఆ రాక్షసేనేమో?
అయితే మాత్రం ? అది చేసేదేమిటి? ఈ భయానికి అర్ధం లేదు. అది నిజామైనా అబద్దం అయినా ఒకటే.
ఒకడు ఈ మధ్యనే జెలు నుంచి వచ్చాడు. భయంగా ఉండాల్సిన చోట నిర్భయంగానూ, స్వేచ్చగానూ గడిపాడు. కొద్ది మాత్రం అయిన ఆమె జీవిత పరిధిలో ఒక్కడూ అలాంటి వాడు కనిపించలేదు. తండ్రి చాలాసార్లు జేలును గురించి చెప్పాడు. జంతువుల్లాంటి జీవితమూ, విరామం లేని చాకిరీ , దేహాన్నీ ఆత్మను వ్యధ పరిచే అవాకులూ, చెవాకులూ , ఇదీ తన తండ్రి చెప్పిన జేలు గాధ, అలాంటి అంధకార బంధురమైన గాధ మరిచిపోవడం మంచిది, ఇక అలాంటిది జరుగరాదు. ఇక్కడ మరో వింత వ్యక్తీ ఉన్నాడు. అతడు జేలు పేరుతోనే వ్యవహరింపబడాలని పట్టు పట్టుతున్నాడు. జేలు నెంబరు తప్ప అతనికి వేరు పేరు లేదు. ఈనాటికీ గూడా లేఖ అతని హృదయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోలేకపోతుంది. ఆమెకు అంతా అయోమయంగా ఉంది . ఏమీ అర్ధం కావడం లేదు. తండ్రీకి అంతే. తండ్రి గుడి ఆదాయంలో భాగం ఇస్తానన్నాడు. కష్టపడి అర్ధించి హోదాకు భాగస్వామి కమ్మన్నాడు. కొత్త జీవితానికి హంగులూ, అవకాశాలూ కల్పిస్తానన్నాడు. అతడు కలలో సహితం చూడని ధనమూ గౌరవమూ లభిస్తున్నాయి.
అయినా బిటేన్ అంగీకరించలేదు. నిరసన దృష్టితోనూ, సానుభూతి తోనూ చిరునవ్వు నవ్వి త్రోసిపుచ్చాడు. సిరిరా మోకాలడ్డాడు.
తండ్రి నమ్మలేక గుడ్లప్ప చెప్పాడు. తరువాత కలవరంతో కదిలిపోయాడు. పసిపాప లాంటి కనుపాపలూ, విశాల ఫాలమూ, భావాల్ను చక్కగా వ్యక్తీకరించే నాసికాపుటలూ గల ముఖాన్ని లేఖ చక్కగా అర్ధం చేసుకుంది.
"నాకేమీ అర్ధం కాలేదు" అన్నాడు చివరకు.
"అర్ధమయ్యే రోజు వస్తుంది. మీలాంటి వారు అంత చులకనగా తప్పుకోలేరు"
"తప్పుకోలేరు?" ధ్వనిలో కాఠిన్యం కన్పించినా కనుచూపూల్లో విచారం ద్యోతకం అవుతూ ఉండగా "మనం అగంతకులం అయినామా?" అని అడిగాడు.
వారిద్దరి మధ్యా బిగింపు వచ్చింది. సళ్ళీపోయింది. బిటేన్ అకస్మాత్తుగా నవ్వుల దొంతర్లు కురిపించేదాకా వాతావరణం బిగుస్తూ పోయేది.
"మాటలు మింగి చూడవయ్యా, ముగ్గు తల మహర్షీ! నాది నీకు కొడుకును కాదగిన వయసు ."
హృదయాలు ఆర్ద్రములైనాయి.
ఊరేగింపులో చేరిన రెండు మూడు రోజుల తర్వాత విశ్వనాద్ ను ధర్మకర్తలు, గుడి కొలువు నుంచి తీసేశారు. అతని మనో వాంచను ఎరిగిన తండ్రి స్వంత కొలిమి నెలకొల్పుకావలసిందిగా కోరాడు. ఈ విధంగానైనా దేవాలయ ధనం సద్వినియోగం అవుతుంది అన్నాడు. కాని విశ్వనాద్ "కొలిమి కేమీ తొందర లేదు. నాకు అంతకంటే తొందర పనులున్నాయి." అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.
కాలూ ఆశ్చర్యంగా "ఏం పని?" అని అడిగాడు.
"తిండి కోసం పోరాటం పాపల కోసం పాలు తీసికెళ్ళడానికి మనిషిని ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషంగా ఉంది."
"నీ పాపలు పస్తులుండరు. తల్లులకు కూడా బియ్యం లభిస్తాయి" అని కాలూ హామీ ఇచ్చాడు.
అన్నం, అన్నం, అన్నం . అన్నార్తులకూ ఆహారం! ఈ నినాదంతో నగరం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఏదో శక్తి ఆవహించి జనుల ఔదాసీన్యం భగ్నం అయింది. రోజూ ఒక ఊరేగింపు వీధుల్లో కనిపిస్తుంది. దరిద్రులూ, అన్నార్తులే కాక, బిటేన్ చెప్పినట్లు ఈ ఊరేగింపుల్లో ఫ్యాక్టరీ లలో పనిచేసే కార్మికులూ, కాలేజీల్లో చదివే విద్యార్ధులూ , ఆఫీసుల్లో పనిచేసే గుమాస్తాలూ కూడా పాల్గొంటున్నారు. వాలంటీర్ల ఊరేగింపులు సాగేయి. అప్పటికే బిటేన్ రెండు మూడు సార్లు ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. అంతేకాక ఈ ఊరేగింపులకు సారధ్యం వహిస్తున్న కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నట్లు తెలిసింది. జేల్లో తనతో పరించయం కలిగిన మరో ఇద్దరు కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారని బిటేన్ చెప్పాడు. ఈ ఉద్యమపు వేళ్ళు క్విట్ ఇండియా మనుషులున్న జెళ్ళ దాకా తన్నుకొని ఉండడమే ఇందుకు కారణం. ఆ కమిటీలో సమాజపు అన్ని అంతస్తులకూ, ప్రాతినిద్యం వహించేవారు ఉన్నారు. దేశపు పునాదులను కదిలించిన మహోద్యమంలో పాల్గొన్నందుకు జెళ్ళలో ఉంచినవారూ, దేశాన్ని ప్రేమించిన నేరానికి జెళ్ళలో మగ్గిన వారూ ఉన్నారు. వారు మన దేశీయులకు మంచి జీవనం కావాలని కోరారు. ఆకలి, వినాశం నుంచి మోక్షం లభించాలని కోరారు. నేటి అంకురమే రేపు ఫలితాన్నిస్తుంది. కాబట్టి వారు త్యాగాలు చేస్తున్నారు.
అది బిటేన్ మాట్లాడిన తీరు. లేఖ అదంతా ఆసక్తితో విన్నది.
జేలుకు ఇంకో రకం మనుష్యులు కూడా వచ్చారు. కలకత్తా లోని జేళ్ళు నిండి పోవడంతో వారిని అక్కడికి పంపారు. ఆకలి మంటలను అర్చుకోవడానికి శాసన ధిక్కారం చేసినవారు. ఇంకో రకపు మనుషులు. విచిత్రం ఏమిటంటే జేలు కు వచ్చినా వాళ్ళల్లో క్విట్టిండియా స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలూ, పురుషులూ జేల్లో నెంబర్లు అయిపోయారు. అలాంటి నెంబర్లే సమూహాలకు సంకేతాలై స్వాతంత్ర్యపోరాటం సాగించడానికి షల్టన్లుగా సిద్దం అయినాయి. స్వాతంత్య సంగ్రామ యెదులుగా సిద్దమై బైటపడుతున్నారు.
బిటేన్ జేలు చిత్రాలు చూపించాడు. ప్రతి ఖైదీ నాలుక మీదా ఒకే ఒక సాధారణ నినాదం ఉండేది. అదే జైహింద్ నినాదం. ఆ నినాదంతోనే ఖైదీలు ఒకరిని ఒకరు అభినందించుకునేవారు. ఉదయం సుపరెండెంటు వార్డుకు వచ్చినప్పుడు ఖైదీలు అతణ్ణి జైహింద్ అని అభినందించారు. మొదటిసారి ఈ నినాదం విన్నప్పుడు అతడు కోపంతో పిచ్చివాడై అందర్నీ శిక్షిస్తానని బెదిరించాడు. ఖైదీలు విడిపోయారు. నేరస్థులు కానీ ఆకలి బాధితుల క్విట్టిండియా సోదరులతో కలిసిపోయారు. మిగతా ఖైదీలు జేలు అధికారుల తోత్తులైపోయారు. అధికారులు వారి ఎడ కనీవినీ ఎరుగని అభిమానం చూపించారు. బీడీ లిచ్చారు. మేకమాంసం కూడా ఇచ్చారు!
జైహింద్ నినాదంతో జేలు సుపరెండెంటు గూబలు పగిలి పోతున్నాయి. చివరకు విసిగి నాయకుణ్ణి ఒంటరిగా కొట్లో ఉంచాడు. ఖైదీలంతా అన్నం మానేశారు. అగ్గిలా అనశన వ్రతం అంతటికీ అలముకుంది. కఠినశిక్షల వాళ్ళు మినహా అంతా అన్నం మానేశారు.
"మీరు గూడా పస్తులున్నారా?" అని అడిగింది ఆశ్చర్యంగా.
చిరునవ్వు నవ్వి "నలుగురితో నారాయణా" అన్నాడు.
"అన్నం దొరకని దరిద్రులంతా పస్తులుంటూ వుండగా , నేనెందుకుండలేను అనిపించింది. వారు తిండి దొరక్క పస్తులుంటున్నారు. నేను ఉపవాసాన్ని పోరాటానికి ఒక ఆయుధంగా వినియోగించుకుంటున్నాను. అలాంటప్పుడు నేను వారి కంటే మెరుక్కాదూ? భేదం తెలిసిందా?"
లేఖకు రెంటికీ మధ్యా ఉన్న వ్యత్యాసం అయితే అర్ధం అయింది. అయినా ఆకలి బాధ అందరికీ ఒకలాంటిదే కదా అనుకుంది.





