Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    ఇష్టకా! నీవు అంతటి అగ్ని స్వరూపవు. ఆ అగ్నికి - ఆ సేనాని, గ్రామణులకు - ఆ అప్సర పరిచారికలకు - ఆయుధాదులకు నిత్య నమస్కారములు. వారందరు మమ్ము సుఖవంతులను చేయవలెను. వారందరు మమ్ము రక్షించవలెను. మేము అహితము కోరు మానవులను మా అహితము కోరువారిని - ఈ అగ్ని మున్నగు వారినోటి కోరలందు ఇరికింతుము.

    16. ఇయ్యది దక్షిణదిశలో అతిశయత్వమును ప్రాప్తించునట్టి వాయువు. అతని రథపు రథస్వనము వాయువునకు సేనాపతి యగును. రథము నందు ఆసీనుడై విచిత్రరీతుల యుద్ధము చేయు రథచిత్రుడు వాయువునకు గ్రామణియగును. మేనక, సహజన్యలు ఆ వాయువునకు అప్సరలు. యాతుధానుడు హేతి - రక్షసుడు ప్రహేతి అగుదురు.

    నమో అస్తుతే న్కోవస్తు తేనో మృడయన్తు తేయం ద్విష్మోయశ్చనో ద్వేష్టి తామేషాం జమ్భేదధ్మః - వారందరకు నమస్కారము. వారు మమ్ము రక్షించవలెను. మేము అహితము కోరువారిని, మాకు అహితము కోరువారిని నోటికోరలందు నలుపుదుము.

    17. సూర్యుడు పశ్చిమమునకు సాగువాడు. సర్వత్రవ్యాపనశీలుడు. విశ్వవాక్కు, రథప్రోతము ఇతని సేనాని. అసమ రథము ఇతని గ్రామణి. అనుమ్లోచన్తి, ప్రమ్లోచన్తి ఇతని అప్సరలు. వ్యాఘ్రము ఇతని హేతి. సర్పము ఇతని ప్రహేతి.

    నమోఅస్తుతే న్కోవస్తుతే తేనో మృడయన్తు తేయం ద్విష్మోయశ్చనో ద్వేష్టితమేషాం జమ్భేదధ్మః

    18. యజ్ఞము  ఉత్తరదిశన ప్రసిద్ధినొందినది. ధనము కొరకు ఆశ్రయించుదగినది. గరుడుడు ఇతని సేనాని. అరిష్టనేమి ఇతని గ్రామణి. విశ్వాచి, ఘృతాచులు ఇతని అప్సరలు. నీరు ఇతని హేతి యగును. వాతము ఇతని ప్రహేతి అగును.

     నమోఅస్తుతే న్కోవస్తుతే తేనో మృడయన్తు తేయం ద్విష్మో యశ్చనో ద్వేష్టి తమేషాం జమ్భే దధ్మః

    19. ఇతడు పర్జన్యుడు, పైన - పైన ఉండువాడు. అట్లయ్యు క్రిందకు వర్షము దింపువాడు. సేనజిత్తు ఇతని సేనాని. సుషేణుడు ఇతని గ్రామణి. ఊర్వశి, పూర్వచితి ఇతని అప్సరలు. వజ్రనిర్ఘోషము ఇతని హేతి. విద్యుత్తు ఇతని ప్రహేతి.

    నమో అస్తుతే న్కోవస్తుతే తేనో మృడయన్తు తేయం ద్విష్మోయశ్చనో ద్వేష్టితమేషాం జమ్భేదధ్మః

    20.ఇతని అగ్ని. ద్యులోకమునకు శీర్షము వంటివాడు. ఎంతోమహత్తు కలవాడు. పృథ్వికి స్వామి. జలముల కారణముగా మేఘములను కలిగించువాడు.

    21. ఇతడు అగ్ని. శత సహస్రమూల్యక అన్నములకు నాథుడు. ధనములకు శీర్షము. క్రాంతదర్శి.

    22. అగ్నీ! అథర్వర్షి సకల ఋత్విజులందు శ్రేష్ఠుడు. అతడు నిన్ను సర్వప్రథమముగా కమలపత్రము మీద మథించినాడు.

    23. (పూర్వదిశి రేతః సిగ్వేలాయాం త్రిష్టుప్ సంజ్ఞా ఇష్టకా ఉపదధాతి. తూర్పుదిక్కున రేతః సిగ్వేలయందు త్రిష్టుప్ నామక ఇటుకలను పేర్చును)

    అగ్నీ! నీవు హవ్యవాహన జ్వాలలను ప్రకటించినపుడు యజ్ఞములకు నేతవగుదువు. యజ్ఞఫలస్వరూప వర్షమునకు నేతవగుదువు. వాయువుకు శుభంకరములగు అశ్వములు నియతములు. నీవు వానితో కూడినపుడు వర్షమును ధరించువాడవగుదువు. ద్యులోకమున సూర్యుని నిలిపిన వాడవగుదువు.

    24. ఉష ఉదయించిన రీతి సమిధలతో కూడిన అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. వత్సము గోవు కొరకు వలె జనులు నిరీక్షించుచున్నారు. సమర్థమగు పక్షి ఉదయమున రెక్కలుచాచి ఆహారము కొరకు  ఆకాశమున వ్యాపించిన రీతి -  ప్రజ్వలిత అగ్ని కిరణములు ఆకసమునకు ఎగిరి వ్యాపించుచున్నవి.

    25. అగ్ని క్రాంతదర్శి. యజ్ఞయోగ్యుడు. శ్రేష్టుడు. ఉద్గాతలమగు మేము వందన వాక్యములు పలుకుచున్నాము. బహుగమనశీల సూర్యకిరణములు ద్యులోకమున సంగతలైనట్లు - హొతలు పావన వచనములచే అన్నమును అగ్నికి సంగతము చేయుచున్నాను- హొమము చేయుచున్నారు.

    26. (జగతీచ్ఛందములను మూడు ఇటుకలను పేర్చవలెను)

    అగ్ని దేవతల ఆహ్వాత. అత్యంత యజనశీలుడు. యజ్ఞములందు ఎంతో ప్రశంసనీయుడు. అట్టి అహవనీయగ్నిని అగ్న్యాధానము చేయు ఋత్విజులు ప్రతిష్టించినారు. ఈ అగ్నినే భృగుగణములు పుత్ర పౌత్రాదుల సహితులై పూర్వము ప్రతిష్టించినారు.

    27. అగ్ని భక్తులగు యజమానులను రక్షించువాడు. యజ్ఞములందు జాగరణశీలుడు. బలశాలి. ఘృతమును జ్వాలారూపముఖమున ధరించువాడు. పావకుడు. అగ్ని యజ్ఞము నిమిత్తము వర్ధిల్లుచున్నాడు. ఋత్విజులకు శుభములు కలిగించుటకుగాను అగ్ని ద్యులోకమునంటు తన వెలుగుచే ప్రకాశించుచున్నాడు.

    28. అగ్నీ! నీవు పారిపోయి గహన జలమున దాగినావు. అప్పుడు అంగిర ఋషులే నిన్ను అందుకున్నారు. నీవు మరల పారిపోయి కర్రలందు దాగినావు. అప్పుడు సహితము అంగిరులే నిన్ను సాధించినారు. బలముగా మధించుట వలన సహితము నీవు అవతరింతువు. అందుకే అంగిరులు నిన్ను 'బలపుత్రుడు' అన్నారు.

    29. త్రిస్క్రోనుష్టుప్ సంజ్ఞేష్టకాః ప్రాఙ్ముఖ ఉపదధాతి - అనుష్టుప్ పేరుగల మూడు ఇటుకలను తూర్పున పేర్చవలెను.

    అగ్ని మానవులకు పూజ్యుడు. జలములనేత బలయుతుడు., ఋత్విజమిత్రులారా! అగ్ని కొరకు హవిస్సులు -  పంచదశ ప్రభృతి స్తోమములు -సమర్పించండి.

    30. అగ్నీ! సేచన సమర్థా! స్వామీ! నీవు యజమానికి సమస్త సత్ఫలితములను సమకూర్చుము. నీవు ఉత్తర వేది యందు ప్రజ్వలితుడగు వాడవు. మాకు బహువిధ ధనములను అందించుము.

    31. ఎంతో కీర్తి గల అగ్నీ! నీవు బహుజన ప్రియుడవు. జ్వాలా కేశివి. ఋత్విక్కులు, యజమానులు దేవతలకు హవి అందించమని  కోరుచు నిన్ను ఆహ్వానింతురు.

    32. ఋత్విక్, యజమానులారా! నేను బ్రహ్మను మీ హవిస్సులు అందుకున్నాను. జలములకు పౌత్రుడు, చైతన్యవంతుడు, విశ్రామరహితుడు, యజ్ఞవంతుడు, విశ్వదూత, అమృతస్వరూపుడగు అగ్నిని ఆహ్వనించుచున్నాను.

    33. అగ్ని విశ్వస్యదూత. అమృతమయుడు. విశ్వస్యదూత మమృతం. అగ్ని లోకములన్నింటికి అన్నము సమకూర్చగల సమర్థుడు. అతడు రక్తవర్ణములగు తన రెండు అశ్వములను రథమున కూర్చును. ఆ రథమునధిరోహించిన అగ్ని ఆహుతులు అందుకొనుటకు గాను త్వరత్వరగా విచ్చేయును.

    34. సమ్యగాహూత అగ్ని యజ్ఞస్థానమునకు ఉరుకులు పెట్టును. సదుద్రవత్స్యాహుతః. ఎచట బ్రహ్మాది ఋత్విజులు ఉందురో, ఎచట యజ్ఞము జరుగుచుండునో, ఎచట వివిధ యజ్ఞకర్మలు పూర్తి అగునో, ఎచట సంపన్న యజమానికి దేవధనమగు హవిస్సుచేరునో, ఆ యజ్ఞస్థానమునకు అగ్ని పరుగులిడును.

    35. అగ్నీ! నీవు గోయుక్త ధనస్వామివి. బలపుత్రుడవు. జ్ఞానవంతుడవు. మాకు మహదన్నమును ప్రసాదించుము.

    36. అగ్నిదేవా! నీవు జ్వాలాముఖివి. సమిధస్వామివి. ధనస్వరూపుడవు. క్రాంతదర్శివి. ప్రశంసనీయుడవు. మా  ఆహుతులందుకొనుము. మాకు ధనములు ప్రసాదించుము.

    37. అగ్నీ ! నీవు శోభాయమానుడవు. వాడికోరల వాడవు. రాక్షసనాశకు. రాత్రింబవళ్లు రాక్షసులను దగ్ధము చేయుము.

    38. కుండమునందలి అగ్నీ! ఆహ్వానించబడిన నీవు శుభంకరుడ వగుము. నీవు అందించు ధనము శుభంకరము కావలెను. అగ్ని కొరకు మేము సముపార్జించు స్తుతులు, ప్రశస్తులు శుభంకరములు అగును గాత.

    39. అగ్నీ! జనులు నిన్ను కీర్తించుటలు శుభంకరములు కావలెను. నీవు యుద్ధములందు శత్రువులను నాశనము చేయువాడవు. అట్టి దృఢమనస్కుడవై వృత్రనాశనమునకు పూనుకొనుము.

    40. అగ్నీ! నీవు శత్రుంజయ వ్రతుడవు. ఆ దీక్షతోనే మామీద ఎక్కుపెట్టిన - బలిశాలి -శత్రువు బాణములను పడగొట్టుము. మమ్ము సముచిత మార్గముల ధనమును ఆర్జించునట్లు చేయుము.

    41. (దక్షిన దిశన పంక్తినామక మూడు ఇటుకలను పేర్చవలెను)

    ఎవడు ధనస్వరూపుడో, ఎవని హొమము కొరకు గోవులు పాలిచ్చుటకు ఇంటికి వచ్చునో, శీఘ్రగామి అశ్వములు ఇంటికి తిరిగి వచ్చునో, నిరంతరము సంచరించు అశ్వములు సహితము ఇంటికి తిరిగి వచ్చునో, అట్టివానిని మాత్రమే అగ్నిగా భావింతుము. అగ్నీ! స్తోతలకు వర్షము, అన్నము కలిగించుము.

    42. ఏ అగ్ని ధనస్వరూపుడగునో, ఎవని కొరకు గోవులు, వడిగల గుర్రములు గృహమునకు చేరునో, ఎవని కొరకు సత్కుల సంజాత ఋత్విక్కులు యజమాని ఇంటికి చేరుదురో, అట్టి అగ్నినే మేము సంస్తుతింతుము. అగ్నీ! స్తోతలకు అన్నము కలిగించుము.

    43. ఆహ్లాదకారక అగ్నీ! నీ నోటికి ఘృతాహుతులు అందుకొనుటకు శిశువు మాతృస్తనమును అందుకొనుటకు వలె - చేతుల వంటి రెండు జుహువులను ఆశ్రయింతువు. బలముల స్వామీ! మా యజ్ఞములందు ప్రసన్నుడవగుము. మాకు ధనధాన్యములు సమకూర్చుము. అగ్నీ! స్తోతలకు వర్షము, అన్నము కలిగించుము.

    44. (ఉత్తరదిశన పదపంక్తి పేరిటి మూడు ఇటుకలను పేర్చవలెను)

    అశ్వమేధయజ్ఞమున అశ్వమును స్తుతులచే అధిక మేధ్యము చేసి మనసునందలి సంకల్పములను సమృద్ధము చేయుదురు. అగ్నీ! అట్లే మేము నిన్ను సంస్తుతించి ధనధాన్యములను మరింత వృద్ధించెందించుకొందుము.

    45. అగ్నీ! ప్రసన్నుడవగుము. రథసారథి కోరిన చోటునకు చేర్చినట్లు - ఫలమునిచ్చునదియు, స్వర్గాది సాధకమును అగు మహాయజ్ఞ నిర్వాహకుడవు అగుము.

    46. హే అగ్నీ! మాస్తుతులను వినుము. మిక్కిలి ప్రసన్నుడవగుము. ఉదయించుచున్న సూర్యుడు  అందరకు అనుకూలుడు అయినట్లు - నీయొక్క పరిపూర్ణ జ్వాలా ముఖమున మాకు అనుకూలుడవు ఆగుము.

    47. దేవతల ఆహ్వాత - దాత- వాసహేతువు - బలపుత్ర - జాతజ్ఞాన - బ్రహ్మణసమ -  జాతప్రజ్ఞుని మాత్రమే నేను అగ్నిగా భావింతును. అట్టి అగ్ని సుయజ్ఞుడు.  ద్యోతమానుడు ఊర్థ్వముఖ జ్వాలలవాడు. హొమములందు దేవతల కందించు ఘృతమును అందుకొనువాడు అగును.

    48. (మూడు ద్విపద ఇటుకలను పేర్చవలెను)

    అగ్నీ! నీవు నిత్యము మాకు దగ్గరి  వాడవగుము. రక్షకుడవు - శుభంకరుడవు- గృహస్వరూపుడవు అగుము. ధనముననందించుట వలన కీర్తిశాలి అగ్ని వాసహేతువగుచున్నాడు.

    అగ్నీ! మాకు అనుకూలుడవు అగుము. మాకు అత్యంత దీప్యమాన ధనమును ప్రసాదించుము మిత్రులకు ధనప్రాప్తి కలుగుటకుగాను దేదీప్యమానుడవగు నిన్ను సంస్తుతించుచున్నాము.

    49. మునులు ఏకాగ్రచిత్తులైనారు. తాపమాచరించినారు. అగ్నిని ప్రజ్వలితుని చేసినారు. యజనము యజమానిని ఏకాగ్రచిత్తుడనగుదును. ఏ అగ్నిని మేధావులు యజనీయము అన్నారో - అట్టి అగ్నిని స్వర్గము కొరకు ఆధానము చేయుదును.

    50. పుణ్యముద్వారా లభించునదియు ప్రకాశమానమగు ద్యులోకమున కన్నా మూడవ అంతరమున ఉన్నదియునగు స్వర్గమును స్వీకరించుచు, మేము మాసోదరులు, పుత్రులు ధనము, భార్యా సహితులమై అగ్నికి పరిచర్యలు చేయుదుము.
   
    51. అగ్ని ముల్లోకములను భరించువాడు. శ్రేష్ఠజనులకు స్వామి. తన ఉపాసకులను గుర్తించువాడు. అతను ఆ అగ్ని చయన స్థానమున ఆరూఢుడు అయినాడు. వేది మధ్యనున్న ఆ అగ్ని ప్రజ్వరిల్లుచున్నాడు. మాపై సేనాసహితులై దండెత్తకోరు శత్రువులను అగ్ని కాలి కిందవేసి నలిపివేయవలెను.

    52. వీరతముడు - అన్నదాత - అనేకదాతయగు అగ్ని  ప్రమాదరహితుడై వెలుంగును గాత  అగ్నీ! నీవు ముల్లోకములందు ప్రకాశించువాడవు. దివ్యస్థానములకు చేరుము.

    53. యాజమాన- ఋత్విక్కులారా! అగ్నిని సముపార్జించండి. అగ్నికి అనుకూలురై సాగండి.
   
    అగ్నీ! నీవు దేవతలను చేరుకొనవలసిన మార్గములను ఏర్పరచుము. మాట తడబడి మనసు నిలకడ లేని తల్లిదండ్రులకు యౌవనము ప్రసాదించిన ఋషులు నిన్నే ఈ యజ్ఞసూత్రమున విస్తారపరచినారు.

    54. అగ్నిదేవా! నీవు ప్రజ్వలితుడవు అగుము. యజమానిని అప్రమత్తుని చేయుము. ఈ యజమానికి ఇష్టఫల ప్రాప్తి కలిగించుము.

    విశ్వేదేవతలారా! ఈయజమాని కల్మషములేని మనసువాడు. ద్యులోకరూప సమస్థానమున ఇతనిని చిరకాలము ఉండునట్లు చేయండి.

    55. అగ్నీ! నీవు సర్వసమర్థుడవు. సహస్రదక్షిణ యజ్ఞమును పూర్తి చేయగలవాడవు. సర్వస్వదక్షిణ యజ్ఞమును పూర్తిచేయగలవాడవు. ఆ సామర్థ్యముననే మేము స్వర్గమున దేవతల మధ్యకు చేరుటకు ఈ యజ్ఞభారమును వహింపుము.

    56. అగ్నీ! ఇది నీయొక్క ఋతుప్రాప్త జన్మభూమి. ఇచటనే నీవు అవతరింతువు. ప్రకాశింతువు. నీ జన్మభూమిని ఎరుగుము. ఈ వేదిమీద స్థానము గ్రహించుము. గో-అశ్వమయమగు మా సంపదను వర్ధిల్లచేయుము.

    57. (విశ్వజ్యోతి ఇటుకల మీద యజమాని చేసిన విశ్వజ్యోతి ఇటుకలను పేర్చవలెను)

    58. పరమేష్ఠి, ప్రజాపతి ఇష్టకా! నీవు జ్యోతిష్మతి ఇష్టకను సంపూర్ణ ప్రాణ, అపాన, వ్యానము నిమిత్తము -ద్యులోకపు ఉత్తమ స్థానమున స్థాపించుము. నీవు మాకు విశ్వజ్యోతిని ప్రసాదించుము విశ్వంజ్యోతిం ప్రయచ్ఛ.

    ఇష్టకా! సూర్యుడు నీకు అధిష్ఠాన దేవతయగును. అతనిచే అనుజ్ఞాతవై - పూర్వము అంగిరుల కుండమున ధ్రువపడిన రీతి ఈ యజ్ఞ కుండమున స్థిరపడుము.

    59. (లోకమ్పృణ ఇటుకను మరల పేర్చవలెను)

    లోకమ్పృణ ఇష్టకా! నీవు ఈ కుండమునందలి అవశిష్ట స్థానములు ఎచట ఉన్నను వానిని పూడ్చుము. రంధ్రాదులు ఎచట ఉన్నను వానిని పూడ్చుము. తదుపరి ఈకుండమునందు స్థిరముగా నిలువుము. ఇంద్ర అగ్ని బృహస్పతులు నిన్ను ఈవేదియందు స్థాపించినారు.

    60. వార్షిక సోమయాగము దేవతల జన్మభూతము. ఈ యజమాని యజ్ఞము చేయుచున్నాడు. అందలి త్రిసవనసోమరసము జలయుక్తము, అన్నమిశ్రితము చేయబడుచున్నది.

    61. ఇంద్రుడు రథికులందు అత్యంత వీరుడు. అన్నదాతలందు శ్రేష్టుడు. సముద్రమందటి గంభీర హృదయుడు. ఆ ఇంద్రునే సమస్తస్తుతులు వర్ధిల్లచేయును.

    62. (స్వయమాతృణ్ణమను రెండు ఇటుకలను పేర్చి, వాని మధ్య విరిగిన ఇటుకను చేర్చవలెను)

    ఈ అగ్ని కర్రయందు పుట్టినపుడు గుర్రము గ్రాసము నందుకొని సకిలించినట్లు, సుఁయి, సుఁయి మని ధ్వనిచేయును. పిదప గాలి అనుకూలము కాగా జ్వాలసాగును.

    అగ్నీ! అప్పుడు నీగమన మార్గము నల్లనిదగుట నిశ్చయము. పొగసాగుట నిశ్చయము.

    63. (మరొక స్వయమాతృణ్ణ ఇటుకను పేర్చవలెను)

    సూర్యుడు జగత్పాలకుడు, దేదీప్యమానుడు. ఇది సూర్యునకు ఆశ్రయభూతమగు నివాసస్థానము రశ్మియుక్త భాసమానమగు ఇటుకను ఇచ్చట చేర్చుచున్నాను. ఇష్టకా! నీవు ద్యులోకమును, పృథ్విని, అంతరిక్షమును భాషింపచేయుదానవు.

    64. ఇష్టకా! పరమేష్ఠి ప్రజాపతియే నిన్ను సావకాశమును, విస్తారశీలమునగు ద్యులోకపు ఉత్తమస్థానమున స్థాపించును గాత. నీవు  మాకు ద్యులోక ప్రాప్తి కలిగించుము. ద్యులోకమును దృఢపరచుము. సమస్త ప్రాణ, అపాన, వ్యాన, ఉదానముల కొరకు ద్యులోకమును హింసించ కుండుము. మహా కళ్యాణపరంపరల ఛాయయందును - శామతి సహితముగను సూర్యుడు నిన్ను రక్షించును గావుత. నీవు సూర్యునిచే అనుజ్ఞాతవై -పూర్వము అంగిరుల కుండమునందువలె మా ఈ కుండమున ధ్రువపడుము.

    65. (అగ్నింప్రోక్షతి - అగ్నిని ప్రోక్షించవలెను)

    వేదికా! నీవు సహస్ర ఇష్టక యుక్తవు. సహస్ర ఇష్టక ప్రతినిధివి. సహస్ర తుల్యవు. సహస్రమూల్యవు. సహస్ర ఫలప్రదాతవు. నేను నిన్ను ప్రోక్షించుచున్నాను.

    సహస్రస్య ప్రమాసి సహస్రస్య ప్రతిమాసి సహస్రస్యోన్మాసి సహస్క్రోసి సహస్రాయ త్వా


       
                              దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
               పంచమీచితిని గూర్చిన పదిహేనవ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.