Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    4. రాత్రిళ్లు సూర్యపుత్రి మీ రథమును అలముకొనును. మీరు దేవాభిలాషిని కర్మద్వారా రక్షించినపుడు రక్షణకు అవసరమైన దీప్తివంతమగు అన్నము మీవద్దకు చేరును.

    5. రథవంతులగు అశ్విద్వయమా ! మీ రథము వెలుగులు కప్పుకొనును. అశ్వములకూడి పయనించును. ఉషోదయమున ఆ రథమున మావద్దకు రండి. పాపములను వదిలించండి. సుఖములను కలిగించండి.

    6. అశ్విద్వయమా ! గౌరామృగివలె విశేష దీప్యమాన సోమము సేవించగోరి మా యజ్ఞమునకు రావలసినది. అనేక యజ్ఞములందు యజమానులు మిమ్ము ఆహ్వానింతురు. కావున అన్యదేవాభిలాషులు మిమ్ము కోరరాదు.

    7. అశ్వినులారా ! సముద్రమున మునిగిన భుజ్యుని అక్షత అశ్రాంత, శీఘ్రగామి, అశ్వములు మఱియు మీ కార్యనైపుణ్యమున జలములు దాటించి రక్షించినారు.

    8. సదాతరుణ అశ్వినులారా ! నేడు మా ఆహ్వానములు వినండి. హవ్యవంత గృహమునకు విచ్చేయండి. రత్నములందించి స్తోతను వర్థిల్ల చేయండి. "యూయం పాత స్వస్తిభః సదానః"


                                      డెబ్బదవ సూక్తము

         ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! మీరు అందరి వరణీయులు. మా యజ్ఞ వేదికపైకి రండి. భూమి మీద ఇదే మీస్థానమని చెప్పుదురు. మీరు ఆసీనులగు అశ్వపు వీపు సుఖప్రదము కావలెను. మీ గుఱ్ఱము ఎల్లప్పుడు మీ వద్దనే ఉండవలెను.

    2. ఈ స్తుతి అత్యంత అన్నవంతము. సుందరము. ఇది మిమ్ము సేవించును. మానవ యజ్ఞగృహమున ధూపము నిండి ఉన్నది. అది మీకు లభించును. అది ఒక ధామము. అది జలము, సముద్రములతో నిండును. రథమున అశ్వములను పూన్చినట్లు యజ్ఞమున మిమ్ము పూన్చబడును.

    3. అశ్వినులారా ! మీరు ద్యులోకమునుండి వచ్చెదరు. ఓషధులు, జనులమధ్య స్థానము ఏర్పరచుకొందురు. పర్వత శిఖరమున కూర్చుందురు. అన్నదాతకు ఆచోటు ఇవ్వండి.

    4. దేవద్వయమా ! ఋషులు ఏర్పరచిన ఓషధులు, జలములను మీరు వ్యాపింప చేయుదురు. అందువలన మీరు ఓషధులను చరుపురోడాశాదులను, జలమును సోమరసమును కోరండి. మాకు బహురత్న దానము చేయండి. మీరు పూర్వదంపతులను అట్లే ఆకర్షించినారు.

    5. అశ్వినులారా ! మీరు శ్రుతిమంతులు. అనేకములు విన్నవారు. ఋషులు అనేక కర్మములను దర్శించినారు. మీరు యజమాని యజ్ఞమునకు విచ్చేయండి. మాకు మీ అత్యంత అన్నపూర్ణ అనుగ్రహము కావలెను.

    6. నా సత్యద్వయమా ! హవ్యయుక్తుడు, కృతస్తోత్రుడు, మానవులతో కలిసి ఉండు వసిష్ఠుని వద్దకు విచ్చేయండి. ఆ స్తోత్రములన్నియు మిమ్ములనే స్తుతించును.

    7. అశ్వినిద్వయమా ! ఈ స్తుతియు ఈ వచనమును మావియే. ఈ శోభన స్తుతులను స్వీకరించండి. సకల కర్మలు మిమ్ము కోఱవలెను. "యూయంపాతస్వస్తిభిః సదానః"


    (ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున నాలుగవ అనువాకము సమాప్తము.)


               అయిదవ అనువాకము             డెబ్బది ఒకటవ సూక్తము

                  ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. రాత్రి తన సోదరి ఉషనుండి స్వయముగనే తొలగిపోవును. నల్లనిరేయి ఎర్రని సూర్యునకు దారి ఇచ్చును. అందువలన అశ్వధన, గోధన అశ్వినులారా ! మిమ్ము మేము పిలుచుచున్నాము. రాత్రింబవళ్లు మావద్దనుండి హింసకులను దూరము చేయండి.

    2. అశ్వినిద్వయమా ! హవ్యదాతకు రథమున రమణీయ పదార్థములు తీసికొనిరండు. అన్న దారిద్ర్యమును, వ్యాధులను దూరము చేయండి. మమ్ము రాత్రింబవళ్లు రక్షించండి.

    3. మీ రథము అనాయాసముగ జోడించబడిన కోర్కెలు తీర్చు అశ్వములు మిమ్ము తీసికొని రావలెను. రశ్మివంతము, ధనవంతమగు రథమును జలదాతలగు అశ్వములతో లాగించండి.

    4. యజమానుల పాలకులారా ! మీరు ఎక్కు రథము మూడు ఆసనములు గలది. ధనవతి, దినమును పట్టిసాగునది. వ్యాపించి అరుగునది. అట్టి రథము మీదనే మీరు మావద్దకు రావలెను.

    5. మీరు చ్యవనుని ముసలితనము వదిలించినారు. పేరునామక రాజు కొఱకు యుద్ధమున వడిగల గుఱ్ఱమునంపినారు. అత్రి, అంధకారమును పాపమును దూరము చేసినారు. భ్రష్ట రాజ్యుడయిన జాహషునకు తిరిగి రాజ్యము ఇప్పించినారు.

    6. అశ్వనిద్వయమా ! ఈ స్తుతియు ఈ వచనమును మీదియే. ఈ శోభన స్తుతులను స్వీకరించండి. సకల కర్మలు మిమ్ము కోఱవలెను. మీతో సంగతము కావలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"    


                                     డెబ్బది రెండవ సూక్తము

              ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. నా సత్యద్వయమా ! మీరు గోవులు, అశ్వములు, ధనముతోకూడిన రథముపై రాగలరు. అనేక స్తుతులు మిమ్ము సేవించును. మీరు అభిలషణీయ శోభ మఱియు దేహముతో దీవించండి.

    2. నా సత్యద్వయమా ! మీరు దేవతలలో సమానప్రీతి యుక్తులయి రథమునెక్కి విచ్చేయండి. మీతో మా బంధుత్వము పూర్వజులనుండి కొనసాగుచున్నది. మీకు మాకు ఒకరే బంధువులు పితామహులు. వారి ధనము సహితము ఒక్కటే.

    (వివస్వతుని నుంచి వరుణుడు, అశ్వినులు కలిగినారు. వసిష్ఠుడు వరుణ సంబంధి. అందువలన బంధుత్వము వివస్వతుడు ఉభయులకు పితామహుడు)

    3. అశ్వినులకు స్తుతులు జాగృతులను చేయును. బంధుస్థానీయములగు సకల కర్మలు ప్రకాశమాన ఉషను జాగృతము చేయును. మేధావి వసిష్ఠుడు స్తుతులతో ద్యావాపృథ్వులను సేవించును. అశ్వినుల ముందు స్తుతులు చదువును.

    4. అశ్విద్వయమా ! ఉషస్సు అంధకారమును తొలగించగా స్తోతలు విశేషరూపమున నిన్ను స్తుతింతురు. సవిత ఊర్ధ్వతేజమును ఆశ్రయించును. సమిధలతో అగ్ని స్తుతించబడును.

    5. నా సత్యద్వయమా ! తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశలనుండి రండి. రారండి. పంచజనులకు హితవు కలిగించు సంపద తీసికొని రండి రారండి. "యూయంపాత స్వస్తిభిః సదానః"


                                        డెబ్బది మూడవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మేము దేవాభిలాషులమగుదుము. స్తుతింతుము. అజ్ఞానమును దాటిపోవుదుము. బహుకర్మ, ప్రభూత తమ పూర్వజాత, అమర్త్య అశ్విద్వయమా ! మిమ్ము స్తోతలు పిలుచుచున్నారు.

    2. అశ్వినులారా ! మీరు ప్రియుడగు మానవ స్తోత ఇక్కడ ఉన్నాడు. అతడు మీ యజ్ఞము చేయును. మాకు వందనము చేయును. అతనివద్ద నిలిచి అతడు అందించిన సోమరసము సేవించండి. అన్నవంతుడనై యజ్ఞమునకు మిమ్ము ఆహ్వానింతును.

    3. మేము స్తోతలము. మేము ఆగమనశీల దేవతల కొఱకు యజ్ఞమును పెంపొందింతుము. అశ్వినులారా ! ఈ స్తుతిని స్వీకరించండి. ఏను వశిష్ఠుడ. శీఘ్రగామి దూతవలె మీ వద్దకు చేరి, మిమ్ము స్తుతించి ప్రబోధితుడవగుదును.

    4. వీరిద్దరు హవ్యవాహకులు. రాక్షస నాశకులు. పరిపుష్పాంగులు. దృఢపాణులు.

    వారు మా ప్రజవద్ద విరాజిల్లవలెను. మీరు మదకర అన్నముతో కూడి ఉండండి. మమ్ము బాధించకండి "ఆగతమ్ శివేన" శుభములతో విచ్చేయండి.

    5. నా సత్యద్వయమా ! తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశలనుండి రారండి. పంచజనులకు హితవు కలిగించి సంపద తీసికొనిరండి-రారండి. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                      డెబ్బది నాలుగవ సూక్తము

         ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - బృహతి.

    1. నివాప్రదులగు అశ్వినులారా ! స్వర్గముకోరు జనులు మిమ్ము ఆహ్వానింతురు. మీరు విశేష వ్యక్తుల వద్దకే వెళ్లుదురు. అందువలన వసిష్ఠుడను - రక్షణకొఱకు మిమ్ము పిలుచుచున్నాను కేకవేయుచున్నాను.

    2. అశ్వినులారా ! మీ వద్ద విచిత్ర భోజ్య ధనము ఉన్నది. దానిని స్తోతవద్దకు పంపండి. సమాన మనసుగలవారై మీ రథమును మా వద్దకు పంపండి. సోమ సంబంధమగు మధుర రసము సేవించండి.

    3. అశ్వినులారా ! రండి మావద్ద నిలువండి. మధుర సోమరసము పానము చేయండి. అభీష్టవర్షకులు. ధనంజయులగు మీరు జలములను ఇవ్వండి. మమ్ము బాధించవద్దు.

    4. అశ్వినులారా ! మీ అశ్వములు మిమ్ము హవ్యదాత గృహమునకు కొనిపోవును. అట్టి శీఘ్రగామి అశ్వములపై మమ్ము చేరగోరి విచ్చేయండి.

    5. అశ్విద్వయమా ! స్తోతలు మరింత అన్నమును ఆశ్రయింతురు. మీరు మాకు చలించని కీర్తిని గృహమును ప్రసాదించండి. మేము ధనికులము.

    6. ఇతరుల ధనము గ్రహించనివారు. మానవులలో ఉండి మానవులను రక్షించువారు. రథమువలె మీవద్దకు చేరువారు స్వబలమున వర్థిల్లుదురు. నివసించుటకు మంచి ప్రదేశమునకు చేరుకొందురు.


                                         డెబ్బది ఐదవ సూక్తము

                ఋషి - వసిష్ఠుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉష అంతరిక్షమున ఆవిర్భవించినది. వెలుగులు తెచ్చినది. ఆమె తన తేజోబలమున తన మహిమను ప్రకటించుచు వచ్చినది. అప్రియ అంధకారమును దూరము చేయుచు వచ్చినది. ప్రాణికోటి తమ కార్యనిర్వహణకుగాను గంతవ్య మార్గమును ప్రకాశింప చేయుచు వచ్చినది.

    2. ఉషా ! నేడు మాకు సుఖములిచ్చుటకు మేల్కొనుము. మహా సౌభాగ్యమును అందించుము. విచిత్ర కీర్తియుక్త ధనమును మా కొఱకు అందుకొనుము. మానవ హితకారిణీ ! మానవులకు అన్నవంతులగు పుత్రులనిమ్ము.

    3. ఉషఃకిరణములు దర్శనీయములు. ప్రవృద్ధములు. అవి నాశ్యములు. దేవతల వ్రతముల ఉత్పాదకములు. అవి అంతరిక్షమును నింపును. అనేక ప్రకారముల వ్యాపించును.

    4. ఆమె ద్యులోకదుహిత. భువన పాలిక. అట్టి ఉష ప్రాణులందరి ప్రజ్ఞానులను దర్శించుచు ఇతర వ్యవహారములను వీక్షించుచు పంచజనుల వద్దకు త్వరత్వరగా చేరును.

    5. ఉష అన్నవతి. సూర్యపత్ని. విచిత్ర ధనవతి. ఆమె ఇప్పుడు ధనములకు, దేవధనములకు స్వామిని అయినది. ఋషులతో స్తుతించబడినదియు, వార్ధక్యము కలిగించునదియు, ధనవతియు అగు ఉష యజమానిచే స్తుతించబడి ప్రభాతము కలిగించును.

    6. దీప్తివంత ఉషను వహించు విచిత్రములు, శుభప్రదములగు అశ్వములు గోచరించుచున్నవి. ఉష దీప్తిమతి అయి అనేక రూపముల రథమున సర్వత్ర పయనించును. ఆమె తన సేవకులకు రత్నములిచ్చును. "రత్నంవిధతే జనాయ."

    7. ఉషోదేవి సత్యరూప, మహతి. యజనీయ ఆమె మహామహులు, యజనీయులగు దేవతలతో కలిసి అత్యంత స్థిర అంధకారమును చెదరగొట్టును. ఆమె గోవులు మేయుటకు వెలుగునిచ్చును. గోవులు ఉషస్సును కోరుకొనును.

    8. ఉషా ! మాకు గోవులు, వీరులు, అశ్వసహిత ధనమునిమ్ము. మానవులలో మా యజ్ఞమును నిందింపకుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                        డెబ్బది ఆరవ సూక్తము

                ఋషి - వసిష్ఠుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సవిత అందరినేత అంతరిక్షమున అవినాశ్యము, సర్వహితైషి అయిన జ్యోతిని ఆశ్రయించును. అతడు దేవకర్మల కొఱకు వెలువడినాడు. ఉష దేవతల నేత్ర స్వరూపిణి. ఆమె సమస్త భువనములను వెలువరించినది.

    2. నేను హింసారహితుడను. తేజోవంతుడను, సంస్కారవంతునయి దేవయాన పథమును చూచినాను. ఉషోకేతనము తూర్పుదిశన ఎగురును. మా ముందుకు ఉష ఉన్నత ప్రదేశము నుండి వచ్చును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.