Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అర్ధరాజ్యము ఇచ్చుటకు తరువాత ఐదేండ్లు పట్టినది. భీష్ముని ఒత్తిడి, శ్రీకృష్ణుని ప్రభావము , ద్రుపదుని బలము, ధృతరాష్ట్రుని మీద ప్రభావము వేసినవి. పాండవులకు అర్దారాజ్యము ప్రకటించునపుడు కౌరవులు లేరు. కురువృద్దులు లేరు. శ్రీకృష్ణుడు మాత్రమూ ఉన్నాడు.
ఇది రహస్యముగా జరిగిన నిర్ణయము.
ధృతరాష్ట్రుడు పాండవులను ఖండవమునకు తొలినాడు. అది మహారణ్యము. శ్రీకృష్ణుని ప్రభావమున అక్కడ ఇంద్రప్రస్థము వెలిసినది.
అర్ధరాజ్యము ప్రతిపాదించినది భీష్ముడు. సాధించి పెట్టినది శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు పాండవులకు అండదండయైనాడు.
యాత్రలు
పాండవులు ఇంద్రప్రస్థమున స్థిరపడినాడు. ఒకనాడు నారదుడు వచ్చినాడు. పాండవులు, ద్రౌపది అతనిని పూజించినారు. అప్పుడు నారదుడు అన్నాడు:-
"ధర్మరాజాదులారా! మీరు సకల ధర్ములు. అయినను మీకు అయిదుగురికి భార్య ఒక్కతే . స్త్రీ కారణముగా కలహములు సహజము. పూర్వము తిలోత్తమ కారణముగా అతి బలవంతులయిన అన్నదమ్ములు సుందోపసుందులు ఒకరిని ఒకరు చంపుకున్నారు. అందువలన మీరు ఒక నియమము ఎర్పరచుకొనుడు. ద్రౌపది ఒక్కొక్క భర్త వద్ద ఒక సంవత్సరము ఉండును. అట్లు ఉన్నప్పుడు ఆ భర్త ఇంటికి మరొకరు వెళ్ళరాదు. అట్లు వెళ్ళినచో ఒక సంవత్సరము తీర్ధయాత్రలు చేయవలెను."
అందుకు పాండవులు అయిదుగురు అంగీకరించినారు. నారదుడు పాండవులను ఆశీర్వదించినాడు. వెళ్ళిపొయినాడు. తోలి సంవత్సరము ద్రౌపది ధర్మరాజు ఇంట ఉన్నది.
అట్లుండగా ఒక బ్రాహ్మణుని గోవులు దొంగిలించబడినవి. అతడు అర్జునునకు మొర పెట్టుకున్నాడు. అర్జునుడు గోవులను తెత్తును అన్నాడు. బాపనికి అభయము ఇచ్చినాడు. కాని అతని వద్ద ఆయుధము లేదు. అది ధర్మరాజు ఇంట ఉన్నది. అక్కడికి వెళ్ళిన నియమభంగమగును. ఆర్తరక్షణకుగాను నియమభంగము చేసినాడు. ధర్మరాజు ఇంటికి వెళ్ళినాడు. ఆయుధము తెచ్చినాడు. దొంగలను చంపినాడు. గోవులను విదిపించినాడు. బాపనికి ఇచ్చినాడు.
బ్రాహ్మణ కార్యము తీరినది. అర్జునుడు ధర్మరాజుతో తాను నియమ భంగము చేసినందున యాత్రలకు వెళ్ళుదును అన్నాడు. ధర్మరాజు వారించినాడు. ఆర్తరక్షణకు నియమ భంగము చేయవచ్చును అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించలేదు. నియమము ప్రకారము యాత్రలకు వెళ్ళుటకే నిశ్చయించినాడు. ధర్మరాజు అందుకు అంగీకరించినాడు.
అర్జునుడు తీర్దాయత్రలకు సాగినాడు. అతని వెంట వేదవిదులు బ్రాహ్మణులున్నారు. శాస్త్రవేత్తలకు విద్వాంసులు ఉన్నారు. పౌరాణీకులు ఉన్నారు. వారితో కూడ అర్జునుడు సకల పుణ్య తీర్ధములను సేవించినాడు. యోగులను, విద్వాంసులను సత్కరించినాడు. గంగాతీర పుణ్య తీర్ధములను సేవించినాడు. గంగా ద్వారమును పుణ్య తీర్ధమునకు చేరినాడు. నిత్యము గంగా నదిలో స్నానము చేసినాడు. పితృతర్పనములు హోమములు గావించినాడు.
గంగా ద్వారమందు ఉండగా ఒక నాగ కన్యక అర్జునుని చూచి మోహించినది. ఆమె అర్జునుని పట్టుకున్నది. నాగలోకమునకు తీసుకొని వెళ్ళినది. "నా పేరు ఉలూచి. నేను నిన్ను చూచినాను. మోహించినాను. నీవు నా కోరిక తీర్చకున్న కామగ్నికి కాలి చత్తును" అన్నది. అర్జునుడు ఆరాత్రి ఉలూచితో భోగించినాడు. ఉలూచికి సద్యోగర్భమున "ఇలావంతుడు" అను కుమారుడు కలిగినాడు. మరునాడు అర్జునుడు గంగా ద్వారమునకు చేరినాడు.
అర్జునుడు గంగా ద్వారము నుండి బయలుదేరినాడు. హిమవంతమున గల అగస్త్యవనము, భ్రుగుశిఖరము, హిమబిందు తీర్ధములను దర్శించినాడు. తరువాత తూర్పునకు మళ్ళినాడు. ఉత్పలిని, కౌశికి, నంద, నవనంద, యశస్విని, మహానది, గయ, గంగను దర్శించినాడు. కళింగ ద్వారమున ప్రవేశించినాడు. అక్కడి నుంచి వెంట వచ్చిన బ్రాహ్మణులు వెళ్ళిపోయినారు. అర్జునుడు కొందఱు సహకులను వెంట పెట్టుకొని సాగినాడు. సముద్ర తీరము వెంట సాగినాడు. కళింగ మందలి దివ్యప్రదేశములను దర్శించినాడు. మహేంద్ర పర్వతమును సేవించినాడు. మణిపుర రాజ్యమున ప్రవేశించినాడు.
మణిపురమునకు రాజు చిత్రవాహనుడు. అతని కూతురు చిత్రాంగద. ఆమె సుందరాంగి. అర్జునుడు ఆమెను వనమున చూచినాడు. వలచినాడు. అర్జునుడు చిత్రవాహుని దగ్గరకు వెళ్ళినాడు. తాను చిత్రాంగదను వలచిన విధానము తెలియపరచినాడు. తనను గురించి వివరించినాడు. చిత్రాంగదను వివాహము చేసికొందును అన్నాడు.
చిత్రవాహనుడు అర్జునుని మాటలు విన్నాడు. సంతోషించినాడు. కానీ ఒక షరతు విధించినాడు. "పూర్వము మా వంశమున ప్రభాకరునకు సంతానము లేకుండెను. అతడు రుద్రుని గురించి తపస్సు చేసినాడు. రుద్రుడు ప్రత్యక్షము అయినాడు. మా వంశము వారందరకు ఒక్కొక్క పుత్రుడు కలుగునట్లు వరము ఇచ్చినాడు. అట్లే జరుగుచు వచ్చినది. నాకు మాత్రము చిత్రాంగద ఒక్కతే కూతురు కలిగినది. ఈమెను పుత్రుని వలె పెంచుకున్నాను. చిత్రాంగదకు కలిగిన పుత్రుని నీవు మాకు కన్యాశుల్కముగా ఈయవలెను. అట్లయిన చిత్రాంగదను ఇచ్చి నీకు వివాహము చేతును" అన్నాడు.
అందుకు అర్జునుడు అంగీకరించినాడు.
చిత్రాంగద అర్జునులకు వివాహము జరిగినది.
అర్జునుడు కొంతకాలము చిత్రాంగదతో గడిపినాడు. ఒకనాడు సముద్రతీరమునకు వెళ్ళినాడు. సౌభద్ర తీర్ధమునకు చేరినాడు. స్నానము చేయదలచినాడు. అక్కడి వారు అతనిని వారించినారు. అందు మొసళ్ళున్నవి. అవి ప్రమాదకరములు అన్నారు. అర్జునుడు వీరుడు. వారి మాటలు లెక్క చేయలేదు. సాహసించినాడు. సముద్రమున మునిగినాడు. అంతే అక్కడ భయంకరమగు మొసలి ఉన్నది. అది అర్జునుని పట్టినది. అర్జునుడు బలవంతుడు. అతడు తన శక్తితో మొసలిని పట్టినాడు. ఒడ్డునకు విసరినాడు.
ఆశ్చర్యము!
మొసలి దేవతాస్త్రీ అయినది!! ఆమె మాట్లాడినది!!!
"అర్జునా! నేను అప్సరసను. నా పేరు నంద. నాకు నలుగురు చెలికత్తెలు. వారు సౌరభేయి, సమీచి, వస, లత అనువారు. మేము లోకపాలకుల పట్టణములు చూచుచు ఈ వనమునకు వచ్చినాము. ఇక్కడ ఒక మునిపుంగవుడు తపము చేయిచున్నాడు. అతడు జితేంద్రియుడు, యోగి , అతనిని చూచినాము. మాలో చిలిపితనము చెలరేగినది. అతనిని భంగపరచినాము. అనేక చిలిపి పనులు చేసినాము. అతడు చెలించలేదు. కాని కోపించినాడు. మీరు అయిదుగురు దుర్మార్గులు . కాబట్టి మొసళ్ళు అయి ఉండుడు" అని శపించినాడు. శాపము విన్నాము. మేము వణకిపోయినాము. అతని పాదములంటి ప్రార్ధించినాము. మన్నించమని వేడుకున్నాము. శాపాంతము అనుగ్రహించమన్నాము. అతడు ముని. శాంతించినాడు. "ఒక మహాపురుషుడు మీచేత పట్టుబడును. అప్పుడు అతడు మిమ్ములను ఒడ్డునకు విసరును. అప్పుడు మీ శాపము పోవును. మీకు నిజరూపములు వచ్చును" అని అనుగ్రహించినాడు. నీవే ఆ మహా పురుషుడవు. "నా శాపము పోగొట్టినావు. నా చెలుల శాపము కూడ పోగొట్టుము" అని ప్రార్ధించినది.





