Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    బిటేన్ కదల్లేదు. మెల్లగా చొక్కా బనీనూ విప్పాడు. బసవ్ చకితుడై చూస్తుండగానే బిటేన్ వక్షం నగ్నం అయింది. బిటేన్ జందేన్ని రెండు పిడికిళ్ళతో పట్టుకొని తొమ్మిది పోగులు పటపటా తెగేట్లు లాగాడు. ఏదో దుష్టపదార్ధాన్ని విసిరినట్టు మూలకు విసిరేశాడు.
    బసవ్ చకితుడై "ఏ ......మి.....ట....ది?" అన్నాడు.
    "బసవ్ దాదా, నేనింకా బ్రాహ్మడిని కాను. ఇప్పడ్నించి మీలో ఒకణ్ణి. ఇప్పటికీ నేనంటే ద్వేషమా?"
    బసవ్ చేతులు చాచి గట్టిగా కౌగలించుకున్నాడు.
    "భాయీ, ఇది క్షణికొన్మధం వల్ల కలిగిన మార్పు కాదు కదా?"
    బిటేన్ తల ఊపాడు. అతడు ఇందును గురించి అనేక రోజులుగా ఆలోచిస్తున్నాడు.
    "జందాన్ని పారేసి, కలకాలపు నరకం అర్జిన్చుకున్నావు. కొత్త జందెం కొనుక్కోవడం అట్టే కష్టం ఏమీ కాదు. ఈ క్షణంలో కలిగిన మార్పుకు కట్టుబడి ఉంటావా?"
    "ఇదిగో ప్రమాణం చేస్తున్నా. మళ్ళీ ఈ జందెం ముట్టను. ఇది పూర్ణిమ చనిపోతూ నాకు నేర్పిన గుణ పాఠం . తెలిసిందా బసవ్ దాదా?"
    అదీ జరిగిన కధ.
    ఆ తరువాత అతడు తలిదండ్రులతో ఉండలేకపోయాడు. జందెం లేని కుమారుణ్ణి చూచి సహించగలరా? వారి పూర్వవిశ్వాసాలు వీసమంతైనా సడలలేదు. ఆ స్థితిలో బిటేన్ వారి కంటపడితే పట్టుకొని ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ద్విజున్ని చేస్తారు. జరిగిన దురదృష్టానికి పూర్వజన్మ పాపాలే కారణం అని ఎంచి వారు క్రతువులను పూర్వం కంటే నియమనిష్టలతో నిర్వర్తిస్తారు. పూర్ణిమ ఆత్మహత్య వల్ల బిటేన్ లోని పాత నమ్మకాలు కూకటి వేళ్ళతో కదలిపోగా, తలిదండ్రుల్లో ఆ వ్రేళ్ళు గట్టి పడ్డాయి. ఏమాత్రం లోపం జరిగినా పాపం సంపాదించుకొని అది ఈ జన్మలో గాని, వచ్చే జన్మలో గాని అనుభవించాల్సి వస్తుందని వారు క్రతువులు విషయంలో అతి జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు.
    ఆరాత్రి ఇల్లు వదిలి బిటేన్ కలకత్తా బైల్దేరాడు. ఆ మహానగరంలో తన చెల్లెలు లేదని అతనిలి తెలుసు. అప్పుడతడు బైల్దేరింది పొట్ట గడుపుకోవడానికి. ఆవిధంగా అతడు బెంగాల్ అటో మోబైల్స్ లో పనికి కుదిరాడు. జెల్లో గడిచిన ఒక సంవత్సరం మరుసటి రంగానికి విష్కంభం లాంటిది. మళ్ళీ అదేచోట 37 ఫోర్డు వాల్వు సానపడ్తున్నాడు.
    బ్రాహ్మణత్వం మీద ఈర్ష్యాద్వేషాలు గల తాను ఒక కొత్త బ్రాహ్మడి సృష్టికి కారకుడయ్యాడు! ఇందులోని అర్ధం ఏమిటి? ఆ నూతన ద్విజుడు కులాలను మంటగలిపి పాపపరిహారం చేస్యిస్తున్నాడు. ఇతరుల్ను పతితుల్ను చేయడానికి వారి విశ్వాసాలను కొల్ల గొడుతున్నట్టివాడు స్వయంగా ఒక విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు. ఇలాంటి విచిత్ర వైరుద్యాలతో ఏమైనా సాధించడం సాధ్యమేనా?
    అతని కూతురు చంద్రలేఖ! పూజారి కూతురుగా నటించడంలో ఆమెకు సుఖం లేదే? ఆమె రూపం, ధ్వని, మాటా అన్నింటిలో బిటేన్ లీనం అయిపోయాడు.
    ఆకలి డొక్కలకు అన్నం అడగడం నేరమా?
    నల్లని ఆమె కనుపాపలు మరీ నలుపెక్కుతున్నట్లు కనిపించాయి. ఆదరా బాదరాగా ఊపిరి పీల్చడంతో ఆమె నాసికాపుటాలు ఉబ్బాయి. తిండి దొంగల్ను జైలుకు పంపడమే కాదు ఉరితీయాలి!
    ఈ భావనలు , అభిప్రాయాలు కుమ్మరి సారే మీది మట్టి ముద్దకు సాధ్యమేనా?
    తండ్రి లేఖకు వరుణ్ణి సంపాదించడానికి అట్టే కాలం పట్టదు. వరుడు బ్రాహ్మడు అయి ఉంటాడు. లేఖ పెళ్ళి జరిగిపోయింది. ఆమెలో రగిలే జ్వాలను ఆమె భర్త అర్ధం చేసుకోగలడా? ఆమెను వేల మందిలో ఒకదానిలా భావిస్తాడు. ఆమె ఇల్లు చక్క పెడుతుంది. రోజువారీ పద్దులు వ్రాస్తుంది. మతం ఆమెకు గాను విధించిన కర్మకాండ యావత్తూ నిర్వర్తిస్తుంది. అలకరించుకొని అందంగా సిద్దం అవుతుంది. అంతటితో ఆమె తృప్తి చెందుతుందా? ఆమెకు తన భర్తను ప్రేమించడం సాధ్యం అవుతుందా?
    వాల్వు చెయి జారి పడిపోయింది. ఉలిక్కిపడి భావనా ప్రపంచం నుంచి భైటపడ్డాడు. గుండెలోని నినాదాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ వాల్వు సానపెట్టడం మొదలుపెట్టాడు. అంతటితో అతనిలోని బాధ అంతరించలేదు. అది ఇనుమడించింది. అనిర్వచనీయమైన వ్యధ అతనిలో ప్రవేశించి కలచి వేసింది. ఇంతకు ముందెప్పుడూ అతడు అంత మధనపడి ఎరుగడు. ఒంటరి అయిపోయాడు. తలిదండ్రులు అతన్ని నిందించారు. చెల్లెలు అసువులు బాసింది. జీవించాల్సింది ఎవరికోసం? క్షామజ్వాల బెంగాల్ను చుట్టుముట్టింది. ఆ జ్వాలల్తో కుస్తీ పట్టు నిరర్ధకం. జెల్లోనే హాయిగా ఉండేది. రోజంతా చమటోడ్చి పనిచేస్తే రాత్రి ప్రశాంతంగా ఇనుప మంచం మీద మేను వాల్చగలిగేవాడు. విడుదలైన రెండు రోజుల్లోనే జీవితపు రంగు మారిపోయింది. అతనిలో అర్ధం కాని రిక్తతా, అభాతం , భయంకరమైన వ్యధా కాపరానికి వచ్చాయి. శాంతి సుదూరంగా నిలిచిపోయింది.
    

                                    18
    
    "పోరాటమే వాస్తవమార్గం. పోరాటం, భయానికి వ్యతిరేకంగా ప్రధమపోరాటం. " ఈ మాటలు చంద్రలేఖ హృదయకుహరంలో మరుపలికాయి.
    కొన్ని నెలలక్రితం ఒకనాటి సాయంకాలం, తండ్రి ఆమెను నాటకానికి తీసికెళ్ళాడు. అది టాగూర్ నాటకం. పైతరగతి టిక్కెట్లు కొన్నాడు. అట మొదలుకవడానికి చాల ముందే వారు నాటకశాలకు వచ్చి కూర్చున్నారు.
    కూర్చొని ఒకసారి చుట్టూ చూసింది. ఆమె గుండె ఝల్లుమంది. ఇంకో పక్కన కూర్చున్న ఒక లావు స్త్రీ బైనాక్యూలర్స్ లోంచి చూస్తుంది. అంతదూరం నుంచి ముఖం గుర్తించేట్లు లేదు. కాని ఎక్కడో ఆమెకు పరించయం ఉన్న ముఖంలా కనిపించింది.
    అది ఆమె ముఖమే!
    గుండె రేపరేపాకొట్టుకుంది. ఆ దుష్ట స్త్రీ లేఖను గుర్తిస్తుందా? అద్దాల్లోంచి కళ్ళు చీల్చుకొని చూచే ఆమె దృష్టి నుంచి ఎలా తట్టుకోవడం? ఆ స్త్రీ లేచి నుంచుంది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.