Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
1. అగ్నే జాతా న్ప్రణుదా నః సపత్నా న్ప్రత్యాజాతాన్నుద జాతవేదః|
అధి నో బ్రూహి సుమనా అహేడస్తవ స్యామశర్మం స్త్రివరూథ ఉద్భౌ ||
(ఈ అధ్యాయము అయిదవ కుండమునకు సంబంధించినది. తొలుత అయిదు అసపత్న, ఇటుకలను పేర్చవలెను)
అగ్నీ! ఇప్పటికే పుట్టిన మా శత్రువులను సప్రకర్షముగ నష్టపరచుము. జాతవేద అగ్నీ! పుట్టనున్న మా శత్రువులను సహితము నష్టపరచుము. క్రోధములేని ప్రసన్న మనమున మాకు యజ్ఞవిద్యను ఉపదేశించుము. మేము నీ పరిచర్య చేయుచు సదః - హవిర్ధాన - అగ్రీధ్రములను త్రిభాగయుక్తమగు, సుఖసమృద్ధులు కలిగించు- నీ యొక్క యజ్ఞగృహమున నిత్యనివాసము చేయుదుము గాక.
2. అగ్నీ! సాహససేనలు గల మాశత్రువును నష్టపరచుము. జాతవేదాగ్నీ! పుట్టనున్న మాశత్రువులను సహితము నష్టపరచుము. నీవు ప్రసన్నుడవగుము. మమ్ము నీ వారలమని వచింపుము. మేము సుమనస్కులము కావలెను. సుమనస్యమానో వయం. మా శత్రువులనందరను తపింపచేయుము.
3. ఇష్టకా! నీవు పదహారు కళలపక్షమవు. బలధనస్వరూపవు. నిన్ను ఈ అయిదవ కుండమునందు చేర్చుచున్నాను.
ఇష్టకా! నీవు చతుశ్చత్వారింశస్తోమవవు. బ్రహ్మవర్చో రూపధనమవు. నిన్ను ఈ అయిదవ కుండమునందు చేర్చుచున్నాను.
ఇష్టకా! నీవు అభక్షక అగ్నివి. చంద్రునకు పదహారుకళలు కలిగించుదానవు. నిన్ను ఈ అయిదవ చితియందు చేర్చుచున్నాను.
ఇష్టకా! నిన్ను విశ్వేదేవతలు సంస్తుతింతురు గాత. స్తోమములు, పుష్ఠములు, హొమములందు ఉపయుక్తమగు ఘృతయుక్తవై ఇచట స్థిరపడుము. మమ్ము పుత్రవంతులను, ధనవంతులను చేయుము.
4. (ప్రతిదిశం దశదశ విరాట సంజ్ఞా ఇష్టకా ఉపదధాతి. ప్రతివైపు పదిపది చొప్పున విరాటములను ఇటుకలను చేర్చును)
ఇష్టకా! సకల ప్రాణుల రాకపోకల ఈ భూలోకమే ఏక ఛందస్సు . నీవు ఏవ ఛందస్వరూపవు. నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! ప్రభామండలమున విరాజిల్లు అంతరిక్షలోకమే 'వరివ' ఛందము నీవు 'వరివ' ఛందస్వరూపవు. నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! సకలమునకు సుఖకారకమగు ద్యులోకమే 'శంభూ' ఛందము. నీవు ఆ ఛందస్వరూపవు. నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! పరితమున విరాజిల్లు దిశలే 'పరిభూ' ఛందము. నీవు ఆ ఛందస్వరూపవు. నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! తనరసమున శరీరమును నిలుపు అన్నమే 'ఆచ్ఛ' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! ప్రజాపతియే మన శ్ఛందము. ఆ 'ఛందో రూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! సర్వజగములను వ్యాపించిన సూర్యుడే 'వ్యచ' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! శరీరమును నిలుపు ప్రాణమే 'సింధు' ఛందము ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! మనసే 'సముద్ర' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! నాలుకనుండి వెలువడు 'వాక్కు' 'సరిర' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! ప్రాణమే 'కకుప్' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! త్రాగిన నీటిని మూడు విధములుగా ధరించు ఉదానమే 'త్రికతుప్' ఛందము ఆఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! వేదత్రయియే 'కావ్య' ఛందస్సు. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! వంకర నడకల జలమే 'అంకుప్' ఛందము. ఆ ఛందో రూపమగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! క్షయరహితమగు ద్యులోకమే 'అక్షరపంక్తీ' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! ఈభూలోకమే 'పదపంక్తి' ఛందము. ఆ ఛందోరూపవగు నిన్ను చయననము చేయుచున్నాను.
ఇష్టకా! వస్తువుల విస్తారయుక్త దిశలే 'విస్తారపంక్తి' ఛందము. తచ్ఛందో రూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
5. అన్నమే ఆచ్ఛచ్ఛందము. అన్నమే ప్రచ్ఛశ్ఛందము. రాత్రియే సంమచ్ఛచ్ఛందము. పగలే వియచ్ఛందము. ద్యులోకము బృహచ్ఛందము. భూమండలమే రథన్తరచ్ఛందము. వాయువు నికాయచ్ఛందము. అంతరిక్షమే వివిధచ్ఛందము. అన్నమే గిరశ్ఛందము. అగ్నియే భ్రజశ్ఛందము. వాక్కు సంస్తుప్ - అనుష్టుప్ ఛందము. పృథ్వియే ఏవశ్ఛందము. అంతరిక్షము బరివశ్ఛందము. అన్నమే వయశ్ఛందము. జఠరాగ్నియే వయస్కృచ్ఛందము. భూతలమే విశాలచ్ఛందము. అంతరిక్షము ఛదిశ్ఛందము.ఆదిత్యుడే దురోహణశ్ఛందము. పంక్తియే తంద్రచ్ఛందము. జలమే అంకాంకచ్ఛందము.
ఇష్టకా! తత్స్యరూపవగు నిన్ను చయనము చేయుచున్నాను.
6. (సర్వదిక్షు స్తోమభాగా సంజ్ఞాఇష్టకా ఉపదధాతి - నలుదిక్కులందు స్తోమభాగమను ఇటుకలను పేర్చును)
ఇష్టకా! తేజోవృద్ధిచేయు అన్నము ద్వారా సత్యము కొరకని వేదియందు చేర్చబడినావు. సత్యమును కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా ధర్మము కొరకు చేర్చబడినావు. ధర్మమును కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా ద్యులోకము కొరకు చేర్చబడినావు. ద్యులోకమును కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా అంతరిక్షము కొరకు చేర్చబడినావు. అంతరిక్షమును కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా పృథ్వి కొరకు చేర్చబడినావు. పృథ్విని కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా సృష్టి కొరకు చేర్చబడినావు. సృష్టిని ప్రోత్సహించుము.
ఇష్టకా! అన్నము ద్వారా దినము కొరకు చేర్చబడినావు. దినమును కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా రాత్రి కొరకు చేర్చబడినావు. రాత్రిని కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా వసువుల కొరకు చేర్చబడినావు. వసువులను కాపాడుము.
ఇష్టకా! అన్నము ద్వారా ఆదిత్యుల కొరకు చేర్చబడినావు. ఆదిత్యులను కాపాడుము.
7. ఇష్టకా! అన్నము ద్వారా గో-అశ్వధనము కొరకు చేర్చబడినావు. గో-అశ్వధనమును వర్ధిల్లచేయుము.
ఇష్టకా! అన్నము ద్వారా శాస్త్రజ్ఞానము కొరకు చేర్చబడినావు. శాస్త్రజ్ఞానమును వర్ధిల్లచేయుము.
ఇష్టకా! అన్నము ద్వారా ఓషధుల కొరకు చేర్చబడినావు. ఓషధులను వర్ధిల్లచేయుము.
ఇష్టకా! అన్నము ద్వారా శరీరము కొరకు చేర్చబడినావు. శరీరమును వర్ధిల్లచేయుము.
ఇష్టకా! అన్నము ద్వారా అధ్యయనము కొరకు చేర్చబడినావు. అధ్యయనమును వర్ధిల్లచేయుము.
ఇష్టకా! అన్నము ద్వారా తేజస్సు కొరకు చేర్చబడినావు. తేజస్సును వర్థిల్లచేయుము.
8. ఇష్టకా! నీవు అన్నస్వరూపవు. అన్నము కొరకు నిన్ను చయనము చేయుచున్నాను. నీవు అనుపదస్వరూపవు. అనుపదము కొరకు నిన్ను చయనము చేయుచున్నాను. నీవు సంపత్ స్వరూపవు. సంపదకొరకు నిన్ను చయనము చేయుచున్నాను. నీవు తేజోస్వరూపవు. తేజస్సు కొరకు నిన్ను చయనము చేయుచున్నాను.
9. ఇష్టకా! నీవు 'త్రివృద్' స్వరూపవు. త్రివృద్ నిమిత్తము నిన్ను చయనము చేయుచున్నాను. నీవు ప్రవృద్ స్వరూపవు. ప్రవృద్ కొరకు నిన్ను చయనము చేయుచున్నాను. నీవు వివృద్ స్వరూపవు. వివృద్ నిమిత్తము నిన్ను చయనము చేయుచున్నాను. నీవు సువృద్ స్వరూపవు. సువృద్ నిమిత్తము నిన్ను చయనము చేయుచున్నాను. నీవు 'అక్రమ్' స్వరూపవు. అక్రమ్ నిమిత్తము నిన్ను చయనము చేయుచున్నాను. నీవు సంక్రమ్ స్వరూపవు. సంక్రమ్ నిమిత్తము నిన్ను చయనము. చేయుచున్నాను. నీవు ఉత్ర్కాన్తి స్వరూపవు. ఉత్ర్కాన్తి స్వరూపవు. ఉత్ర్కాన్తి నిమిత్తము నిన్ను చయనము చేయుచున్నాను.
ఇష్టకా! నీవు అధిపతివై మాబల వీర్యములను వర్ధిల్లచేయుము.
10. (తూర్పును వదలి మిగిలిన మూడు దిశలందు 'నాకసద్' నామక ఇటుకలను కూర్చవలెను)
ఇటుకా! శోభనమనస్కవగు నీవు ప్రాచీదిశవు. నిన్ను పాలించు వారు వసువులు. శత్రువుచే ప్రయోగించబడిన శాస్త్రాస్త్రముల నివారణ కర్త అగ్ని అగును. త్రివృత్సోమము. నిన్ను పృథ్విమీద నిలుపుము. రథన్తరసామము నిన్ను అంతరిక్షమున నిలుపును. సప్తప్రాణములు - ద్యులోకమును విస్తరించినరీతి - నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారకవాక్కు - అధిపతి మనసు నిన్ను నిలుపవలెను. వీరందరు ఐకమత్యమున నిన్ను యజమానిని స్వర్గలోకమున నిలుపవలెను.
11. ఇష్టకా! శోభన మనస్కవగు నీవు దక్షిణదిశవు. నిన్ను పాలించువారు రుద్ర గణములు. శత్రువుచే ప్రయోగించబడిన శస్త్రాస్త్రముల నివారణకర్త ఇంద్రుడగును. పంచదశ స్తోమము నిన్ను పృథ్వి మీద నిలుపును. నీ నిశ్చలత కొరకు 'వాయురాగ్రేగా' ప్రఉగ ఉక్థము నిన్ను దృఢపరుచవలెను. బృహత్సామము నిన్ను అంతరిక్షమున నిలుపును. ప్రథమోత్పన్న ప్రాణము - ద్యులోకమును విస్తరించిణ రీతి - నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారక వాక్కు - అధిపతి మనసు నిన్ను నిలుపవలెను. వీరందరు ఐకమత్యమున నిన్ను -యజమానిని స్వర్గ లోకమున నిలుపవలెను.
12. ఇష్టకా! శోభన మనస్కవగు నీవు పశ్చిమ దిశవు. నిన్ను పాలించువారు. ఆదిత్యగణములు. శత్రువుచే ప్రయోగించబడిన శాస్త్రాస్త్రముల నివారణ కర్త వరుణుడగును. సప్తదశస్తోమము నిన్ను పృథ్విమీద నిలుపును. నీ నిశ్చలత కొరకు 'త్వారథం యథోవయే' ఉక్థశస్త్రము నిన్ను ధృఢపరచును గాత. వైరూపసామము నిన్ను అంతరిక్షమున నిలుపును. ప్రథమోత్పన్నప్రాణము ద్యులోకమును విస్తరించిన రీతి- నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారకవాక్కు - అధిపతి మనసు నిన్ను ద్యులోకమును విస్తరించిన రీతి - నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారకవాక్కు - అధిపతి మనసు నిన్ను నిలుపవలెను. వీరందరు ఐకమత్యమున నిన్ను - యజమానిని స్వర్గలోకమున నిలుపుదురు గాత.
13. ఇష్టకా! స్వయం ప్రకాశమానవగు నీవు ఉత్తరదిశవు. నిన్ను పాలించు అధిష్టాన దేవతలు మరుద్గణములు. శత్రువుచే ప్రయోగించబడిన శస్త్రాస్త్రముల నివారణకర్త సోముడగును. ఏకవింశత్సోమము నిన్ను పృథ్విమీద నిలుపును. నీ నిశ్చలత కొరకు "అభిత్వాశూరనోనుమః" నిష్కైవల్య శస్త్రము నిన్ను దృఢపరచవలెను. వైరాజస సామము నిన్ను అంతరిక్షమున నిలుపును. ప్రథమోత్పన్న ప్రాణము - ద్యులోకమును విస్తరించిన రీతి - నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారకవాక్కు - అధిపతి మనస్సు నిన్ను నిలుపవలెను. వీరందరు ఐకమత్యమున నిన్ను యజమానిని స్వర్గలోకమున నిలుపవలెను.
14.ఇష్టకా! నీవు సర్వపాలన కర్త్రి ఊర్ధ్వదిశవు. విశ్వేదేవతలు నీకు అధిష్టాన దేవతలు. శత్రువుచే ప్రయోగించబడు శాస్త్రాస్త్రముల నివారణ కర్త బృహస్పతి అగును. త్రిణవ -త్రయస్త్రింశత్సోమము నిన్ను పృథ్విమీద నిలుపును. 'తత్సవితుర్వృణీమహే' వేశ్వదేవ శాస్త్రము మరియు 'వైశ్వానరాయ పృథుసాజసా' అగ్ని మారుత శాస్త్రము నిన్ను దృఢపరచవలెను. ప్రథమోత్పన్న ప్రాణము -ద్యులోకమును విస్తరించిన రీతి - నిన్ను దేవతలందు నిలుపవలెను. ధారక వాక్కు - అధిపతి మనసు నిన్ను నిలుపవలెను. వీరందరు ఐకమత్యమున నిన్ను - యజమానిని స్వర్గలోకమున నిలుపుదురు గాత.
15. (నాకసద ఇటుకల మీద చత్వాలమృత్తువేసి ఆస్తి పంచచూడ ఇటుకలను యథాస్థానమున ఉంచవలెను)
అగ్ని సమ్ముఖమున రగులునది. అగ్నియొక్క కేశముల వంటి జ్వాలా కిరణములు సూర్యకిరణ సదృశములు. అగ్నియొక్క రథమును వహించుట యందు నిపుణుడగు రథగృత్సుడు, రథయుద్ధ కుశలుడు రథౌజుడు దేవసేనానియు గ్రామణియు అగుదురు. వారిరువురు వసంతఋతు సంబంధ ఫాల్గుణ - చైత్రములను రెండు మాసములు. దిక్, ఉపదిక్ రూపలగు పుంజికస్థల ఇరువురు అప్సరలు పరిచారికలు. దశనశీలలగు వ్యాఘ్రాది మృగములు అగ్నికి వజ్రాయుధములు. అగ్ని యొక్క పౌరుషేయ వధ - ఒకరినొకరు కొట్టుకొనుటయే - హననమగును.





