Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    4. మిత్రావరుణులారా ! మీరు రాజులు. మనసు లగ్నముచేసి మీకొఱకు ఈ రథము నిర్మించినవారికి, ఉత్తమ కర్మలు చేసినవానికి, యజ్ఞమున మిమ్ము స్మరించువానికి జలమును, అందమగు నివాసమున ఇచ్చి సంతృప్తుని చేయండి.

    5. మిత్రావరుణులారా ! మీ కొఱకుగాను వాయువు కొఱకును దీప్తమగు సోమమువంటి సోమము సిద్ధమైనది. మీరు మా కర్మములందు ప్రవేశించండి. మా స్తుతులకు గమనించండి. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                        అరువది ఐదవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్ర, శుద్ధ బల వరుణులారా ! సూర్యోదయముకాగా మీ ఉభయులను నేను స్తుతులతో ఆహ్వానింతును. మీ బలము అక్షయము ప్రరము. యుద్ధము జరిగినపుడు మీరు విజయ వంతులగుదురు.

    2. వారిద్దరు దేవతలలో అసురులు బలవంతులు. ఆర్యులు అందరకు ప్రభువులు.

    మిత్రావరుణులారా ! మేము మిమ్ము వాపింప చేయుదుము. మీ వ్యాపకతలో ద్యావాపృథ్వులు, రాత్రింబవళ్ళు మమ్ము ఆప్యాయితులను చేయును.

    3. మిత్రావరుణుల వద్ద అనేక పాశములు ఉన్నవి యజ్ఞము చేయనివారిని అబద్ధములాడు వారిని వారు ఆ పాశములతో బంధింతురు. వారు శత్రువులకు దురతిక్రములు. వారు మమ్ము పడవతో నదిని దాటించినట్లు యజ్ఞమార్గమున పాపములనుండి దాటింతురు.

    4. మిత్రావరుణులారా ! మా హవ్యము స్వీకరించుటకు విచ్చేయండి. అన్న సహితముగా మా గోచర భూమిని జలసిక్తము చేయండి. ఈ జగములందు మీకు ఉత్కృష్ట హవ్యము ఇవ్వగలవాడు ఉన్నాడా? మీరు లోకములకు స్వర్గీయము, రమణీయమగు జలమును ప్రసాదించండి.

    5. మిత్రావరుణులారా ! మీకొఱకును, వాయువు కొఱకును దీప్తమగు సోమమువంటి సోమము సిద్ధమైనది. మీరు మా కర్మములందు ప్రవేశించండి. మా స్తుతులను గమనించండి. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                        అరువది ఆరవ సూక్తము

 ఋషి - వశిష్ఠుడు, దేవత - మిత్రావరుణులు - సూర్యుడు ఛందస్సు - వివిధము.

    1. మరల మరల ఆవిర్భవించు మిత్రావరుణుల సుఖకర, అన్నవంత సూక్తము సాగుచుండవలెను.

    2. శోభనబలవంతులు, బలముల రక్షకుల, విశిష్ట తేజోవంతులగు మిత్రావరుణుల బలములకొఱకు దేవతలు నిలిచినారు.

    3. మిత్రావరుణులారా ! మీరు గృహములను, దేహములను పాలించువారు. మీరు స్తోతల కర్మరూప స్తోత్రములను సఫలము చేయండి.

    4. మిత్ర, సవిత, ఆర్యమ, భగులారా ! మీరు పాప నాశకులు. సూర్యోదయమైనంతమీరు, నేడు, మాకొఱకు, అపేక్షిత ధనమునుపంపండి.

    5. శోభన దాన పారాయణులారా ! మా పాపములను దూరము చేయండి. మీరు చేరిన ఇల్లు సురక్షితము అగుగాత.

    6. మిత్రాదులు అదితి అహింసక వ్రతములకు ఈశ్వరులు. వారు మహాధనములకు కూడ ఈశ్వరులు.

    7. సూర్యోదయమైనంత మిత్రావరుణులను శత్రుభక్షక ఆర్యమను నేను నుతింతును.

    8. ఈ స్తుతి హితకరము. రమణీయమగు ధనముతో పాటు మాకు అహింసనీయబలము నీయవలెను.

    9. మిత్రావరుణులారా ! ఋత్విక్కులతో కలిసి మేము మీ స్తోతల మగుదుము. మేము ధనము, బలము సహితము దాల్చెదము.

    10. మిత్రాదులు మహాసూర్యునివలె దీప్తులు అగ్ని జిహ్వులు యజ్ఞవర్ధకులు వీరులయి విశాలప్రదేశములను ప్రదానము చేస్తారు.

    11. మిత్రావరుణ ఆర్యములు సంవత్సరములు, మాసములు, దినములు, రాత్రులు, మంత్రములను ఏర్పరచినారు. ఆరు శోభాయమానులై ఏ ఇతరులకు లేనంతటి బలము కలవారైనారు.

    12. మిత్రావరుణ ఆర్యములారా ! నేడు సూర్యోదయమైనంత సూక్తములతో మిమ్ము స్తుతింతుము. నీ వద్ద ఉన్న ధనమును యాచింతుము.

    13. నేతలారా ! మీరు ఋతవంతులు ఋతజాతలు ఋతవర్ధకులు. భయానకులు ఋతహీనుల ద్వేషులు మీవద్ద సుఖములనిచ్చు ధనము ఉన్నది. దానికి ఇతర ఋత్విక్కుల సహితముగా మేము హక్కుదారులము అగుదుము.

    14. అది దర్శనీయ మండలము. అది అంతరిక్ష సమీపమున ఉదయించుము. హరితవర్ణ, శీఘ్రగామి అశ్వములు ఆ మండలమును వహించును. అందరకు దర్శనము చేయించును.

    15. సూర్యుడు శీర్షములకు శీర్షము. సకల స్థావరజంగమా భర్త. రథారోహి, పిడు శీఘ్రాగమి, హరితవర్ణలు లోక కళ్యాణమునకుగాను సమస్త జగములముందుకు సూర్యుని తెచ్చును.

    16. అతడు నేత్రము వంటివాడు. దేవతల హితముకోరువాడు. నిర్మలుడు. సూర్యమండలమున ఉదయించుచున్నాడు. మేము నూరేళ్లు చూడవలెను. నూరేళ్లు జీవించవలెను. "పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతమ్".

    (నూరేళ్లు జీవించటం మాత్రంచాలదు. నూరేళ్లు కన్నులుండి జీవించవలె అవయములన్నియు చక్కగా ఉండి జీవించవలెనను ఆశయము)

    17. మిత్రావరుణులారా ! మీరు అహింసనీయులు. ద్యుతిమంతులు. మా స్తోత్రములు వినుడు.సోమపానమునకు విచ్చేయుడు.

    18. మిత్రావరుణులారా ! మీరు ద్రోహరహితులు. మీరు ద్యులోకము నుండి రారండి. శత్రువును హింసించండి. సోమపానము చేయండి.

    19. మిత్రావరుణులారా ! మీరు యజ్ఞ నేతలు. ఆహుతులు సేవించండి. యజ్ఞవర్ధకులు కండి, సోమపానము చేయండి.


                                         అరువది ఏడవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! మేము హవ్యయుక్త స్తోత్రములతో మీ రథమును స్తుతించుచున్నాము కొడుకు తండ్రిని లేపినట్లు మీ రథము దూతవలె జగములను లేపును. ఆ రథమే మా ముందుకు రావలెనని పిలుచుచున్నాను.

    2. మేము సమిధలు అర్పింతుము. అగ్ని ప్రజ్వరిల్లును. అప్పుడు చీకటిచోట్లనుకూడ జనులు చూడగలరు. సూర్యుడు ప్రజ్ఞాపకుడు. అతడు ద్యులోకదుహిత ఉషయొక్క పూర్వదిశన అందములు సంతరించుకొని ఉదయించును. అప్పుడు అందరు అతనిని తెలిసికొందురు.

    3. నా సత్యద్వయమా ! సుందరహోత, స్తుతివక్త, స్తోమముతో మేము మిమ్ము సేవింతుము. స్తోత్ర ఫల స్వరూపులై మీరు పూర్వ మార్గమున జలజ్ఞాత ధనయుక్త రథమున మాముందు అవతరించండి.

    4. అశ్విద్వయమా ! మీరు రక్షకులు, మధుర సోమయోగ్యులు. సోమాభిషవమైనంత, మిమ్ము కోఱి, ధనాభిలాషినై, నేను మిమ్ము స్తుతింతుము. మీ ప్రవృద్ధ అశ్వము నిన్ను తీసికొనిరావలెను. మీరు మధురసోమము ఆరగించవలెను.

    5. అశ్వినులారా ! మాబుద్ధి, ధనాభిలాషిణి సరళ హింస ఎరుగనిది. దానిని లాభయోగ్యము చేయండి. యుద్ధమునందును మా బుద్ధిని రక్షించండి. మాకు కర్మ మూలమగు ధనమును ప్రసాదించండి.

    6. అశ్వినులారా ! మా కార్యములందు మీరు మమ్ము రక్షించండి. మా వీర్యము క్షీణించరాదు. పుత్రోత్పాదక సమర్థముకావలెను. మాపుత్ర, పౌత్రులను అనుగ్రహించండి. వారు కోఱిన ధనము ప్రసాదించండి. మేము ధనవంతులమై యజ్ఞములు దర్శించుచుందుము.

    7. మధుప్రియ అశ్వినీకుమారులారా ! మిత్రుని కొఱకుగాను దూత ముందుగా వెళ్లినట్లు మేము సంకల్పించిన సోమము నిధిస్వరూపమున మీముందు సమర్పించబడినది. కావున క్రోధశూన్య చిత్తమున మాముందుకు ఏతెంచండి. మానవరూప ప్రజల హవిని ఆరగించండి.

    8. అందరిని పోషించు అశ్వినీ ద్వయమా ! మీరు ఇద్దరు కలిసినంత మీ రథము ఏడు ఏరులు దాటివచ్చును. మీ అశ్వములు సుజన్మలు దేవసంపన్నులు. అవి మిమ్ము మోయును. మీ రథములాగును. కాని అలసట ఎరుగవు.

    9. మీరు ఆసక్తి రహితులు. ఏ ధనవంతుడు. ధనము కొఱకు, దాతవ్య హవ్యము అర్పించునో, ఎవడు మిత్రుని సత్యవచనములతో వర్థిల్లచేయునో, ఎవడు గోవులు, అశ్వములు, ధనము దానము చేయునో అట్టివారి కొఱకే మీరు కలిగినారు.

    10. మీరు నేడు మా పిలుపు ఆలకించండి, నిత్యతరుణ అశ్విద్వయమా ! మీరు హవ్యవంత గృహమునకు విచ్చేయండి. రత్నములిచ్చి స్తోతలను వర్థిల్ల చేయండి. "యూయంపాత స్వస్తిభిః సదానః"


                                       అరువది ఎనిమిదవ సూక్తము

  ఋషి - వశిష్ఠుడు, దేవత - అశ్వినులు ఛందస్సు - 1-7 విరాజము, 8,9 త్రిష్టుప్.

    1. దీప్తివంతులు, అశ్వవంతులగు అశ్వినులారా ! రండి. మీరు శత్రుహంతలు. మీ భక్తుల స్తుతులను స్వీకరించండి. మేము అర్పించు హవ్యమును ఆరగించండి.

    2. అశ్వినులారా ! మీ కొఱకు మాదక సోమము సిద్ధముగా ఉన్నది. మా హవ్యము అందుకొనుటకు త్వరత్వరగారండి. మా శత్రువు పిలుపును వినిపించుకోక మా పిలుపు వినండి.

    3. అశ్వినులారా ! మీరు రథమున సూర్యపుత్రి సహితులై ఉందురు. మీ రథము మనోవేగము గలది. అపార రక్షణలున్నది. మేము మీ రథమును ప్రార్థింతుము. అది సకల లోకములను వదిలి మా యజ్ఞమునకే వచ్చును.

    4. నేను మిమ్ము దేవతలుగా ప్రతిష్ఠించదలచినప్పుడు సోమాభిషవమునకు అభిషవ శిలలు గంభీర ధ్వనిచేయునప్పుడు అప్పుడు విప్రులు మిమ్ము హవ్యములిచ్చి ఆహ్వానింతురు.

    5. మీవద్ద చిత్రవిచిత్రమగు ధనమున్నది. అది మాకు అందించండి. మీకు ప్రియులై, మీరు అందించిన సుఖములు అనుభవించువారిని విపత్తులనుండి విడదీయండి. 

    6. అశ్వినులారా ! చ్యవనుడు వృద్ధుడు. మీకు హవి సమర్పించువాడు. అతనికొఱకు మీరు మృత్యువువద్ద నుండి ఒక రూపము తెచ్చి ఇచ్చినారు. ఆ రూపమే అతనిని దాల్చినది.

    (వృద్దుడగు చ్యవనుని అశ్వినులు యువకుని చేసినారనునది ప్రసిద్ధగాథ చ్యవన ప్రాశ మను ఔషధమును ఈ చ్యవనుని పేరిటిదే)

    7. దుష్టులగు మిత్రులు భుజ్యుని సముద్ర మధ్యమున వదలినారు. మీరు అతనిని దరికి చేర్చినారు. భుజ్యుడు మిమ్ము ప్రార్థించినాడు. ఎన్నడు విరుద్ధా చరణము చేయలేరు.

    (భజ్యుడు లాహానయన వంశజుడు యాజ్ఞ వల్క్యుని సమకాలికుడని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది.)

    8. అశ్వినులారా ! వృకమహర్షి క్షీణించినపుడు మీరు మీ సామర్థ్యమున అతనికి ధనము ఇచ్చినారు. శయు మహర్షి మిమ్ము పిలువగా మీరు అతని పిలుపు విన్నారు. నదులను జలములు నింపినట్లు అతని ముసలి ఆవును పాడి ఆవును చేసినారు.

    (వృకుడు వృక విధ్వంసుకుడు కావచ్చును. వృకనామక ఋషికావచ్చును. వృకధ్వరస్ వ్యతిరేకముగ యుద్ధము జరిగినది. ఇతడు ఇరాన్ దేశపువాడని హిలెబ్రాంట్ అభిప్రాయము.

    శయునకు చెందిన ముసలి ఆవును అశ్వినులు పాలిచ్చు ఆవును చేసినారని వృత్తాంతము.)

    9. స్తోత వసిష్ఠుడు నిర్మల మనస్కుడై ఉష కన్న ముందు మేల్కొని సూక్తములతో స్తుతించును. అతని అన్నమును వర్థిల్లచేయండి. అతని పాడిని వర్థిల్ల చేయండి. అతని గోవులను వర్థిల్ల చేయండి. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                        అరువది తొమ్మిదవ సూక్తము

                  ఋషి - వసిష్ఠుడు, దేవత - అశ్వినులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. తరుణ అశ్వినులతో రథము రావలెను. ఆ రథము హిరణ్మయము. ద్యావాపృథ్వులందు రక్షించునది. దాని చక్రములందు జలమున్నది. ఇరుసున వెలుగున్నది. అది అన్నవాహకము - యజమానులకు స్వామి.

    2. ఆ రథము పంచభూతములను ప్రసిద్ధముచేయు మూడు బంధురములు ఆసనములు కలది. అది స్తుతి యుక్తము. అశ్విద్వయమా ! మీరు ఈ రథముపై మీరు కోఱినచోటికి దేవాభిలాష యజ్ఞమునకు వెళ్లండి.

    3. సుందర అశ్వములను విశేష అన్నమును తీసికొని మా వద్దకు రండి. మీరు మధుమంతనిధి సోమమును పానము చేయండి. మీ రథము సూర్యగమనము కలది. దాని చక్రములు వేగమునకు ద్యులోకము అణగిపోవును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.