Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    నిర్ణయము జరిగినది. సభ ముగిసింది. విదురుడు కాంపిల్యమునకు పయనము అయినాడు. విదురుడు ద్రుపదుని రాజ భవనమునకు చేరినాడు. ద్రుపదుడు ఆదరమున ఆహ్వానించినాడు. పాండవ శ్రీకృష్ణాదులు విదురుని పూజించినారు. కుశల ప్రశ్నలు అయినవి. సభ తీరినది. విదురుడు అన్నాడు:-
    "ద్రుపద మహారాజా! నీవు సద్వంశమున జన్మించినావు. శాస్త్రములు అభ్యంసించినావు. నీతో సంబంధము కలిసినందుకు ధృతారాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపులు సంతోషించుచున్నారు. పాండవులు హస్తిన వీదినపుడు వారందరు తల్లడిల్లినారు. లక్క ఇల్లు కాలినపుడు దుఃఖించినారు. నీకు పాండవులతో బాంధవ్యము ఏర్పడినందులకు సంబర పడినారు. పాండవులను కుంతిని తోడ్కొని రమ్మని నన్ను పంపినారు. నీవు సమ్మతించి పంపిన వారిని హస్తినకు తీసుకొని వెళ్ళుదును."
    అందుకు ద్రుపదుడు "పాండవులను తోడ్కొని రమ్మని ధృతరాష్ట్రమహారాజు కోరినాడు. నీవు వచ్చినావు. నీవు, కృష్ణుడు పాండవులకు సర్వదా మేలు కోరువారు. మీరును, ధర్మరాజును అలోచించి పాండవులకు మేలు కలుగు రీతి నిర్ణయించుడు" అన్నాడు.
    అప్పుడు కృష్ణుడు "మహారాజా! విదురుడు పాండవులకు సర్వదా మేలు కోరువాడు. మేలు చేయువాడు. విదురునితోడున్నంత వరకు పాండవులకు అపాయము లేదు. ఇది మొదలు పాండవులకు శుభములు కలుగును" అన్నాడు.
    ధర్మరాజు "భీష్మ, ధృతరాష్ట్ర, విదురులు మువ్వురు మాకు గురువులు. ద్రుపదరాజు కూడ మాకు గురువగును. శ్రీకృష్ణుడు మాకును సకల లోకములకును గురువు అగును. మీ అందరి కృపనే మాకు శుభములు కలుగును" అని హస్తినకు వెళ్ళుటకు నిశ్చయించినాడు.
    పాండవులు హస్తినకు పయనమయినారు. ద్రుపదుని అనుమతిపొందినారు. విదురునితో సాగినారు. వారితో శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు మహా సైన్యముతో కదలినారు. హస్తిన చేరినారు. చిత్రసేన, ద్రోణ, కృపాచార్యులు, ఎదురేగి వారికి స్వాగతము పలికినారు. పాండవులు హస్తిన చేరినారు. భీష్మ, ధృతరాష్ట్రాది కౌరవ వృద్ధులకు నమస్కరించినారు. హస్తినలో విడిసినారు.
    పాండవులు సకల జనులకు అనురాగము కలిగించుచు, దుర్యోధనాదులతో కలిసి , ఎప్పటివలె రాజ్యవినోదములు అనుభవించినారు. ఆ విధముగా అయిదు సంవత్సరములు గడచినవి.
    ఒకనాడు ధృతరాష్ట్రుడు పాండవులతో "శ్రీకృష్ణుడు సకలలోక సాక్షి అతని సాక్షిగా , సకల వృద్ధరాజుల ముందు , మీ తండ్రియగు పాండురాజు భాగమగు సగము రాజ్యమును మీకు ఇచ్చుచున్నాను. మీరు ఖాండవ ప్రస్తమునకు వెళ్ళుడు. అచ్చట స్థిరపడి మీ సగము రాజ్యమును పాలించుడు" అని ధర్మరాజునకు అర్ధరాజ్యపు పట్టము కట్టినాడు. పాండవులు కురువృద్దులు అనుమతి పొందినారు. ఖాండవ ప్రస్థము చేరినారు. వారి వెంట శ్రీకృష్ణుడు వెళ్ళినాడు.
    ఖాండవ ప్రస్థము చేరిన శ్రీకృష్ణుడు ఇంద్రుని తలచినాడు. ఇంద్రుడు శ్రీకృష్ణుని అభిమతము ఎరిగినాడు. విశ్వకర్మను పంపినాడు. దేవేంద్రుని పట్టణముతో సమానముగు పట్టణము నిర్మించమని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు ఆదేశములు ఇచ్చినాడు. విశ్వకర్మ సుందరమగు నగరమును నిర్మించినాడు. దానికి "ఇంద్రప్రస్థము" అని పేరు పెట్టినాడు.
    ధర్మరాజు వేదవ్యాస , శ్రీకృష్ణుల అనుమతి పొందినాడు. ఒక శుభ మూహుర్తమున ఇంద్రప్రస్థమున ప్రవేశించినాడు. దౌమ్యుడు , బ్రాహ్మణులు వేదములు చదివినారు. సర్వజనులు ఆశీర్వదించినారు. వాద్యధ్వనులు మిన్నుముట్టినవి.
    ఇంద్రప్రస్థమున ప్రవేశించిన ధర్మరాజు ధర్మమూర్తి వలె రాజ్యము చేసినాడు. ధర్మార్ధ కామ మోక్షములను పురుషార్ధమూలవంటి నలుగురు తమ్ములు ధర్మరాజునకు విధేయులుగా ప్రవర్తించినారు.
    ధర్మరాజు రాజ్యము సంపన్నమయినది. వేళకు వానలు కురిసినవి. పంటలు పండినవి. జనులకు వ్యాధి, చొర పరాజయ భయములు లేకున్నవి. జనులందు శత్రుభావము పోయినది. మిత్రభావము వర్దిల్లినది.
    ధర్మరాజు రాజ్యము స్థిరపడినది. కృష్ణుడు ద్వారకకు పయనము అయినాడు. తాను వెళ్ళిన తరువాత నారదుడు వచ్చుననియు , అతడు చెప్పినట్లు నడుచుకొనవలనినదనియు ధర్మరాజుతో చెప్పినాడు.
    శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళినాడు.

                                                        ఆలోచనామృతము

1. అర్ధరాజ్య ప్రతిపాదన భీష్ముని ఆవిష్కరణగా కనిపించుచున్నది. ఇది సామాన్యమయినది కాదు. మానవజాతి మనుగడలో ఒక ప్రధాన ఘట్టము. మానసికమయిన అశాంతితో ఘర్షణలతో కలిసి ఉన్నదాని కంటే ఆస్తిని పంచుకొని సుఖముగా జీవించవచ్చునను విషయమును కనుగొన్నాడు భీష్ముడు.
అంతకుముందు రాజ్యము అవిభాజ్యము పెద్దవాడు రాజగు ఆచారము. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయినను రాజయినాడు. "రాజు కొడుకు రాజగును" అన్నాడు దుర్యోధనుడు.
రామాయణమందు రాజ్య విభజన లేదు. రాముని రాజగు హక్కును హరించుటకై కైక రాముని అడవులకు పంపినది. తనకు రాజ్యము రావలెనని సుగ్రీవుడు వాలిని చంపించినాడు. విభీషణుడు రావణుని చంపించినాడు. పంచుకొని పాలించుట తెలిసినచో అట్లు జరిగేడిదికాదు.
    భీష్ముడు అప్పటి కురువంశమునకు పితామహుడు. "ధృతరాష్ట్ర పండురాజులు ఇద్దరును నాకు కొడుకులు. వారి పుత్రులు కౌరవ పాండవులు. ఉభయుల యందు నాకు సమబుద్ది ఉన్నది" అన్నాడు. అట్టి భీష్ముడు కుట్రలు, కూహకము, మోసములు, మాయోపాయములు చూచినాడు. తనముందే తన కుటుంబమున అగ్గి పుట్టుట సహించ లేకపోయినాడు. రాజ్యమును విభజించిన తగవులు తీరి సుఖింతురు. అనుకున్నాడు. రాజ్య విభజనను కనిపెట్టినాడు. ప్రతిపాదించినాడు. సాధించినాడు.
2. ధృతరాష్ట్రుడు విచిత్రుడు. అతని మనసు ఎరుగుట దుస్తరము. విదురుడు తనకు తమ్ముడు. ప్రజ్ఞావంతుడు, నీతిధనుడు. అతని మాట విన్నట్లు నటించును. పాండవులను పరిమార్చవలెనని అంతరంగమున ఉండును. పాండవులను ద్రుపదుని వద్ద ఉండనీయరాదనునది అసలు రహస్యము. దుర్యోధనుని మాయోపాయములకు అతడు అంగీకరించలేదు. అందుకు లక్క ఇంటి కుట్ర విఫలము అగుట ప్రధాన కారణము. కర్ణుని యుద్ద ప్రతిపాదన అతనికి నచ్చినది కాని అంతకంటే సులభ ఉపాయమునకై వ్రుద్దులను అడిగినాడు. వారు రెండు మాటలు చెప్పినారు. పాండవులనుహస్తినకు తెచ్చుట, వారికి అర్ధరాజ్యమిచ్చుట. అతడు అంగీకరించినది మొదటిదానికే. విదురుడు ద్రుపదునితో అర్ధరాజ్య ప్రస్తావన చేయడు. తమకు స్థాన బలము కలుగునని పాండవులు అంగీకరించినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.