Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    ఆ రోజంతా బిటేన్ పూర్ణిమ దాపునకు సహితం వెళ్ళలేదు. అమాంతంగా ఎదురుపడ్డ పూర్ణిమ "దాదా, నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను." నీవు అందరి లాంటి వాడివి కావని నమ్మాను. కాని ......నా ఆశలన్నీ అడియాసలయ్యాయి" అని కంట తడి పెట్టుకుంది.
    ఆమె కళ్ళల్లో అగ్ని భగ్గుమంది. ఆమె వీక్షణ జ్వాలను చూచి భరించలేని బిటేన్ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    మర్నాటి రాత్రి పూర్ణిమ మగనితో అత్తింటికి తర్లిపోయింది. ఆ క్షణం నుంచీ బిటేన్ జీవితంలో ఒక విధమైన మార్పు ప్రారంభం అయింది. బిటేన్ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగాడు. నిత్యమూ ఇనుప చక్రంలా నిర్ణీత క్రతువులు నిర్వర్తిస్తుండేవాడు. ఆ కర్మకాండ విషయంలో అతనికి ఉత్సాహం లేకున్నా యంత్రంలా మారుమాటాడకుండా నిర్వర్తిస్తుండేవాడు. నాటి అరుణోషస్సూ , గగనయానం సాగిస్తున్న సూర్యుడు అతని నిర్లక్ష్యాన్ని గమనించారు. మూడు వేల సంవత్సరాలుగా వస్తున్నా సూర్యనమస్కారాల ఆచారాన్ని ఆనాడు దిక్కరించాడు. "రక్తజాబాకుసుమ వర్ణం గలిగి, తేజోవంతుడనై , తిమిరపుంజాలను తెగవాడే దివాకరా, ఇవిగో నమస్కారాలూ " అనే మంత్రం అతడు ఆనాడు అలపించలేదు. తన పూర్వేకులకు గాను అతడు తర్పణం వదల్లేదు. ఉపనయన సమయంలో అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణానుసారంగా గాయత్రిని పదిసార్లు జపించలేదు. తలిదండ్రుల హృదయాల్లో విశ్వాసరూపంలో పారినవేళ్ళు , వారి మానవతా భావాలకు వికృతరూపం కల్పించిన వ్రేళ్ళు తెంపుకుని బైట పడ్డాడు.
    అయినా తలిదంద్రుల్లో ఉన్న మానవత అతని నుంచి దూరం కాలేదు. పూర్ణిమకు న్యూమోనియా వచ్చినప్పుడు నిద్రలేకుండా రాత్రులు రాత్రులే గడిపిన తలిదండ్రులు అతనికి కనిపించారు. పూర్ణిమ కోసం వారు పడిన బాధా, భయం అతని గుండెలో వెళ్ళు తన్నుకున్నాయి. వారం వారమంతా తిండి తాకకుండా గడిపిన తలిదండ్రుల్ను అతడు మరిచిపోలేకున్నాడు.
    అలాంటి ప్రేమమూర్తుల్ను, క్రౌర్యమూర్తుల్నుగా , మార్చిన దుష్ట శక్తి ఏది? ఎవరి సంతోషానికైతే తమ సర్వస్వం త్యాగం చేయడానికి సిద్దపడ్డారో ఆమెను యమయాతనల పాలు ఎలా చేశారు? విశ్వాసం ఇంత గుడ్డిగా వినాశాన్ని గుర్తించకుండా ఉంటుందా? ఇంత మహా పరిణామం ఎలా సాధ్యం అయింది?"
    తలిదండ్రులు విషయంలో అంత కరకుగా ఆలోచించినా బిటేన్ కు వారి బాధలు తెలియకపోలేదు. పుర్నిమను గట్టెక్కించామనే సంతోషం వారికి ఉన్నా మంచి వరుణ్ణి తేలేకపోయినందుకు వారు పడిన బాధ అతడు గమనించకపోలేదు. వారు మాత్రం ఏం చేస్తారు? సమయం అలా అవ్చ్చింది. కట్నం అడుగలేదు. అలాంటప్పుడు ఏ దిక్కులేని తలిదండ్రులు అంతకంటే చేయగలిగిందేమిటి?
    దుఃఖంతో పిచ్చివాడై పోయాడు బసవ్. దీనికంతటికీ తానే బాధ్యుడినని విలపించాడు. పూర్ణిమ జీవిత ప్రాంగణంలో తాను అడుగుపెట్టకుండా ఉంటే ఇంకొంత కాలానికైనా ఆమెకు మంచి బాపని వరుడు దొరికేవాడనుకున్నాడు. పూర్ణిమ తండ్రికి ఉత్తరం రాయడమే ఆమె అదృష్టానికి అడ్డు తగిలినట్లిందని భావించాడు. తానేదో క్షమించరాని నేరం చేశానని తల బాదుకున్నాడు.
    నాలుగు నెల్లు గడిచాయి. అన్న తలంటు పండుగకు బిటేన్ కలకత్తా వెళ్ళాడు. వారి ఇల్లు నగరానికి దూరంగా ప్రశాంతమైన పేటలో ఉంది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళలాగే కనిపించారు. కాని అతడు పూర్ణిమను చూసినప్పుడు బంగారు పంజరంలో ఉన్న చిలుకలా కనిపించింది.
    తలంటు పండుగ చేశారు. బిటేన్ సంపన్న భోజనం చేశాడు. అన్నాచెల్లెళ్ళు ఏకాంతంగా పడకగదిలో కలుసుకున్నప్పుడు పూర్ణిమ గుండె బద్దలై కన్నీరు ధారలుగా ముఖం మీద ప్రవహించింది.
    ఆమె చెప్పిందంతా విన్నాడు. మనోవ్యధ భరించలేక బసవ్ కు ఉత్తరం వ్రాసింది. పోస్టు బాక్సు చేరకముందే ఉత్తరం పట్టుబడింది. నాటి నుంచి ఆమె యాతన ప్రారంభం అయింది. ఆమె పడుతున్న బాధల్ను గురించి అడిగినప్పుడు ఆమె ముఖాన దయ్యాలు నాట్యం చేస్తునట్లు భయామయంగా కనిపించింది. ఆ ముఖం అతనిలో శాశ్వతంగా నిలిచిపోయింది.
    'ఒకనాటికి ఈ యాతన భారించేలేని రోజు వస్తుంది. అప్పుడు నేను విముక్తురాలను కావాల్సివస్తుంది." ఇవి ఆమె పలికిన చివరి వాక్యాలు.
    ఆరోజు రానే వచ్చింది. ఆమెకు విముక్తి లభించింది.
    ఇంటి వెనుక ఉన్న దిగుడు బావిలో ఆమె కళేబరం కనిపించిందని ఉత్తరం వచ్చింది. ప్రమాదవశాత్తు జరిగిందని తెల్చారు. ఉదయస్నానానికి వెళ్ళి మెట్ల మీద ఉన్న పాకుడు వల్ల కాలు జారి బావిలో పడిపోయింది అని వ్రాశారు. నిజం బిటేన్ కు తెలుసు. ఇదంతా వట్టి కట్టు కధ. పూర్ణిమకు బాగా ఈదడం వచ్చు. ఆమె విముక్తురాలు కాదల్చుకుంది. ఆమెకు విముక్తి లభించింది.
    ఇంట్లో ఏడుపులూ , పెడబొబ్బలూ మొదలైనాయి. అయితే ఇంటికి దూరంగా ఉంటున్న బిటేన్ కు ఇవేవీ వినిపించలేదు. తలిదండ్రులంటే అతనికి ద్వేషం కలిగింది. ఆనాడు బసవ్ దగ్గరికి వెళ్ళాడు.
    బసవ్ బిటేన్ అనుకున్నంత దుఃఖంలో లేడు. అతని హృదయంతరాళంలో ఏదో వెలుగు కనిపించింది. బసవ్ వచ్చినవాణ్ణి నిరసన దృష్టితో చూశాడు.
    'చాలా? ఇప్పుడు సంతోషంగా ఉందా? బాపల చేతిలో ఒక హత్య జరిగింది. ఇంతటితోనైనా సంతృప్తేనా?"
    బిటేన్ మాట్లాడకుండా తల వంచుకుని కూర్చున్నాడు. కాలం దొర్లిపోయింది. నిముషమే గడిచిందో గంటే గడిచిందో గాని అతడు లేచి వెళ్ళబోయాడు.
    గుమ్మం చూపి "వెళ్ళిపో" అని కసిరాడు బసవ్.   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.