Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    దిశ్య ఇష్టకే! నీవు ప్రాగ్దిశకు రాజ్ఞివి. ఆ రూపమున నిన్ను మూడవ కుండమున చేర్చుచున్నాను. నీవు దక్షిణ దిశకు సామ్రాజిజ్ఞివి. ఆ రూపమున నిన్ను మూడవ కుండమున చేర్చుచున్నాను. పశ్చిమదిశకు స్వరాట్టువు, నిన్ను ఆ రూపమున మూడవ కుండమున చేర్చుచున్నాను. పశ్చిమదిశకు దిగధిపత్నివి. నిన్ను ఆ రూపమున మూడవ కుండమున చేర్చుచున్నాను. ఊర్ధ్వ దిశకు అధిపత్నివి. నిన్ను ఆ రూపమున మూడవ కుండమున చేర్చుచున్నాను.

    14. (ప్రథమోపహితాయా విశ్వాజ్యోతిషఉపరి విశ్వజ్యోతిషమిష్టకాముపదధాతి. మొదట పేర్చిన విశ్వజ్యోతిషమను ఇటుకమీద మరొక విశ్వజ్యోతిష ఇటుకను చేర్చవలెను)

    మూడవ కుండమున విశ్వజ్యోతిష ఇష్టకా! స్వయముగా ప్రజాపతియే నిన్ను విశ్వజోతిష ఇటుక వీపుమీద చేర్చునుగావుత. సమస్త ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను దృఢపరచుటకు నీవు ఈ మూడవకుండమున గట్టి పడుము. దీనిని పూర్తిగా నియంత్రించుము. వాయువు నీకు అధిదేవతయగును. ఆ వాయుదేవతచే అనుజ్ఞాతవై పూర్వము నీవు అంగిరుల తృతీయ కుండమున స్థిరపడినావు. అట్లే మా ఈతృతీయ కుండమున స్థిరపడుము.

    15. శ్రావణ భాద్రపదములు వర్షుర్తువులు. ఇష్టకా! నీవు ఈ కుండమును కూర్చుదానవు. గట్టి పరచుదానవు. ఈ కుండమున చేయు యజ్ఞములను సఫలము చేయుము. ద్యావాపృథ్వులను జలములను - ఓషధులను మాకు అనుకూలము చేయుము. ఇందలి ఇటుకలన్నియు యజమానికి ఒకేరీతిగా శుభములు సమకూర్చవలెను. అవి నాజ్యేష్ఠతకు అనుకూలములు కావలెను. ద్యావాపృథ్వు లందు - సమానప్రీతి గల - అగ్నులు ఉన్నవి. అవి యజమాని యొక్క ఇటుకలను వర్షర్తు సమముగా భావించవలెను. దేవతలు ఇంద్రుని శ్రేష్ఠునిగా భావించి శరణువేడుదురు. అట్లే ఆ  ఇటుకలు యజమానినగు నాలో ప్రవేశించవలెను. దేవతలచే అనుజ్ఞాతవై ఇష్టకా! పూర్వము నీవు అంగిరుల కుండమున స్థిరపడినావు. అట్లే మా ఈ తృతీయ కుండమున స్థిరపడుము.

    16. (అపరే ఋతవ్యే పూర్వయోపరి దధాతి - తదుపరి పూర్వపు వానిపైన ఋతవ్య ఇటుకలను పేర్చును)

    అశ్వీయుజ కార్తీకములు శరదృతువగును. ఋతువ్య ఇటుకలారా! మీరు ఈకుండమును కూర్చువారలు. శరదృతువు వలె ద్యావాపృథ్వులను మాకు అనుకూల పరచుడు. జలములను, ఓషధులను అనుకూలపరచండి. ఇటుకలు సమాన శుభకర్మలై - నాజ్యేష్ఠతను బలపరచవలెను. ఒకేవిధమగు ఇటుకలు ప్రథమ, ద్వితీయ కుండములందు ఉన్నవి. అవి ఈ ఋతవ్య ఇటుకలను శరదృతువు వలె ఆశ్రయించవలెను. అదెట్లన సకల దేవతలు ఇంద్రుని ఆశ్రయించినరీతి.

    ఋతవ్య ఇటుకలారా! శరదధిష్ఠాత దేవత వలన అనుజ్ఞాతులై - అంగిరుల కుండమున స్థిరపడిన రీతి మా తృతీయ కుండమున స్థిరపడండి.

    17. దశ ప్రాణభృత ఇష్టకలారా! నా ఆయువును రక్షించండి. నాప్రాణమును రక్షించండి. నా అపానమును రక్షించండి. నావ్యానమును రక్షించండి. నా కన్నులను రక్షించండి. నాచెవులను రక్షించండి. నా వాక్కును సఫలము చేయండి. నా మనసును ప్రసన్నము చేయండి. నా ఆత్మను రక్షించండి. నాకు జ్యోతిని ప్రసాదించండి - "జ్యోతిర్మేయచ్ఛ"

    18. (పక్ష, పృచ్ఛసంధులందు పన్నెండేసి ఛందస్య ఇటుకలను పేర్చవలెను)

    ఇష్టకా! ఈభూలోకము 'మా' ఛందము. అంతరిక్షము 'ప్రమా' ఛందము ద్యులోకము 'ప్రతిమా' ఛందము. లోకత్రయమునుండి లభించు అన్నమే 'అస్రీ వయ' ఛందము - ఉష్ణిక్ ఛందము - పంక్తి ఛందము - బృహతీ ఛందము - అనుష్టుప్ ఛందము - విరాట్ ఛందము - గాయత్రీ ఛందము -త్రిష్టుప్ ఛందము - జగతీ ఛందము. నీవు మా, ప్రమా, ప్రతిమా మున్నగు ఛందమవు. నిన్ను తృతీయ కుండమున చేర్చుచున్నాను.

    19. పృథ్వివీ చంద్కోన్తరిక్షం ఛందో ద్యౌశ్ఛందః సమాశ్ఛందో నక్షత్రాణి ఛన్దో వాక్ ఛందో మనశ్ఛందః కృషిశ్ఛందో హిరణ్యం చన్దో గౌశ్ఛన్ద్కోజా చ్ఛన్దో శ్వశ్ఛ్కన్దః

    20. అగ్నిర్దేవతా వాతోదేవతా సూర్యోదేవతా చన్ద్రమాదేవతా వసవో దేవతారుద్రా దేవత్కాదిత్యా దేవతా మరుతోదేవతా విశ్వేదేవా విశ్వేదేవా దేవతా బృహస్పతిర్దేవతేన్ద్రో దేవతా వరుణోదేవతా.

    21. (వెంట్రుకంత ఎడము ఉండకుండునట్లు ఏడు 'అపర' ఏడు 'పర' ఇష్టకములను పేర్చును)

    రెండుచేతులు + రెండు భుకములు + ఒకమెడ + ఒకతల + ఒకనాభి అను ఏడు ప్రాణము 'అపర' అగును. రెండు ఊరువులు + రెండు జంఘలు + రెండు జానువులు - ఒకనాభి కింది భాగమను ఏడు ప్రాణములు 'పర' అగును.

    వాలఖిల్య ఇష్టకా! నీవు మూర్ధవు. నీవు దృఢమవు. నీవు లోకములను భరించుదానవు. భూమిని ఆయుష్యము కొరకు -  బ్రహ్మవర్చస్సు కొరకు - కృషి కొరకు - యోగక్షేమముల కొరకు నిన్ను తృతీయ కుండమున పేర్చుచున్నాను.

    (వెంట్రుకంత సందులేకుండ చేయునది వాలఖిల్యము)

    22. ఇష్టకా! నీవు నియమయుక్తముగా విరాజమానవు. నియంత్రించబడిన నీవు అన్యులను నియంత్రించు దానవు. స్థిరపడుము. అచలవగుము. అన్నము కొరకు - బలముకొరకు - అశ్వగోధనము కొరకు - పోషణ కొరకు నిన్ను తృతీయ కుండమున చేర్చుచున్నాను.

    23. (నాలుగవ చితి చయనము ప్రారంభము. పద్ధెనిమిది యజుస్సులచే పద్ధెనిమిది ఇటుకలను చేర్చుదురు)

    ఇష్టకా! నీవు వ్యాపనశీల త్రివృత్ స్తోమవు. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! నీవు వజ్రరూపమగు పంచదశస్తోమవవు. ఆ రూపవగు నిన్ను చతుర్ధకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! సంవత్సరమే సప్తదశస్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! ఆదిత్యుడే నవదశస్తోమము. ఆ రూపమగు నిన్ను చతుర్థచితి యందు చేర్చుచున్నాను.

    ఇష్టకా! 12నెలలు + 5 ఋతువులు + ఒక స్నయముతో కూడిన సంవత్సరమే అష్టాదశస్తోమము. ఈ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! పందొమ్మిది అంగములు తపనశీల సంవత్సరమే నవదశస్తోమమగును ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! సర్వమును ఆవర్తనము చేయించు ఇరువది అవయవముల సంవత్సరమే సవింశస్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! అత్యంత బలశీలయై ఇరువది రెండుఅవయవముల సంవత్సరమే  ద్వావింశస్తోమమగును. ఆరూపవగు నిన్ను చతుర్థచితి యందు చేర్చుచున్నాను.

    ఇష్టకా! అందరిని పోషించి పాలించు ఇరువది మూడు అవయవముల సంవత్సరమే త్రయోవింశత్సోమమగును. ఆ రూపవగు నిన్ను  చతుర్థ కుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! సకల ఉత్పత్తికి కారణ భూతమగు కాలమునకు ఆధార భూతమగు ఇరువది నాలుగు అవయవముల సంవత్సరమే చతుర్వింశ స్తోమమగును. ఆ రూపవగు నిన్ను చతుర్థ చితి యందు పేర్చుచున్నాను.

    ఇష్టకా! సోమమునకు గర్భ స్వరూపమై పదమూడవ మాసమై సకల ఋతువులకు గర్భ స్వరూపమగు సంవత్సరమే పంచ వింశస్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థ కుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! అత్యంత తేజస్వి. వజ్ర స్వరూపమగు ఇరువది యేడు అవయవముల సంవత్సరమే త్రినవ స్తోమమగును. ఆ రూపవగు నిన్ను చతుర్థ చితి యందు చేర్చుచున్నాను.

    ఇష్టకా! సర్వభూతకర్తయగు సంవత్సరనమే యజ్ఞములందు అత్యంత ఉపయోగకారకమగు ఏకత్రింశస్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! అందరను తనయందు చేర్చుకొను ముప్పదిమూడు అవయవముల సంవత్సరమే త్రయస్త్రింశ స్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థచితి యందు చేర్చుచున్నాను.

    ఇష్టకా! సూర్యునకు స్వరాజ్యపట్టము కట్టునదియు ముప్పదినాలుగు అవయవములు గల సంవత్సరమే చాతుస్త్రింశ స్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! దుఃఖము నెరుగని ముప్పదియారు అవయవముల సంవత్సరమే పట్త్రింశస్త్రోమమగును. ఆ రూపవగు నిన్ను నాలుగవ చితియందు చేర్చుచున్నాను.

    ఇష్టకా! భూతములను ఆవర్తన - వివర్తనము చేయు నలుబదిఎనిమిది అవయవముల సంవత్సరమే అష్టాచత్వారింశస్తోమము. ఆ రూపవగు నిన్ను చతుర్థకుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! జగములకు ఆధారభూతమును - నాలుగుదిక్కులచే స్తుతించబడునట్టి త్రివృత్, పంచదశ, సప్తదశ, ఏకవింశత్సోమ సమూహమే చతుష్టోమమగును. ఆ రూపవగు నిన్ను నాలుగవ చితియందు చేర్చుచున్నాను.

    25. ఇష్టకా! నీవు వసువుల భాగమవు. నీపై రుద్రుల ఆధిపత్యము కలదు. చతుర్వింశస్తోమమున నీవు గవాది చతుష్పాత్తులను రక్షించినావు. అటువంటి నిన్ను నాలుగవ కుండమున చేర్చుచున్నాను.

    ఇష్టకా! నీవు ఆదిత్యుల భాగమవు. నీపై మరుత్తుల ఆధిపత్యము ఉన్నది. త్రిణవస్తోమమున నీవు ఓజోబలమును రక్షించినావు. అట్టి నిన్ను నాలుగవకుండమున చేర్చుచున్నాను.

     ఇష్టకా! నీవు అదితి - పృథ్వి- భాగమవు. నీపై పూష ఆధిపత్యము ఉన్నది. త్రిణవస్తోమమున నీవు ఓజోబలమును రక్షించినావు. అట్టి నిన్ను నాలుగవకుండమున చేర్చుచున్నాను.

   
    ఇష్టకా! నీవు సవిత భాగమవు. నీపై బృహస్పతి ఆధిపత్యము ఉన్నది. నీవు చతుష్టోమ సోమమున సర్వసంచారయోగ్య దిశలను రక్షించినావు. అట్టి నిన్ను నాలుగవ చితియందు చేర్చుచున్నాను.

    26.  ఇష్టకా! నీవు పూర్వపక్షముల భాగమవు. నీపై అపరపక్షముల ఆధిపత్యము ఉన్నది. చతుశ్చత్వారింశ స్తోమమున నీవు ప్రజలను రక్షించినావు. అట్టి నిన్ను నాలుగవకుండమున చేర్చుచున్నాను.

     ఇష్టకా! నీవు ఋతువుల భాగమవు. నీపై విశ్వేదేవతల ఆధిపత్యము ఉన్నది. త్రయస్త్రింశ స్తోమమున నీవు భూతజాతములను రక్షించినావు. అట్టినిన్ను నాలుగవ చితియందు చేర్చుచున్నాను.

    27. (రెండు ఋతవ్య ఇటుకలను పేర్చును)

    మాఘపుష్యములు హేమంతపు అవయవములు. ఋతవ్వ ఇష్టకా! నీవు చితిలోపలి భాగమును దృఢపరచుదానవు. ద్యావాపృథ్వులను, జలములను, ఓషధులను నాకు అనుకూలములను చేయుము. మిగతా అన్ని ఇటుకలతో కలసి ప్రీతికరమవగుము. నాకు జ్యేష్ఠత్వమును సిద్ధింపచేయుము. మూడవ, నాలుగవ కుండములందున్న ఇటుకలన్నియు ఈ రెండు ఋతవ్య ఇటుకలను హేమంత ఋతువుగా భావించి ఇతర దేవతలు ఇంద్రునివలె - వీనిని ఆశ్రయించవలెను. ఇష్టకలారా! మీరు హేమంతాభిమాన దేవతచే అనుజ్ఞాతలై - పూర్వము అంగిరుల చితియందు స్థిరపడిన రీతి ఈ నాలుగవ కుండమున స్థిరపడండి.

    28. ('సృష్టి' యనుపేరుగల పద్ధెనిమిది ఇటుకలను పేర్చవలెను)

    ప్రజాపతి ఒకేవాణిచే పరమాత్మను స్తుతించినాడు. అప్పుడు ప్రజలు పుట్టినారు. అప్పుడు ఆ ప్రజలకు ప్రజాపతి స్వామి అయినాడు.

    ప్రజాపతి ప్రాణ, ఉదాన, వ్యానములచే స్తుతించినాడు. అప్పుడు బ్రాహ్మణులు పుట్టినారు. బ్రాహ్మణుల అధిపతి బ్రాహ్మణస్పతి అయినాడు.

    ప్రజాపతి నాలుగు ప్రాణములచే ఒకమనస్సును స్తుతించినాడు. అప్పుడు ఇతర ప్రాణులు పుట్టినవి. ఆ ప్రాణులకు అధిపతి భూతపతి అయినాడు.

    ప్రజాపతి ఏడుతలల ప్రాణులచే స్తుతించినాడు. అప్పుడు సప్తర్షులు అవతరించినారు. వారి అధిపతి ధాత అయినాడు.

    29. ప్రజాపతి ఏడుతలల - రెండు నిమ్నస్థప్రాణులచే స్తుతించినాడు. అప్పుడు పితరుల సృష్టిజరిగినది. వారి అధిపతి అదితి అయినది.

    ప్రజాపతి పదకొండు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు ఋతువులు ఉత్పన్నములు అయినవి. వాని అధిపతి  ఋతువుల అధిష్టాన దేవత అయినాడు.

    ప్రజాపతి పదమూడు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు పన్నెండుమాసములును, అధికమాసము ఉత్పన్నములైనవి. వానికి అధిపతి సంవత్సరము అయినది.

    ప్రజాపతి పదిహేను ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు క్షత్రియులు పుట్టినారు. వారికి అధిపతి ఇంద్రుడు అయినాడు.

    ప్రజాపతి పదిహేడు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు గ్రామ్యపశువులు పుట్టినవి. వాటికి అధిపతి బృహస్పతి అయినాడు.

    30. ప్రజాపతి పందొమ్మిది ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు శూద్రులు, వైశ్యులు పుట్టినారు. వారికి అధిపతి అహొరాత్రములు అయినవి.

    ప్రజాపతి ఇరువదియొక్క ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు ఏకఖుర - ఒకేగిట్టగల జంతువులు పుట్టినవి. వానికి అధిపతి వరుణుడు అయినాడు.

    ప్రజాపతి ఇరువది మూడు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు క్షుద్ర పశువులు పుట్టినవి. వానికి అధిపతి పూష అయినాడు.

    ప్రజాపతి ఇరువది అయిదు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు క్షుద్ర పశువులు పుట్టినవి. వానికి అధిపతి వాయువు అయినాడు.

    ప్రజాపతి ఇరువది ఏడు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు ద్యావాపృథ్వులు వేరైనవి. వసు, రుద్ర, ఆదిత్యులు వేరగుటకు తోడ్పడినారు. వారే ద్యావాపృథ్వులకు అధిపతులైనారు.

    31. ప్రజాపతి ఇరువది తొమ్మిది ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు అశ్వత్థము మున్నగు వనస్పతులు పుట్టినవి. వానికి అధిపతి సోమము అయినది.

    ప్రజాపతి ముప్పదియొక్క ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు ప్రజలు. పుట్టినారు. వారికి అదిపతులు పూర్వ, అపరపక్షములు అయినవి.

    ప్రజాపతి ముప్పదిమూడు ప్రాణములచే స్తుతించినాడు. అప్పుడు సకల భూతములు సుఖశాంతులు పొందినవి. పరమ స్థానమున నిలిచిన ప్రజాపతియే వానికి అధిపతి అయినాడు.

    (తదుపరి మూడు లోకంపృణ ఇటుకలు పేర్చవలెను)

   
                       దాశరథి రంగాచార్య విరచిత
              శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
          వర్ణ్య ద్విత్రిశ్చతుశ్చితమను పదునాలువగ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.