Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. మరుత్తులారా ! మీ ధనములు పరస్పరము కలిసి ఉన్నవి. సోమరూప హవి భక్షణకుగాను చక్కగా విచ్చేయుడు. మీకు నేను హవి అందించుచున్నాము. మీరు వేరు చోటునకు వెళ్లవద్దు.

    6. మరుత్తులారా ! మీరు మా కుశలపై ఆసీనులు కండు. కోరిన ధనములు ఇచ్చుటకు మావద్దకు విచ్చేయుడు. మీరు బాధించనివారై ఈ యజ్ఞమున మదకరసోమ రూప హవ్యమునుస్వాహా అని ఉన్మత్తులగుడు.

    7. అంతర్హిత మరుత్తులారా ! మీ అవయవములను అలంకరించుకొని నీలవర్ణ హంసలవలె విచ్చేయండి. నా యజ్ఞమున ఆనందించి, సంతసించిన మానవులవలె విశ్వవ్యాప్త మరుద్గణములు నాచుట్టు చేరవలెను.

    8. ప్రశంసనీయ మరుత్తులారా ! వికార క్రోధమున తిరస్కృతులైన మానవుడు మా మనసును నాశనము చేయగోరును. వాడు పాపి-ద్రోహి. వరుణదేవు పాశములతో మమ్ము బంధించతలచినాడు. వాడిని మీరు అత్యంత తాపకరమగు ఆయుధములతో నష్టపరచండి.

    9. శత్రుతాపకులారా ! ఇదే మీ హవ్యము. మీరు శత్రుభక్షకులు. మీ రక్షణలతో హవిని స్వీకరించండి.

    10. మరుత్తులారా ! మీరు గృహమునందును శుభప్రదాతలగుదురు. రక్షణలతో విచ్చేయండి. వెళ్లవద్దు.

    11. మరుత్తులారా ! మీరు స్వయం ప్రవృత్తులు. క్రాంతదర్శులు. నేను యజ్ఞమును గురించి ఆలోచించుచున్నాను.

    12. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్దనమ్ |
    ఉర్వారుకమివ బంధనాన్మృత్యోక్షీయమామృతాత్ ||

    మేము సుగంధియు, పుష్టివర్ధకుడగు త్ర్యంబకుని పూజింతుము. ఉర్వాక ఫలమువలె మృత్యుబంధనము నుండి విడిపించుము. అమృతము నుండి విడిపించకుము.

    (సుగంధి ప్రసారితమగు పుణ్యకీర్తి. పుష్టి వర్ధనమ్ జగములకు బీజప్రాయము లేదా అణిమాది శక్తి వర్ధనము. త్ర్యంబకమ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆదిస్థానము ఉర్వాకమ్ బదరీ ఫలము)


    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున నాల్గువ అధ్యాయము సమాప్తము.)


           ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి
           నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతావి సమేత స్థివాంసః

                అయిదవ అధ్యాయము             ఆరువదవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు, దైవత - మైత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

   
           ఓం యదద్య సూర్యబృవో వాగా ఉద్యమ్నిత్రాయవరుణాయ సత్యం
             వయందేవతాది తేస్యామ తవ ప్రియావో ఆర్యవవ్గృణాంతః

    1. సూర్యా ! ఉదయించుము. నేడు అనుష్ఠాన కాలమున మమ్ము పాపరహితులను చేయుము. అదితీ ! దీనుడు కానట్టి నీవు మా దేవతలలలో మిత్రావరుణులవద్ద సత్యము వగుము. అర్యమన్! దాతా నిన్ను స్తుతించి మేము నీకు ప్రీతిపాత్రులము అగుదుము.

    2. మిత్రావరుణులారా ! ఇతడు మానవ దర్శనీయుడు సూర్యుడు. అతడు అంతరిక్షమున సాగును. ద్యావాపృథ్వుల కొఱకు ఉదయించును. అతడు సమస్త స్థావర జంగమాత్మక జగములకు పోషకుడు. మానవుల పుణ్యపాపములను వీక్షించును.

    3. మిత్రావరుణులారా ! సూర్యుడు అంతరిక్షమున ఏడు హరితవర్ణ అశ్వములను తన రథమున కట్టినాడు. ఆ ఏడు జలదాతలయి సూర్యుని తీసికొని సాగును. గోపాలుడు గోసమూహములను కాపాడినట్లు సూర్యుడు ఉదయించి లోకమునందలి ప్రదేశములను ప్రాణులను కాపాడును.

    4. మిత్రావరుణులారా ! మీ కొఱకు అన్నము, మథుర పురోడాశము ఉన్నవి. సూర్యుడు దీప్తమగు అంతరిక్షమునకు ఎక్కును. సమాన ప్రీతిగల మిత్ర, ఆర్యమ, వరుణాదులు సూర్యునకు మార్గము కలిగింతురు.

    5. మిత్రావరుణులు ఆర్యమ పాపనాశకులు. వారు అహింసక, సుఖకర అదితికి పుత్రులు వారు యజ్ఞ గృహమున పెంపొందుదురు.

    6. ఆదిత్యుడు. మిత్రుడు, వరుణుడు ఈ మువ్వునిరిని లొంగదీయగలవాడు లేడు. వారు ఆజ్ఞానులను జ్ఞానవంతులను చేయుదురు. వారు ఉత్తమ జ్ఞానవంతుల కర్మానుష్ఠానవంతులవద్దకు వెళ్లి వారి దుష్కృతములను తుడిచివేసి మమ్ము మంచి దారిన తీసికొని వెళ్లుదురు.

    7. వీరు అనిమిషులై ద్యులోక భూలోకములందలి ఆజ్ఞానులను కర్మపరులను చేయుదురు. సామర్థ్యమున దిగువ దేశములందు సహితము నదుల జలము లభించును. వారు మమ్ము వ్యాపక కర్మమును దాటించవలెను.

    8. ఆర్యమ, మిత్రావరుణులు రక్షణలు కలిగించిన హవ్యదాతకు సుఖములు కలిగింతురు. హవ్యదాత పుత్రపౌత్రులకు సహితము సుఖములు కలిగింతురు. మేము శీఘ్రకారి దేవతలకు కోపము కలిగించు పనులు చేయకుండవలెను.

    9. మా యజ్ఞవేదిమీద మమ్ము ద్వేషించువారు దేవతలను స్తుతించనివారు ఉందురు. వరుణుడు వారిని నష్టపరచవలెను. ఆర్యమ మమ్ము రాక్షసాదులనుంచి వేరుచేయవలెను. కోఱికలు తీర్చు మిత్రావరుణులు హవ్యదాతలగు నాకు విశాల ప్రదేశము నివ్వవలెను.

    10. ఈ మిత్రాదుల స్నేహము గుప్తము, దీప్తము. వీరు గుప్తబలమున మమ్ము ద్వేషించువారిని ఓడింతురు. మిత్రాది దేవతలారా ! మీ భయమున మా విరోధులు గడగడలాడుదురు. మీ బలమహిమతో మమ్ము సుఖవంతులను చేయండి.

    11. అన్నము ఉత్తమ ధనము దానము చేయునట్టి యజమాని మిమ్ము స్తుతించు స్తోత్రములకు తన బుద్ధిని జోడించినపుడు మఘవాదులు ఆ స్తోత స్తుతులను ఆశ్రయిస్తారు. అట్టివాని కొరకు సుందరగృహము ఏర్పరుస్తారు.

    12. మిత్రావరుణులారా ! మీ ఉభయుల యజ్ఞమున ఈ స్తుతి ఉచ్ఛరించబడినది. దీనిని స్వీకరించండి. త్వరత్వరగా మా విపత్తులను దూరము చేయండి. మమ్ము దరికి చేర్చండి.


                                      అరువది ఒకటవ సూక్తము

          ఋషి - వశిష్ఠుడు, దైవత - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీరు ప్రకాశవంతులు. సూర్యుడు మీ నేత్ర స్వరూపుడు. శోభన రూపములవాడు. అతడు తన వెలుగులు పెంచుచు. ఆకసమున ఎగబాకును. సూర్యుడు సమస్త భువనములను వీక్షించును. అతడు మానవులందు ఉండు స్తోత్రములను తెలియును.

    2. వశిష్ఠుడు యాజ్ఞికుడు విప్రుడు చిరశ్రోత. మిత్రవరుణులారా ! అట్టి వసిష్ఠుడు మీ కొఱకు పూజనీయ స్తుతులు రచించినాడు. మీరు శోభన కర్ములు. వసిష్ఠుని స్తోత్రములను రక్షింతురు. మీరు కలకాలమగా వసిష్ఠుని కర్మములను పూరించుచున్నారు.

    3. మిత్రావరుణులారా ! మీరు విశాలభూమిని పరిక్రమించినారు. గుణ, రూపములందు విశాలమగు ద్యులోకమును చుట్టివచ్చినారు. ఓషధులు ప్రజలకొఱకు విభిన్న రూపములు దాల్తురు. నిర్నిమేష భావమున సన్మార్గగామిని పాలింతురు.

    4. ఋషీ ! నీవు మిత్రావరుణులను స్తుతించుము. తమ మహిమతోను మిత్రావరుణులను స్తుతించుము. తమ మహిమతోను మిత్రావరుణుల బలమువలనను ద్యావాపృథ్వులు విడివిడిగా ఉన్నవి. యజ్ఞము చేయనివారి మానములు పుత్రరహితములై గడువవలెను. యజ్ఞవృద్ధి మానవ వృద్ధికి కావలెను.

    5. మిత్రావరుణులు వ్యాపకులు. కోఱికలు తీర్చువారు. ప్రాజ్ఞుడా ! నీవు వారిని స్తుతించినావు. ఆశ్చర్యకరమగు నీ స్తుతికి చకితులైన మిత్రావరుణులు వారి యజ్ఞమును, పూజను ఎరుగలేకున్నారు. ద్రోహులగు జనులు మిథ్యాస్తుతులను సేవింతురు. మీ ఉభయులకొఱకు చేయబడిన స్తుతులు అజ్ఞానకారకములుకారాదు.

    6. మిత్రావరుణులారా ! మీ ఉభయుల యజ్ఞమున ఈ స్తుతి ఉచ్చరించబడినది. దీనిని స్వీకరించండి. త్వరత్వరగా మా విపత్తులను దూరము చేయండి. మమ్ము దరికి చేర్చండి.


                                      అరువది రెండవ సూక్తము

  ఋషి - వసిష్ఠుడు, దేవత - సూర్యుడు - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. సూర్యుడు, అత్యధికమగు తేజమున ఊర్ధ్వముఖుడై వెలుగవలెను. మానవులందరకు ఆశ్రయము ఇవ్వవలెను. అతడు పగలు అందకాడై ఒకేరూపమున దర్శనమిచ్చును. సర్వకర్త, కృతప్రజాపతినుండి సూర్యుడు వెలుగులు అందుకొనును.

    2. సూర్యా ! నీవు స్తుతుడవై, హరితవర్ణ, గమనశీల అశ్వములపై ఊర్ధ్వముఖుడవగుము. మాముందునకు విచ్చేయుము. మిత్ర, వరుణ, ఆర్యమ, అగ్నిముందు మమ్ము నిరపరాధులనుగా చెప్పుము.

    3. వరుణ, మిత్రాగ్నులు దుఃఖనివారకులు సత్యవంతులు ప్రసన్నతా దాయకులు. వారు మాకు వేలకొలది ధనములను ఇవ్వవలెను. స్తుతింపదగినవియు పూజనీయములగు పదార్థలీయవలెను. మా స్తుతులను అందుకొని మా కోఱికలు తీర్చవలెను.

    4. మహా ద్యావాపృథ్వులారా ! మమ్ము రక్షించండి. మేము మంచి జన్మలవారలము. మిమ్ము ఎరుంగుదుము. మేము వరుణుని వాయువుయొక్క మానవుల ప్రియతముడగు మిత్రుని క్రోధమున పడరాదు.

    5. మిత్రావరుణులారా ! మీ బాహువులు చాచండి, మేము బ్రతుకుటగాను గోమార్గ భూమిని నీటితో తడపండి. మానవులందు మమ్ము విఖ్యాతులను చేయండి. మీరు సత్య తరుణులు. మా పిలుపు వినండి.

    6. మిత్రావరుణ ఆర్యయలారా ! మా కొఱకును, మా పుత్రులకును ధనము ప్రదానము చేయండి. మేము చేరవలసిన దారులన్నియు సుగమములు కావలెను. "యూయంపాతస్వస్తిభిః సదానః"


                                      అరువది మూడవ సూక్తము

  ఋషి - వసిష్ఠుడు, దేవత - సూర్యుడు - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులు శోభన భాగ్యులు. సర్వదర్శకులు. సమస్త మానవులకు సాధారణులు. వారికి నేత్రరూపుడు, ప్రకాశమానుడగు సూర్యుడు ఉదయించుచున్నాడు. సూర్యుని చర్మమువంటి అంధకారమును సంవేష్ఠించును.

    2. సూర్యుడు మానవులకు ఉత్పాదకుడు. మహామహుడు. సర్వసూచకుడు. అతడు ఒకే ఒక చక్రమును త్రిప్పుటకు ఉదయించును. రథమునకు కట్టిన హరిత అశ్వములు అతనిని మోయును.

    3. అత్యంత ప్రకాశమానుడగు సూర్యుడు స్తోతల స్తోత్రముల వినుటలో ఉన్మత్తుడై ఉషలమధ్య ఉదయించును. అతడు మాకు కోఱిన పదార్ధములు ఇచ్చును. అతడు సర్వసముడు. తన తేజమును సంకుచితము చేయడు.

    4. దూరగామి, త్రాత, దీప్తిమంతుడగు సూర్యుడు శుభంకరుడై, బహుతేజవంతుడై అంతరిక్షమున ఉదయించును. జీవులన్నియు సూర్యునినుండియే ఉత్పన్నములగును. కర్తవ్య కర్మలు నిర్వహించును.

    5. అమరులగు దేవతలు సూర్యుని కొరకు మార్గముపరచినారు. అది గతిపారాయణమగు గ్రద్దవలె అంతరిక్షమున సాగును. మిత్రావరుణులారా ! సూర్యోదయమైనది. ప్రాతస్సవనమున మీకు నమస్కరించి, హవ్యములందించి మిమ్ము సేవింతుము.

    6. మిత్రావరుణ ఆర్యములారా ! మాకు, మా పుత్రులకు ధనము ప్రదానము చేయండి. మేము సాగవలసిన మార్గములను సుగమములు చేయండి. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                      అరువది నాలుగవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీరు ద్యులోక భూలోకములందు జలములకు స్వాములు. మీరే మేఘములకు జలరూపము కలిగింతురు. మిత్రుడు, సుజన్మ ఆర్యమ రాజు, బలివరుణుడు మా హవ్యమును స్వీకరించవలెను.

    2. మీరు రాజులు. మహా యజ్ఞరక్షకులు. సింధుపతులు. వీరులు. మావద్దకు విచ్చేయండి. శీఘ్రదాతలగు మిత్రావరుణులారా ! అంతరిక్షమునుండి మాకు అన్నము వర్షము పంపండి.

    3. మిత్రావరుణులు, ఆర్యమ ఉత్తమ మార్గమున మమ్ము నడిపించవలెను. ఆర్యమ మంచిదాతకు మా కథ వినిపించవలెను. మీ రక్షణలందు మేము అన్నవంతులమై, పుత్రపౌత్రాదుల సహితులమై ప్రమత్తులముకావలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.