Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



 3. మనకు సలహాలు ఇచ్చుటకు లాయర్లున్నారు, డాక్టర్లున్నారు. సామాజిక శాస్త్రజ్ఞులు లేరు. పురోహితుడు సామాజిక విజ్ఞానము కలవాడు . మనిషి మనుగడకు సమాజము అవసరము. అందువలన సమాజము తెలిసిన శాస్త్రజ్ఞులు అవసరము. వారి సలహా అవసరము. ఆ విషయమును నేడు మనము గుర్తించుట లేదు. ఇది అతి ప్రధాన విషయము. దీనిని ఆనాడు గుర్తించినారు. అందుకే పాండవులు దౌమ్యుని పురోహితునిగా ఎన్నుకున్నారు.
4. పాంచాల దేశము సంరుద్దము అన్నది కుంతి. నేటికిని పంజాబు సమృద్దము. ఆ రాష్ట్రమున పండించినంత పంట ఏ రాష్ట్రమును పండించుట లేదు.
5. కాంపిల్యమునకు వచ్చిన రాజులు, కాశీ వస్త్రములు ధరించినారని చెప్పబడినది. నేటికిని బనారసు పట్టు వస్త్రములు విశిష్టములు.
6. శ్రీకృష్ణుడు తొలిసారిగా ద్రౌపదీ స్వయంవరమున దర్శనమిచ్చినాడు. అతను ద్రౌపదిని పొందుటకు రాలేదు. అందుకు తనవారిని వారించినాడు. పాండవులు కాంపిల్యమునకు వత్తురని అతనికి తెలియును. బ్రాహ్మణవేషములు ఉన్న పాండవులను ముందుగా గుర్తించినవాడు శ్రీకృష్ణుడే. తదుపరి పాండవుల స్థావరమునకు పోయినాడు. తాను పాండవ పక్షపాతిని అని ప్రకటించినాడు.
    లక్క ఇంటి కధ తరువాత రాజులలో చాల పరిణామములు వచ్చినట్లు విదితము అగుచున్నది. రాజులలో ఒక పక్షము దుర్యోధనుని దుష్టత్వమును గర్హించినది. వారు పాండవులకు జరిగిన అన్యాయమును గుర్తించినారు. ద్రౌపది స్వయంవరమున పక్షములు స్పష్టమయినవి.
    పాండవులకు మహాబలవంతుడయిన ద్రుపదుని అండ లభించినది.
    ద్రౌపది పెండ్లికి శ్రీకృష్ట బలరాములు రాలేదు. అపెండ్లికి వారు వ్యతిరేకులా? సమయము లేక ద్రుపదుడు పిలువలేదా?
    ఆలస్యము మంచిది కాదని ఆనాడే పెండ్లి చేయించినాడు వ్యాసుడు.

                                           అర్ధ రాజ్యము - ఇంద్రప్రస్థము

    పాండవులు ద్రౌపదిని వివాహమాడినారు. ద్రుపదుని ఇంట ఉన్నారు. వారు సంపన్నులుగా ఉన్నారు. సమర్ధులుగా ఉన్నారు. బలవంతులయి ఉన్నారు. అది చూచినాడు దుర్యోధనుడు. ఈర్ష్య చెందినాడు. కర్ణ దుశ్శాసనులతో గూడి దృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళినాడు. తండ్రితో అన్నాడు :-
    "తండ్రీ! విదురుడు పాండవ పక్షపాతి. రాత్రింబవళ్ళు అతడు నిన్ను విడువడు. మేము మీతో మాట్లాడుటకు సమయము దొరుకుట లేదు. ఇప్పుడు సమయము చూచి వచ్చినాము. నా విన్నపము చిత్తగించుము."
    "పాండవులు ద్రుపదుని వద్దకు చేరినారు. వారికీ శ్రీకృష్ణ బలరాముల అండ లభించినది. శ్రీకృష్ణబలరాముల సాయము లభించిన సకల యాదవులను, వృష్టిభోజ అంధక వంశస్థుల సాయము లభించును. అట్లు జరిగిన పాండవులను జయించుట అసాధ్యమగును. ఆలస్యము మంచిది కాదు. ఏదో విధమున పాండవులు ద్రౌపదిని విడుచునట్లు చేయవలెను. ఒక భార్యకు అయిదుగురు భర్తలుండుట పొసగదు. అప్పుడు వారికి ద్రుపదునితో వైరము కలుగును. తరువాత ద్రౌపది విషయమున పాండవులలో వారిలో వారికి కయ్యము కలిగించవలెను. అట్లు చేసి భీముని రహస్యముగా చంపించవలెను. ఆ తరువాత యుద్దమున కర్ణుని చేత చచ్చును. ధర్మరాజు నిర్వీర్యుడగును ఇది నా ఆలోచనము."
    కర్ణుడు మాయోపాయములకు అంగీకరించలేదు. "మహారాజా! ద్రుపదునకు పాండవుల ఎడల అనురాగము ఏర్పడినది. అతడు వారిని విడువడు. స్త్రీలు అనేక మంది భర్తలు కావలెనని కోరుకుందురు. కాన ద్రౌపది పాండవులను విడువదు. ఇది వరకు భీముని చంపుటకు రహస్యముగా అనేక ప్రయత్నములు చేసినారు. ఫలించలేదు. కాబట్టి రహస్య ప్రయత్నములు కూడవు. వారితో బహిరంగ యుద్దమునకు పూనుకొనవలెను. చతురంగ బలములతో దండెత్తి ద్రుపదుడు మున్నగు పాంచాలుర చంపవలెను. పాండవులను మరొక చోటికి పోనివ్వరాదు. హస్తినకు తేవలయును."
    ధృతరాష్ట్రుడు వారి మాటలు విన్నాడు అన్నాడు:-
    "విదురునితో నాకు సఖ్యత లేదు. అట్లు నటింతును. నా మనసులోని మాట విదురునితో చెప్పను. పాండవుల విషయమున మీవలెనే నేనును అలోచింతును. మీ మాటలు విన్నాను. కర్ణుడు చెప్పినది బాగున్నట్లు తోచుచున్నది. అయినను బుద్దిమంతులతో యోచింతము" అని భీష్మ ద్రోణ, విదుర , కృపాచార్య, అశ్వత్ధామ , సోమదత్తాదులను పిలిపించినాడు. దుర్యోధనాదుల ఆలోచనను వారికి వివరించినాడు. వారి సలహా అడిగినాడు.
    "దుర్యోధనా! వంచనకు దిగకు. అకార్యము తలపెట్టకు. ధృతరాష్ట్ర పాండురాజులు ఇద్దరును నాకు కొడుకులు. వారి పుత్రులు కౌరవ పాండవులు. ఉభయులయందు నాకు సమబుద్ది ఉన్నది. పాండవులతో యుద్దమునకు నేను సమ్మతించను. ఈ రాజ్యము పితృపితామహ,మగు ధనము. కావున మీవలెనే వారును రాజ్యమునకు అర్హులు అగుదురు. వారికి సగము రాజ్యము ఇచ్చిన నీకు, నీ బంధుజనులకు మేలు కలుగును. నీకు కీర్తి కలుగును. పాండవులకు రాజ్యము పంచి ఇచ్చి వారితో స్నేహముగా ఉండుట శ్రేయస్కరము" అన్నాడు భీష్ముడు.
    ద్రోణుడు :- "భీష్ముని వాక్యములు బహుగుణ వస్తువులకు భూషణములవంటివి. అవి న్యాయ సమ్మతములు. ధర్మ స్వరూపములు. సాధు సమ్మతములు. నీవు భీష్ముని వాక్యము వినుము. కర్ణ శకుని దుశ్శాసనుల దుష్ట వాక్యములను వినకుము. పెద్దల వాక్కులకు మూడులు విరోధము పలుకుదురు. మూడులు రాజులకు అప్తులయి , స్నేహితులు అగుదురు. అందువలన నాకు ప్రకాశిం'తురు. రాజులను ప్రకాశింపనీయరు. వారి మాటలు ప్రమాదకరములు."
    "పాండవులు సత్య సంపన్నులు. ధర్మపరులు. వారికి దైవబలము ఉన్నది. వారితో విరోధము కూడదు. పాండవులకు , కుంతికి, ద్రుపద, ధృష్టద్యుమ్నదులకు వస్త్రభూషణములు ఇచ్చి నీ తమ్ములగు వికర్ణ, దుశ్శాసనులను పంపుము. పాండవులను పిలిపించుము." అన్నాడు.
    విదురుడు "భీష్మద్రోణులు సత్యవంతులు. ధర్మపరులు. మధ్యస్థులు. వారు చెప్పినట్లు చేయుట నీకు ధర్మము. దుర్యోధన, కర్ణ, దుశ్శాసన శకునులు బాలురు. వారికీ ధర్మాధర్మములు తెలియవు. వారి మాట నీవు ఆచరించవద్దు. పాండవులు మహా బాల శౌర్య సంపన్నులు. వారికి శ్రీకృష్ణ, బలరామ, సాత్యకి ద్రుపద ద్రుష్టధ్యుమ్నుల సాయమున్నది. పాండవులకు దైవబలము ఉన్నదని లక్క ఇంటి యందే తెలిసినది. కాబట్టి వారితో యుద్దము తగదు. వారిని రప్పించుము. రాజ్యము పంచి ఇమ్ము."
    అందరి మాటలు విన్నాడు ధృతరాష్ట్రుడు. తన నిర్ణయము తెలియపరచినాడు.
    "భీష్మ, ద్రోణ, విదురులు లోక ప్రసిద్దులు. ధర్మబుద్ధి గలవారు.  వారి మాట వినకుండుటకు నేను మూర్ఖుడను కాను. పాండవులకు అర్ధ రాజ్యము ఇచ్చెదను. విదురుడు కాంపిల్యమునకు వెళ్ళును. పాండవులను తోడ్కొని వచ్చును."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.