Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    8. అంగణమున పడుకున్న అంగనలు. వాహనములపై పండినవారు, పరుపులపై పన్నవారు, పుణ్యగంధులు అట్టి అంగనలందరిని నిద్రింప చేయుదుము.

    (వశిష్ఠుడు ఒకరాత్రి వరుణుని ఇంటి ప్రవేశించినాడు. అక్కడి కుక్క మొరుగుచు వశిష్ఠుని వెంబడించినది. ఈ మంత్రములతో దానిని శాంతింపచేసి నిద్రపుచ్చినాడు.)

                                             మరొక కథనము

    1. వశిష్ఠునకు మూడు రాత్రులు అన్నముదొరకలేదు. నాలుగవ రాత్రి వరుణుని ఇంటికి చేరదలచినాడు. ద్వారము వద్ద కుక్క బెదిరించినది. దానిని నిద్ర పుచ్చినాడని శాయణుడు.

    (ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున మూడవ అనువాకము సమాప్తము.)


   
                నాలుగవ అనువాకము             ఏబది ఆరవ సూక్తము

    ఋషి - వసిష్ఠుడు, దేవత - మరుత్తులు ఛందస్సు 1-11 ద్విపద, 12-20 విరాజ, మిగిలినవి త్రిష్టుప్.

    1. కాంతిమంతనేతలు, సమాన గృహనివాసులు, మహదేవపుత్రులు, మానవహితైషులు, అశ్వవంతులు ఎవరు? వీరెవరు?

    2. వీరు పుట్టుక ఎరిగినవారులేరు. వీరిలో వీరికే తమ జన్మకథ తెలియును.

    3. స్వయం చాలకులు. పరస్పరము కలిసికొనువారు. వాయువేగముగల శ్యేనముతో స్పర్థింతురు.

    4. శాస్త్రము లెరిగిన మనుజులు ఈ శ్వేతవర్ణ జీవులను ఎరుగుదురు. మహతి పృశ్ని వీరిని అంతరిక్షమున మోసినది.

    5. ఆమె బుద్ధిజీవులగు మరుత్తుల అనుగ్రహమున సదాశత్రువులను ఓడించునదియు, ధనమునకు పుష్టిని ఇచ్చునదియు వీరపుత్రవతియు అయినది.

    6. మరుత్తులు తాము వెళ్లు స్థలములకు అందరికన్న ఎక్కువగా వెళ్లుదురు. అలంకారములతో అందరికన్న ఎక్కువ శోభింతురు. వారు కాంతిపూర్ణులు. ఓజస్వులు.   

    7. మీ తేజస్సు ఉగ్రము బలము స్థిరము. మరుద్గణములు బుద్ధిమంతులు కావలెను.

    8. మీ బలము సర్వత్ర శోభిల్లునది. మా చిత్తము క్రోధశీలము. పరాభవించగల మీవేగము స్తోతవలె బహువిధ ధ్వనికలది.

    9. మరుత్తులారా ! మీ పురాతన అస్త్రములు మాకు దూరము కానీయండి. మీ క్రూర ప్రవృత్తి మమ్ము తాకరాదు.

    10. మీరు క్షిప్రకారులు. మిమ్ము మీకు ప్రియములగు నామములతో పిలుతుము. మీరు అందుకు సంతుష్టులగుదురు.

    11. మరుద్గణములు సుందర ఆయుధధారులు. గతిశీలురు. సుందర అలంకారములవారు. వారు మా దేహములను అలంకరింతురు.

    12. మరుత్తులారా ! మీరు శుచిమంతులు. శుచిమంత హవ్యము మీది కావలెను. మీరు శుచిమంతులు. మీ కొఱకు మేము శుచిగల యజ్ఞము చేతుము. జలస్పర్శ మరుద్గణము ఋతమునుండి సత్యమును పొందినారు. మరుద్గణములు శుచిమంతులు, వారి జన్మము శుచిమంతము వారు ఇతరులను శుచిమంతులను చేయుదురు.

    13. మరుత్తులారా ! మీ దండములకు కడియములు ఉన్నవి. మీ ఉదరమున ఉత్తమ హారములున్నవి. వర్షముతో మెరుపుతో శోభించినట్లు జలమును ఇచ్చునపుడు మీరు ఆయుధములతో శోభిల్లుదురు.

    14. మరుత్తులారా ! అంతరిక్షమున ఆవిర్భవించిన మీ తేజస్సు విశేషరూపమున గమనము చేయును. మీరు విశేష రూపమున యజనీయులు. జలములను వర్థిల్లచేయండి. మీరు సహస్ర సంఖ్యాకము, గృహోత్పన్నము, గృహమేధి సమర్పించు ఈ భాగములను ఆశ్రయించండి.

    15. మరుత్తులారా ! అన్నవంతుడగు మేధావియొక్క హవ్యయుక్తి స్తోత్రమును మీరు ఎరుంగుదురు. శోభన పుత్రవంతునకు వెంటనే ధనము నివ్వండి. ఆ ధనమును శత్రువులు నష్టపరచరాదు.

    16. మరుద్గణములు నిరంతరము నడచు అశ్వమువంటి చక్కని నడకకలవారు ఉత్సవమును చూచుజనులవంటివి శోభస్కరులు. ఇంట ఉన్న పసిపాపవంటి సుందరులు. ఆటలలో ఉన్న పిల్లవంటివారు. వారు జలములను దాల్తురు.

    17. మరుత్తులారా ! మాకు ధనము ఇవ్వండి. మీ మహిమ సుందరము. ద్యావాపృథ్వులను పూరించండి. మాకు సుఖములు ప్రసాదించండి. మీ మానవ నాశక ఆయుధము మా నుంచి దూరముగ ఉంచండి. సుఖములు అందుకొని మాముందు అవతరించండి.

    18. మరుత్తులారా ! తన గృహమున కూర్చున్న హోత మీ దానకార్యములను ప్రశంసించును. మిమ్ము మాటిమాటికి ఆహ్వానించును. కార్యనిష్ఠగల యజమానిని కాపాడు హోత కపటశూన్యుడై మిమ్ము స్తోత్రములతో స్తుతించును.

    19. ఈ మరుత్తులు యజ్ఞమున క్షిప్రకారి యజమానిని ప్రసన్నుని చేయుదురు. వీరు తమ బలమున బలవంతులను క్రుంగదీయుదురు. వంగపెట్టుదురు. ఆర్గురు స్తోతలను హింసకులనుండి రక్షింతురు. కాని హవ్యము అందించని వారికి గొప్ప హాని కలిగింతురు.

    20. వీరు ధనికులను, దరిద్రులను ఉభయులను ఉత్తేజ పరతురు. దేవతలు, బంధువులు కోరినరీతి మీరు చీకట్లను దూరము చేయండి. మాకు మేము కోరినట్టి పుత్రపౌత్రులను ప్రసాదించండి.

    21. కోఱికలు నీడేర్చు మరుత్తులారా ! మేము మీ దానములకు ఆవల ఉండరాదు. మీరు ధనమును దానము చేయునపుడు మమ్ము వెనుక పడనీయరాదు. అభిలషణీయ ధనములందు మమ్ము భాగస్వాములను చేయవలెను. మీ ధనము మంచి జన్మగలది. దానిలో కూడ మమ్ము భాగస్వాములను చేయవలెను.

    22. పరాక్రమశాలురు ఓషధులను జనులను జయించుటకు కుపితులైనప్పుడు అప్పుడు రుద్రపుత్ర మరుత్తులు యుద్ధమునందు శత్రువుముందు మాకు రక్షకులు కావలెను.

    23. మరుత్తులారా ! మా పూర్వీకులు కొఱకు మీరు అనేక కార్యములు చేసినారు. అతడు ముందటి ప్రశంసనీయ కార్యములను కూడ మీరే చేసినారు. యుద్ధమున మీ సహాయము వీరుడైనవాడు శత్రువును పరాజితును చేయును. మీ సాయమునననేస్తోత అన్నము అనుభవించుచున్నాడు.

    24. మరుత్తులారా ! మా పుత్రుడు బలశాలి కావలెను. అతడు అసుర శత్రువులను వధించవలెను. ఆ పుత్రుని కూడి అందమగు నివాసమునకుగాను శత్రువును నాశనము చేయుదుము. మీ ఆత్మీయస్థానమున మేము నివసింతుము "స్వమోకో అభివఃస్యామ"

    25. ఇంద్ర, వరుణ, మిత్ర, అగ్ని, జల, ఓషధి, వృక్షములు మాస్తోత్రమును ఆశ్రయించవలెను. మరుత్తుల వడిలో మేము సుఖించవలెను.

    "శర్మం న్త్య్సామ మరుతాముపస్థోయూయం పరాతస్వస్తిభిః సదానః".


                                       ఏబది ఏడవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. యజనీయ మరుత్తులారా యజ్ఞకాలమున స్తోతలు ఉన్మత్తులగుదురు. అప్పుడు మీ బలముతో పాటు మీ నామమును కీర్తింతురు. వారు విశాల ద్యావాపృథ్వులను గడగడలాడింతురు. మేఘములనుండి జలము వర్షింతురు. ఓజస్వులై సర్వత్ర సంచరింతురు.

    2. మరుద్గణములు స్తోతలకొఱకు వెదుకుదురు. వారు యజమాని మనోరథము పూరింతురు. మరుద్గణములారా ! మీరు ప్రసన్నులుకండు. సోమపానమునకు మా యజ్ఞమునకు విచ్చేయుడు. కుశలపై ఆసీనులుకండు.

    3. మరుద్గణములు చేసినంత దానము మరెవ్వడు చేయజాలరు. వారు హారములు, ఆయుధములతో తమ దేహములను అలంకరించు కొందురు. ద్యావాపృథ్వులు వెలిగించు వెలుగులుగల గాలిదేవరలు అందమునకుగాను సమాన రూప ఆభరణములను వ్యక్తపరతురు.

    4. మరుత్తులారా ! ప్రసిద్ధముగా మీ ఆయుధము మాకు దూరముగా ఉండవలెను. మేము మానవులము. మా విషయమున అపరాధము చేయగలవారలము. అయినను మీ ఆయుధము మామీద పడరాదు.

    5. మా యజ్ఞమున మరుత్తులు రమింతురుగాత "కృతోచిదత్రమరుతః" అనువారు ఆనందమయులు దీప్తివంతులు. శుభంకరులు. మరుత్తులారా ! మీరు దయతలచండి. లేదా మా స్తుతులకు ప్రసన్నులకండు. మమ్ము తగురీతిన పాలించండి. అన్నమూలమున పోషించండి. మమ్ము అభివృద్ధిపరచండి.

    6. మరుద్గణములారా ! మీరు స్తుతులయి హవిని ఆరగించండి. మీరు నేతలు. సకల జలసహితులై విరాజిల్లినారు. మా సంతానమునకు జలము అందించండి. హవ్యదాతకు సత్యము ప్రియమగు ధనము ఇవ్వండి "జిగృత రాయః సూనృతా మఘాని"

    7. మరుద్గణములు స్తుతులయి, సకల రక్షణ సహితులై, యజ్ఞమున స్తోతముందు అవతరించవలెను. వారు స్వయముగా స్తోతలను పుత్ర, మిత్ర, పరిచారణాదులతో శత సంఖ్యాకులను చేయుదురు. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                         ఏబది ఎనిమిదవ సూక్తము

            ఋషి - వసిష్ఠుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. స్తోతలారా ! వర్షము నిచ్చు మరుద్గణములను సర్వదా పూజించండి. వారు స్వర్గమునందు అందరిని మించిన బుద్ధికుశలురు. తమ మహిమతో వారు ద్యావాపృథ్వులను భగ్నము చేయుదురు. భూమి, అంతరిక్షమునుండి స్వర్గమును వ్యాపించ చేయుదురు.

    2. మరుత్తులారా ! మీరు భయంకరులు. ప్రవృద్ధ బుద్ధులు. గమనశీలురు. మీకు దీప్తుడగు రుద్రుడు జన్మనిచ్చినాడు. మీరు తేజము, బలమును ప్రభావ శాలురయినారు. మీ గమనమునకు సూర్యుని చూడగల సమస్తప్రాణిజాలము భయపడును.

    3. మరుత్తులారా ! మీరు హవ్యయుక్తునకు చాల అన్నము ఇవ్వండి. అందములగు మా స్తోత్రములను స్వీకరించండి. మీరు పయనించిన మార్గమున ప్రాణిజాలమునకు హానికలుగదు. మీరు మమ్ము అభిలషణీయ రక్షణలతో పెంపొందించండి.

    4. మరుత్తులారా ! మీరు రక్షించిన స్తోత శత సంఖ్యాక ధనవంతుడగును. మీరు రక్షించిన స్తోత ఆక్రమణకారి శత్రువును అణచి సహస్ర ధనవంతుడగును. మీరు రక్షించినవాడు సామ్రాట్టు శత్రునాశకుడగును. మీరు ఇచ్చిన ధనము మరింత పెరగవలెను.

    5. కోఱికలు తీర్చుమరుత్తులను నేను సేవింతును. వారు మరల మరల ఎన్నోమార్లు మాముందుకు రావలెను. ఏ ప్రకటిత, అప్రకటిత పాపమున మరుద్గణములకు కోపము కలుగునో, అట్టి పాపములను మరుత్తులను స్తుతించి కడిగి వేతుము.

    6. ధనవంతులగు మరుత్తుల శోభన స్తుతిని ఈ సూక్తమున చేసినాము. మరుద్గణములు ఈ సూక్తమును స్వీకరించవలెను. అభీష్ట వర్షక మరుత్తులు దూరమునుండియే శత్రువును వేరు చేయవలెను. "యూయంపాత స్వస్తిభిః సదా నః"


                                         ఏబది తొమ్మిదవ సూక్తము

        ఋషి - వసిష్ఠుడు, దేవత - రుద్ర - మరుత్తులు, ఛందస్సు - 1-6 బృహతి, 7,8 త్రిష్టుప్, 11 గాయత్రి, 12 అనుష్టుప్.

    1. దేవతలారా ! స్తోతలను భయమునుండి రక్షించండి. అగ్ని, వరుణ, మిత్ర, ఆర్యమ, మరుత్తులారా ! మీరు సన్మార్గము నడిపించిన వానికి సుఖముల నివ్వండి.

    2. దేవతలారా ! మీ రక్షణలో మీకు ప్రియదినమున యజ్ఞము చేయువాడును శత్రువును ఆక్రమించువాడును మిమ్ము అన్యస్థానములకు పోనీక హవ్యము ఇచ్చువాడును తన నివాసమును పెంచుకొనును.

    3. నేను వసిష్ఠుడను. మీలో మందులను వదిలి స్తుతించను. అందరిని స్తుతింతును. మరుత్తులారా ! మీరు సోమాభిలాషులై, అందరు కలిసి మా సోమము అభిషుతముకాగా సోమపానము చేయండి.

    4. నేతలారా ! మీరు, కోఱిన కోర్కెలు తీర్చినవారిని మీ రక్షణలు యుద్ధమున కాపాడును. మీ అనుగ్రహ వృద్ధులు నవీనములై మా వద్దకు ఏతెంచవలెను. సోమపానాభిలాషులారా ! మీరు త్వరగారండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.