Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
4. అశ్వములందు ముఖ్యుడు, శీఘ్రగామి, గతిశీలుడగు దధిక్ర జ్ఞాతవ్యమును ఎరుగును. ఉష, సూర్య, ఆదిత్యగణ, వసుగణ, అంగిరులతో కలిసి దధిక్ర స్వయముగా రథపు అగ్రభాగమున తగులును.
5. దధిక్రా ! అందఱు యజ్ఞము చేయవలెను. అందఱు చక్కని మార్గమున నడువవలెను. అందఱకు దివ్యజలము లభించవలెను. అందఱకు జ్ఞానము కలుగవలెను. సామర్థ్యము కలుగవలెను. అందఱు దేవతల గుణములు దానము చేయవలెను. అందఱు స్వయముగా దేవతల వంటివారు కావలెను.
నలుబది ఐదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - సవిత ఛందస్సు - త్రిష్టుప్.
1. సవిత రత్నయుక్తమగు తన తేజస్సుతో అంతరిక్షమును పూరించును. అతడు అశ్వమును అధిరోహించును. మానవులకు హితకరమగు అనంత ధనమును రెండు చేతులందు దాల్చును. అతడు ప్రాణులను వారి స్థానములందు భరించి వారిని వారివారి కర్మలకు ప్రోత్సహించుచు విచ్చేయవలెను.
2. దానము కొఱకు ప్రసరించిన విశాల హిరణ్మయ బాహువులతో సవిత అంతరిక్షపు అంచులవరకు వ్యాపించవలెను. నేడు మేము సవితయొక్క ఆ మహిమనే కీర్తింతుము. సూర్యుడు సహితము సవితకు కర్మ స్వేచ్చ నివ్వవలెను.
3. తేజస్వి, ధనాధిపతి సవితయే మా కొఱకు ధనము పంపవలెను. అతడు బహువిశాల రూపము ధరించును. మాకు మానవభోగ యోగ్యమగు ధనము ఇవ్వవలెను.
4. సవిత్ర స్తోత్ర రూపవచనుడు. ఉత్తమ జిహ్వజలవాడు. సుందరహస్తములు కలవాడు. ఆ సవితను మేము స్తుతింతుము. అతడు మాకు విచిత్రము విశాలమగు అన్నము ప్రదానము చేయవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"
నలుబది ఆరవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - రుద్రుడు, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.
1. రుద్రుడు దృఢ ధనుష్టుడు. వేగవంతములను అమ్ములవాడు. అన్నవంతుడు. అజేయుడు. విజేత. సుతీక్ష్ణ అస్త్ర కర్త. అటువంటి రుద్రుని స్తుతించండి. అతడు వినవలెను.
2. భూమిమీద, స్వర్గమందు ఉన్న వారిని ఐశ్వర్యమునుబట్టి తెలుసుకొనవచ్చును. నిన్ను స్తుతించువారిని పాలింపుము. మా ఇంటికి విచ్చేయుము. మమ్ము రోగస్థులను చేయకుము.
3. రుద్రా ! నీవు అంతరిక్షమున పిడుగును విడుతువు. అది నేలను అంటునపుడు మమ్ము తాకరాదు. "స్వసివాత" రుద్రా ! నీ వద్ద వేల ఓషధులు ఉన్నవి. మా పుత్ర, పౌత్రులను హింసించకుము.
4. రుద్రా ! నీవు మమ్ము కొట్టరాదు. మమ్ము విడువరాదు. నీ కోపమున పడిన ఉచ్చులలో మమ్ము పడనీయకుము. ప్రాణులచే ప్రశంసించబడు యజ్ఞమున మమ్ము భాగస్వాములను చేయుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"
నలుబది ఏడవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - అప్, ఛందస్సు - త్రిష్టుప్.
1. అప్ దేవతా ! నీవు సంస్కరించిన సోమరసము దేవతలు ఇష్టపడునది. అధ్వర్యులు ఇంద్రునకు పానయోగ్యముగా చేసినది. అట్టి శుద్ధము, నిష్పాపము, వృష్టిజల సేచనకారి అగు రసవంత సోమరసమును మేముకూడ సేవింతుము.
2. శీఘ్రగతిగల అపాంనిపాత, అగ్నీ ! దేవతలు నీ రసవత్తమ సోమమును రక్షించవలెను. అందు వసువులు రుద్రులు ఉన్మత్తులు అగుదురు. మేము దేవాభిలాషులము. నేడు ఆ సోమరసమును అందుకొందుము.
3. అప్ దేవత జలదేవత అనేక పావన రూపములవాడు. హర్షోత్పాదకుడు. ప్రకాశమానుడు. దేవతల స్థానములందు ప్రవేశము కలవాడు. అతడు ఇంద్రుని యజ్ఞాది కర్మములకు ఆటంకము కలిగించడు. అధ్వర్యాలారా ! మీరు సింధు మున్నగు జలస్థానమునలకు ఘృతయుక్త హవ్యముతో హోమము చేయండి.
4. సూర్యుడు తన కిరణములతో జలములను విస్తరింపచేయును. ఇంద్రుడు జలగమన మార్గమును ఏర్పరచినాడు. సింధుగణములారా ! మీరు మా కొఱకు ధనము దాల్చుడు. "యూయం పాత స్వస్తిభిః సదానః"
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఋభువులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఋభువులారా ! మీరు నేతలు, ధనవంతులు. మా సోమము పానము చేయుడు. మత్తులగుడు. మీరు వెళ్లుచున్నారు. మా అశ్వములు మీ కార్యములు నిర్వర్తించునవి. సమర్థలు. అవి మా కొఱకని మానవహితకర రథమును ఆవర్తితము చేయవలెను.
2. ఋభువులారా ! మేము మీ వలన ప్రసిద్ధులము అగుదుము. మేము సమర్థులము కావలెను. మీ సాయమున మీ బలముతో మేము శత్రువులను అణచివేసెదము. వాజనామక ఋభువు యుద్ధములందు మమ్ము రక్షించవలెను. ఇంద్రుని సహాయమున మేము వృత్రుని బారినుండి తప్పించుకొన గలము.
3. ఇంద్రుడు ఋభుగణములు తమ ఆయుధములతో మా శత్రుసేనలను అనేకములను ఓడింతురు. యుద్ధము జరిగినప్పుడువారు సమస్త శత్రువులను హతమార్చెదరు. విభ్వ, ఋభుక్ష, వాజలను ముగ్గురు ఋభువులను, ఆర్య ఇంద్రుడు మథించి శత్రుబలములను నష్టపర్చెదరు.
4. ప్రకాశక ఋభువులారా ! మాకు నేడు ధనము ఇవ్వండి.
సమస్త ఋభువులారా ! ప్రసన్నులై మీరు మమ్ము రక్షించండి.
ప్రశస్త ఋభువులారా ! మీరు మాకు అన్నము ప్రదానము చేయండి. "యూయంపాత స్వస్తిభిః సదానః"
నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - అప్, ఛందస్సు - త్రిష్టుప్.
1. జలములందు సముద్రుడు జ్యేష్ఠుడు. అప్ దేవత గమనశీలుడు. శోధకుడు. అతడు అంతరిక్ష మధ్యమునుండి సాగును. వజ్రధరుడు, అభీష్ట వర్షియగు ఇంద్రుడు జలములను విడిచినాడు. ఆ అప్ దేవత ఇక్కడ మమ్ము రక్షించవలెను.
2. అంతరిక్షమున పుట్టిన జలములు. నదులలో ప్రవహించు జలములు. నేల అడుగునుండి త్రవ్వితీసిన జలము స్వయముగా పుట్టి సముద్రమువైపు సాగుజలములు అట్టిదీప్తములగు పవిత్ర జలములన్నియు మమ్ము రక్షించవలెను.
3. జలసమూహముల స్వామి వరుణుడు. అతడు సత్యాసత్యములకు సాక్షీభూతుడై మధ్యలోకమునకు తరులును. అట్టి రసమును వర్షించు ప్రకాశయుక్తములగు, శోధక జలదేవతలు మమ్ము రక్షించవలెను.
4. రాజావరుణుడు నివసించునదియు, సోమము నిలుచునదియు అన్నములుపొంది విశ్వదేవతలు ప్రసన్నలగునదియు, వైశ్వానరుడు ఆసీనమగునదియు ప్రకాశక అప్ దేవత మమ్ము రక్షించవలెను.
ఏబదవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - వేరు వేరు, ఛందస్సు - జగతి.
1. మిత్రావరుణులారా ! ఈ లోకమున మీరు మమ్ము రక్షింపుడు. నిలిచి ఉండునదియు పాకునదియు అగు విషము మమ్ము చేరరాదు. అజక అను వ్యాధివలె దుర్ధర్శన విషము సమసి పోవలెను. కనిపించక సాగు సర్పము మా పదధ్వనులను గుర్తించరాదు. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"
2. వందననామక విషము నానాజన్మములందు వృక్షాది గ్రంథిస్థానములందు ఉత్పన్నమగును. జాను గుల్మాదులకు వాపు కలిగించు విషమును దీప్తిమాన్ అగ్నిదేవా ! మా మానవులకు దూరముగా ఉంచుము. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"
3. వృక్షఃస్థానమున (రొమ్మున) ఉండు విషమును నదుల జలములందు ఓషధులతో కలుగు విషమును విశ్వదేవగణములారా ! మా నుండి దూరము చేయండి. "మాం పద్యే నిరపపరసా విదత్సరుః"
4. ప్రబల దేశమునకు పోవు నదులు దిగువదేశమునకు పోవు నదులు ఉన్నత దేశమునకు పోవు నదులు జలయుక్తములు, జలశూన్యములై లోకమును తృప్తిచెందించు నదులు మాకు వచ్చు "శిపాద" రోగమును నయము చేయవలెను. మాకు శుభములు కలిగించవలెను. నదులు బాధించరాదు.
ఏబది ఒకటవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఆదిత్యుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఆదిత్యుల రక్షణలతో మాకు నూతనము. సుఖకరమగు గృహము లభించవలెను. క్షిప్రకారి ఆదిత్యగణములు మాస్తోత్రములు వినవలెను. ఈ యజ్ఞకర్తను నిరపరాధిని అవిరుద్దుని చేయవలెను.
2. ఆదిత్యగణము అదితి అత్యంత సరళ స్వభావ మిత్ర, వరుణ, ఆర్యమ ఉన్మత్తులు కావలెను. లోక రక్షక దేవగణములు మమ్ము రక్షించవలెను. వారు మమ్ము రక్షించుటకు సోమపానము చేయవలెను.
3. మేము సమస్త ఆదిత్య గణములను సమస్త మరుద్గణములను సమస్త దేవగణములను సమస్త ఋభువులను ఇంద్రుని, అగ్నిని, అశ్వినులను స్తుతించుచున్నాము. "యూయంపాత స్వస్తిభిః సదానః"
(ఆదిత్యులు 12మంది మరుత్తులు 49మంది దేవగణము 3333 ఋభువులు ముగ్గురు.)
ఏబది రెండవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ఆదిత్యులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. మేము ఆదిత్యులకు ఆత్మీయులము. అవిభాజ్యులము వసువులారా ! మానవులను రక్షించండి. మిత్రావరుణులను భజించుచు మేము ధనములు అనుభవింతుము. ద్యావాపృథ్వులారా మేము శక్తివంతులముకావలెను.
2. మిత్రావరుణాది ఆదిత్యగణములు మా పుత్ర పౌత్రాదులకు సుఖములు కలిగించవలెను. ఇతరుల పాపము మేము అనుభవించకుండవలెను. వసువులారా ! ఏ కర్మము చేయుట వలన మీరు నాశము చేసెదరో అట్టి కర్మను మేము చేయకుండవలెను.
3. క్షిప్రకారులగు అంగిరులు సవితను యాచించి అతని ధనమును పొందినారు. వ్యాపింపచేసినారు. యజ్ఞశీలుడు. మహాపిత, ప్రజాపతి మఱియు దేవగణములు సుమనస్కులై ఆ ధనమును మాకు అందించవలెను.
ఏబది మూడవ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - ద్యావాపృథ్వులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ద్యావాపృథ్వులు విశాలలు. దేవతలకు జననులు. స్తోతలు వారిని స్తుతులతో స్తుతించుచు స్థాపించినారు. అట్టి యజనీయులు. మహిమాన్వితలగు ద్యావాపృథ్వులను ఋత్విక్కుల బాధాసహితుడనై యజ్ఞమున నమస్కారములతో స్తుతింతును.
2. స్తోతలారా ! కొత్త స్తుతులు రచించండి. మాతా పితృరూపులయిన ద్యావాపృథ్వులను యజ్ఞమునందు అగ్రభాగమున స్థాపించండి. ద్యావాపృథ్వులు తమ వద్దగల వరణీయ ధనము మాకు ఇచ్చుటకు దేవతల సహితులై మా వద్దకు రావలెను.
3. వాస్తోష్పతీ ! మేము నీ యొక్క సుఖకరము. రమణీయము. ధనవంత స్థానమును పొందవలెను. నీవు మాకు లభించనిది. లభించిన ధనములను రక్షింపుము. "యూయం పాత స్వస్తిభిః సదానః"
ఏబది నాల్గువ సూక్తము
ఋషి - వసిష్ఠుడు, దేవత - వాస్తోష్పతి, ఛందస్సు - వివిధములు.
1. వాస్తోష్పతీ ! నీవు రోగ నాశకుడవు. సర్వ ప్రకార రూపముల ప్రతిష్ఠుడవయి మాకు మిత్రుడవు, సుఖకరుడవగుము.
2. శ్వేతర్ణము ఒక్కొక్క అంశమున పింగళ వర్ణ సరమ వంశోద్భవుడే వాస్తోష్పతి. అతడు దంతములు వెళ్లపెట్టినపుడు తినునపుడును, పెదవి కదలినపుడును అవి ఆదంతములు ఆయుధమువలవలె శోభిల్లును. ఇప్పుడు మాత్రము. నీవు సుఖముగా నిద్రింపుము. "షుస్వప".
3. సారమేయా ! నీవు బయలుదేరిన చోటికే తిరిగి చేరుదువు "పునఃసరః సారమేయః" నీవు దొంగలు బందిపోటుల దగ్గరికి వెళ్లుము. ఇంద్రుని స్తుతించువాని వద్ద కేగి ఏమిచేతువు? మమ్ము ఎందుకు బాధింతువు. సుఖముగా నిద్రింపుము. "షుస్వప"
4. నీవు పందిని చీల్చుము. పంది నిన్ను చీల్చును. ఇంద్రుని స్తుతించువాని దగ్గరకేగి ఏమి చేతువు? మమ్ము ఎందుకు బాధింతువు? సుఖముగా నిద్రింపుము "షుస్వప".
5. నీ తండ్రి నిద్రించవలెను. తల్లినిద్రించవలెను. నీవు నిద్రించవలెను. గృహస్వామి నిద్రించవలెను. బంధువులు నిద్రించవలెను. నలువైపుల జనులు నిద్రించవలెను.
6. ఇచట ఉన్నవాని సంచరించువాని మమ్ము చూచువాని కనులు పొడిచివేయుదుము. ఈ మేర ఎంత నిశ్చలముగా ఉన్నదో వారును అట్లే అయిపోవుదురు.
7. వేయి కిరణముల వృషభము. సూర్యుడు సముద్రము నుండి లేచువాడు. ఆ విజేత సాయమున సకల మానవులను పండపెట్టెదము నిద్రింప చేయుదుము. "స్వాపయామసి"





