Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
బృహత్పృష్ట సామము నుండి భరద్వాజ ఋషి ఉత్పన్నుడైనాడు. ఇష్టికా! నీవు భరద్వాజ స్వరూపవు. భరద్వాజ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఇష్టకా! నీవు ప్రజాపతిచే నిర్మించబడినదానవు. ప్రజలందరి మనస్సిద్ధి కొరకు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
56. (మూడవ పది ఇటుకల వరుస పేర్చవలెను.)
పడమటికి వెళ్ళు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి విశ్వము నందలి పదార్థములను కనిపింప చేయువాడు. ఇష్టం! నీవు అట్టి విశ్వవ్యచ సూర్యుని రూపమవు. విశ్వవ్యచ సూర్య రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
విశ్వ వ్యచ సూర్యుని నుండి చక్షువు ఉత్పన్నమైనది. ఇష్టికా! రూపమవు. వర్ష స్వరూపమగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
వర్షము నుండి జగతీ ఛందము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు జగతీ చంధ స్వరూపమవు. జగతీ ఛంద స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
జగతీ ఛందము నుండి ఋక్సమ సామము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు ఋక్సమసామ స్వరూపవు. బుక్సమసామ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఋక్సమ సామము నుండి శుక్రగ్రహము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు శుక్ర గ్రహరూపమవు. శుక్రగ్రహ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రజాపతి శుక్ర గ్రహమునుండి శుక్రగ్రహము ఉత్పన్నమైంది. ఇష్టకా! నీవు శుక్ర గ్రహరూపమవు. శుక్రగ్రహ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రజాపతి శుక్ర గ్రహమునుండి సప్త దశస్తోమము ఉత్పత్తి చేసినాడు. ఇష్టకా! నీవు సప్తదశ స్తోమ స్వరూపవు. సప్తదశస్తోమ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
సప్తదశస్తోమము నుండి వైరూప పృష్ఠ సామము ఉత్పన్నమైనది. ఇష్టకా! వైరూప పృష్ఠసామరూపమవు. వైరూప పృష్ఠ సామరూపమవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
వైరూప పృష్ఠ సామము నుండి జమదగ్ని ఋషి కలిగినాడు. ఇష్టకా! నీవు జమదగ్ని స్వరూపవు. జమదగ్ని స్వరూపవగు నిన్ను కుండము నందు చేర్చుచున్నాను.
ప్రజాపతిచే నిర్మించబడిన ఇటుకను కుండమున చేర్చి సకల ప్రజల కొరకు చక్షువును గ్రహింతును.
57. (నాలుగవ పది ఇటుకలను వరుసను పేర్చవలెను.)
ఉత్తర దిశను ఆద్యోపాంతమగు స్వర్గము విరాజిల్లు చున్నది. ఇష్టకా! నీవు స్వర్గ స్వరూపవు. స్వర్గ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
స్వర్గమునుండి శ్రోత్రము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు శ్రోత్ర స్వరూపవు. శ్రోత స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
శ్రోత్రము నుండి శరద్ ఋతువు ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు శరదృతు స్వరూపవు. శరదృతు స్వరూపవగు నిన్ను కుండమునందు చేర్చుచున్నాను.
శరదృతువు నుండి అనుష్టుప్ ఛందము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు అనుష్టుప్ ఛందోరూపమవు. అనుష్టుప్ ఛందో రూపమగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
అనుష్టుప్ ఛందము నుండి ఐడసామము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు ఐడసామ స్వరూపమవు. ఐడ సామ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఐడ సామము నుండి మంథగ్రహము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు మంథ గ్రహ స్వరూపమవు. మంథ గ్రహ రూపమవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
మంథ గ్రహము నుండి ఏకవింశత్సోమము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు ఏకవింశత్సోను రూపమవు. ఏకవింశత్సోమ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఏక వింశత్సోమము నుండి వైరాజ సామము ఉత్పన్నమైనది. ఇష్టకా నీవు వైరాజససామ స్వరూపవు. వైరాజస సామ స్వరూపవగు నిన్ను చితిలో పేర్చుచున్నాను.
వైరాజ సామము నుండి సర్వ జగన్మిత్రుడు విశ్వామిత్రుడు కలిగినాడు. ఇష్టకా! నీవు విశ్వామిత్ర స్వరూపమవు. విశ్వామిత్ర స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రజాపతి నిర్మించిన ఇటుకను కుండమున చేర్చి సకల ప్రజల కొరకు శ్రోతమును గ్రహించుచున్నాను.
మతి నుండి హేమంతము ఉత్పన్నమైనది. ఇటుకా! నీవు హేమంత స్వరూపమవు. హేమంత స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
హేమంతము నుండి పంక్తి ఛందము ఉత్పన్నమైనది. ఇటుకా! నీవు పంక్తి ఛందోరూపమవు. పంక్తి ఛందోరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
పంక్తి ఛందము నుండి నిధనవత్సామము ఉత్పన్నమైనది. ఇటుకా! నీవు నిధనవత్సామ స్వరూపమవు. నిధనవత్సామ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
నిధనవత్సామము నుండి ఆగ్రాయణ గ్రహము ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు ఆగ్రాయణ గ్రహ స్వరూపమవు. ఆగ్రాయణ గ్రహ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఆగ్రాయణ గ్రహము నుండి త్రిణవ మరియు త్రయ, స్త్రింశస్తోమములు ఉత్పన్నములయినవి. ఇష్టకా! నీవు త్రిణవ, త్రయస్త్రింశ స్తోమరూపవు. త్రణవ, త్రియస్త్రింశస్తోమ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
త్రిణవ, త్రయస్త్రింశ స్తోమముల నుండి వరుసగా శక్వర మరియు రావత్సామము ఉత్పన్నములయినవి ఇష్టకా! నీవు శక్వర, రైవత్సామ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
శక్వర, రైవత్సామములనుంచి విశ్వకర్మ ఉత్పన్నుడైనాడు. ఇష్టకా! నీవు విశ్వ కర్మ రూపమవు. విశ్వకర్మ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రజాపతిచే నిర్మించబడిన ఈ ఇటుకను కుండమున చేర్చి ప్రజలందరి కొరకు వాణిని గ్రహించుచున్నాను.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
పుష్కరాద్యాది చిత్యంతమను పదమూడవ అధ్యాయము సమాప్తము.





