Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
అగ్నీ! నీ అశ్వములు వినయవంతలు. అవి నిన్ను దేవ యజ్ఞములకు గొనిపోవును. వానిని త్వరగా నీ రథమునకు పూన్చుము.
37. అగ్నీ! రథస్వామి తన రథమునకు అశ్వములు పూన్చిన రీతి - నీవు సహితము త్వరగా - దేవతలను ఆహ్వానించుటకు - నైపుణ్యము గల అశ్వములను నీ రథమునకు పూన్చుము. మానవ హొత కన్న ముందే నీవు ఈ వేదిమీద ప్రతిష్టితుడవగుము.
38. (ముఖప్రభృతి సప్తను ప్రాణాయతనేషు సప్త హిరణ్య శకలాన్ప్రత్యస్యతి - ఏడు పశువుల ముఖములందు ఏడు బంగారు ముక్కలు ఉంచవలెను.)
ఇవి హృదయమందుండి - మనసు నుండి పవిత్రముగా వెలువడిన హవిరన్నములు. ఇవి హిరణ్మయుని మీద నదుల వలె పడుచున్నవి. కుండ మధ్యమున విరాజిల్లుచున్న హిరణ్మయుని మీద పడుచున్న ఘృతాహుతి ధారలను నేను దర్శించుచున్నాను.
39. (నాసికయోః ప్రాశ్యతిః పశువు ముక్కునకు చూపవలెను.)
హిరణ్యఖండమా! బుక్కు కొరకు నిన్ను ఎడమ ముక్కున ఉంచుదును. కాంతి కొరకు నిన్ను కుడి ముక్కున - నాసికా రంధ్రమున ఉంచుదును.
(పశువు కన్నులకు చూపవలేను)
స్వర్ణఖండమా! వెలుగు కొరకు నిన్ను పశువు ఎడమ కంటి వద్ద ఉంచుదును. కాంతి కొరకు నిన్ను పశువు కుడి కంటి వద్ద ఉంచుదును.
(పశువు చెవులకు చూపవలెను)
ఈ సువర్ణ ఖండము ఈ సమస్త లోకములకు - అగ్నికి బలము ప్రదానము చేయునది. కావున దీనిని పశువుయొక్క ఎడమ - కుడి చెవుల వద్ద ఉంచుదును.
40. (దక్షిణశ్రోతే శకలం ప్రాశ్యతి. కుడిచెవి వద్ద బంగారం ముక్కను ఉంచవలెను.)
పశువు చెవి యందు స్వర్ణము పడినది. అందువలన అగ్ని తేజోవంతుడు అగుచున్నాడు. కాంతిమంత అగ్ని సువర్ణ కాంతివలన మరింత కాంతిమంతుడు అయినాడు.
(పురుషశిర ఉద్గ్రు హ్ణాతి - మానవ శిరస్సును ఉఖ యందు ఉంచవలెను.)
మానవ శిరమా! నీవు వేనవేల సంపదలు ఇచ్చుదానవు. వేనవేల సంపదలు కలుగవలెనని నిన్ను ఉఖయందుంచుచున్నాను.
(ముందు మానవ శిరమున తదుపరి అశ్వ, గో, అజములందు సువర్ణఖండములు ఉంచవలెను)
41. (పురుష శిర ఉద్గ్రుహ్ణాతి - మానవ శిరమును కుండము నందుంచవలెను.)
అగ్ని వేలమందికి దాత యగును. నానా రూపములుగ అవతరించువాడగును. మానవ శిరమా! నీవు ఈ గ్రహణశీల నీటితో తడుపుము. అగ్నీ! తేజమున ఈ యజమానిని రక్షించుము. ఇతనిని బాధించనీయకుము. కుండమునందు నిలిపిన శిరమా! ఈ యజమానిని "శాతాయుషం కురుహి"
42. (అశ్వశిర ఈశానే ఉపదధాతి - అశ్వశిరమును ఈశాన్యమున ఉంచవలెను)
అగ్నీ! నీవు వాయు వేగవంతుడవు. వరుణునకు నాభివంటి వాడవు. జలమధ్యమున ఉత్పన్నుడగు వాడవు. సముద్ర పత్నులగు నదులకు శిశువు వంటి వాడవు. హరిత వర్ణడవు. అగ్ని సంభూతుడవు. ఈ అశ్వము జలముల సంతతి. దీనిని పరమాకాశమున బాధించకుము.
43. (గోశిర ఆగ్నేయ్యాముపదధాతి)
అగ్ని అనుపేక్షనీయుడు. ఐశ్వర్యోపేతుడు. రోషరహితుడు. పూర్వ ఋషులచే పూజించ బడినవాడు. అన్నములందించి అందరను పోషించువాడు. స్వయంభరణీయుడు. అట్టి అగ్నిని స్తుతించుచున్నాను.
పర్వములు, ఋతువులననుసరించి విధివిధానమున ప్రజ్వరిల్లచేయబడునట్టి అగ్నీ! అఖండనీయము - విశేష రూపమున శోభితమగు ఈ గోవును బాధించకుము.
44. (వాయువ్య్కే విశిరముపదధాతి. వాయవ్యమున గొర్రె తలను ఉంచవలెను)
ఈ గొర్రెస్వరూపములు నిర్మించు త్వష్ణ అనుగ్రమున కంబళాదుల ద్వారా ఈ లోకములను ఆచ్ఛాదించునది. వరుణనాభి వంటి రక్షణీయ పరమ దిశలందు ఉత్పన్నమగునది. గొప్పది. వేల విలువ చేయునది. ప్రాణులకు ప్రజ్ఞ ప్రదానము చేయునది. అగ్నీ! అట్టి గొర్రెను పరమాకాశమున బాధించకుము.
45. (నైర్రుత్య్కేజముపదధాతి - అజము -మేక)
ఆగ్నేయ ఆజము ప్రజాపతి శోకమున పుట్టినది. ద్యులోక, భూలోక శోకములందు పుట్టినది. ప్రజాపతి వాగ్రూపమున మేకను, ప్రజలను సృష్టించినాడు.
అగ్నీ! అట్టి మేక విషయమున నీ క్రోధమును అతి దూరముగ విడువుము. బాధించకుము.
46. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః
ఆప్రా ద్యావాపృథివీ అంతరిక్షం సూర్య ఆత్మాజగతస్తస్థుషశ్చ
(7వ అధ్యాయపు 42 వ మంత్రము పునరావృతము)
47. (అధ్వర్యు వేదికి దక్షిణమున ఉత్తరాభిముఖుడై అయిదు మంత్రములచే అయిదుతలలను ఉపస్థానము చేయును.)
అగ్నీ! నీవు హిరణ్యశకల రూపుడవు. వేల కన్నుల వాడవు. యజ్ఞము కొరకు చయనము చేయబడువాడవు. ఈ రెండు కాళ్ళ పురుష పశువును హింసించకుము. యజ్జీయతురంగ ముఖ పశువును నీవు ఇష్టముగా భక్షించుము. నీ జ్వాలా శరీరమును పెంచుము. ఇచట స్థిరపడుము.
అగ్నీ! నీ మంటలు - మేము ద్వేషించునట్టి - కిన్నెర మృగమును చేరునుగాక.
48. అగ్నీ! ఇది అశ్వము -సకిలించునది. వేగవంతులందు వేగవంతము. దీనిని నీవు హింసించకుము. నీకు నేను అరణ్యమునందలి గౌర మృగమును చూపుదును. దానిని భక్షింపుము. నీ జ్వాలా దేహమును పెంచుము. ఇచట సుఖముగా వసింపుము.
అగ్నీ! నీ మంటలు మేము ద్వేషించునట్టి - గౌర మృగమును చేరును గాత.
49. ఇది గోవు. సహస్రమూల్యము. సహస్ర ఉపకారకము. ఘృత దుగ్ధముల శతధార కూపము. జీవనార్ధము అనేకానేక మానవులచే ఆశ్రయించబడునది. యజమానికి ఘృతము అందించునది అదీన. అగ్నీ! ఈ గోరూప పశువును పరమాకాశమున బాధించకుమా! నేను నీకు అరణ్యమందలి గోవు వంటి గవయ మృగమును చూపుదును. దానిని భక్షించుము. నీ జ్వాలా దేహమును పెంచుము. ఇచట సుఖముగా వసింపుము.
అగ్నీ! నీ మంటలు - మేము ద్వేషించు - గవయ మృగమును చేరవలెను.
50. ఇది గొర్రె. ఉన్ని నిచ్చునది. వరుణ నాభి వలె రక్షణీయ, ద్విపాద, చతుష్పాద పశువులను చలి నుండి రక్షించునది. కంబళాది త్వచల సృష్టించునది. పశురూప ప్రజను సృష్టించు త్వష్ట తొలుత సృష్టించినది. అగ్నీ! అట్టి గొర్రెను పరమాకాశమున హింసించకుమీ. అగ్నీ! నేను నీకు అరణ్యమునందలి ఒంటెను చూపుదును. దానిని భక్షింపుము. నీ జ్వాలా దేహమును పెంచుము ఇచట సుఖముగా వసింపుము.
అగ్నీ! నీ మంటలు మేము ద్వేషించు- ఒంటెను చేరును గాత.
51. ఇది మేక. ప్రజాపతి శోకమున పుట్టినది. ఆ మేక తనను సృష్టించిన ప్రజాపతిని మొట్ట మొదలు చూచినది. ఆ మేక యజ్ఞము చేసిన దేవత దేవతలందు అగ్రగణ్యుడైనాడు. ఆ మేక మూలముననే యాగయోగ్య యజమాని స్వర్గాదులను ఆరోహించును. అగ్నీ! నేను నీకు అరణ్యమునందలి శరభమును చూపుదును. దానిని భక్షింపుము. నీ జ్వాలా దేహము పెంచుము. ఇచట సుఖముగా వసింపుము.
అగ్నీ! నీ మంటలు - మేము ద్వేహించు - శరభ మృగమును చేరును గాత.
52. (బహిర్వేదేరాగత్యాగ్ని సమీప్కేర్ధచిత్యాముపతిష్ఠతి| వేది నుంచి బయటికి వచ్చి అగ్ని సమీపమున అర్ధచిథనుఇ ఏర్పరచును.)
అత్యంత యువఅగ్నీ! నీవు మా స్తుతులను వినుము. మేము ఋత్విజులను. హవిర్ధాత యజమాని వారలము. మమ్ము రక్షింపుము. యజమాని అతని పుత్ర పౌత్రాదులను కూడ రక్షింపుము.
53. అపస్య ఇష్టకా! నేను నిన్ను జలమార్గమున వాయువు నందు స్థాపింతును. జలముల ఓద్మి ఉషయందు స్థాపించెదను. జలముల భస్మమునందు స్థాపింతును. జలముల జ్యోతి యందు స్థాపింతును. జలముల అయనము భూమి యందు స్థాపింతును. జలముల స్థానము - ప్రాణము నందు స్థాపింతును. జలముల చక్షువులందు స్థాపింతును. జలముల సధిశోత్రము లందు స్థాపింతును. జలముల సదనమగు ద్యులోకమున స్థాపింతును. జలముల సహస్థానము అంతరిక్షమున స్థాపింతును. జలముల యోని సముద్రమున స్థాపించును. జలము అన్నమున స్థాపింతును. జలముల మలము ఇసుక యందు స్థాపింతును.
(అపస్య అను ఇటుకలను అయిదింటింని పేర్చవలెను.)
ఛందస్య ఇష్టకా! నేను నిన్ను గాయత్రీ ఛందమున కుండమున చేర్చుచున్నాను. త్రిష్టుప్ ఛందమున కుండమున చేర్చుచున్నాను. జగతీ ఛందమున కుండమున చేర్చుచున్నాను. అనుష్టుప్ ఛందమున కుండమున చేర్చుచున్నాను. పంక్తి ఛందమున కుండమున చేర్చుచున్నాను.
54. (ప్రాణభ్రుత్ ఇటుకలు పదిపది చొప్పున వరుస పేర్చవలెను.)
ప్రాణభృత ఇష్టకే! ఇదిగో ముందట సమ్ముఖభువ అగ్ని విరాజిల్లుచున్నది. నీవు ఈ అగ్ని స్వరూపుడవు. అగ్ని స్వరూపమగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! భువ అగ్ని సంతానము. భౌవౌయనమను ప్రాణము. నీవు ఆ అగ్ని స్వరూపవు. అగ్ని స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! ప్రాణపు సంతానము. ప్రాణాయనమను వసంత ఋతువు. నీవు వసంత ఋతురూపవు. వసంతర్తు రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! వసంత సంతానము వాసంతియను గాయత్రి. నీవు వాసంతీ గాయత్రీ స్వరూపవు. వాసంతి గాయత్రీ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! గాయత్రి సంబంధమున గాయత్రి సామము ఉత్పన్నమైనది. నీవు గాయత్రీ సామ స్వరూపవు. గాయత్రీ సామ స్వరూపవగు కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! గాయత్రి సామము నుండి ఉపాంశు గ్రహము ఉత్పన్నమైనది. నీవు ఉపాంశుగ్రహ స్వరూపమవు. ఉపాంశుగ్రహ స్వరూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! ఉపాంశు గ్రహమునుండి త్రివృత్సోమము ఏర్పడినది. నీవు త్రివృత్సోమ రూపవు. త్రివృత్సోమ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! రథంతర పృష్టసామము నుండి సర్వధార ప్రాణ వసిష్ఠము ఉత్పన్నమైనది. నీవు సర్వాధార ప్రాణ వసిష్ఠమవు. సర్వాధార ప్రాణ వసిష్ఠ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ప్రాణభృత ఇష్టకే! నీవు ప్రజాపతి చే నిర్మించబడిన దానవు ప్రజలందరి ప్రాణ సిద్ధి కొరకు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
55. (రెండవ పది ఇటుకలను వరుస పేర్చవలెను)
సర్వస్రష్టయగు ఈ వాయువు దక్షిణదిశ యందు అత్యంత వేగశాలి యగును. ఇష్టకా! నీవు విశ్వ కర్మవే అగుదువు. విశ్వకర్మ ఇష్టకవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
ఆ విశ్వకర్మ వాయువు నుండి మనస్సు ఉత్పన్నమైనది. ఇష్టికా! నీవు మనోరూపిణివి. మనోరూపిణివగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
మనసు నుండి గ్రీష్మఋతువు ఉత్పన్నమైనది. ఇష్టకా! నీవు గ్రీష్మ ఋతు రూపిణివి. గ్రీష్మ ఋతు రూపిణివగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
గ్రీష్మ ఋతువు నుండి ప్రజాపతి త్రిష్టుప్ ఛందమును చేసినాడు. ఇష్టకా! నీవు స్వార నామక సామరూపమవు. స్వారనామ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
స్వారము నుండి అంతర్యానుగ్రహము ఉత్పన్నమైనది. ఇష్టికా! నీవు అంతర్యానుగ్రహ రూపమవు. అంతర్యాను గ్రహ రూపవగు నిన్ను చితిలో పేర్చుచున్నాను.
అంతర్యానుగ్రహము నుండి ప్రజాపతి పంచదశ స్తోమమును కల్పించినాడు. ఇష్టకా! నీవు పంచదశస్తోమ రూపమవు. పంచదశ స్తోమ రూపమగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.
పంచదశ స్తోమము నుండి బృహత్పృష్టసామము ఉత్పన్నమైనది. ఇష్టికా! నీవు బృహత్పృష్ట సామరూపవు. బ్రహత్పృష్ట సామ రూపవగు నిన్ను కుండమున చేర్చుచున్నాను.





