Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    2. సవితా ! ఉదయింపుము నీవు హిరణ్య బాహువవు. విస్తృతము, ప్రసిద్ధమగు వెలుగు ఇచ్చుచున్నావు. మానవుల భోగ యోగ్యమగు ధనము నేతలకు ఇచ్చునట్టి యజ్ఞము ప్రారంభమైనది. నీవు మా స్తోత్రము వినుము.

    3. సవితను మేము స్తుతించవలె, సవితను సమస్త దేవతలు స్తుతింతురు. ఆ పూజనీయ సవిత మా స్తోత్రమును అన్నమును స్వీకరించవలెను. సర్వ రక్షణలతో స్తోతలను పాలించవలెను.

    4. సవిత అనుమతి ప్రకారము అదితి సవితను స్తుతించను. వరుణాది దేవతలు సవితను స్తుతింతురు. మిత్రాదులు, సమాన ప్రీతిగల ఆర్యమ సవితను స్తుతింతురు.

    5. దాననిపుణులు, భక్తులగు యజమానులు పరస్పరము కలసి ద్యులోక భూలోక మిత్రుడగు సవితను సేవింతురు. అహిర్భద్న మా స్తుతిని వినవలెను. ముఖ్యధేనువులద్వారా వాగ్దేవి మమ్ము పాలించవలెను.

    6. ప్రజారక్షక సవిత మా ప్రార్థన మన్నించవలెను. మాకు తన మనోహరధనము అందించవలెను. ఓజస్వి స్తోతలు మారక్షణకు భగుని మరలమరల పిలుస్తారు. అసమర్ధుడు రత్నములు అడుగును. అనుగ్రహో అధయాతి రత్నమ్.

    7. వాజీగణము మితద్రవులు మిత్రమార్గులు శుభంకర అన్నవంతులు. యజ్ఞసమయమున వారు మా స్తోత్రములు వినవలెను. మాకు సుఖములు ప్రసాదించవలెను. వాజీదేవగణా! దాత కాని వానిని హంతకులను, రాక్షసులను హతమార్చండి. మాకున్న సకల పాతరోగములను దూరము చేయండి.

    8. వాజీగణమా ! మీరు మేధావులు. అమరులు. సత్యజ్ఞానులు. ధననిమిత్తము జరుగు సకల యుద్ధములందు మీరు మమ్ము పాలించవలెను. ఈ సోమమును పానము చేయుడు. ఉన్మత్తులుకండి. తృప్తులయి దేవయాన మార్గమున సాగండి.


                                        ముప్పది తొమ్మిదవ సూక్తము

             ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నిపైకి ఎగిసి స్తోతల శోభన స్తుతులను ఆశ్రయించవలెను. అందరకు వార్థక్యము కలిగించు ఉష పూర్వాభిముఖియై యజ్ఞమునకు రావలెను. ఆదరయుక్తులగు యజమాని అతని భార్య రథికులవలె యజ్ఞమార్గమును ఆశ్రయిస్తారు. మేమంపిన హోత యజ్ఞము చేయిస్తాడు.

    2. ఈ యజమానులు అన్నయుక్తులు కుశయుక్తులగుదురు. వాయువు, పూష ప్రజాపాలకులు. పడవలు గలవారు. వారు ప్రజాహితులయి. ఉషోదయముకన్న ముందటి ఆహ్వానమువిని, అంతరిక్షమునుండి రావలెను.

    3. ఈ యజ్ఞమున వసుగణములు భూమిమీద ఆనందించవలెను. విశాల అంతరిక్షమునుండి, దీప్యమానులగు మరుద్గణములు పూజింపబడుదురు. వేగగాములగు మరుత్తులు, వసువులారా ! మీ గమ్యము మావైపు కావలెను. మా దూత మీ కొఱకు వెళ్లినాడు. అతని ఆహ్వానము మన్నించండి.

    4. ప్రఖ్యాతులు, యజనీయులు, రక్షకులు విశ్వ దేవగణము యజ్ఞస్థానమునకు వస్తారు. అగ్నీ ! మా యజ్ఞమున మేము కోరిన దేవతలను యజ్ఞము చేయుము. భగునకు అశ్వినులకు ఇంద్రునకు వెంటనే పూజచేయుము.

    5. అగ్నీ ! ద్యులోకమునుండి స్తుతియోగ్యులగు మిత్ర, వరుణ, ఇంద్ర, ఆర్యమ, అదితి విష్ణువులను మా యజ్ఞముకు పిలువుము. భూమి నుంచి కూడ పిలువుము. సరస్వతి, మరుద్గణములు హృష్టులు కావలెను.

    6. మేము యజనీయులగు దేవతలకు, స్తుతులతోకూడ హవ్యము సమర్పింతుము. అగ్ని మా అభిలాషలకు ఆటంకముగా కాకుండ మా యజ్ఞమును వ్యాప్తము చేయును. దేవతలారా ! గ్రహించదగి, అనుభవించదగిన ధనము ప్రసాదించండి. నేడు మేము సహాయక దేవతలను కలుసుకొందుము.

    7. నేడు వశిష్ఠులు ద్యావాపృథ్వులను చక్కగా స్తుతించినారు. యజ్ఞయుక్తలయి వరుణ, ఇంద్ర, అగ్నులను కూడ స్తుతించినారు. ఆహ్లాదకారులగు దేవగణములు మాకు పూజనీయము, సర్వోత్తమమగు అన్నము అందించవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                              నలుబదవ సూక్తము

            ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. దేవతలారా ! మీరు మనసుతో ఆర్జించిన సుఖములు మా వద్దకు చేరవలెను. మేము వేగవంతులగు దేవతలను స్తుతిస్తాము. ఇప్పుడు సవిత పంపిన రత్నవంతమగు ధనమును మేము స్వీకరింతుము.

    2. మిత్రావరుణులు, ద్యావాపృథ్వులు మాకు అదేప్రసిద్ధమగు ధనము ఇవ్వవలెను. ఇంద్రుడు, ఆర్యమ మాకు ప్రకాశవంతులగు స్తోతలు సేవించిన ధనము ఇవ్వవలెను. వాయువు, భగుడు మాకు ఇవ్వతల పెట్టినట్టి ధనముచే అదితి మాకు అందించవలెను.

    3. పృషత్, అశ్వములుగల మరుత్తులారా ! మీరు రక్షించిన మానవుడు ఓజస్వి బలవంతుడు అగును. అగ్ని సరస్వతి మున్నగు దేవగణములు యజమానిని వర్థిల్లచేయవలెను. ఈ యజమాని ధనమునకు విఘాతుకులు ఉండరాదు.

    4. యజ్ఞప్రాపకుడగు వరుణుడు, మిత్రుడు ఆర్యమ అందరు శక్తియుతులు వీరందరు మా యజ్ఞకర్మను భరింతురు. ఆటంకపరచరానిదియు, ప్రకాశమానయు అగు అదితి శోభన ఆహ్వానవంతురాలు. మాకు బాధకలుగని రీతిగా సకల దేవతలు మమ్ము పాపములనుండి కాపాడవలెను.

    5. విష్ణువు హవ్యము ద్వారా ప్రాపణీయుడు అభీష్టవరదుడు. దేవతలందరు విష్ణువు అంశపు వారే. రుద్రుడు తన మహిమను మాకు ప్రదానము చేయవలెను. అశ్వినులు హవ్యముగల గృహమునకు రావలెను.

    6. అందరి వరణీయ సరస్వతి. దాన నిపుణలగు దేవపత్నులు మాకు ధనము ఇస్తారు. దీప్తివంతపూషా ! ఆ ధనమును ఆటంక పరచకుము. సుఖప్రదులు, గతిశీలురగు దేవగణములు మమ్ము చక్కగా పాలించవలెను. సర్వత్ర సంచరించువాయువు మాకు జలము ప్రదానము చేయవలెను.

    7. నేడు వసిష్ఠులు ద్యావాపృథ్వులను చక్కగా స్తుతించినారు. యజ్ఞయుక్తులగు వరుణ, ఇంద్ర, అగ్నులను కూడ స్తుతించినారు. ఆహ్లాదకరులగు దేవగణములు మాకు పూజనీయము, సర్వోత్తమమగు అన్నము అందించవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                         నలుబది ఒకటవ సూక్తము

 ఋషి - వసిష్ఠుడు, దేవత - వేరు వేరు ఛందస్సు- మొదటిది జగతి, తక్కినవి త్రిష్టుప్.

    1. మేము ప్రాతఃకాలమున ఇంద్రాగ్ని మిత్రావరుణులను ఆహ్వానింతుము. ప్రాతఃకాలమున అశ్వినులను స్తుతింతుము. ప్రాతఃకాలమున భగ, పూష, బ్రహ్మణస్పతి సోమ, రుద్రులను స్తుతింతుము.

    2. లోకములను భరించువారు, జయశీలురు, ఉగ్రులు, అదితి పుత్రులు. వారిలో భగుని మేము ప్రాతఃకాలమున ఆహ్వానింతుము. దరిద్ర స్తోతయు, ధనికుడగు రాజును భగదేవతను తమకు భోగభాగ్యములిమ్మని అర్థింతురు.

    3. భగుడా ! నీవు ఉత్తమనేతవు. సత్యధనుడవు. మాకు మేము కోరినవి ఇమ్ము. మా స్తోత్రము సఫలము చేయుము. మమ్ము గోవులు, అశ్వముతో వర్థిల్ల చేయుము. మేము పుత్రాదులతో మనుష్యవంతులము అగుదుము.

    4. మేము ఇప్పుడు మీవారము కావలెను. దినపు మొదటి మధ్యన కూడా ఆవారము కావలెను. ధనికుడవగు భగదేవా ! సూర్యోదయమున మేము ఇంద్రాదుల అనుగ్రహము పొందవలెను.

    5. దేవతలారా ! భగుడే భగవానుడు ధనవంతుడు కావలెను. మేము భగుని అనుగ్రహమున భగవంతులము ధనవంతులము కావలెను. భగదేవా ! నిన్ను అందరు తేప తేపకు పిలుస్తారు. నీవు ఈ యజ్ఞమున మాకు అగ్రగామివగుము. 

    6. శుద్ధస్థానము కొఱకు దధిక్రవలె ఉషా దేవత మా యజ్ఞమునకు రావలెను. వేగవంతమగు అశ్వరథమువలె ఉష, ధనదాత భగుని మాముందుకు తేవలెను.

    7. ఉష సకలగుణోపేత, ప్రవృద్ధ, పూజనీయ ఆమె గోవులు, వీరపురుషుల యుక్తముగను, జలసేచనము చేయుచును ఎల్లప్పుడు మాకు రాత్రివేళ చీకట్లను పార ద్రోలవలెను, "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                            నలుబది రెండవ సూక్తము

                      ఋషి - వశిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. స్తోతలగు అంగిరులు అంతట వ్యాపించవలెను. పర్జన్యుడు మా స్తోత్రమును విశేషరూపమున అభిలషించవలెను. హర్షద నదులు జలసేచనము చేయుచు సాగవలెను. ఆదర సంపన్న పత్ని, యజమాని యజ్ఞరూపమున యజించవలెను.

    2. అగ్నీ ! నీవు చిరకాలము నడిచిన మార్గము సుగమము కావలెను. నల్లనివి, రాగిరంగు అశ్వములు. యజ్ఞగృహమునకు నీ సమ వీరులను తెచ్చి శోభనందును. ఆ అశ్వములనే నీ రథమునకు కట్టుము. నేను యజ్ఞగృహమున కూర్చుండి దేవతలను ఆహ్వానింతును.

    3. దేవతలారా ! నమస్కరించువారలగు స్తోతలు మీ యజ్ఞమును విధి పూర్వకముగా పూజింతురు. మాకు దగ్గరలో ఉన్న హోతీ సర్వోత్తముడు. యజమానులారా ! దేవతల యజ్ఞమును చక్కగా నిర్వహించండి.

    బహుతేజోవంతులగు దేవతలారా ! మీరు భూమిని ఆవర్తితముచేయండి.

    4. అగ్ని సకల జనులకు అతిథి. అతడు వీరుడు, ధనవంతుడగువాని వాని గృహమున శయనించి కనిపించినప్పుడు గృహమందు నిలిచి ప్రసన్నుడైనపుడు అప్పుడు అగ్ని ఆ చుట్టుపట్ల జనులకు వరణీయ ధనము ఇచ్చును.

    5. అగ్నీ ! మా ఈ యజ్ఞమును స్వీకరింపుము. ఇంద్ర మరుత్తుల ముందు మమ్ము యశస్వులను చేయుము. రాత్రియు ఉషఃకాలమందును కుశలపై ఆసీనుడవగుము. యజ్ఞాభిలాషులు మిత్రావరుణులను ఈ యజ్ఞమున పూజింపుము.

    6. ధనము కోఱిన వసిష్ఠుడు ఈవిధముగనే బలపుత్రుడగు అగ్నిని బహురూపధన ప్రాప్తికని స్తుతించినాడు. అగ్నిమాకు అన్నము, బలము, ధనము ఇవ్వవలెను. "యూయంపాత స్వస్తిభిః సదానః"


                                       నలుబది మూడవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. వృక్షశాఖలవలె మేధావుల స్తోత్రములు అన్నివైపుల వ్యాపించును. వారే దేవకామి యజ్ఞమున నమస్కరించి నిన్నుపొందుటకు విశేషముగా స్తుతింతురు. వారు ద్యావాపృథ్వులను కూడ నుతింతురు.

    2. వేగవంతమగు అశ్వమువలె ఈ యజ్ఞమునకు చేరుము. ఘృతము స్రవించు సృక్కును ఎత్తుము. యజ్ఞము కొఱకు మంచి కుశలను పరచుము.

    అగ్నీ ! నీ దేవకామి కిరణములు ఊర్ధ్వముఖులు కావలెను.

    3. గారాబముచేయబడు కొడుకు తల్లివడిలో కూర్చున్నట్లు దేవతలు యజ్ఞపు ఉన్నతాసనములందు విరాజిల్లవలెను.

    అగ్నీ ! నీ యజనీయ జ్వాలలు జుహువును చక్కగా కాపవలెను. యుద్ధమున నీవు మా శత్రువుకు సాయము చేయరాదు.

    4. యజనీయ దేవగణములు పితుక దగిన జలధారలను కురిపించుచు, ఇష్టము వచ్చిన రూపమున మా సేవలను స్వీకరించవలెను. దేవతలారా ! ధనములందు పూజ్యుధనము నేడు ఇచటకి రావలెను. ఏక మనస్కులై మీరు విచ్చేయండి.

    5. అగ్నీ ! ఈవిధముగా ప్రజలనుంచి మాకుధనము ఇమ్ము. నీవు మమ్ము విడువరాదు. మేము నిత్యయుక్త ధనములతో మత్తులమై అహింసితులము కావలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                          నలుబది నాలుగవ సూక్తము

 ఋషి - వసిష్ఠుడు, దేవత - దధిక్రుడు ఛందస్సు - మొదటిది జగతి తక్కినవి త్రిష్టుప్.

    1. నీ రక్షణ కొఱకు ముందు నేను దధిక్రదేవుని ఆహ్వానింతును. తదుపరి అశ్వినులు, ఉష, సమిద్ధ అగ్ని, భగదేవతలను ఆహ్వానింతును. ఇంద్ర, విష్ణు, పూష, బ్రహ్మణస్పతి, ఆదిత్యగణ, ద్యావాపృథ్వి, జల, సూర్యులను ఆహ్వానింతును.

    2. యజ్ఞప్రారంభమున మేము స్తోత్రముతో దధిక్రుని ప్రబోధితుని చేసి ప్రవర్తితుని చేయుదుము. ఇళన స్థాపింతురు. శోభన ఆహ్వాన సంపన్నులగు మేధావి అశ్వినులను ఆహ్వానింతుము.

    3. దధిక్రుని ప్రబోధితుని చేసిన నేను అగ్ని, ఉష, సూర్య, వాగ్దేవిని స్తుతింతును. దురభిమానుల వినాశకారి వరుణుని మహాపింగళ వర్ణ. అశ్వమును స్తుతింతును. సకల దేవగణములు సకల పాపములను నానుండి వేరు చేయవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.