Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    11. దేవతలారా ! మీరు ద్యులోకమున పదకొండుమంది, భూలోకమున పదకొండుమంది, ఆకాశమున పదకొండుమంది మహత్తు కలిగి ఉన్నారు. మీరు ఈ యజ్ఞసంబంధమయిన హవిస్సులను స్వీకరించుడు.

            (ప్రథమ మండలమున ఇరువదియవ అనువాకము సమాప్తము.)

             ఇరువది ఒకటవ అనువాకము            నూట నలుబదియ సూక్తము

        ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి, 12,13 త్రిష్టుప్.

    1. అధ్వర్యుడా ! వేదియందలి ఉత్తరవేదియందు ప్రేమ కలిగి, ప్రకాశవంతుడగు అగ్ని కొఱకు హవిస్సునకువలె స్థానము ఏర్పరచుము. ఆ స్థానము ప్రకాశించు వర్ణము కలది. చీకట్లను పోగొట్టునది అగుచున్నది. ఆజ్యము మున్నగు వానికి ఆధారమయిన ఆ స్థానమును వస్త్రముతోవలె దర్భలతో ఆచ్చాదింపుము.

    2. అగ్ని రెండు అరణులనుండి అవతరించినాడు. అతడు నేయి, పురోడాశము, సోమము అను మూడు అన్నములను ఆరగించుచున్నాడు. అగ్ని ఆరగించిన అన్నము సంవత్సరముకాగానే యజమానిని యాగము చేయు సమర్ధుని చేయును. ఈ అగ్ని వర్షము కలిగించును. స్రుక్కువంటి నాలుకతో ఇతర హవిస్సులను అందుకొనును. వర్ధిల్లును. ఈ అగ్నే దావాగ్ని రూపము ధరించి అరణ్యములను దహించుచున్నాడు.

    3. రెండు అరణులు ఇద్దరు తల్లులవలె ఉన్నవి. అరణులను రాచి అగ్గి పుట్టించునపుడు నల్లనిపొగ, సమానమగు అగ్ని కలిగి జ్వలించుచున్నది. తొలి జ్వాలయే నాలుకగా గల అగ్నిని ఆవిర్భవింప చేయుచున్నది. ఆ అగ్ని తిమిర ద్వంసకము, మూసి వేయతగినది. యజమానిని వృద్ధిపొందించునది, శిశుధర్మము గలది అగుచున్నది.

    ( యజమాని తండ్రిగను, అరణులు తల్లిగను, అగ్ని శిశువుగను చెప్పినాడు)

    4. జ్ఞానవంతులగు ఋత్విజులు కలిగించిన అగ్నిజ్వాలలు జ్వలించుచున్నవి. ఆ అగ్ని యజమానిని బ్రహ్మలోకమునకు పంపును. అది వేగవంతమయి, నల్లనికాంతి కలిగి, అసమానసుఖములు కలిగి, చలించునట్టిది, ఎండించునది. వాయువుచేత ప్రేరేపింపబడి సర్వత్ర వ్యాపించునది అగును.

    5. అగ్ని ప్రఖ్యాతము, ప్రసిద్ధము. అగ్ని చీకట్లను పారద్రోలును. నల్లనిది. అన్యులకు అశక్యమయినది. అధిక ప్రకాశము కలిగించునది. అగ్ని కణములు చిమ్మి సర్వత్ర వ్యాపించినపుడు అధిక ధ్వని చేయును. సాగిపోవును. అట్టి అగ్నిని స్తుతింతుము.

    6. అగ్ని పచ్చని ఓషధులందు అధికముగా ప్రవేశించుచున్నాడు. అగ్ని సకలమును అలంకరింపచేయుచున్నాడు. తనను పాలించు చెట్లనుచేరి ఆబోతువలె అగ్ని అధికముగా ధ్వనించుచున్నాడు. తేజోరూపుడయిన అగ్ని తన జ్వాలలను పెంపొందించుచున్నాడు. పట్టశక్యము కాకున్నాడు. భయంకర మృగముల కొమ్ములవలె ఉన్న జ్వాలలను అగ్ని మరింత జ్వలింపచేయుచున్నాడు.

    7. అగ్ని విస్తరించుచున్నాడు. ఓషధులను గ్రహించుచున్నాడు. యజమాని ఉద్దేశము తెలిసికొనుచున్నాడు. నిరంతరము జ్వాలలను రగిలించుచున్నాడు. ఆ జ్వాలలు వర్ధిల్లుచున్నవి. యాగయోగ్యమగు అగ్నిని ఆశ్రయించుచున్నవి. జ్వాలా రూపమయిన అగ్ని ద్యావా భూములకు విలక్షణమయిన తేజస్సును కలిగించుచున్నాడు.

    8. అగ్నిని నల్లని వ్రేళ్లవంటి జ్వాలలు ఆలింగనము చేసికొనుచున్నవి. బొగ్గునుచేరి ఊర్థ్వముఖములయి ఎదుగుచున్నవి.

    9. దావాగ్ని భూమిపై ఉన్న పొదలను, తుప్పలను తగులపెట్టుచున్నాడు. మిక్కిలి ధ్వనించి జంతువుల వెంట వేగముగ ఉరుకుచున్నాడు. అతడేకదా ఆయా జంతువులకు తగిన ఆహారములు కలిగించినవాడు. అతడు గడ్డి మున్నగు వానిని తగుల పెట్టుచు, నల్లని మసి మార్గమును అనుసరించి సాగిపోవుచున్నాడు.

    10. అగ్నీ ! మా యాగములందు ప్రజ్వరిల్లుము. అనంతరము శాంతించుము. మాకు వరములు ప్రసాదించుము. నీవు చిన్న, చితుకు మంటలను విడువుము. యుద్ధములందు కవచమువలె ఎవరిని దరిచేరనీయక జాజ్వల్యముగ జ్వలించుము.

    11. మేము శ్రమించి చేసి, కట్టెలమీద ఉంచిన హవిస్సులు అగ్నికి ప్రియములన్నింటికన్న ప్రియము కావలెను. అగ్నీ ! నీ శరీరమే జ్వాలలు. నీ తేజస్సు నిర్మలము. ఆ తేజస్సున మాకు రత్నములు ప్రసాదించుము.

    12. అగ్నీ ! సమర్ధుడు - సర్వాధారుడు అయిన యజమానికొఱకు ఋత్విజులను తెడ్లు, మంత్రములను కర్రగల పడవను సంసారము దాటించుటకు ప్రసాదించుము. ఆ ఓడ మాకు ఆహారమును, పుత్ర పౌత్రాదులను, సుఖములను కలిగించవలెను.

    13. అగ్నీ ! మా స్తుతులను స్వీకరించుము. భూమ్యాకాశములు, వర్షము పంటలు కలిగించవలెను. గోక్షీరాదులు, పురోడాశాదులు స్రవించవలెను. అరుణారుణ ఉషస్సులు మాకు కలకాలము అన్నమును, ఇతర సంపదలను కలిగించవలెను.

                             నూట నలుబది ఒకటవ సూక్తము
        ఋషి - దీర్తతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి, 12, 13 త్రిష్టుప్.


    1. సూర్య తేజస్సు బలము వలన పుట్టినది. అది ప్రకాశించుచున్నది. సకల జీవరాసులందు ఉన్నది. అగ్ని తేజస్సు మాబుద్ధిని చేరుచున్నది. కోర్కెలు సాధించుచున్నది. వాక్కులందు సమానముగా ప్రవర్తించుచున్నది. జగత్తు వ్యవహారములు నిర్వహించుచున్నది.

    2. అగ్ని అన్నసాధకము, శరీర అభివృద్ధి కరము. హవిర్లక్షణ అన్నము కలది. శాశ్వతము అయినది. రెండవది అగు విద్యుదగ్ని ఏడు లోకములకు శుభము కలిగించుచున్నది. మూడవ అగ్ని సూర్యుని రూపమున ఉండి వర్షము కురిపించుచున్నది. అట్లు పదిదిక్కులు ప్రసరించుచున్నది. అతనిని పది దిక్కుల దర్శించుచున్నవి.

    3. తొలినుండి మేధావంతులయిన ఋత్విజులు యాగరూపమగు అగ్నిని సాధించుచున్నారు. అనాదికాలము నుండి అగ్నికి సమర్పించుటకు హవిస్సులు భద్రపరచినారు. వాయువు అగ్నిని ప్రబలము చేయుచున్నది. ఆ అగ్నిని స్తుతించుచున్నాము.

    4. పశురూపమయిన హవిస్సును అగ్నిచుట్టు ప్రదక్షిణము చేయించుచున్నారు. అగ్నికి దంతములగు జ్వాలలలో పొదలు, తుప్పలు ప్రవేశించుచున్నవి. అగ్ని జన్మకు అరణులు కారకములు అగుచున్నవి. అందువల్ల పవిత్రుడగు అగ్ని కాంతిమంతుడు అగుచున్నాడు. యవ్వనవంతుడు అగుచున్నాడు.

    5. అగ్నికి తల్లులు అగు దిశలు, అన్యబాధలు లేక అధికముగా వృద్ధి చెందినపుడు అగ్ని పది దిక్కులందు ప్రకాశించినది. వయసురాగానే ప్రసరించినది. వయసురాక ముందు తుప్పలు, చెట్లుమున్నగునవి మొలిచినవి. అగ్నికి వయసురాగానే వాటియందు మెల్లగా ప్రసరించి కాల్చినాడు.

    6. దేవతలను ఆహ్వానించు అగ్నిని ద్యులోకమున సేవింతురు. యజమానులు హవిస్సులు అర్పించి రాజునువలె పూజింతురు. సకల ధనములు గల అగ్నిని బహుమంది బహువిధముల స్తుతుల చేతను, క్రతువులచేతను, మంత్రములచేతను స్తుతించుచున్నారు.

    7. అగ్ని వాయుప్రేరకుడయి యజ్ఞమునకు అర్హుడు అగుచున్నాడు. అగ్ని బహువక్త అగు విదూషకునివలె వివిధ కర్మలు ఆచరించుచున్నాడు. అపుడు అతడు తన దారిలోని అన్నింటిని కాల్చును. నల్లని మసి మార్గమున జ్వాలలతో పయనించును. అట్టి అగ్నిని లోకములు సేవించుచున్నవి.

    8. త్రాళ్ళతో కట్టిన రథమువలె స్థాపితుడు అగు అగ్ని అంతరిక్షమును అంటుచున్నాడు. అనంతరము అగ్ని మార్గమున సాగుచు నల్లగ చేయుచున్నవి. ఆ అగ్ని దీప్తివలన శూరుని ప్రతాపమునకు శత్రువు భయపడినట్లు మృగములు, పక్షులు భయపడి ఉరుకుచున్నవి.

    9. అగ్నీ ! నీవలననే వరుణుడు వర్షించు వ్రతము దాల్చినాడు. మిత్రుడు చీకటిని అణచుచున్నాడు. ఆర్యముడు మంచిదాత అగుచున్నాడు. సర్వత్ర కర్మచేత ఆర్యముడు వ్యాపించినట్లు రథము యొక్క రేకులచుట్టు కమ్మి వ్యాపించినట్లు, అగ్నిసర్వత్ర వ్యాపించుచున్నాడు.

    10. అగ్నీ ! నీవు నిత్యయవ్వనుడవు. మేము అందించు హవిస్సులను దేవతలకు చేర్చుచున్నావు. నీవు రత్నవంతుడవు. నవీనుడవు. నిన్ను-రాజునువలె స్తుతించుచున్నాము. ధ్యానించుచున్నాము.

    11. అగ్నీ ! కోరదగిన, ఉపాసించ తగిన ధనమును మాకు ఇచ్చినావు. ఉత్సాహవంతులు, విద్యాబుద్ధులు కల పుత్రులను ఇచ్చినావు. అగ్ని తన కిరణములనువలె తన జన్మకు ఆధారములు అయిన ఉభయలోకములను నియంత్రించుచున్నాడు. ఆ అగ్ని శుభకర్మల మా యాగమునందు దేవతల స్తుతులను గ్రహించుచున్నాడు.

    12. ప్రకాశవంతుడు, వేగవంతుడు, అశ్వవంతుడు, హవ్యవాహనుడు, గంభీరుడు అగు అగ్ని మా ఆహ్వానమును మన్నించునా? ఉత్తమబలుడు, సుప్రసిద్ధుడు అగు అగ్ని మమ్ము నడిపించునా? అందరు కోరునట్టి, శుభములను ఇచ్చునట్టి స్వర్గమును మాకు అందించునా?

    13. అగ్ని ! గొప్పదగు మహా సామ్రాజ్యమును ధరించుచున్నాడు. కర్మవంతములయిన మంత్రముచేత

    నుతించబడుచున్నాడు. ఋత్విజులు, మేమును, మేఘమును సూర్యుడు ధ్వనింపచేసినట్లు అగ్నిని స్తుతులతో ధ్వనింప చేతుము.

                              నూట నలుబది రెండవ సూక్తము
        ఋషి - దీర్ఘతముడు, దేవత - అనేక దేవతలు, ఛందస్సు - అనుష్టుప్.


    1. అగ్నీ ! నీవు ప్రకాశకుడవు. యాగమునకు హవిర్భోక్తలను తీసుకొని రమ్ము. చేత స్రువముపట్టి సోమమును అభిషవించి, హవిస్సులు అందించు యజమాని యజ్ఞమును దేవతలకు విస్తరింపుము.

    2. తనూనపాదగ్నీ ! మేధావులమగు మేము నిన్ను స్తుతించుచున్నాము. నేయికారుచున్న, మధురమయిన సోమాది ద్రవ్యములుగల మా యజ్ఞమునకు విచ్చేయుము. పూర్తి అగునంతవరకు ఉండుము.

    3. శుచియు, పవిత్రత గలది, ఆశ్చర్యము కలిగించునది, ప్రకాశించునది, యజ్ఞమును సంపాదించునట్టిది అగు నరాశంసాగ్ని, నరులు స్తుతించు అగ్ని ద్యులోకమునుండి వచ్చి మధుర రసముతో మా యజ్ఞమును మూడుసార్లు తడుపును.

    4. అగ్నీ ! నీవు స్తోతవ్యుడవు. మనన సాధనమగు ఈ స్తుతి సుజిహ్వుడగు అగ్నికొఱకు ఆలపించబడుచున్నది. ఈ యజ్ఞమును కోరదగిన ప్రియమయిన ఇంద్రుని ఆహ్వానించుము.

    5. ఋత్విజులు మంచి ఆధ్వర్యములుగల సోమయాగమునందు దర్భలు పరుచుచున్నారు. ఋత్విజులు హోమసాధన పాత్రలు కలిగి ఇంద్రుని కొరకు విశాల గృహమును ఆర్జించుచున్నారు.

    6. యజ్ఞ ద్వారములు గొప్పవి యజ్ఞమును వృద్ధిపరుచునవి. పవిత్రత కలిగించునవి. అందమయినవి. దూరదూరమున ఉన్నవి. దేవతలను ప్రవేశపెట్టుటకు యజ్ఞ ద్వారములు తెరిచి ఉండవలెను.

    7. అహోరాత్రములు అందరిచే స్తుతించబడునవి, దగ్గరగా ఉన్నవి, అందమయినవి, యజ్ఞమును నిర్మించునవి. అవి స్వయముగా విచ్చేయవలెను. యజ్ఞమున దర్భలమీద ఆసీనులు కావలెను.

    8. భౌమ-వైద్యుత అగ్నులు ఇద్దరు దేవతలకు బలము కలిగించు జ్వాలలు కలవారు. స్తుతి కర్తలను అనుగ్రహించువారు. మేధావంతులయిన దేవతలను ఆహ్వానించువారు. ఆ అగ్నులు ఫలసాధనమయి, ద్యులోకమును అంటుచున్న ఈ యజ్ఞమును చక్కగా నెరవేర్చవలెను.

    9. పరిశుద్ధమయినది, దేవతల మధ్యస్థమయినది, హోమమును ఆర్జించునది అగు స్వర్గవాక్కు భారతి, భూమిగతమయిన వాక్కు ఇళ, అంతరిక్షవాక్కు సరస్వతి అగ్నికి మూడు మూర్తులయిన ఈ దేవేరులు యజ్ఞమున దర్భాసనమున ఆసీనులు కావలెను.

    10. ఉదకము అద్భుతము. శీఘ్రవ్యాపకము. త్వష్ట అనబడు వైద్యుతాగ్ని ఆ ఉదకమును మేఘమధ్యము నుండి విడిపించవలెను. మమ్ము పోషించవలెను.

    11. వనస్పతులందు ఉన్న అగ్నీ ! ఋత్విజులను తొందరపెట్టుము. దేవతలను సమీపించుము. పూజించుము. ఆహవనీయాగ్ని ప్రకాశవంతుడు, మేధావి. అతడు దేవతలకు హవిస్సులు అర్పించును.

    12. ఇంద్రుడు గమనశీలుడు. సామవేద స్వరూపుడు. పూష, మరుత్తులు సకలదేవతలతో కూడిన ఇంద్రుని కొఱకు హవిస్సులను హోమము చేయుడు.

    13. ఇంద్రా ! ఋత్విజులు యజ్ఞమునందు నిన్ను ఆహ్వానించుచున్నారు. మా పిలుపు వినుము. "స్వాహా" అని వేల్వబడిన హవిస్సులను స్వీకరించుటకు విచ్చేయుము. మా స్తోత్రములు వినుటకు విచ్చేయుము.

                           నూటనలుబది మూడవ సూక్తము
        ఋషి-దీర్ఘతముడు, దేవత-అగ్ని, ఛందస్సు 1-7 జగతి, 8 త్రిష్టుప్.

    1. అగ్ని బలములకు పుత్రుడు. జలమునకు మనుమడు. అట్టి అగ్నికొఱకు వృద్ధికరము. నవీనము అగు యాగమును, స్తుతిని చేయుచున్నాను. యజమానికి ప్రియుడును, హోమకర్తయు అగు అగ్ని వేదికయందు ధనములతో ఆసీనుడు కావలెను.

    2. అగ్ని ఆవిర్భవించిన వెంటనే వేదికయందు అంతరిక్ష సంచారి అగు వాయువునకు ప్రత్యక్షము అయినాడు. సమిధలచేత ప్రజ్వరిల్లినాడు. భూమ్యాకాశములను ప్రకాశింప చేసినాడు.

    3. అగ్ని స్తోత్రవ్యుడు. అతని కాంతికి ముదిమిలేదు. అతని కిరణములు దర్శనీయములు. అవి వెలుగులు చిమ్ముచు చీకట్లను పారద్రోలును. సూర్య కిరణములవలెనే అగ్ని కిరణములు ముదిమి లేక తీష్ణములయి విరాజిల్లును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.