Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    "మనిద్దరి పనులమధ్యా దగ్గరి పోలిక ఉందనే విషయం సత్యం. కార్లను ఇంజను ఎలా నడుపుతుందోకూడా చెపుతావేమో? నీ పొట్టనిండా ఉపాయాలే ఉన్నాయి" అన్నాడు కాలూ. పాత జేలు మిత్రత్వం వారిలో పొంగులు వారింది.
    బి- 10 మళ్ళీ సాగించాడు. "ఆ పని చాల బావుంటుంది. ఒక్కొక్క సారి ప్లగ్గులు మండవు. మనిషికి దగ్గూ, పడిసెం పట్టినట్లై ఇంజను కొద్దిగా జల్లున పడుతుంది. ఒక్కొక్కసరి కార్బురేటర్ సతికిపోతుంది. గ్యాసు, లోపల ఉన్న గాలితో సరిగ్గా కలవదు. అదీ ఒక వ్యాధే. అంతేకాదు. ఇంకా పెద్దపెద్ద రోగాలు వస్తాయి. అలాంటప్పుడు పిస్టన్ సరిగా చూడాల్సి ఉంటుంది. డాక్టరు పొట్టను చీల్చినట్లు, ఇంజనువిప్పి భాగాలన్నీ విడివిడిగా పెట్టాల్సి ఉంటుంది. తెలిసిందా?"
    "తెలిసింది. తెలిసింది" అన్నాడు కాలూ.
    "ఇంజన్ను ముక్కలు ముక్కలుగా విడగొట్టి మళ్ళీ ఇమ్జనుగా చేయొచ్చున్నమాట" లేఖ ధ్వనిలో ఏదో కొత్తవింతగోచరించింది. వారి పక్కనే కాస్త దూరంగా కాళ్ళు ముడుచుకొని కూర్చున్న లేఖ "విడిభాగాలన్నీ కలిసిపోతే?" అని అడిగింది ఔత్సుక్యంతో.
    "అలా జరగదు లేఖా. పని తెలిస్తే అలా ఎందుకు జరుగుతుంది? డాక్టరు లీవరును స్ప్లీన్ స్థానంలోనూ స్ప్లీన్ ణు లీవర్ స్థానంలోనూ పెడ్తాడా?"
    బి- 10 కంటితో చిరునవ్వు నవ్వి లేఖవైపు చూస్తూ "నీ తండ్రికి మూడు అనన్యసామాన్యములైన వస్తువులున్నాయి. వాటిల్లో ఒకటి తిత్తి. రెండవది సమ్మెటా. మూడవది అతని కూతురు" అన్నాడు.
    "తిత్తీ, సమ్మెటా అమ్ముతూంటే నా గుండె వడిపెట్టినట్లైంది." అన్న కాలూ గుండెను చంద్రలేఖ నవ్వు బాకులా గుచ్చుకుంది.
    "అయితే ఆ పని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది?" కాలూ అడిగాడు.
    బి-10 ముఖంమీద విషాదచ్చాయలు కమ్ముకున్నాయి. ఒక క్షణం సేపు అతని నోటివెంట మాట పెకల్లేదు. "ఈ మహానగరానికి నేను రెండు సంవత్సరాలక్రితం వచ్చాను."
    "చెట్లకు బంగారంపండే నగరానికేనా?" కాలూ అడిగాడు.
    "ఇది ఈ మహాకాటకానికి ఒక సంవత్సరం క్రితపుమాట. యుద్ధం మొదలైంది. పని ఇట్టే దొరకడం ప్ర్రారంభించింది."
    "మనను అసహ్యించుకునే ఉన్నత వర్గంవారు కాటకం రావడంతో నిన్ను పనినుంచి తీసేశారు. అంతేకదూ" కాలూ పేలవంగా అడిగాడు.
    బి- 10 కాదన్నట్లు తల ఊపాడు. "వారు నన్ను తీసెయలేదు. యుద్ధం బెంగాల్, బర్మా సరిహద్దులంటేవరకు వ్యాపారం కనీవినీ ఎరుగనంతగా పెరిగిపోయింది. కొల్లలుగా పని దొరికేది. కార్లధర ఇది వరకటి కంటే మూడురెట్లు పెరిగిపోయింది. కార్లు దొరకడం కష్టం అయింది. చెత్తచెత్త అయిన పాతకార్లుకూడా వారం రోజులకంటే ఎక్కువ నిలవ ఉండేవికావు. బెంగాల్ ఆటోమొబైల్స్ యజమాని రెండు చేతులా లాభాలార్జించాడు, సదరన్ ఎవెన్యూలో ఒక పెద్ద భవనం కొన్నాడని కూడా మాకు తెలిసింది. కాని బోనసు మాకు మామూలుగానే ఇచ్చాడు."
    "నీవు ఆ అన్నార్తులతో ఎలా కలిశావు?"
    "అదే చెపుతున్నా . ఆకలితో మలమలామాడి ఎలుకల్లా చస్తున్న మనుషుల్ను చూశాను. నేను యమయయాతన పడ్డాను. ఇంక ఆలోచన సైతం రాకుండేట్లు రాత్రింబవళ్ళు పనిచేశాను. అయినా నన్నాభయాంకర దృశ్యాలు వదల్లేదు. "బి-10 అమాంతంగా ఆగిపోయాడు. అతని గుండెకు తగిలన గాయం ముఖంలో కనిపించింది.
    "చాల్చాలు, ఇంక అవసరం లేదు" అన్నది లేఖ.
    ఆ మాటల్ను లెఖ్కచేయనట్లే బి-10 చెప్పుకొనిపోయాడు.
    'ఒక హోటల్ ముందు ఒక కారు ఒక అన్నార్తున్నీ  చంపి , లాంపు పోస్టుకు కొట్టుకుంది. దెబ్బతిన్న కారును పరిశీలించాల్సిందిగా నన్ను పంపారు. అర్ధనగ్న శరీరం డొక్క పగిలిన కుక్కలా రోడ్డు మీద పడి ఉంది. ఆ దరిద్రుని వంట్లో అట్టే రక్తం లేనందున కారుకు ఒకటి రెండు రక్తపు మరకలు మాత్రం అయినాయి. నిర్జీవములైన అతని కళ్ళు తెరచి దేన్నో చూస్తున్నాయి."
    "అపు, చాలు" కాలూ కేక పెట్టాడు.
    "నాకా కళ్ళు మరుపుకావు. ఆ కళ్ళు మానవతనే వెక్కిరిస్తున్నాయి. అతన్ని బలిగొన్న కారుకు అట్టే నష్టం కలుగలేదు. గ్యారేజీలో కారు బాగుచేస్తున్నా. ఫెండరు సరిచేస్తున్నా. హెడ్ లైట్లు బిగిస్తున్నా. ఈవిధంగా పని చాలా రోజులు పట్టింది. ఆ కారులోని ఏ భాగాన్ని ముట్టుకున్నా భయంకరమైన ఆ కళ్ళు - మానవతకు వెక్కిరిస్తున్న నయనాలు - నిర్జీవములైన ఆ దృక్కులు - నా ముందు ప్రత్యేక్షం అయ్యేవి. నన్ను వెంటాడు తున్నట్లు అనిపించేది."
    "అందులో నీదెం తప్పుంది?"
    "ఆ అన్నార్తుని బలిగొన్న కారును బాగు చేస్తున్నది నేను. ఆకలి బాధతో అలమటించి అణగారిపోతున్న అన్నార్తుల బాధల్ను చూసీ చూసీ నాగుండె బండ అయిపొయింది. కాని ఆ కళ్ళు మాత్రం నన్ను ఒక్కణ్ణే కాదు - ఈ మహానగరంలోని లక్షలాది జనాన్ని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది."
    ఎవరూ మాట్లాడలేదు. నిశ్శబ్ధం ఆవరించింది. గుడి గంటలు ఆ నిశ్శబ్దాన్ని భంగపర్చాయి.
    బి-10 బాల్కనీలోంచి గుడి వైపు చూశాడు. అందమైన గుడి. గుడి చుట్టూ విశాలమైన స్థలం. ఆవరణం చుట్టూ ఎత్తైన గోడ. గోడపైన ఉన్న గాజుపెంకులూ కనిపించాయి. "నీవు వెళ్ళాలా?" బి-10 అడిగాడు.
    "అవసరం లేదు . పూజారి వున్నాడు."
    బి-10 చూపు తిప్పుకున్నాడు. అతని కళ్ళలో మెరుపు కనిపించింది. "అయితే ఇప్పుడు నీవు పదహారణాల బ్రాహ్మడిని అన్నమాట. ఎలా ఉంది నీ ద్విజత్వం?"
    "ఇదంతా ఏదో వింతగానూ, అసహ్యంగానూ ఉంది. ఇప్పుడు నాకు ఇదంతా అవసరం లేదనిపిస్తుంది. నా పని తీరిపోయినది. జనాన్ని కేకేవేసి పిలిచి "మిత్రులారా! చూడండి. అనాదిగా వస్తున్న బంధనాల్ను చేధించడం ఎంత తేలికో చూడండి." అని అరిచి చెప్పాలనిపిస్తుంది."
    "నీకీ ఉపాయం చెప్పినప్పుడు ఇలా నీకో బంగారుగని దొరుకుతుందనుకోలేదు. ఏదో ఇంత పొట్టా, బట్టా వెళ్ళుతుందనుకున్నా ."
    "ఈ గని మీద నీకూ సమానమైన హక్కు ఉంది. నాకా అభిప్రాయమే లేకుంటే నీవు జెలు నుంచి బైట పడగానే ఇక్కడికి తీసుకొని రావడానికి ఎందుకు ఆదుర్దా పడ్తారు?"
    బి-10 ఆశ్చర్య చకితుడై" ఈ కలికాలంలో ఇలాంటి త్యాగం అరుదు" అన్నాడు.
    "సరే, నిన్ను గురించి ఏదో కొంత చెప్పావు. కాని నీ కులాన్ని గురించి మాత్రం చెప్పలేదు."
    "నాది ఖైదీల కులం."
    కాలూ నవ్వాడు. 'ఆ విషయం ఇది వరకు కూడా చెప్పావు. జేలు అనుభవాలు మరవడం అసాధ్యం అని నాకు తెలుసు. ఊరకే గాలి పీలుస్తే చాలు నాకు జేలువాసనే వస్తుంది. నీకూ అంటే అనుకుంటా. అంతకంటే ఎక్కువ కూడా అయి ఉండాలి. ఒక్క సంవత్సరం జేల్లోనే గడిపావు. అయినా నీవు యువకునివి. చెడు మానడం యువకులకు తేలిక. నీకో జందెం చేస్తా. నీవు నాకు మేనల్లుడవనీ గుడి పనుల్లో సహాయం చేస్తావనీ జనానికి చెపుతా, ఏ? ఎలా ఉంటుంది?"
    "న్యాయం కాదు. సమంజసం అంతకంటే కాదు."
    కాలూ ముఖంలో కలవరం కన్పించింది. "ఇదంతా నాకేమీ అర్ధం కాలవడం లేదు. ఈ ఇపాయం ఎవరిది? నీదేనా? అవునా? కాదా?" జందెం వేయడం అంటావూ! నిన్ను నేను జేల్లో పరీక్షగా చూశా. నీవు బాపడివే అని నాకు నమ్మకం కలిగింది. ఆ అదీకాక నీవు నాకు గాయత్రి నేర్పనా? అక్కడే నీవు కాలు జారింది. ఇప్పుడు స్పష్టంగా చెప్పు. నీవు బ్రాహ్మడివే కదూ? కాకుంటే మరి ఏం కులం?"
    బి-10 గంభీరంగా "ఖైదీలకులం " అన్నాడు.
    "బాబూ , ఇంకో ఊరేగింపు వస్తుంది. ఈ పదిహేను రోజుల్లోనూ మూడు చూశామా? అదిగో నాల్గవది. కేకలు వినిపించడం లేదూ?"
    కేకలు దగ్గర పడ్తున్నాకొద్దీ బి-10 , కాలూ బాల్కనీ ఇనుపకడ్డీలు పట్టుకొని వంగి చూడసాగారు. లేఖ కూడా వారిని అనుసరించింది.
    ఊరేగింపు ముందు పెద్ద పతాకం నడుస్తుంది. పెద్ద పెద్ద మనవ పంక్తులు నినాదాలు చేస్తూ పతాకం వెనుక నడుస్తున్నాయి. వారు చేసే నినాదాలు సహితం పతాకాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్నాయి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.