Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    బి. 10 గిరుక్కునవెనక్కు తిరిగి వింతగా చూశాడు. కాలూ బి. 10 వైపు నడిచాడు.
    పి. 14 అనే ధ్వనిమీద అతనికి నమ్మిక కలుగలేదు.
    .10 వింతచూపులు చూచి "ఎవరూ లేరు" అని కాలూ పకపకా నవ్వాడు. "జేలు గేటుదగ్గర ఒక మిత్రుడు వేచిఉంటాడని కబురంపాను కదూ?"
    "అటూఇటూ చూశాను. ఎవరూ కనిపించలేదు. చీఫ్ వార్డన్ పరిహాసానికి అన్నమాట అయిఉంటుంది అనుకున్నా. ఇలా పరిహాసం చేయడం అతనికి అలవాటు."
    "అయితే మీకెవరూ కనిపించలేదన్నమాట. మా వైపు ఎందుకు చూడాల్సివచ్చింది?"
    బి.10 తడబడ్డాడు. "అ......వు.....ను. చూశాను. మరి......."
    "నాకు తెలుసు. ఈ ఖరీధైన బట్టలూ, బట్టతలనుకప్పే తెల్లటోపీ అంతేభేదం. బి.10. ఇదిగో నా కూతురు. చంద్రలేఖ"
    బి-10 ఆమెవైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించాడు.
    "చలో" అనే అరుపు వినిపించింది.
    "నడుద్దాం" అన్నాడు కాలూ.
    "మీరెక్కన్నుంచి ఊడిపడ్డారు. నేను నా కళ్ళనే నమ్మలేకపోయాను." వారిద్దరూ ఒకరిప్రక్క ఒకరు నడుస్తూంటే లేఖ వారి వెనుక నడుస్తూంది.
    "శనగల గారడీ. ఆఁ. అది పనిచేసింది."
    "ఏమిటీ?" బి- 10 ఏమీ అర్ధం కానట్లు అడిగాడు.
    "భూమిలోంచి శివుడు పుట్టాడు. శనగలమంత్రం పారింది. బ్రహ్మాండమైన....." కాలూ చటుక్కున ఆగిపోయాడు. "నీకు ఇప్పుడే చెప్పొద్దనుకున్నా."
    తండ్రి వెనుకనే నడుస్తూఉన్న లేఖ "రెండుగంటలు ఓపిక  పట్టడం చాతనౌతుందా?" అన్నది.
    "అయితే నన్నాగుడికి తీసికెళ్తున్నావా?" అని బి-10 అడిగాడు.
    "ఆ గుడి నీదెంతో నాదీ నాతే. ఉపాయం చెప్పిందెవరు? మేము దేవాలయంలో ఉండడంలేదు. గుడిముందు రోడ్డుకు ఆవల ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. వీధి మలుపులో వున్న పేరడైజ్ లాజ్ లో నీకోసం ఒక గది అద్దెకు తీసుకున్నా. వారం రోజులు విశ్రాంతి తీసుకో. బాగా తిని పాటలూ, ఆటలూ ఉన్న సినీమాలు చూడు. తరువాత మనం మాట్లాడ్దాం"
    "వారం రోజులదాకా మాటలన్నీ నీ పొట్టలో ఆగుతాయీ" అంది లేఖ.
    కాలూ లేఖవైపు ఒక చూపు విసిరి మళ్ళీ స్నేహితునివైపు తిరిగి "మా లేఖను గురించి చెప్పిందంతా గుర్తుందికదూ" అన్నాడు.
    "నీవు చెప్పిందంతా సుమారు లేఖనుగురించే. ఇప్పుడు దేన్ని గుర్తు తెచ్చుకొమ్మంటున్నావు."
    "మెడల్ లేఖ గెలిచిన మెడల్" వెంటనే అతని ముఖంమీద విచారమేఘాలు ఆవరించాయి. మెడల్ పోయింది. అది మళ్ళీ తనచేతికి వస్తే ఏదైనా ఇవ్వడానికి సంసిద్ధుడే. ఇక బి.10కు మెడల్ కనిపించదు.
    "పోటీచేసినవాళ్ళు వేయిమంది ఉన్నప్పుడు వారందర్నీ గెలవడానికి బాగా చురుకుదనం కావాలి" అన్నాడు బి-10.
    "బాబూ, జేల్లో నన్నుగురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. నీవు మాట్లాడ్డానికి ఇంకేవిషయాలు లేవా?" అని ఎరుపెక్కిన ఆమె ముఖం చూడకుండా ఉండాలని గిరుక్కున తిప్పుకుంది.
    "నేను మరోజన్మ ఎత్తడానికి ధైర్యం ఇచ్చింది లేఖ మెడలే. అలాంటి కూతురు తండ్రి బ్రాహ్మడు కావడంలో ఏం సందేహం?" క్షణం అతనినోటివెంట మాటరాలేదు. అతని ముఖంలో ఏదో కొత్త విచారం కనిపించింది. "లేఖ పెళ్ళిచేసుకుని అత్తవారింటికివెళ్తే ఎలా బ్రతుకుతానో?"
    "ఆ శుభదినంకూడా అట్టేదూరం లేదనుకుంటా" అన్నాడు బి-10.
    "ఇప్పటికింకా ఏమి నిశ్చయం కాలేదు. కాని......."
    లేఖ బి-10 వైపు ఒకచూపు విసిరి "బాబు మిమ్మల్ని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఒకసారి తమ కులాన్ని గురించి అడుగుతే ఖైదీలకులం అని అన్నారని నాతో చెప్పాడు" అన్నది.
    "ఆఁ. మరచాను. నీవు ఉండడం పేరడైజ్ లాజ్ లోనే అయినా కులపు కట్టుబాట్లు లేకుంటే భోజనం వగైరాలు మాదగ్గరే చేయాలి. మాకు బ్రాహ్మణ వంటమనిషి ఉంది. అయినా ఆమెకు సహాయం చేయడానికి లేఖ తరుచుగా వంటింట్లోకి వెళ్తూ ఉంటుంది."
    "నీ ఉద్దేశంలో నేను... ..." బి- 10 ఆగాడు.
    "అవును. నాకు తెలిసినంతవరకు నీవు బ్రాహ్మడవే అని నా విశ్వాసం. లేకుంటే నాకు గాయత్రీమంత్రం ఎలా నేర్పావు? ఆ మంత్రం బ్రహ్మలకు తప్ప వేరేవారికి రాదని నా విశ్వాసం."
    "అయితే ఇకనుంచి నేను వంటింట్లో అడుగుపెట్టరాదన్న మాట" అన్నది లేఖ.
    బి-10 నవ్వాడు "నేను మీకంటే ఎక్కువేచేశాను. అంటరాని వాళ్ళ ఇళ్ళల్లోకూడా తిన్నాను."
    అంటరానివాళ్ళతో తినడానికి కమ్మర్లు సహితం ఒప్పుకోరు. బ్రాహ్మలకూ కమ్మర్లకూ ఎంత భేదమో, కమ్మర్లకూ అంటరానివారికి అంతభేదం అని కమ్మర్లనమ్మకం.
    "నీవు బ్రాహ్మడివి అయినా కాకున్నా నీకు పునర్జన్మ లభించేది ఖాయం. ఆ విషయాన్ని గురించే నీతో చర్చించ తల్చుకుంది. ఈలోగా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి పి. 14 ప్రస్తుతపు పేరు మంగల్ అధికారి. రెండవది అతడు శివుణ్ణి కలలో దర్శించుకున్న బ్రాహ్మడు. అర్ధం అయిందికదూ?"
    "ఇదంతా నాకు చిత్రంగా ఉంది. కథ మొదటినుంచీ చెప్పు. అప్పుడుగాని అర్ధం అయ్యేట్లులేదు. శనగల గారడీ. నీకా ఉపాయం ఉబుసుపోకకు చెప్పింది. అంతకంటే చెప్పేదేమీ కనిపించలేదు కాబట్టి చెప్పాను. అంతే."
    "అయితే విను....." అన్నాడు కాలూ.
    
                                       16
    
    రెండు గంటలతరువాత రైలు దిగారు. స్నానం, భోజనం అయింతరువాత బాల్కనీమీద పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. ఈ సంవత్సరం అంతా బి.10 తమవెంట ఉంటే ఎంత బావుండేది అనుకున్నాడు కాలూ.
    లేఖ నిన్ననే "బాబూ అతనితో నీకు రెండు నెల్లైనా పూర్తిగా పరిచయం లేందే?" అని అడిగినప్పుడు "రెండునెల్లు జేలు పరిచయం" అని జవాబు చెప్పాడు. "లేఖా, ఇప్పుడు తెలిసిందా? అర్ధం అయిందా?"
    బి.10 అతన్నిగురించిన కొన్ని విషయాలు బైటపెట్టాడు. ఇప్పుడతని నిజస్వరూపం చూడవచ్చు. వేలమంది, ప్రతి సంవత్సరం పది లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే తాతా ఉక్కు కర్మాగారంలో అతని తండ్రి గుమాస్తా. తండ్రికి బి.10 మొదటికొడుకు. బి.10 కు నలుగురు తమ్ముళ్ళూ ఒక చెల్లె. వచ్చే నాలుగు రాళ్ళతో ఇంత పెద్ద కుటుంబం పోషించడం సాధ్యంకాకపోయింది. అప్పటికి బి.10 స్కూలు ఫైనల్ లో ఉత్తీర్ణుడు అయినాడు. అతనికి ఫస్టుక్లాసు రావడమే కాక ఒకటి రెండు విషయాల్లో డిస్టింగ్షన్ కూడా వచ్చింది. అయినా ఫస్టుక్లాసు రావడమే కాక ఒకటి రెండు విషయాల్లో డిస్టింగ్షన్ కూడా వచ్చింది. అయినా ఉన్నతవిద్యకు వెళ్ళడం అనే ప్రశ్న ఉదయించలేదు. కొడుక్కు అక్కడే ఒక గుమాస్తా ఉద్యోగం ఇప్పించాడు తండ్రి. బి-10 కు అది నచ్చలేదు. అతని అభిరుచులూ ప్లానులూ వేరు. ఉద్యోగం చేస్తూనే మోటార్ గ్యారేజీకి వెళ్ళి అక్కడ కొందర్ని మిత్రుల్ను చేసుకొని వారిపని చూడ్డం మొదలుపెట్టాడు. అట్లాగే వారి పని కొంత అతనికి వచ్చేసింది. మోటారు గ్యారేజీలో అప్రెంటిసుగా కుదిరాడు. ఒక్క సంవత్సరంపాటు జీతం కాస్త తక్కువేవచ్చినా మూడు సంవత్సరాల్లో తండ్రికంటే ఎక్కువే సంపాదించడం మొదలుపెట్టాడు. గౌరవనీయమైన గుమాస్తా ఉద్యోగం వదులుకొని వెధవ యే స్త్రీ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు.
    "నీ పనీ నాపనిలాంటిదే. ఇద్దరమూ పనిముట్లతో పలికిస్తాం" అన్నాడుకాలూ.
    "అవును సరిగ్గా అంతే. నేను నోరులేని ఇంజనుతో గర్జింప చేసేవాణ్ణి. నీవేమో సమ్మెటతో ఊడిగం చేయించుకునేవాడివి" అంటూ తనకుర్చీ కాస్త దగ్గరికి లాక్కొని గోడకు అనుకొని కూర్చున్నాడు బి.10.
    కారు ఇంజన్లతో చిత్రవిచిత్రాలు కనిపించేవి కాలూకు. ఒక్కొక్కసారి ఝార్నాలో జటిలమైన ఆ యంత్రాల్ను చూసినప్పుడు అతడు ఇట్టే ఆకర్షింపబడేవాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.