Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    8. విశాల తేజోవంతుడగు సూర్యుడు మా శాంతి కొఱకు ఉదయించవలెను. నాలుగు మహాదిశలు మాకు శాంతి ప్రసాదించవలెను. స్థిర పర్వతములు మాకు శాంతి ప్రసాదించవలెను. నదులు మాకు శాంతి ప్రసాదించవలెను. జలములు మాకు శాంతి ప్రసాదించవలెను.

    9. కర్మద్వారా అదితి మాకు శాంతినీయవలెను. శోభన స్తుతులు గల మరుత్తులు మాకు శాంతి నీయవలెను. విష్ణువు మాకు శాంతినీయవలెను. పూష మాకు శాంతినీయవలెను. అంతరిక్షము మాకు శాంతినీయవలెను. వాయువు మాకు శాంతి నీయవలెను.

    10. రక్షించుచు సవిత మాకు శాంతి అనుగ్రహించవలెను. చీకట్లను దూరము చేయు ఉషస్సులు మాకు శాంతి అనుగ్రహించవలెను. మా ప్రజకు పర్జన్యుడు శాంతి అనుగ్రహించవలెను. క్షేత్రపతి శంభుడు మాకు శాంతి అనుగ్రహించవలెను.

    11. ప్రకాశమానులగు విశ్వేదేవతలు మాకు శాంతి అందించవలెను. కర్మతో పాటు సరస్వతి మాకు యజ్ఞ సేవక శాంతి నందించవలెను. దాననిపుణులు మాకు శాంతి నందించవలెను. భూలోక, ద్యులోక, అంతరిక్షములందు పుట్టిన జీవములన్నీయు మాకు శాంతి నందించవలెను.

    12. సత్యపాలక దేవతలు మాకు శాంతిని ప్రసాదించవలెను. అశ్వగణములు మాకు శాంతి ప్రసాదించవలెను. గోవులు మాకు సుఖములనిచ్చునవి కావలెను. సుకర్మ కర్తలు, సుందరహస్తులు ఋభువులు మాకు శాంతిని ప్రసాదించవలెను. స్తుతించినపుడు మా పితరులు సహితము మాకు శాంతిని ప్రసాదించవలెను.

    13. అజ ఏకపాదదేవా ! మాకు శాంతినిమ్ము. అహిర్భుద్న్య దేవా ! మాకు శాంతినిమ్ము. ఉపద్రవ శాంతి కారక అపాం నపాత, దేవా ! మాకు శాంతినిమ్ము. దేవపాలిక పృశ్నీ ! మాకు శాంతినిమ్ము.

    14. మేము ఈ కొత్త స్తోత్రము రచించినాము. ఆదిత్య గణ, రుద్రగణ, వసుగణములు దీనిని స్వీకరించవలెను. ద్యులోక, భూలోక, వృశ్ని జాతములన్నియు మిగిలిన యజ్జీయములన్నియు మా ఆహ్వానము వినవలెను.

    15. యజ్ఞ, యోగ్య దేవతలు, యజనీయమను ప్రజాపతి, యజనీయ, అమర సత్యజ్ఞ దేవగణములు నేడు మాకు బహు కీర్తనీయ పుత్రుని ప్రదానము చేయవలెను. నీవు మమ్ము ఎల్లపుడు శుభములు కలిగించి పాలింపుము.

    ఆలోచనామృతము

    ఆదిత్యా రుద్రా వసవో జుషంతేదం బ్రహ్మ క్రియమాణంనవీనం|
    శ్రుణ్వంతునో దివ్యాః పార్ధివాసోగోజాతా ఉతయే యజ్ఞియాసః||

    ఇది ఈ సూక్తము పదునాలువ మంత్రము "ఇదం బ్రహ్మక్రియమాణం నవీనం" ఇది కొత్తగా రచించిన సూక్తము అనుచున్నాడు.

    ఈ సూక్తము అందమయినది. సుందరమైనది. సురుచిరము. మనసున పులకింపచేయునది. ఆనందకరము. హర్షదము. స్పందింప చేయునది. కొన్ని పదములు, మనసును కదిలించును. కొన్ని ఏడిపించును.

    కొన్ని బాధించును. కొన్ని నవ్వించును. పదములకు ప్రాణము లేక పోవచ్చు. శక్తి ఉన్నది. అని మనిషిమీద మనసుమీద అనంతమగు ప్రభావము వేయగలవు.

    శాంతి, ఇది ఆప్యాయమగు పదము ఉచ్ఛారణ మాత్రమున మనసున మల్లెలు మొలుచును. ఏదో చెప్పలేని అవ్యక్త, అనుభూతి చోటుచేసుకొనును. పచ్చని పంట చేలు, నల్లనికారు మబ్బు, మెల్లగాపారు ఏరు, మెల్లని పిల్లగాలిని తలపించును.

    కొన్ని పదములు మాత్రమే ఉండును. వాస్తవమున ఉండవు. శాంతి. అటువంటి పదము. అది మానవాళికి ఈ నాటికి అందలేదు. ముందు అందగలదని నమ్మకము లేదు. ఏలననగా మనిషి, మనసు ప్రకృతి అలజడిగలవి. వాటికి నిలకడలేదు. అందుకే శాంతికి నిలకడలేదు.

    శాంతి అందదు. అందుకని అందమయినదికాదు. అందనిప్రతిది అందముకాదు.

    మానవ జీవితము మరీచిక. దానికి అన్నీ కనిపిస్తాయి. వాటివెంట పరుగే జీవితము. మనిషికి నిశ్చితముగా అందునది మృత్యువు మాత్రమే. జీవితము అనిశ్చితము మృత్యువు నిశ్చితము.

    మానవుని జీవితము వాస్తవము సత్యము, ఋతము మీద ఆధారపడినదికాదు. అది ఆదర్శము లక్ష్యము గమ్యము మీద ఆధారపడినది. మానవుడు ఏనాటికయినా ఆదర్శమును అందుకొనగలడా? అదొక ప్రశ్న, మానవ జీవితము ప్రశ్నల తోరణము. అన్నింటికి సమాధానము ఉండదు.

    ఇంతకుముందటిసూక్తములు సుఖములను కోరినవి. ధనమును కోరినవి. అన్నమును కోఱినవి. బలమును కోఱినవి. శాంతిని ఆశించలేదు.

    మానవ జీవిత ప్రయాణమున ఇదొక మరువరాని మజిలీ ! అన్నము, బలము మున్నగునవి సుఖమును ఇవ్వలేకపోయినవి. అందుకే అన్వేషణ. ఆ నిరంతర అన్వేషణలో వశిష్ఠుని ఊహా పథమున శాంతి గోచరించినది. అతడు ఆ ఉత్సాహమున, ఆవేశమున, ఆనందమున వచించిన సూక్తమిది. అందుకే "ఇదం బ్రహ్మక్రియమాణం నవీనం" అన్నాడు. బ్రహ్మ అనగా మంత్రము సూక్తము

    శాంతము లేదా సౌఖ్యము లేదన్న మన త్యాగయ్య వశిష్ఠున కన్న తక్కువాడుకాడు.

    శాంతి పదము చిన్నది. అర్థము అనంతము. శాంతి స్వతంత్రంకాదు పరాధీన. శాంతి ఒకచోటిది కాదు. పెక్కుచోట్లది. శాంతి బాహిరము మాత్రమేకాదు అధికముగా ఆంతరంగికము.

    శాంతి అందదు. ఎందుకు? అది ప్రకృతి మీద ఆధారపడినది. పరిసరములు మీద ఆధారపడినది. పరిస్థితుల మీద ఆధారపడినది. రాజకీయముమీద ఆధారపడినది. మనిషిమీద ఆధారపడినది. మనసు మీద ఆధారపడినది. ఇవి భిన్నములు పొంతనలేనివి. అందని శాంతిని అందదని మిన్నకుండ జాలము ! నిరంతర యత్నములు కొనసాగుచూనే ఉన్నవి-ఉండును.

    శాంతికొఱకని సాగిన యుద్ధములెన్ని? శాంతి కొరకని చెలరేగిన అశాంతి ఎంత?

    ఈ హింస, ఈ అశాంతి ఎవరికొరకు? ఒక నియంత కొరకా? ఒక రాచరికము కొరకా? ఒక మతము కొరకా? ఒక విధానము కొరకా? ప్రజలను శాంతిగా బ్రతకనీయకుండుట కొరకా?

    ఎవని నిర్వచనము వానిది? ఒకనికి అశాంతి మరొకరిశాంతి ఇదికూడా సాపేక్షమే. మానవజాతిని ఉద్ధరించుటకని పుట్టిన సిద్ధాంతములలో చాల వరకు ఆదర్శముగనే నిలిచిపోయినవి. శాంతి సహితము అటువంటిదే.

    అటువంటి శాంతి ఎన్నింటిమీద ఆధారపడినది. ఈ సూక్తము చెప్పినది. శాంతి కొఱకు తపించినది. ఈ సూక్తపు ఉచ్ఛారణలో శాంతి ఉన్నది. "మహానామ్నివర్తే ఏతత్సూత్రం జప్యం" అన్నాడు శాయణుడు.

    వాస్తవ జీవితముకన్న పదములు వాటి స్వరములు ఉచ్ఛారణలు ప్రభావము ఎక్కువ. అందుకే ఈ సూక్తపు మొదటి మంత్రము ఉచ్ఛరింతము.

    "శంన ఇంద్రాగ్నీ భవతామవోభిః || శం" ఇంద్రావరుణా రాతహవ్యా
    శమింద్రాసోమా సువిత యసంమోః శంన ఇంద్రాపూషాణా వాజాసాతౌ

    (ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ మండలము ఐదవ అష్టకమున మూడవ అధ్యాయము సమాప్తము.)


               నాలుగవ అధ్యాయము             ముప్పది ఆరవ సూక్తము

           ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. యజ్ఞస్థానము నుండి స్తోత్రములు శ్రేష్ఠముగా సూర్యాదులవద్దకు చేరవలెను. తన కిరణములతో సూర్యుడు వర్షజలమును ఏర్పరచినాడు. భూమి తన సానువులమీద విస్తృతమై వ్యాపించి ఉన్నది. పృథ్వి యొక్క విస్తృత అవయవములమీద అగ్ని జ్వలించును.

    2. బలవంతుగు మిత్రావరుణులారా ! హవ్యరూప అన్నమువంటి కొత్త స్తుతిని మీ కొఱకు రచిస్తాను. మీ ఇద్దరిలో వరుణుడు స్వామి స్థానము కల్పించువాడు. మిత్రుడు స్తుతించగా ప్రాణులను ప్రవర్తింపచేయువాడు.

    3. కదలికగల వాయువు నడక నలువైపుల శోభిల్లును. పాడి ఆవు వర్థిల్లును. ప్రకాశమానుడగు ఆదిత్యుని అంతరిక్షమున మేఘము ఉత్పన్నమగును. ఆ మేఘము జలవర్షకమై అంతరిక్షమున గర్జించును.

    4. శూర ఇంద్రా ! నీ అశ్వములు హరినామకములు. సుందరగమనములు కలవి. భారము వహించగలవి. వానిని స్తుతలతో రథమున పూన్చువాని యజ్ఞమునకు విచ్చేయుము. ఆర్యమ హింసించగోరు శత్రువు కోపమును నష్టపరచును. శోభన కర్మలుగల ఆర్యమను స్తుతితో ఆవర్తితము చేయుదును.

    5. యజమానులు అన్నవంతులయి, యజ్ఞ స్థలమున నిలిచి రుద్రుని సఖ్యత కోరుచున్నారు. నేతల స్తుతులు విని రుద్రుడు అన్నము అందించవలెను. నేను రుద్రునకు ప్రియ నమస్కారము చేయుదును.

    6. నదులకు సింధునదిమాత సరస్వతి సప్తమ. ఆ నదులు కోఱికలు తీర్చునవి సుందర ధారలు కలవి ప్రవహించునవి. తమ జలములతో పొంగునవి, అన్నవంతములు కోరికలుగల నదులులన్నియు ఒకేసారి రావలెను.

    7. మరుత్తులు ప్రసన్నులు వేగవంతులు. వారు మా యజ్ఞకర్మను పుత్రులను రక్షించవలెను. అక్షర వ్యాప్తమయి, సంచరించు వాగ్దేవి మమ్ము విడువరాదు. ఇతరులను చూడరాదు. మాధనము నియతము. అయినను మరుత్తులు వాగ్దేవి దానిని పెంచవలెను.

    8. మహతి, ఆసీమ భూమిని పిలువుము. యజ్ఞయోగ్య వీరపూషను పిలువుము. మా కర్మలను రక్షించు భగుని పిలువుము. దాన నిపుణుడు, ప్రాచీనుడు ఋభువులలో ఒకడు వాజీదేవుని యజ్ఞమునకు పిల్వుము.

    9. మరుత్తులారా ! ఈ శ్లోకము మీ ముందునకు చేరవలెను. ఆశ్రమదాత, గర్భపాలక విష్ణువు వద్దకు కూడ చేరవలెను. వారు స్తోతకు, పుత్రులు, అన్నము ప్రసాదించవలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                     ముప్పది ఏడవ సూక్తము

          ఋషి - వసిష్ఠుడు, దేవత - విశ్వేదేవతలు ఛందస్సు - త్రిష్టుప్.

    1. విస్తృత తేజము ఆధారముగా గల ఋభువులారా ! వాహకము, కీర్తనీయము, అహింసరథము మిమ్ము మోయవలెను. సుందర హనువులుగల ఋభువులారా ! యజ్ఞమందు ఆనందమునకుగాను పాలు, పెరుగు, సత్తు కలిసిన సోమముతో కడుపునింపండి.

    2. స్వర్గ దర్శులగు ఋభువులారా ! మీరు హవిష్మంతుల కొఱకు అహింసక రత్నములను ఉంచండి. అనంతరము బలము కలుగు యజ్ఞమున సోమపానము చేయండి. దయదలచి మాకు విశేష రూప ధనమును అందించండి.

    3. ధనికుడవగు ఇంద్రా ! నీవు అధిక, అల్పధన దాన సమయములందు ధనమును సేవింతువు. నీ రెండు చేతులనిండ ధనము ఉన్నది. ధనప్రాప్తియందు నీ మాట కటువుకాదు.

    4. ఇంద్రా ! నీవు అసాధారణ యశోవంతుడవు. ఋభువులకు ఈశ్వరుడు. సాధకుడవు. ఇతరులవలె నీవు స్తోత ఇంటికి రమ్ము. హర్యశ్వ ఇంద్రా ! నేడు మేము హవ్యము అర్పించి మిమ్ము స్తుతించుచున్నాము.

    5. హర్యశ్వా ! నీవు మా స్తుతివలన వ్యాప్తిచెందుదువు. హవ్యము అర్పించు యజమానికి ప్రవహించు ధనము ఇమ్ము. ఇంద్రా ! నీవు మాకు ధనము ఎప్పుడు ఇచ్చెదవు? నేడు నీకు యోగ్యముల రక్షణలతో మేము పాలితులమగుదుము.

    6. మా స్తోత్రరూపవాక్యమును ఎప్పుడు అర్థము చేసికొందువు? ఇప్పుడు నీకు మాకు నివాసము ఇచ్చుచున్నావు. బలము కలిగి వేగవంతములగు నీ అశ్వములు మా స్తుతులు విని వీరపుత్ర సహిత ధనమును అన్నమును మా ఇంటికి తేవలెను.

    7. ప్రకాశమానమగు భూమి ఇంద్రుని అధిపతిని చేయుటకు వ్యాపించును. విశిష్ట అన్నముగల వర్షము ఇంద్రుని వ్యాపించచేయును. మానవులు ఇంద్రుని స్తుతించి తమ ఇంటికి తీసికొని వెళ్లుదురు. అట్టి త్రిలోకధారి ఇంద్రుడు జఠరాగ్ని కలిగి ఉండును.

    8. సవితా ! నీ వద్దనుంచి ప్రశంసనీయ ధనము మావద్దకు చేరవలెను. పర్వతములు అందించిన ధనము మావద్దకు చేరవలెను. సర్వరక్షకుడు, స్వర్గవాసి ఇంద్రుడు మాకు రక్షకుడు కావలెను. "యూయం పాత స్వస్తిభిః సదానః"


                                        ముప్పది ఎనిమిదవ సూక్తము

            ఋషి - వసిష్ఠుడు, దేవత - సవిత ఛందస్సు - త్రిష్టుప్.

    1. ప్రభ స్వర్ణ మయము. సవిత దానిని ఆశ్రయించును. దానినే ఉదయింపచేయును. సవిత మానవులకు స్తుతింపతగినవాడు. అతడు అనేక ధనములు కలవాడు. స్తోతలకు మనోహర ధనము ఇచ్చును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.