Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
4. నియుత్తులను అశ్వములు పూన్చినరథము వాయువును, ఇంద్రుని సోమము చరుపురోడాశులు సేవించుటకు తీసుకొని రావలెను. ఇంద్రవాయువులారా ! ఇతరదేవతలకన్న ముందు సోమము సేవించుట మీకు ప్రియము. అందువలన సోమము సేవించుటకు అందరికన్నముందు గవాదిసంపదలతో విచ్చేయుడు.
5. ఇంద్రవాయువులారా ! ఈ యజ్ఞమున మిమ్ము స్తుతించుచున్నాము. మీ కొఱకు అశ్వవేగమంతటి తీవ్రమయిన సోమమును శోధించినాము. ఈ యజ్ఞమునకు సర్వ రక్షణలతో విచ్చేయుడు. దంచి, పిండిన సోమమును అధ్వర్యులు అందించుచున్నారు. స్వీకరింపుడు, సేవింపుడు, అన్నము ప్రసాదించుడు.
6. మేము కర్మలు చేయుచున్నాము. ఆ కర్మలందు ఇంద్రవాయువుల కొఱకు దంచిపిండిన సోమము సిద్ధపరచినాము. అది ప్రకాశించునది వెంట్రుకలు పడనిది. శుద్ధమయినది. లోపరహితము. అట్టి సోమమును అధ్వర్యుడు పట్టుకొని ఉన్నాడు.
7. వాయువా ! సోమము దంచు ధ్వని వినిపించు చోటికి యజ్ఞ గృహముల స్తుతివాక్కులు వినుపించుచోటికి హోమము కొఱకు నేయి తీసుకొనిపోబడుచున్న చోటికి నిద్రించు యజమానులను దాటుకొని విచ్చేయుము. ఇంద్రుడు కూడ విచ్చేయవలెను. నియుత్తులను అశ్వములమీద యజ్ఞస్థలమునకు మీరిద్దరు విచ్చేయుడు. నీవును ఇంద్రుడు యాగములకు విచ్చేయుడు.
8. యజమానులు సోమమును సేకరించుచున్నారు. ఋత్విజులు యాగము నిర్వహించుచున్నారు. ఇంద్ర వాయువులారా ! ఈ యజ్ఞమునందే సోమరసపు ఆహుతిని గ్రహించుడు. ఈ యజ్ఞమునందు రోగములేనివి దొంగలు దొంగలించరానివి అయిన గోవులు మీ కొఱకు పాలు ఇచ్చుచున్నవి. యవాది దాన్యములతో పురోడాశము చేయబడినది. ఈ యజ్ఞమునందే ఆహుతి గ్రహించుడు.
9. వాయువా ! నీ అశ్వములు బలము గలవి. వయసులో ఉన్నవి. వృద్ధిపొందునవి. ఆబోతులవంటివి. అవి నిన్ను ద్యావాపృథ్వుల మధ్యభాగమున నిలుపుచున్నవి. అవి అంతరిక్షమున కూడ ఎక్కడ నిలువక వేగముగా నడువగలవి. అవి సూర్యకిరణములవలె నిలుపశక్యముకానివై నిన్ను నిలుపుచున్నవి.
నూట ముప్పది ఆరవ సూక్తము - ఋషి - పురుచ్చేపుడు
దేవత - రుద్రుడు, మిత్రావరుణు; ఛందస్సు - అత్యష్టి, చివరిది త్రిష్టుప్.
1. ఋత్విజులారా ! మిత్రావరుణులు సనాతనులు. యజమానికి సుఖప్రదాతలు. రుచికరములయిన హవిస్సులను ప్రియముగా భక్షించినారు. వారికొఱకు మెచ్చదగు సూక్తమును పూజ్యమగు హవిస్సును సిద్ధపరుచుడు.
మిత్రావరుణులు ప్రకాశించువారు. వర్షము కలిగించువారు. వీరి బలమును ఎంతటి శత్రువైనను ఎదిరించలేడు. వీరి దేవభావము సహితము కాదనరానిది.
2. సంచార స్వభావము కలిగి, శ్రేష్టురాలయిన ఉషోదేవి అందములనడక అగుపించినది. సూర్యుని మార్గము కిరణములచేత దర్శనీయమయినది. మిత్రుని స్థానమగు అంతరిక్షము వెలుగులతో విరాజిల్లినది. వరుణుని స్థానమునకు కూడ కిరణములు చేరినవి. అందువల్ల వారు స్తోత్రార్హమగు హవిస్సును ధరించుచున్నారు.
3. యజమాని వెలుగులు కలిగి సర్వలక్షణ సమన్వితమయిన ఉత్తరవేదిని శుభ్రము చేయుచున్నాడు. యాగము నిర్వహించబడు ఉత్తరవేదిని నిత్యము మిత్రావరుణులు ఆశ్రయించుచున్నారు. ప్రతి నిత్యము మేల్కొలుపువారును, ప్రకాశవంతులును, అదితి పుత్రులును, ఇష్టదాతలును అయిన మిత్రావరుణులు అచట శక్తినిపొందుచున్నారు. అర్యముడు ఆ ఇద్దరి మధ్య ఉండి జనులను పనులకు పురికొల్పుచున్నాడు. జనుల కర్మలను బట్టి పరలోకమును చేర్చుచున్నారు.
4. హోమమునందున్న ఈ సోమము మిత్రునకు ప్రియము కావలెను. ఇది మిత్రావరుణులు తలవంచుకుని త్రాగునది. యజమానులలో ప్రకాశించునది. సర్వదేవతలు అనుభవింపతగినది. ఈ సోమరసమును సమస్తదేవతలు సమానప్రీతి కలిగి సేవించుచున్నారు. మిత్రావరుణులారా ! మేము ప్రార్థించుచున్నాము. మా కోర్కెలు తీర్చుడు.
5. మిత్రావరుణులను సేవించి హవిస్సులు అర్పించు మర్త్యుడగు యజమానిని వారు పాపములనుండి రక్షింతురు. అర్యముడు సహితము సన్మార్గవర్తనుడగు యజమానిని అతని కర్మలను అనుసరించి రక్షించును. యజమాని ఏ దేవతలను స్తుతించునో వారు అతనిని రక్షింతురు.
6. మహత్తుగలిగి ప్రకాశించు సూర్యునకు నమస్కారము. ద్యావా భూములకు నమస్కారము. మిత్రావరుణలకు నమస్కారము. సుఖప్రదాత, ఇష్టఫలదాత రుద్రునకు నమస్కారము. హోతా ! ఇంద్రుని, అగ్నిని, ఆర్యముని, భగుని చేరి స్తుతింపుము. చిరంజీవులమగు మేము సంతతి కలిగి ఉండవలెను. సోముడు మమ్ము రక్షింపవలెను.
7. ఇంద్రుడు మమ్ము అనుగ్రహించినాడు. కీర్తివంతులగు మరుత్తులు మమ్ము అనుగ్రహించినారు. అగ్ని, మిత్రుడు, వరుణుడు మాకు సుఖములు ప్రసాదించినారు. అన్నవంతులమగు మేము ఆ వరములను అనుభవించగలము.
శ్రీ మదాంధ్రవచన ఋగ్వేద సంహిత ప్ర. మండలము రెండవ అష్టకము మొ. అధ్యాయము సమాప్తము.
రెండవ అధ్యాయము - నూట ముప్పది ఏడవ సూక్తము
ఋషి - పురుచ్చేపుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - అతిశక్వరి.
1. సోమమును దంచి రసము తీసినాము. సోమరసమున పాలు కలిపినాము. ఇది మిక్కిలి మాదకము. ప్రకాశించువారు, ద్యులోకవాసులగు మిత్రావరుణులు యజ్ఞమునకు విచ్చేయవలెను. పాలు, నీరు కలిసిన ప్రకాశవంతమగు సోమమును స్వీకరించవలెను. మమ్ము రక్షించవలెను.
2. సోమరసము తీసినాము. అందు పెరుగు కలిపినాము. ఉష, సూర్యుని కిరణముల ప్రకాశమున సోమము పిండినాము. మిత్రావరుణులారా ! ఇది మీకు ప్రియమయినది. తృప్తిని ఇచ్చునది. మీ కొరకే తీయబడినది. యజ్ఞములందు ఆరగింపదగినది. మీరు విచ్చేయుడు. ఈ సోమమును స్వీకరించుడు.
3. పాలిచ్చు ఆవును పితికినట్లు సోమమును పిండి రసము తీసినాము. అందులో నీరు చల్లినాము. రుబ్బినాము. మిత్రావరుణులారా ! మీ కొఱకు ఈ సోమరసము సిద్ధము చేయబడినది. మీరు యజ్ఞమునకు విచ్చేయుడు. సోమరసమును పూర్తిగా సేవించుడు.
ఆలోచనామృతము:
సోమము చంద్రుని వెలుగు-వెన్నెలతో పెరుగు తీవ. దానితో సిద్ధము చేయునది సోమరసము. సోమరసము సాంతము ఒకే తీరుదికాదు. ఒకే పదార్ధమును రుచుల మార్పుతో వండుట జరుగును. పదార్థము ఒక్కటే. వంటలు వేరు. రుచులువేరు. అట్లే సోమము. సిద్ధము చేయుపద్దతులు, ప్రక్రియలు వేరు వేరుగా ఉన్నట్లున్నవి. పిండినవి. రుబ్బినవి. పాలు కలిపినవి. పెరుగు కలిపినవి వేరు వేరు సోమములు ఉన్నట్లున్నది.
సోమశక్తిని అశ్వశక్తితో పోల్చుట జరిగినది. ఆధునిక మాదక ద్రవ్యములకు గుఱ్ఱపు పేర్లు ఉన్నవి.
నూట ముప్పది ఎనిమిదవ సూక్తము
ఋషి - పురుచ్చేపుడు, దేవత - పూష, ఛందస్సు - అత్యష్టి.
1. పూష యజమానులను రక్షించుటకు అవతరించినాడు. అతని మహిమలు గొప్పవి. అందరు పొగడునట్టివి. అతనిని బాధించగలవాడు లేడు. పూష స్తోత్రమును విడుచువాడు లేడు. అతడు యజ్ఞవంతుడు. యజమానుల మనసులను మురిపించును. నేను సుఖమును ఆపేక్షించి సుఖము కలిగించు పూషను స్తుతించుచున్నాను. పూష యజ్ఞమును పూర్తి చేయవలెను.
2. పూషా ! నీవు యజ్ఞములకు వెళ్లునపుడు నీగమనమువలెను. నీవేగమును అశ్వమువలెను, యుద్ధములకు సాగునపుడు నడకవలెను స్తుతించుచున్నాము. నీవు యుద్ధవీరులను ఒంటెవలె దరి చేర్చుచున్నావు. కావున నరులు నిన్ను సుఖప్రదుడవు అని తెలుసుకున్నారు. నీతో స్నేహము చేయుటకు నిన్ను ఆహ్వానించుచున్నారు. మా పిలుపులను వినుము. మా స్తుతి ధ్వనులను వెల్లడి చేయుము. మాకు అన్నమును-యుద్ధములందు జయమును కలుగజేయుము.
3. పూషా ! నీ సఖ్యమున యోగ్యులు సత్కర్మలు చేయుచున్నారు. నిన్ను కీర్తించుచున్నారు. సుఖములు అనుభవించుచున్నారు. ఆవిధముగా నీవు సత్కర్మలను రక్షించుచున్నావు. రక్షకుడవు అయిన నిన్ను లక్షల ధనము యాచించుచున్నాము. మేము నిన్ను ఆశ్రయించుచున్నాము. నీవు కోపరహితుడవు అగుము. యుద్ధములందు అగ్రభాగమున నిలుపుము.
4. పూషా ! నీవుదాతవు. శత్రునాశకుడవు. మాకు దగ్గరివాడవు అగుము. మేము అన్నము కోరుచున్నాము. మాకు మేకలను, గుఱ్ఱములను ప్రసాదించుము. నిన్ను స్తోత్రములతో ప్రసన్నుని చేయుచున్నాము. వర్షము కలిగించుము. నీ స్నేహమును దాచక ప్రకటించుము.
(పూష ద్వాదశ ఆదిత్యులలో ఒకడు. అతడు వెలుగువాడు. దాగనివాడు. సూర్యుని రథసారథి కూడ అగును.)
నూట ముప్పది తొమ్మిదవ సూక్తము
ఋషి -పురుచ్చేపుడు, దేవత-విశ్వేదేవతలు, ఛందస్సు-అత్యష్టి, చివరిది త్రిష్టుప్.
1. ఉత్తరవేదియందు ఆహవనీయాగ్నిని నిలిపినాము. ఆ అగ్నియొక్క దివ్యబలమును పొందుచున్నాము. ప్రకాశమానమగు యజ్ఞమున స్వయం ప్రకాశములు అగు స్తుతులతో ఇంద్ర వాయువులను సేవించుచున్నాము. మా స్తుతులు వినుటకు విచ్చేయుడు. మా కర్మలు మిమ్ము చేరవలెను. మేము ఏ దేవతలను యజించుచున్నామో అవి వారిని చేరవలెను.
2. మిత్రావరుణులారా ! మీరు సూర్యునివలె కీర్తనీయులు. తేజోవంతులు. మీరు జలమును ప్రసాదించుచున్నారు. బంగారుమయమయిన మీరూపమును యజ్ఞ గృహమునందు మా కర్మలచేతను మనసుతోను కన్నులతోను దర్శించుచున్నాము. మనసుతోను ఇంద్రియములతోను దర్శించుచున్నాము.
3. అశ్వినులారా ! యజమానులు మిమ్ము స్తుతించుచున్నారు. ప్రార్థించుచున్నారు. హవిస్సులు అందించుచున్నారు. స్తోత్ర పాఠములు చేయుచున్నారు. అన్నము అధికముగా పొందుచున్నారు. మీ బంగారు రథము తేనెతో నిండియున్నది. రథపు కమ్ములు తేనెను రాల్చుచున్నవి. మా హవిస్సులను ఆ రథము మీద గ్రహింపుము.
4. అశ్వినులారా ! మీ మహత్తును ఎల్లరు గ్రహించినారు. మీరు విశేషముగ దుఃఖరహితము, సుఖప్రదము అయిన యజ్ఞములకు వెళ్లుదురు. మా సారథి, మీ రథమును ఆకాశమున నడిపించును. రథమును, రథికుని నొప్పింపక యజ్ఞములకు చేర్చును.
అశ్వినులారా ! ఆకాశ మార్గమున స్వర్గముకు పోవు శత్రువులను మీరు లొంగదీతురు. వర్షము కలిగింతురు. మూడు నొగల రథమును అధిరోహింతురు.
5. అశ్వినులారా ! మీ సత్కర్మలచేత దివారాత్రులకు అవి కోరిన ఫలములు ప్రసాదించుడు. మీరు చేయు దానము ఎల్లవేళల లోపలరహితము కావలెను. మేము చేసిన దానములు సహితము నశింపకుండవలెను.
6. ఇంద్రా ! నీవు వర్షివి. నీ కొఱకు సోమములు అభిషవించబడినవి. అవి నీకు అర్హములు. జలములు కలిగించునవి. యజ్ఞమునందు అట్టి సోమమును నీకు సమర్పించుచున్నాము. అవి నీకు దినదినాభివృద్ధి కలిగించును. తృప్తి కలిగించును. మేము నిన్ను స్తుతించుచున్నాము. రమ్ము. విచ్చేయుము. మాకు సుఖములు ప్రసాదించుము.
7. అగ్నీ ! మా ఆహ్వానములను మన్నింపుము. మా స్తుతులను ఆలకింపుము. యాగకర్తలు అందించు హవిస్సులను దేవతలకు పంచి ఇమ్ము. వారి వినతులను దేవతలకు నివేదింపుము.
దేవతలు ప్రసిద్ధము అగు గోవును అంగిరోవంశజులకు ఇచ్చినారు. అర్యముడు ఆగోవుపాలు పిదికినాడు. అర్యముడు ఆ గోవును నాతోకూడ తెలిసికొన్నాడు.
8. మరుత్తులారా ! మీ బలములు ప్రకాశవంతములు. నిత్యములు. అవి మమ్ము వదిలిపోకుండవలెను. మా సంపదలు క్షీణించకుండవలెను. మా ప్రాణములు నశింపకుండవలెను. మీరు నిర్మించినవి, చిత్రవర్ణములయినవి, నూతనములయినవి, మనుష్య దుర్లభములు అయిన గ్రామములు సర్వదా మాకు చెందవలెను. మీ వద్ద దుస్తరమగు ధనము ఉన్నది. దానిని మాకు ప్రసాదించుడు. శత్రువులు హింసించలేని ధనమును మాకు అనుగ్రహించుడు.
9. దధ్యంగుడు, అంగిరోరుషి, ప్రియమేదుడు. అత్రి, మనువు అను పూర్వ ఋషులు నన్ను దివోదాస పుత్రునిగా ఎరుగుదురు. ఆ ఋషులతో మాకు దీర్ఘకాల సంబంధము ఉన్నది. ఆ ఋషుల మహత్త్వము చేత స్తోత్రవాక్కులతో నమస్కరించుచున్నాను. వారి అనుగ్రహమున యాగయోగ్యులయిన ఇంద్రాగ్నులను స్తుతించుచున్నాను.
10. హోత అను ఋత్విజుడు, యాజ్యమంత్రములు హవిస్సు కోరిన దేవతలకు సోమమును అందజేయవలెను. అధ్వర్యుడు దేవతానుగ్రహమును ఆపేక్షించి చలువను ఇచ్చునది, జనము కోరినది, వర్షము కలిగించు]నది అయిన సోమముతో యాగము చేయుచున్నాడు. యజమానులము దూరముగా ఉండి అభిషవశిల ధ్వనిని చెవి కింపుగా వినుచున్నాము. తదుపరి సత్కర్మలు చేయు అధ్వర్యుడు అభిషవజలమును ధరించుచున్నాడు. ఈ అధ్వర్యుడు ప్రజ్ఞావంతుడు. అనేక గృహములు కలవాడు.





