Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    అతనికొక ఆలోచనతట్టి ముఖం చాటంత అయింది. జేలులోంచి లేత నీలిరంగు కవరుగల నోటుబుక్కు తీసి వెనక్కు ఆనుకొని దర్జాగా తెరిచాడు.
    అది అతని సేవింగ్స్ బ్యాంక్ ఎక్కౌంటు.
    అలా కిటికీలోంచి బయటికి చూసినప్పుడల్లా పొలాల్లో పచ్చనిపంటా, మట్టిగోడల చిన్నచిన్న పూరిగుడిసెలు కనిపించాయి. వీటిని చూడక సంవత్సరం గడిచిపోయింది. నాటి ప్రయాణం ఒక నిర్దిష్ట గమ్యంలేని ప్రయాణం. నాడు అతని నెత్తిన జేలుభారం ఉంది. అయినా ఎండమావుల్లాంటి మహానగరానికి సాగుతున్న ఆకలి యాత్రల్ను చూచి అతనికి ధైర్యం వచ్చింది.
    మళ్ళీ నేడు అదే బాటన రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. భేదం ఇప్పుడతనికి విజయం లభించింది. బ్యాంకు బుక్కులో వరుసగా వ్రాసి ఉన్న సంఖ్యల్ను చూశాడు. అన్నీ సరిగా ఉన్నాయా? మెరిసే సిరాతో వ్రాసిన ఎర్రని అంకెలు అర్ధసంవత్సరపు వడ్డీని సూచిస్తున్నాయి. పని లేకుండా సోమరిగా ఉన్నధనం సహితం వారానికీ, నెలకూ కొవ్వు పెంచుకుంటూంది. విచిత్రం!
    అంకెలగారడీ జరగలేదుగదా! ఎక్కడో ఒక చిక్కు, ఒక అదృశ్యమైన వలా లేవుగదా?
    పేపరు చదువుతూ వెనక్కు ఆనుకుని తనముందు కూర్చున్న ఇద్దరు ప్రయాణీకుల్ను ఎగాదిగా చూశాడు. ఎక్కడోక్కడ చిక్కు ఉండాలి.
    చంద్రలేఖవైపు తిరిగాడు. ఆమె కిటికీలోకి తొంగిచూస్తూంటే వాయువేగానికి ఆమె వెంట్రుకలు నాట్యం చేస్తున్నాయి.
    "బొగ్గుపొడి కళ్ళల్లో పడుతుంది జాగ్రత్త"
    "గాలి ఎంత చల్లగా ఉంది"
    "చలిగా లేదూ!"
    "లేదు హాయిగా ఉంది"
    లేఖ జేలు చూడాలని ఎందుకనుకుంది అనే విషయం ఇంకా సమస్యగానే నిలిచిపోయింది. లేఖ తన హృదయంలో ఒక ఇరుకైన చీకటిగది నిర్మించుకుంది. ఆమె దానిలోంచి బైటికిరాదు. వేరువారికి అందులోకి ప్రవేశంలేదు.
    జీవితం ఆమెకు యాతనగా ఉంది. అతని హృదయం కలతచెందింది. ఆమె పాలిపోయిన కపోలాలవైపు చూచాడు. ఆమె చంద్రలేఖయేనా?
    రూపా అతనికి దృగ్గోచరం అయింది. ఆ వీధి మొత్తంమీద రూపా ప్రభావం, కొరడా పట్టుకున్న రాక్షసీ అతనికి కనిపించాయి. కొరడాదెబ్బ లేఖ హృదయం మీద ఇంకా నిలిచే ఉందనేది వాస్తవం. కనీసం వీపుమీదిగాయం మానిందా?
    భర్త, సంతానం వీటిలో లీనం కాకుంటే ఆమెకి విముక్తిలేదు.
    కాలూ ఒక నిట్టూర్పు విడిచి రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉన్న వంగభూములను చూశాడు. తెలిగ్రాపు తీగలమీద నల్లని పక్షులు కూర్చొని ఉన్నాయి. కాకి పచ్చిక బైళ్ళవైపు చూస్తూంది. రోడ్డువెంట సాగిపోతూ ఉన్న కారువేగం హెచ్చిరైలును దాటిపోతూంది.
    ఇంకాస్తసేపటికి బి.10 జేలునుంచి బయటికి వస్తాడు. అనామక మిత్రుని సందేహం ఇప్పటికే అతణ్ణి కలవరపెద్తూ ఉండాలే. ఆ సందేశానికీ పి-14 కూ సంబంధం ఉందని ఊహించగలడా? అది ఎలా సాధ్యం? పి.14ను గురించి అతడు అంచనా వేసి ఉంటాడు. ఈ దరిద్ర ప్రజానీకంలో ఒకనిగా పి.14 నశించి ఉంటాడని అతను ఊహించి ఉంటాడు.'మనం వారిని వీపుమీద గుద్దాలి' ఎదురుదెబ్బ తీయడానికి పి.14 ఆయుధ సమేతుడుగా సిద్దం అవుతాడని అతడెలా ఊహిస్తాడు?
    బి.10 ఆశ్చర్యంతో తబ్బిబ్బు అవుతాడు. పి.14 గారడీచేశాడు. చేస్తాడని అంచనా వేసిందానికంటే పి.14 ఎక్కువే చేశాడు. ఈ కాకమ్మ కథంతా తెలియకముందే అతడు దేవాలయం చూడాలి. ఇల్లు చేరేదాకా బైటపెట్టకుండా ఉండడమే ఉత్తమం. అంతా అతని కళ్ళముందు కనిపిస్తే ఎలా ఉంటుంది? చూడు మిత్రమా, నీ ఆదేశం ప్రకారం మట్టిలోంచి దేవాలయం పుట్టింది. రెండుసేర్ల శెనగలు పొంగి బ్రహ్మాండమైన తెల్లని దేవాలయంగా తయారైంది.
    ఇంకో చిత్రం. బి.10 ఇంకా తనకు కొత్తే. అతన్నిగురించి తనకు తెలిసిందేమిటి? కనీసం పేరైనా తెలియదు. అలాంటివాడికా ఈ రహస్యం చెప్పేది?
    అలా జరగడం అసంభవం ఏమీకాదు. సాధ్యమే. ఒక్కొక్క సారి నీతో ఏళ్ళతరబడి పరిచయం ఉన్న వ్యక్తిని గురించి నీకేమీ తెలియదు. ఒక వ్యక్తితో ఇలా కలుస్తామో లేదో ఇట్టే అతని హృదయం తెలిసిపోతుంది.
    "బాబూ ఇదిగో ఇటుచూడు"
    కాలూ లేఖవైపు తిరిగి ఆమె చూసినవైపు చూశాడు. సుపరిచితములైన ఎత్తు గోడలు. అది జేలు! అప్పటి ప్రయాణంలో అతనికి జేలుగోడలు కనిపించలేదు. బహుశః తాను ఇంకోవైపు కూర్చున్నాడేమో. రైలు అనుకున్నదానికంటే త్వరగా వచ్చేసింది.
    స్టేషను గేటుదాటి బైటికి నడిచి కాలూ రిక్షాకోసం అటూఇటూ చూశాడు. కాని లేఖ "అట్టేదూరం ఉన్నట్లులేదు. నడుద్దాం" అన్నది.
    "సరే, నడుద్దాం" అతడు ముందు నడిచాడు. కాలూ మామూలు వేగంతో నడుస్తుంటే లేఖ అతన్ని అందుకోవడానికి పరిగెత్తాల్సివచ్చింది. లేఖ బాగా వెనుకపడినప్పుడల్లా ఆగి ఆమె వచ్చేదాకా వెనక్కు తిరిగి నుంచుంటున్నాడు.
    "ఏం? నడవగల్దువా?"
    "ఈ కొత్తచెప్పులు వేళ్ళకు గుచ్చుకుంటున్నాయి"
    "చెప్పుల్లేకుండా నడవడం తేలికఅవుతే నడువు. చెప్పులిలా ఇవ్వు, నేను పట్టుకొనివస్తా."
    "బాబూ నీవు ఫస్టుక్లాసులో ప్రయాణంచేసినా నీవు ఝార్నాకమ్మరివే. నీ స్థాయికి చెందిన బ్రాహ్మడు చెప్పులు చేతుల్తో పట్టుకొని నడుస్తుంటే, నీ కూతురు చెప్పుల్లేకుండా నడవడం ఎలా ఉంటుందో ఆలోచించు."
    అర్ధం అయినట్లు నవ్వాడు.
    "నా మెదడు పదును పారేట్లు లేదు" అంటూ రొంటినుంచి గడియారం తీసిచూసి "లేఖా చాలా టైముంది. మెల్లగా నడువు" అన్నాడు.
    "సిల్కు చొక్కాకు రెండుప్రక్కలా జేబులుండగా గడియారం రొంటిన పెట్టుకోవడం ఎందుకు?"
    కాలూ నాలుక కరుచుకొని "మట్టిబుర్ర" అని తిట్టుకున్నాడు.
    రోడ్డు దుమ్ము కొట్టుకుంటూంది. రోడ్డుమీదినుంచి సాగిపోతున్న కారు ధూమమేఘాలు లేపింది.
    "లేఖ ముక్కు మూసుకో. ఈ రోడ్లకంటే మన ఝార్నారోడ్లేనయం. ఇందులో సగం దుమ్ముకూడా లేవదు"
    "రోడ్డుకు రెండు ప్రక్కలా ఊసర క్షేత్రాలే కనిపిస్తున్నాయి. ఇండ్లెక్కడా?"
    "మనకు ఊరు తగల్దు. ఈ రోడ్డు అచ్చంగా జేలుకోసం వేసిందే. అందుకే దీనికి జేలురోడ్డు అనిపేరు. ఇప్పుడు మనం చూసిన నల్లనికారు జేలు సూపరెంటెంటుది."
    "అదిగోచూడు. మళ్ళీ పచ్చగోడలు కనిపిస్తున్నాయి"
    ఇనుపగేటు ఇంకా 50 గజాలు ఉందనగా వారు నడక చాలించారు. ఆ రోడ్డు ఒక కాలవమీదినుంచి పోతుంది. దానికి ఒక చిన్న పిట్టగోడ కూడా ఉంది.
    "మనం పిట్టగోడమీద కూర్చుందాం. ఇంకొంచెంసేపట్లో బి-10 వచ్చేస్తాడు. ఇదే అతనిదారి."
    నిరీక్షణలో ఆలోచనలు చిలువలు పలవలుగా రేగాయి. కాలూ మూడుసార్లు గడియారం చూశాడు. "విశ్వనాథ్ తేదీ తప్పుచెప్పి ఉండాలి. లేదా బి.10 శిక్ష పెంచబడి ఉండాలి. తెలుసుకొనివచ్చేదా?"
    చేతులో తుపాకిఉన్న గార్డు కనిపించేప్పటికి కాలూగుండె కూలబడ్డది. వేచి చూడ్డమే మంచిది.
    పెద్ద గేతులోని చిన్న అంతర్ధ్వారాన్ని నెట్టుకుని ఒక మనిషి బయటికి వచ్చాడు. కాలూ బాగా చూచాడు. 'బి.10....' అని అరిచినంత పని చేశాడు. కాని తమాయించుకున్నాడు.
    బి.10 గార్డుతో ఏదో మాట్లాడి మిత్రునిలా వీపుతట్టాడు. కాలూకు ఆశ్చర్యం అయింది. సంవత్సరంపాటు జేల్లో ఉన్నమనిషి అంత ధైర్యంగా నవ్వడం ఎలా సాధ్యం? ఎంత నిర్భయంగా ఉన్నాడు? బి.10 రోడ్డు దాక వచ్చి వెదికాడు. ఒక క్షణం అటూఇటూ చూసి రోడ్డున పడ్డాడు. కాలవ వంతెనమీంచి నడుస్తూ అక్కడ కూర్చున్న ఇద్దరివైపు ఒకచూపు విసిరి సాగిపోతున్నాడు. బి.10 కొంతదూరం పోయింతర్వాత "భ్రమలో పి- 14 ను మరిచిపోతున్నావ్" అని కాలూ అరిచాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.