Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    3.  బంగారమా! నిప్పులో వేసినను పేలాల వలె నీవు రూపు మార్చవు. నీవు మాటకు చుట్టమవు. నిప్పునందు పుట్టియు సోమమునకు ఈయబడుదానవు.

    (వాచో బన్ధుః మాటకు చుట్టమవు. అనగా పసిడికలవాని మాటచెల్లును అని.)

    4. జలమా! నీవు దీప్తిమంతవు. చంద్రుని యందు చంద్రుడవు. అమృతమునందు అమృతమవు. స్వాహాకార రాజసూయము కొరకు తేబడిన వారు. నిన్ను బంగారముచే పవిత్రము చేయుచున్నాము.

    (బంగారమున దర్భతో కట్టి నీటియందు కదిలించవలెను.)

    5. వరుణుడు జలములకు శిశువు వంటివాడు. జలములు తల్లుల వలె వరుణుని తమయందు ఉంచుకొని లాలించుచున్నవి.

    జలములు దీప్తివంతములు. బలహేతువులు. పేల్చరానివి. కర్మ కోరునవి. వస్త్రము వలె వ్యాపించి ఉండునవి.

    (నాలుగు నీటి పాత్రలందు మోదుగు, అత్తి, రావి, మర్రి కొమ్మలను వేయవలెను.)

    6. క్షాత్రమునకు బలమవు. క్షాత్రమునకు స్థానమవు అగుచున్నావు.

    7. అగ్ని కర్మచేతనే గృహపతి అయినాడు. ఇంద్రుడు కర్మచేతనే ఎంతో కీర్తిమంతుడు అయినాడు. పూష కర్మచేతనే విజ్ఞానవంతుడు అయినాడు. మిత్రా వరుణులు కర్మచేతనే సత్య ప్రవర్ధకులు అయినారు. అదితి కర్మచేతనే విశ్వరూపి అయినది.

    ఇతడు - ఈ యజమాని - రాజేంద్రుని పుత్రుడో, పౌత్రుడో అగును. అతడు కర్మ వలననే ప్రజలు కలవాడు - రాజ్యము కలవాడు అయినాడు. క్షాత్రము, ఆధిపత్యము సార్వభౌమత్వము కలవాడు అయినాడు.

    8. మీకు భరతుడు రాజగును. బ్రాహ్మణులమగు మాకు సోముడే రాజగును.

    9. ధనువా! నీవు ఇంద్రుని వజ్రమవు అగుధువు. దెబ్బతీయు దానవగుదువు. నిన్ను పట్టిన ఈ యజమాని శత్రువును వధించునుగాక.

    10.  శరములారా! మీరు శత్రువును హింసించండి.

    (యజమానికి ధనువు, మూడు బాణములు ఇవ్వవలెను.)

    11.  బాణములారా! ఎదురుగా వచ్చు బాణముల నుండి నన్ను రక్షించండి. అడ్డముగా వచ్చు బాణముల నుండి నన్ను రక్షించండి. వెనుక నుండి వచ్చు బాణముల నుండి నన్ను రక్షించండి. అన్ని దిక్కుల నుండి వచ్చు బాణముల నుండి నన్ను రక్షించండి. సకల శస్త్రముల నుండి నన్ను రక్షించండి.

    12. శత్రు నివారక వామ హస్తమా! శత్రుమారక దక్షిణ హస్తమా! మీరు బంగారు కవచము ధరించి ఉన్నారు. ఇనుప స్తంభముల వలె గట్టిగా ఉన్నారు. ఉషోదయ, సూర్యోదయములందు గర్తసదృశ రథమును అధిరోహించండి. అనంతము, అఖండితమగు స్వసేనను అనుగ్రహ దృష్టితో వీక్షించండి. శత్రు సేనను ఆగ్రహ దృష్టితో చూడండి.

                                 పదమూడవ అనువాకము

                        (దిగ్వాపస్థాపన మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. యజమానీ! నీవు తూర్పున ఉండుము. ఛన్దసామ్ ఛందస్సులలో, గాయత్రీ - త్వా - నిన్ను, అవతు- రక్షించును గాత. త్రివృత్ స్తోమః త్వా అవతు. రథన్తర సామః త్వా అవతు. అగ్నిదేవతా త్వా అవతు. బ్రహ్మద్రవిణం -ధనమును, అవతు.

    2. యజమానీ! దక్షిణ దిశన ఉండుము. త్వా ఛన్దసాం త్రిష్టుప్ అవతు. పంచదశస్తోమః అవతు. బృహత్ సామః అవతు. ఇన్ద్ర దేవతా అవతు. ద్రవిణమ్, క్షత్రమ్ - క్షతియుడు అవతు.

    3. యజమానీ! నీవు పశ్చిమ దిశన ఉండుము. త్వాఛన్దసామ్ జగతీ అవతు. సప్తదిశస్తోమః అవతు. వైరూపంసామ అవతు. మరుతః దేవతా అవతు. ద్రవిణమ్ విట్ - వైశ్యుడు, అవతు.

    4. యజమానీ! ఉత్తర దిశన నిలువుము. త్వాఛందసాం జగతీ అవతు. ఏకవింశః స్తోమః అవతు. వైరాజసామ అవతు. మిత్రావరుణా అవతామ్. బలమ్ ద్రవిణం అవతు.

    5. యజమానీ! నీవు ఊర్ధ్వదిక్కును చూడుము. త్వాం ఛన్దసాం పంక్తిః అవతు. త్రిణవః త్రయస్త్రింశౌ అవతు. శాక్వర రైవతే సామినీ అవతామ్. బృహస్పతిః దేవతా అవతు. వర్చః ద్రవిణమ్ అవతు.

    6.  అగ్నయే స్వాహా. సోమాయస్వాహా. సరస్వత్యై స్వాహా. పూష్ణేస్వాహా. బృహస్పతయే స్వాహా. స్వాహేన్ద్రాయ. ఘోషాయస్వాహా. శ్లోకాయస్వాహా. అగంశాయ స్వాహా. భగాయ స్వాహా. క్షేత్రస్యపతయే స్వాహా పృథివ్యై స్వాహా. అంతరిక్షాయ స్వాహా. దివే స్వాహా. సూర్యాయ స్వాహా. చన్ద్రమసే స్వాహా. నక్షత్రేభ్యః స్వాహా. అద్భ్యః స్వాహా. ఔషధీభ్యః స్వాహా. వనస్పతిభ్యః స్వాహా. చరాచరేభ్యః స్వాహా. పరిప్లవేభ్యః స్వాహా. సరీసృషేభ్యః స్వాహా.

    (ఈ మంత్రమునందు 24 హోమములు ఉన్నవి. మొదటి 12 పార్ధములు. వీనిలో మొదటి ఆరు అభిషేచనకు పూర్వము 'ఇంద్రాయస్వాహా' తరువాతి ఆరు అభిషేచానంతరపువి.

    మిగిలిన 12 అవేష్టులు. వీనిలో మొదటి ఆరు అభిషేచనకు పూర్వపువి. 'అద్భ్యః స్వాహా' నుండి ఆరు అభిషేచనానంతరపువి.)

                                 పదునాలుగవ అనువాకము

    1.  శార్దూలచర్మమా! నీవు సోమమునకు దీప్తివి. నీవలెనే నాకు దీప్తి కలుగునుగాక.

    2.  హిరణ్యమా! నీవు అమృతమవు. నన్ను మృత్యువు నుండి రక్షించుము.

    (శార్దూల చర్మము మీద నూరు హిరణ్యములు ఉంచవలెను.)

    3.  సువర్ణపాత్రమా! నీవు నన్ను రక్షింపుము.

    (ఇది నూర్లచిల్లుల పాత్ర. దీనిలోని నీటితో యజమానిని అభిషేచింతురు.)

    4. సర్పములను నాశనము చేసినాము.

    (సర్పముగా భావించిన నేసమును నపుంసకుని మీదకు విసరవలెను.)

    5.  నముచి రాక్షసుని తల నరుక బడినది.

    (యజమాని రాగి వస్తువును ఎడమపాదమున వేది బయటికి త్రోయవలెను.)

    6. యజ్ఞకర్తా! ధర్మము తెలిసిన సోమ, వరుణ, అగ్ని మున్నగు దేవతలు నీ వాక్కును గ్రహింతురుగాక. నీ ప్రాణమును తెలిసికొందురుగాక. నీ కన్నులను- చూపును - గ్రహింతురు గాత. నీ చెవులను - వినికిడిని - గ్రహింతురు గాక.

    7.  యజమానీ! నిన్ను సోముని దీప్తిచే అభిషేకము చేయుచున్నాను. అగ్నితేజస్సుతోను - సూర్యుని వర్చస్సుతోను - ఇంద్రుని బలముతోను - మిత్రావరుణుల శక్తితోను - మరుత్తుల ఓజస్సుతోను అభిషేకము చేయుచున్నాను.

    8. యజమానీ! నీవు క్షత్రియులకు స్వామివి అగుచున్నావు.

    (అభిషిక్త యజమానిని అభిమంత్రించవలెను.)

    9. యజమానీ! నీవు ఇతర రాజులను అతిక్రమించుము. రక్షించుము.

    (పై పూతలున్న బట్టలను విడువవలెను.)

    10. లేపముల మీదినుంచి నీరు పైనపడుచున్నది. క్రిందపడుచున్నది. సుళ్లు తిరుగుచున్నది. ఆపాదమస్తకము సాగుచున్నది.

    ఆ నీరు పర్వతము వంటి మేఘమునందలి నీటివలెను - జలములందు నావ వలెను సాగుచున్నది.

    11. రుద్రదేవా! నీకు శర్వుడను నామము కలదు. భక్తులు ఆ నామమును జపింతురు. ఆ నామము వారికి ఫలప్రదమగును. ఆ నామమునకు ఈ శేషజలము హుతము అగును గాత.

    (అభిషేక శేషజలముతో హోమము చేయవలెను.)

    12. ప్రజాపతే! పుట్టిన ఈ లోకములను రక్షించుటకు నిన్ను మించిన వాడు లేడు. మేము ఏ ఫలము కోరి నీకు హోమము చేయుచున్నామో ఆ ఫలము మాకు సిద్ధించునుగాక. మేము ధనవంతులము అగుదుముగాక.

    పుత్రుని, భార్యను తాకి హోమము చేయవలెను.

                                    పదిహేనవ అనువాకము

    1.  రథమా! నీవు శత్రుహంతయగు ఇంద్రుని వజ్రమవు. నీ సాయమున ఈ యజమాని శత్రువులను వధించును గాత.

    2.  దక్షిణాశ్వమా! మిత్రావరుణులు అనుమతించినారు. నిన్ను యజ్ఞమునకని రథమునకు కట్టుచున్నాను.

        (రథపు దక్షిణమునకు కట్టవలెను.)

    3. విష్ణువు యొక్క అడుగు పడిన భూలోకమవు. రెండవ అడుగు పెట్టిన అంతరిక్షమవు. మూడవ అడుగు మోపిన త్రివిష్ఠపమవు అగుచున్నావు.

        (యజమాని రథమును ఎక్కవలెను.)

    4. మరుత్తుల ఆశీస్సుల వలన ఈ జైత్రయాత్ర యందు గెలుపొందగలను.

        (రథమును నడిపించవలెను.)

    5. మనసు కోరినది లభించినది.

    (యజమాని ధనువును పట్టవలెను. తూర్పులేక ఉత్తర దిశన నిలువవలెను. బాణము సంధించి విడువవలెను.)

    6.  మేము అవయవములందు శక్తి కలవాడను అయినాను.

    (1. ఇతర రాజులను జయించినట్లు ప్రదక్షిణ చేయవలెను 2. ప్రదక్షిణ భూమండలము జయించినట్లు.)

    7. పాదరక్షలారా! మీరు చర్మనిర్మితలు. పశువు యొక్క కోపస్వరూపలు అయి ఉన్నారు. నేను సహితము మీ వలెనే శత్రువు పై కోపము కలిగి ఉన్నాను.

        (పాదుకలను విడువవలెను.)   

    8. మాత్రే పృథివ్యైనమః భూమాతకు నమస్కారము. భూమి నాకు తల్లి. ఆమెను నేను బాధించను. తల్లి భూదేవి నన్ను బాధించకుండును గాక.

    9. వెండి పతకమా! పరిమిత పరిమాణవు అగుచున్నావు. ఆయుః స్వరూపమువు అగుచున్నావు. మే ఆయుః ధేహి నాకు ఆయువును ప్రసాదించుము.

    రాగి పతకమా! నీవు బలస్వరూపమువు. మే ఊర్జం దేహి - నాకు బలమును ప్రసాదించుము.

    బంగారు పతకమా! నిన్ను ధరించవచ్చును. నీవు వర్చస్సు కలదానవు. మయి వర్చః ధేహి - నాయందు వర్చస్సు కలిగించుము.

    10. అగ్నయే గృహపతయే స్వాహా. సోమాయ వనస్పతయే స్వాహా. ఇన్ద్రస్య బలాయ స్వాహా.

    11. రథము శుచియైనది. అద్దంకులులేని అంతరిక్షమున ఉండునది. హోతృసమానమైనది. యజ్ఞవేదియందు ఉండునది. అతిథి వంటిది. ఇంటియందు, మనుష్యులవద్ద - రాజుల ఇండ్లయందు ఉండునది. యజ్ఞములందు ఉండునది. ఆకాశమున ఉండునది. అది గోవులనుండి పుట్టినది. యజ్ఞమున పుట్టినది. పర్వతములందు పుట్టినది.

    అట్టి రథము రాజసూయము కొరకు సమార్జించబడును గాత.

    (రథమును రథవాహనము నందు ఉంచవలెను.)

                               పదహారవ అనువాకము

                  (విజయానంతరము సమస్త రాజులు సేవించుట.)

    1.  కుడిభుజమా! నీవు మిత్రదేవతా స్వరూపమవు. ఎడమ భుజమా! నీవు వరుణ దేవతా స్వరూపమవు.

        (ఎత్తిన బాహువులు దించవలెను.)

    2. నేను సకల దేవతలను కలిసి కొందునుగాక.

        (అమిక్షయందు చేతులను ఉపావాహరణము చేయవలెను.)

    3. చర్మపటమా! నీవు క్షత్రియుడు కూర్చుండు స్థానమవు అగుచున్నావు. క్షత్రియునకు మూలస్థానము అగుచున్నావు.

    4. నా శరీరమా! సుఖమగు ఆసనమునకు చేరుము. సుఖముగా కూర్చుండ యోగ్యమగు స్థానమునకు చేరుము. ఈ ఆసనము నిన్ను, నన్ను హింసించకుండును గాక.

    (ఆసనము మీద కూర్చుండవలెను. 2. నిన్ను శరీరమును, నన్ను మనసును - ఆత్మను.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.